
అల్లూరి సీతారామరాజు సినిమా ( 1 మే 1974 )
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్ళతో పెకిళించడమే లక్ష్యంగా, నిరంకుశ పాలనను నిర్మూలించడమే ధ్యేయంగా, తెల్ల దొరల అరాచకాలని అంతమొందించడమే ప్రధాన అస్త్రంగా ఎంతో మంది పోరాటయోధులు భారత గడ్డపై నిర్విరామంగా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడి మన భారతదేశానికి స్వతంత్ర్యం తీసుకువచ్చి భరతమాత సంకెళ్ళను తెంచిన అమరవీరులు ఎందరో ఉన్నారు. వారిలో మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు ఒకరు. తన 27 ఏళ్ల వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన పుణ్యమూర్తులు మన అల్లూరి సీతారామరాజు గారు.
27 ఏళ్ల వయసు అంటే యువతకు యుక్త వయస్సు. అలాంటి యుక్త వయస్సులోనే తన ప్రాణాలను స్వాతంత్య్రం కోసం త్యాగం చేసి, తన ప్రాణాలను పుణ్యభూమికి కానుకగా ఇచ్చిన కార్యదీక్షకులు మన అల్లూరి సీతారామరాజు గారు. అందుకే తన త్యాగానికి అశేష జనవాహిని హారతులు పట్టారు. ఇలాంటి ఘన చరిత్ర కలిగిన తన చారిత్రాత్మక ఇతివృత్తాన్ని సినిమాగా తెరకెక్కించాలని ఎందరో ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ ఆ అదృష్టాన్ని దక్కించుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆంధ్రుల అందగాడిగా, తెలుగు చిత్రసీమ తొలి జేమ్స్ బాండ్ గా, సాహసాలకు పెట్టింది పేరుగా ధైర్యం చేసి చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు నటలు కృష్ణ గారు.
ఓరుగంటి రామచంద్ర రావు గారు దర్శకులుగా, ఘట్టమనేని హనుమంతరావు నిర్మాతగా, త్రిపురమైన మహారథి కథా రచయితగా, కృష్ణ, విజయనిర్మల, జగ్గయ్య, గుమ్మడి లాంటి అతిరథ మహారథులతో ఈ సినిమాని అత్యద్భుతంగా తెరాకెక్కించి ఎన్నో రికార్డులు, రివార్డులు అందుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ గారు. 365 రోజులు ప్రదర్శించబడిన ఈ చిత్రం తొలి గోల్డెన్ జూబ్లీ చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఎన్టీఆర్ గారికి తీరని కలగా మిగిలిపోయిన ఈ చిత్రాన్ని తాను నెరవేర్చుకుని, తన వందో చిత్ర మైలురాయిని ఘన విజయంతో ముగించారు సూపర్ స్టార్ కృష్ణ గారు.
పాత్రలు – పాత్రధారులు..
- కృష్ణ – అల్లూరి సీతారామరాజు
- గుమ్మడి – గంటం దొర
- ప్రభాకర్ రెడ్డి – మల్లు దొర
- బాలయ్య – అగ్గిరాజు
- కాంతారావు – పడాలు
- రావు గోపాలరావు – వీరయ్యదొర
- చంద్రమోహన్ – గోవిందు
- కొమ్మినేని శేషగిరిరావు – కోయరాముడు
- జగ్గయ్య – రూథర్ ఫర్డ్
- రాజనాల – మేజర్ గుడాల్
- త్యాగరాజు – బాస్టియన్
- పేకేటి శివరాం – బ్రేకన్
- కె.వి.చలం – పిళ్లె
- జగ్గారావు – కవర్ట్
- ఆనంద్ మోహన్ – హైటర్
- అల్లు రామలింగయ్య – సింగన్న
- సాక్షి రంగారావు – లింగన్న
- విజయనిర్మల – సీత
- మంజుల – రత్తి
- జయంతి – గంగమ్మ
- రాజశ్రీ – సింగి
- నందితాబోస్ – ఫ్లారెన్స్
- పండరీబాయి – నారాయణమ్మ
- వేదుల లక్ష్మీగణపతి శాస్త్రి
చిత్ర కథ..
