Telugu News

మతం ముసుగులో రాజకీయం.. మనుషుల మధ్యన విషబీజం

భారతదేశం ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాల ఫలం. కులమతాల వైవిధ్యాన్ని దాటి, అందరూ కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న స్వతంత్ర గడ్డ ఇది. ‘ప్రజల కోసమే పాలన’ అనే పవిత్ర శపథంతో మన ప్రయాణం మొదలైంది. కానీ నేటి స్వార్థ నాయకులు కుర్చీ కోసం, ఓట్ల కోసం మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారు. నాటి ఐక్యత, త్యాగాలు ఒకవైపైతే.. నేడు దేశాన్ని ముక్కలు చేస్తున్న మత రాజకీయాలు మరోవైపు నిలిచాయి. సమాజానికి ఇంతటి ప్రమాదంగా మారిన ఈ కుటిల రాజకీయాల అసలు రంగును ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో నాయకులు ఎంతో నిజాయితీగా, దేశ శ్రేయస్సు కోసమే పనిచేశారు. పార్టీ ఆశయాలకు కట్టుబడి, నైతిక విలువలతో రాజకీయం సాగించారు. కానీ గత ఏడు దశాబ్దాల కాలంలో ఆ ఆశయాలు అడుగంటి, స్వార్థ ప్రయోజనాలు ఎక్కువయ్యాయి. దేశం కంటే వ్యక్తులకే ప్రాధాన్యత పెరిగి నియంతృత్వ ధోరణులు రాజ్యమేలుతున్నాయి. నేటి రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఊహించడం అసాధ్యంగా మారింది. కేవలం పదవులు, డబ్బు సంపాదన కోసం, తాము చేసిన అవినీతి అక్రమాల నుండి రక్షణ పొందేందుకు అధికార పార్టీల్లోకి దూకుతున్నారు. నిన్నటివరకు మతసామరస్యం అని మాట్లాడిన వారే, నేడు మత రాజకీయాల పార్టీలలో చేరి సమాజానికి ద్రోహం చేస్తూ ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారు.

ప్రస్తుత రోజుల్లో పార్టీ ఫిరాయింపులు అనేవి ఓ సిగ్గులేని అలవాటుగా మారిపోయాయి. ప్రజాసేవ అనే ముసుగులో ప్రజలను మోసకరిస్తూ, ఒక పార్టీలో గెలిచి పదవుల కోసం మరో పార్టీలోకి వెళ్లడం సర్వసాధారణమైంది. ఒకప్పుడు మత రాజకీయాలను అసహ్యించుకుని వ్యతిరేకించిన వారు సైతం, నేడు స్వప్రయోజనాలే ముఖ్యమని భావించి మతశక్తులతో చేతులు కలపడం దారుణం. తెలుగు ప్రజల ఆత్మగౌరవం పేరుతో, సోషలిజమే ధ్యేయంగా నాడు ఏర్పాటైన శక్తులు కూడా నేడు మత రాజకీయ పార్టీలతో ఊరేగడం పచ్చి అవకాశవాదానికి నిదర్శనం. చిన్న రాష్ట్రాల ఏర్పాటును సమర్థించిన శక్తులు, కేంద్రంలో పదేళ్లుగా అధికారం చెలాయిస్తున్నా ఉత్తరప్రదేశ్ విభజన తీర్మానాన్ని అమలు చేయకపోవడం మోసకారి చర్యే. సామాజిక న్యాయ ఉద్యమకారులు సైతం ఇలాంటి మత పార్టీల్లో చేరడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.

1947 దేశ విభజన నాటి దారుణ పరిస్థితులను మరిచి భారతీయులంతా మతాలకు అతీతంగా నవసమాజ నిర్మాణంలో కలిసిమెలిసి జీవిస్తున్నారు. అయితే, నేటి మత రాజకీయవాదులు మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా సమాజంలో చిచ్చులు పెడుతూనే ఉన్నారు. ఎన్నికల్లో గెలవడమే పరమావధిగా మెజార్టీ, మైనార్టీ వాదనలను తెరపైకి తెచ్చి ప్రజల మధ్య గోడలు కడుతున్నారు. ఈ విభజన రాజకీయాలు దేశ భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమించాయి. కశ్మీర్‌లో రగిలించిన మంటలు ఇంకా చల్లారలేదు. అణగిపోయిందనుకున్న ఖలిస్తాన్ నినాదం మళ్లీ తెరపైకి వస్తోంది. ఈశాన్య రాష్ట్రాలలో అల్లకల్లోలంగా మారింది. ప్రస్తుత పరిస్థితులు సామాజిక సామరస్యానికి అత్యంత ప్రమాదకరమని మేధావులు హెచ్చరిస్తున్నా, పాలకులు అస్సలు పట్టించుకోవడం లేదు.

“దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్” అన్న మాటను పాలకులంతా తప్పక ఒప్పుకోవాలి. మన దేశంలో 99 శాతం మంది కష్టపడి శ్రమించి బతికే సామాన్యులు ఉంటే.. కేవలం ఒకే ఒక్క శాతం మాత్రమే దోపిడీదారులు ఉన్నారు. చారిత్రాత్మకంగా దేశ సంపదను సృష్టించేది కష్టజీవులు, కార్మికులు, రైతులే అయినప్పటికీ, నేటి పాలకులు మాత్రం ఆ ఒక్క శాతంగా ఉన్న కార్పొరేట్ దోపిడీదారులకే ఊడిగం చేస్తున్నారు. మత రాజకీయాలు చేసేవారు నిజంగా మెజారిటీ వాదానికి కట్టుబడి ఉంటే, శ్రమజీవులైన ఈ 99 శాతం మెజారిటీ ప్రజలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారో సమాజం ఆలోచించాలి.

పాలకుల దోపిడీ విధానాల వల్ల సమాజంలో ఆర్థిక అంతరాలు నింగికి, నేలకు ఉన్నంతగా పెరిగిపోయాయి. ధనవంతులు మరింత ధనవంతులుగా, పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. ప్రజలు తమ హక్కుల కోసం తిరగబడకుండా ఉండేందుకు పాలకులు మతపరమైన అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. నిరుద్యోగం, పేదరికం, ధరల పెరుగుదల నుండి దృష్టి మళ్లించడానికి నిరంతరం విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. ఈ డొల్లతనాన్ని శ్రామిక వర్గాలు త్వరగా గ్రహించి చైతన్యవంతులు కావాలి.

రాజకీయాల నుండి స్వార్థాన్ని, అవినీతిని, మత పిచ్చిని వెలివేసి, భారతదేశాన్ని నిజమైన ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టడంలో ప్రజలే ప్రధాన పాత్ర పోషించాలి. ఇందుకోసం తక్షణమే పార్టీ పిరాయింపుల చట్టాన్ని కఠినంగా మార్చాలి. సంఖ్యతో సంబంధం లేకుండా పార్టీ మారిన వెంటనే ప్రజాప్రతినిధి పదవిని రద్దు చేసేలా చట్టం తేవాలి. రాజకీయ నాయకులు పదవిలోకి వచ్చే ముందు, ముగిసిన తర్వాత వారి ఆస్తులను తనిఖీ చేసి, అక్రమ ఆస్తులను జాతీయం చేసే చట్టాలు రావాలి. సమూల రాజకీయ ప్రక్షాళన ద్వారా సమాజాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా ఏకమై తమ గళాన్ని గట్టిగా వినిపించాలి.

Show More
Back to top button