ఎప్పుడెప్పుడా అని షేర్ మార్కెట్ ఇన్వెస్టర్లు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న ‘జియో ఐపీఓ’ (Jio IPO) కథ ఒక కొలిక్కి వచ్చింది. ఈ పబ్లిక్ ఇష్యూకి సంబంధించిన డ్రాఫ్ట్ పేపర్లను (DRHP) రిలయన్స్ జియో బోర్డు ఆమోదించడమే కాకుండా, మార్కెట్ నియంత్రణ సంస్థ అయిన ‘సెబీ’కి కూడా సమర్పించేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సమావేశం (AGM)లో ముకేశ్ అంబానీ ఈ గుడ్ న్యూస్ ప్రకటించిన కాసేపటికే ఈ పత్రాలు సెబీ ముందుకు వెళ్లాయి. ఈ సందర్భంగా అంబానీ మాట్లాడుతూ.. ఇది తనతో పాటు కోట్లాది మంది వాటాదారులకు ఎంతో ఎమోషనల్ మూమెంట్ అని, ఈ ఏడాది రిలయన్స్ కుటుంబానికి జియో ఐపీఓ అత్యంత కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. మన దేశం కూడా ప్రపంచ స్థాయి టెక్నాలజీ కంపెనీలను నిర్మించగలదని ఈ లిస్టింగ్ ద్వారా ప్రపంచానికి నిరూపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ మెగా ఐపీఓ ద్వారా మార్కెట్ నుండి సుమారు 3 బిలియన్ డాలర్లు (మన దేశ కరెన్సీలో దాదాపు 25 వేల కోట్ల రూపాయలకు పైగా) నిధులను వసూలు చేయాలని రిలయన్స్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఇన్వెస్టర్ల కోసం 27 కోట్ల కొత్త షేర్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. అయితే ఈ ఐపీఓ ద్వారా వచ్చే డబ్బును రిలయన్స్ కంపెనీ తనకున్న అప్పులను తీర్చడానికి ఉపయోగించనుంది, మిగిలిన నిధులను కంపెనీ సాధారణ అవసరాల కోసం వాడుకుంటారు. ప్రస్తుతం డ్రాఫ్ట్ పేపర్లు ఇచ్చే సమయానికి జియో ప్లాట్‌ఫామ్స్‌లో మాతృ సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 66.43 శాతం వాటా ఉంది. ఈ ఐపీఓ ప్రక్రియ బాధ్యతలను ముకేశ్ అంబానీ పిల్లలైన ఆకాష్, ఇషా, అనంత్ అంబానీలు దగ్గరుండి చూసుకుంటున్నారు.
నిజానికి గతేడాది జరిగిన రిలయన్స్ మీటింగ్‌లోనే 2026 మొదటి భాగంలోనే జియో ఐపీఓ ఉంటుందని అంబానీ ప్రకటించారు. కానీ ఈ మధ్య కాలంలో రిలయన్స్ షేర్ వాల్యూ కాస్త తగ్గడం, అలాగే పశ్చిమాసియాలో జరుగుతున్న గొడవల వల్ల రిలయన్స్‌కు ముఖ్య ఆదాయ వనరైన పెట్రోకెమికల్ బిజినెస్‌పై దెబ్బ పడటంతో ఈ ప్రాసెస్ కొంచెం లేట్ అయింది. ఆలస్యమైనా సరే, ఎట్టకేలకు డ్రాఫ్ట్ పేపర్లు దాఖలు కావడంతో ఇన్వెస్టర్లలో మళ్లీ జోష్ వచ్చింది. సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ ఐపీఓ మార్కెట్లోకి రానుంది. ఇది పాత షేర్ హోల్డర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టడమే కాకుండా, కొత్తగా మార్కెట్లోకి వచ్చే ఇన్వెస్టర్లకు కూడా జియో భాగస్వామ్యంలో పెట్టుబడి పెట్టడానికి ఒక సూపర్ ఛాన్స్ కానుంది.