సినిమా కథ ప్రకారం చిన్నతనం నుంచి బ్రిటీష్ పరిపాలన పట్ల వ్యతిరేకత ఉన్న అల్లూరి రామరాజు ఆంగ్ల విద్యను తిరస్కరించి భారతీయుల సనాతన యోగవిద్యను అభ్యసిస్తాడు. రామరాజు దేశమంతా పర్యటించి బ్రిటీష్ పరిపాలనలో ప్రజల కష్టాలు, సమస్యలు అర్థం చేసుకుని, అహింసా విధానాన్ని తిరస్కరిస్తాడు. రామరాజు, సీత పరస్పరం ప్రేమించుకుని వివాహానికి పెద్దల అంగీకారాన్ని పొందుతాడు. దేశాటనకు వెళ్ళిన రామరాజు గారు కార్తీక పౌర్ణమి నాటికి తిరిగి వచ్చి తాను అవివాహితుడిగా, సన్యాసిగా ఉండి దేశ దాస్యవిముక్తికి పోరాడతానని సీతకు చెప్పగా ఆమె వేరే పెళ్ళిని అంగీకరించలేక ఆత్మహత్య చేసుకుంటుంది. ఆనాటి నుంచి అల్లూరి రామరాజు గారు సీతారామరాజుగా పేరు మార్పుచేసుకుంటాడు. సీతారామరాజు గారు మన్యం ప్రాంతంలో శ్రమదోపిడీ, ప్రకృతి వనరుల దోపిడీ చూసి చలించిపోయి, అక్కడి ప్రజల్లో తిరుగుబాటను ప్రోత్సహిస్తారు.

గంటదొర, మల్లుదొర వంటివారి సహకారంతో ప్రజలను సమీకరించి బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు. ఈ క్రమంలో పోలీసు స్టేషన్లపై దాడిచేసి ప్రజలపై అక్రమంగా బనాయించిన కేసు పత్రాలను చించి, ఆయుధాలు స్వాధీనం చేసుకుంటాడు. బ్రిటీష్ ప్రభుత్వం సీతారామరాజును బంధించాలని చేసే యత్నాలు భగ్నమై విప్లవ వీరులు విజయం సాధిస్తారు. అంతర్గత సమస్యలతో విప్లవం బలహీనం కాగా, బ్రిటీష్ కలెక్టర్ రూధర్ ఫర్డ్ మన్యంలోని గ్రామాలపై దాడులు చేసి, ప్రజలను హింసించి సీతారామరాజును స్వయంగా బయటకు రప్పిస్తుంది. రూధర్ ఫర్డ్, ఇతర అధికారులు వ్యక్తిగతంగా సీతారామరాజు సత్య నిష్ఠకీ, పోరాటంలోని నిజాయితీకి ఆకర్షితులైనా, వృత్తిధర్మంలో భాగంగా సీతారామరాజును కాల్చి చంపుతారు. ఒక్క సీతారామరాజును చంపితే వేలమంది సీతారామరాజులు పుడతారని నినదిస్తూండగా సీతారామరాజు మరణంతో సినిమా ముగుస్తుంది.
సాంకేతిక వర్గం…
- రచన… త్రిపురనేని మహారథి
- పాటలు…. శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజు, సినారె
- సంగీతం… ఆదినారాయణరావు
- కళ… తోట – రామలింగం
- కూర్పు… కోటగిరి గోపాలరావు
- ఛాయాగ్రహణం… వి.యస్.ఆర్.స్వామి
- దర్శకత్వం… వి.రామచంద్రరావు, కె.ఎస్.ఆర్.దాస్
- నిర్మాత… జి. హనుమంతరావు
- నిర్వహణ… జి.ఆదిశేషగిరిరావు
కథకు బీజం.
