HEALTH & LIFESTYLE

స్ట్రీట్ ఫుడ్ తింటున్నారా? ఆ నూనె రంగు మారితే రోగాలు ఖాయం..!

బజ్జీలు, పకోడీలు, సమోసాలు, పూరీలు, దోశలు వేడివేడిగా కనిపిస్తే తినకుండా ఉండలేం. ముఖ్యంగా టిఫిన్‌ సెంటర్లు, హోటళ్లు, రోడ్డు పక్కన ఉండే స్ట్రీట్‌ ఫుడ్‌ బండ్ల దగ్గర వీటిని ఎక్కువగా తింటుంటాం. అయితే వాటి రుచి గురించి ఆలోచిస్తున్నాం తప్ప.. వాటిని తయారు చేయడానికి ఎలాంటి నూనె వాడుతున్నారో పట్టించుకోవడం లేదు. కొన్ని చోట్ల ఒకసారి వేడి చేసిన నూనెను పారేయకుండా మళ్లీ మళ్లీ వేడి చేసి ఉపయోగిస్తుంటారు. ఇలా పదే పదే మరిగించిన నూనెలో ఫ్రీ రాడికల్స్‌, ట్రాన్స్‌ ఫ్యాట్స్‌, ఆల్డిహైడ్స్‌ వంటి హానికరమైన పదార్థాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ నూనెతో చేసిన ఆహారాన్ని తరచూ తింటే జీర్ణ సమస్యలు, అధిక బరువు, గుండె సంబంధిత సమస్యలు రావచ్చు. దీర్ఘకాలంలో కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు కూడా పెరిగే అవకాశం ఉందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. అందువల్ల ఆహారం ఎంత రుచిగా ఉందనే విషయంతోపాటు, దాన్ని తయారు చేసిన నూనె నాణ్యతను కూడా గమనించడం చాలా అవసరం.

స్ట్రీట్ ఫుడ్ నూనెలో టీపీసీ 38 శాతం వరకు

ఇటీవల హైదరాబాద్‌లోని సరోజినీ నాయుడు వనితా మహావిద్యాలయానికి చెందిన న్యూట్రిషన్‌, డైటెటిక్స్‌ విభాగం పరిశోధకులు నల్లగొండ పట్టణంలోని పలు టిఫిన్‌ సెంటర్లు, స్ట్రీట్‌ ఫుడ్‌ బండ్ల నుంచి వాడుతున్న నూనె నమూనాలను సేకరించి పరీక్షించారు. ఆ నమూనాల్లో టోటల్‌ పోలార్‌ కంపౌండ్స్‌ (TPC) 38 శాతం వరకు ఉన్నట్లు గుర్తించారు. నూనె ఎక్కువసార్లు వేడి చేసినప్పుడు అందులో ఏర్పడే హానికరమైన పదార్థాల స్థాయిని తెలుసుకోవడానికి ఈ టీపీసీ ఉపయోగపడుతుంది. ఆహార భద్రత నిబంధనల ప్రకారం ఇది 25 శాతానికి మించకూడదు. కానీ పరిశీలించిన నూనెల్లో ఆ పరిమితి దాటినట్లు అధ్యయనంలో తేలింది. ఈ పరిస్థితిని మార్చాలంటే హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, వీధి వ్యాపారులకు నూనెను సురక్షితంగా వాడే విధానంపై అవగాహన కల్పించాలి. అదే సమయంలో వినియోగదారులు కూడా నూనె రంగు, వాసన, ఆహారం తయారయ్యే విధానాన్ని గమనించాలి.

నూనె రంగు మారితే ఏం చేయాలి?

గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు

* నూనె ముదురు గోధుమ లేదా నలుపు రంగులో కనిపిస్తే దాన్ని వాడకూడదు.
* నూనె నుంచి కాలిన లేదా మాడిపోయిన వాసన వస్తే వెంటనే మార్చాలి.
* నూనె నుంచి ఎక్కువ పొగ వస్తున్నా, నురుగు ఏర్పడుతున్నా అది పాడైనట్లు గుర్తించాలి.
* ఒకసారి వేయించిన తర్వాత మిగిలిన నూనెలో ఆహార ముక్కలను వడగట్టి తొలగించాలి.
* వాడిన నూనెలో కొత్త నూనె కలిపి మళ్లీ ఉపయోగించడం సురక్షితం కాదు.
* నూనెను ఎక్కువ వేడి వద్ద చాలా సమయం ఉంచకూడదు.
* బయట ఆహారం కొనేటప్పుడు నూనె రంగు, వాసన, వేయించే పాత్ర శుభ్రంగా ఉన్నాయో గమనించాలి.
* ఒకే చోట పదే పదే వేయించిన ఆహారం తినకుండా ఇంటి ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

Show More
Back to top button