HEALTH & LIFESTYLE

బాలింతలు తప్పనిసరిగా పాటించాల్సిన ఆహార నియమాలు.

బిడ్డకు జన్మనివ్వడం ప్రతి తల్లి జీవితంలో ఓ అద్భుతమైన క్షణం. బాలింతల ఆహారం ప్రసవం తర్వాత శరీరం కోలుకోవడానికి, బిడ్డకు సరిపడా పాలు అందించడానికి పోషకాహారం చాలా అవసరం. అయితే పాలు పెరగాలనే ఉద్దేశంతో నెయ్యి, తీపి పదార్థాలు, ప్రత్యేక ఆహారాలను అధికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్నం, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, గుడ్లు వంటి సాధారణ ఆహారాన్నే సమతులంగా తీసుకుంటే సరిపోతుంది. పాలిచ్చే తల్లులకు సాధారణం కంటే రోజుకు సుమారు 330 నుంచి 400 అదనపు కేలరీలు అవసరమవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

బాలింతలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పోషకాహారం

ప్రొటీన్లు తప్పనిసరి: పప్పులు, శనగలు, పెసలు, గుడ్లు, పాలు, పెరుగు, చేపలు, చికెన్ వంటి ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని రోజువారీ భోజనంలో చేర్చాలి. ఇవి ప్రసవం తర్వాత శరీరం త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి.

ఆకుకూరలు పండ్లు: పాలకూర, తోటకూర, మునగాకు, క్యారెట్‌, బీట్‌రూట్‌తోపాటు కాలానికి లభించే పండ్లు తీసుకోవాలి. వీటివల్ల ఐరన్‌, కాల్షియం, విటమిన్లు, పీచుపదార్థాలు లభించి రక్తహీనత, మలబద్ధకం తగ్గుతాయి.

పాలిచ్చే తల్లులు ఎంత నీరు తాగాలి?

నీరు తగినంత తాగాలి: పాలిచ్చిన ప్రతిసారీ దాహాన్ని బట్టి నీరు తాగాలి. సూప్‌, మజ్జిగ, కొబ్బరినీళ్లు కూడా తీసుకోవచ్చు. అయితే పాలు పెరగాలంటూ బలవంతంగా అధిక నీరు తాగాల్సిన అవసరం లేదు.

చిరుధాన్యాలు తీసుకోవాలి: రాగి, జొన్న, సజ్జ, కొర్రలతోపాటు గోధుమలు, ఓట్స్‌ వంటి ఆహారం శక్తిని అందిస్తుంది. తెల్లబియ్యంపైనే పూర్తిగా ఆధారపడకుండా ధాన్యాలను మారుస్తూ తీసుకోవాలి.

కెఫిన్, మద్యం విషయంలో జాగ్రత్తలు

కెఫిన్‌ను పరిమితం చేయాలి: టీ, కాఫీ, చాక్లెట్లు, శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫిన్‌ ఉంటుంది. అధికంగా తీసుకుంటే బిడ్డలో నిద్రలేమి, చికాకు కనిపించవచ్చు. మద్యం, పొగాకు పూర్తిగా మానేయడం సురక్షితం.  

వైద్యుల సలహా అవసరం: ఐరన్‌, కాల్షియం, విటమిన్‌ మాత్రలను సొంతంగా వాడకుండా వైద్యుల సూచన మేరకే తీసుకోవాలి. ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత తల్లికి లేదా బిడ్డకు సమస్య కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.

Show More
Back to top button