దేవదాసు (1953) నిర్మాత డీ.ఎల్.నారాయణరావు గారు “అల్లూరి సీతారామరాజు” చరిత్రను మొదట అందాల నటులు “శోభన్ బాబు” గారితో సినిమాగా తీయాలని ప్రయత్నించారు, కానీ కుదరలేదు. అక్కినేని నాగేశ్వరావు గారితో ఈ చిత్రాన్ని చేయాలని ప్రముఖ దర్శకుడు టి.ప్రకాష్ రావు గారు 1953లో స్క్రిప్ట్ వ్రాయించారు. అదీ పట్టాలకెక్కలేదు. తర్వాత ఎన్టీఆర్ గారు ఈ సినిమాను తాను కథనాయకుడిగా తెరాకెక్కించాలని ప్రయత్నించారు. అది కూడా కుదరలేదు. దాంతో ఈ కథను నిర్మించాలని మిక్కిలి మక్కువతో ఉన్న సూపర్ స్టార్ కృష్ణ గారు తన కలను నెరవేర్చుకున్నారు. ఈ చిత్ర కథను డీ.ఎల్.నారాయణ గారు అందించారు. త్రిపురనేని మహారథి గారు వ్రాసిన ఈ స్క్రిప్టుకి డీ.ఎల్.నారాయణ గారు సహాయం అందించారు. మహారథి గారు అద్భుతంగా వ్రాసిన ఆ స్క్రిప్టును అంతే అద్భుతంగా తెరకెక్కించారు కృష్ణ గారు. తన 12వ చిత్రం “అసాధ్యుడు”లో పాత్రలో భాగంగా ఓ సన్నివేశంలో “అల్లూరి సీతారామరాజు” గా నటించారు కృష్ణ గారు. ఆ తర్వాత తన 100 వ చిత్రంతో పూర్తి నిడివి గల అల్లూరి సీతారామరాజు పాత్రని పోషించి తనకు మరెవరూ సాటిరారు అనిపించుకున్నారు.
దర్శకులు ఓరుగంటి రామచంద్ర రావు గారు..
దేవుడు చేసిన మనుషులు, గంగ – మంగ, అబ్బాయిగారు అమ్మాయిగారు, అమ్మ మాట, పాపం పసివాడు, పగబట్టిన పడుచు, అసాధ్యుడు, నేనంటేనేనే, మరపురాని కథ లాంటి చక్కని చిత్రాలను తెరకెక్కించిన దిగ్గజ దర్శకులు ఓరుగంటి రామచంద్ర రావు గారు. తాను తెరకెక్కించిన “పాపం పసివాడు” చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఒక విలక్షణ చిత్రంగా నిలిచిపోయింది. ఎడారిలో తప్పిపోయిన పసి బాలుడు కథతో వచ్చిన ఈ చిత్రం అశేష జనుల అభిమానాన్ని చూరగొన్నది. తాను నిర్మించిన “భద్రం కొడుకో” చిత్రానికి జాతీయ పురస్కారం లభించింది.
అంతకు ముందు “దేవుడు చేసిన మనుషులు” చిత్రాన్ని తీసి తనకు అద్భుతమైన విజయం అందించడంతో కృష్ణ గారు “అల్లూరి సీతారామరాజు” చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే పనిని కృష్ణ గారు వి.రామచంద్ర రావు గారికి అప్పగించారు. అలా ఈ సినిమాను తెరకెక్కించే క్రమంలో 70% చిత్రీకరణ పూర్తి అయిన తర్వాత 14 ఫిబ్రవరి 1974లో తన 47 సంవత్సరాల వయస్సులోనే తాను గుండెపోటుతో మరణించారు. దాంతో రామచంద్ర రావు గారి చివరి కోరిక మేరకు మిగతా చిత్రాన్ని కృష్ణ గారు దర్శకత్వం వహించారు. కానీ టైటిల్స్ లో మాత్రం దర్శకుడుగా వి.రామచంద్ర రావు గారి పేరునే వేసి తన మాట నిలబెట్టుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ గారు.
నిర్మాణం…
చిత్ర పరిశ్రమలో ఎవరు సాహసించినా, సాహసించకపోయినా, నిర్మాత సాహసించకపోతే గొప్ప చిత్రాలు రావు. 1974లో వచ్చిన “అల్లూరి సీతారామరాజు” చిత్రాన్ని సుమారు 30 లక్షల రూపాయల ఖర్చుతో, చింతపల్లి అడవులలో, సహజ ఆటవిక వాతావరణంలో కృష్ణ గారు నిర్మించిన “అల్లూరి సీతారామరాజు” చిత్రం తెలుగు చిత్ర నిర్మాణంలోనే అప్పట్లో పెను సంచలనమే సృష్టించింది అని చెప్పాలి. తెలుగులో తొలి కలర్ స్కోప్ గా తీసిన ఈ చిత్రం నిర్మించడానికి సుమారు 60 రోజులు పట్టింది. హిందీలో “పాకీజా” సినిమా కలర్ స్కోప్ లో తీసిన తొలి చిత్రమైతే, భారతదేశంలో కలర్ స్కోప్ లో తీసిన మూడవ చిత్రం “అల్లూరి సీతారామరాజు”.
“పాకీజా” చిత్రాన్ని స్కోప్ లో తీసిన కమల్ అమ్మోహి ని సంప్రదించి “అల్లూరి సీతారామరాజు” సినిమాని స్కోప్ లో తీయడానికి అవసరమైన లెన్సును అద్దెకు తీసుకొచ్చారు కృష్ణ గారు. “కొండ దేవరా నిన్ను కొలిచేమమ్మా” అనే పాటతో తొలిరోజు చిత్రీకరణ ప్రారంభించారు దర్శకులు వోరుగంటి రామచంద్ర రావు గారు. కృష్ణ, మంజుల, రాజశ్రీ, కాంతారావు వంటి అగ్రశ్రేణి నటీనటులతో పాటు మరో 100 మంది జూనియర్ ఆర్టిస్టులతో సినిమాలో పాటను ముందుగా చిత్రీకరించారు. ఫలితం చాలా గొప్పగా వచ్చింది. దాంతో సినిమా మొత్తం స్కోప్ లోనే చిత్రించారు.
చింతపల్లి అడవులలో మంచి లొకేషన్ లు ఉండడంతో అందరికోసం కాటేజీలు నిర్మించి, హోటల్ గదులలో ఉండే సౌకర్యాలు ఏర్పాటు చేశారు కళాదర్శకులు. ప్రధాన నటవర్గమే కాకుండా, వంట వాళ్ళు, టెక్నీషియన్లు, సాంకేతిక నిపుణులు, జూనియర్ ఆర్టిస్టులు అంతా కలిపి మొత్తం 300 మందికి పైగానే చిత్రీకరణలో పాల్గొని చిత్రాన్ని పూర్తి చేశారు. వాహిని స్టూడియోస్ లో 12 డిసెంబరు 1973న ప్రారంభమై, ఆ తరువాత విశాఖపట్నం సమీపంలో గల చింతపల్లి, లంబసింగి, లోతుగడ్డ, పాశంపాడు, అన్నవరం, కృష్ణదేవిపేట, బలిమెల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ పూర్తి చేశారు.
చాలా భాగం చిత్రీకరణ జరిగాక హఠాత్తుగా దర్శకులు వి.రామచంద్ర రావు గారు మరణించారు. దాంతో పోరాట సన్నివేశాలకు కే.ఎస్.ఆర్.దాస్ గారు దర్శకత్వం వహించగా, మిగిలిన భాగానికి కృష్ణ గారు దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని పూర్తిచేశారు. 1 మే 1974లో విడుదల అయిన “అల్లూరి సీతారామరాజు” చిత్రం అఖండ విజయంతో కృష్ణ గారి ఖ్యాతి దేశవ్యాప్తమైంది. ఆ రోజుల్లో 30 లక్షల ఖర్చు అంటే మామూలు విషయం కాదు. ఇంత పెద్ద మొత్తం ఖర్చుతో చిత్రాన్ని నిర్మించిన కృష్ణ గారి సాహసాన్ని కొనియాడకుండా ఉండలేము.
రికార్డులు…
ఘట్టమనేని ఆదిశేషగిరి రావు గారి నిర్వహణలో, ఘట్టమనేని హనుమంతరావు గారు నిర్మాతగా, కృష్ణ గారి సమర్పణలో, వి.రామచంద్రరావు గారి దర్శకత్వంలో నిర్మించిన “అల్లూరి సీతారామరాజు” చిత్రానికి 1975 వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి “స్వర్ణ నంది” లభించింది. తాష్కెంట్ లో జరిగిన మూడవ ఆఫ్రో – ఏషియన్ చలన చిత్రోత్సవంలో “అల్లూరి సీతారామరాజు” సినిమా అవార్డు గెలుచుకుంది. హిందీలో ఇంక్విలాబ్ గా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. తెలుగు సినిమా చరిత్రకు, తెలుగు సినిమా రంగానికి, కృష్ణ సినీ ప్రస్థానానికి గర్వకారణమైన సినిమా “అల్లూరి సీతారామరాజు”. తెలుగు ప్రేక్షకులు, ఈ చిత్రంలోని నటీనటులు సగర్వంగా చెప్పుకునే చిత్రం

“అల్లరి సీతారామరాజు”. ఆంధ్రప్రదేశ్ లోని 34 కేంద్రాల్లో 52 థియేటర్లలో మరియు బెంగళూరులో రెండు థియేటర్లలో విడుదలై ఈ సినిమా 19 కేంద్రాల్లో థియేటర్ మారకుండా, థియేటర్ మారి మూడు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది ఈ చిత్రం. ఆంధ్రప్రదేశ్ లోని 32 కేంద్రాల్లో, బెంగళూరులో రెండు థియేటర్లలో అర్థ శత దినోత్సవం కూడా జరుపుకుంది ఈ అల్లూరి సీతారామరాజు చిత్రం. ఈ చిత్రం హైదరాబాద్ లో సంవత్సరం పాటు ప్రదర్శితమైంది. రెండోసారి విడుదల చేసినప్పుడు కూడా శతదినోత్సవం జరుపుకుంది. ఈ చిత్రం విడుదలైన మొదటి రోజున ఆరోజుల్లో 3,46,338 రూపాయలు, తొమ్మిది రోజులకు 18,48,179 రూపాయలు వసూలు చేసి రికార్డును నెలకొల్పింది అల్లూరి సీతారామరాజు చిత్రం.
పురస్కారాలు…
అల్లూరి సీతారామరాజు చిత్రానికి 1974 సంవత్సరానికి గానూ ఉత్తమ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు వరించింది…
“తెలుగు వీర లేవరా” అనే అద్భుతమైన గేయానికి సాహిత్యాన్ని అందించిన శ్రీశ్రీ గారికి జాతీయ ఉత్తమ సినీ గీత రచయితగా పురస్కారం లభించింది..
తాష్కెంట్ లో జరిగిన ఆఫ్రో – ఏషియన్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడి బహుమతిని అందుకుంది..
చిత్ర విశేషాలు..
ముందుగా ‘అల్లూరి సీతారామరాజు ’సినిమాను నందమూరి తారకరామారావు గారు చేయాలని చాలా రోజులుగా అనుకున్నారు. కానీ కుదరలేదు. సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ సినిమా చేసినా కూడా ఆ పాత్రపై మక్కువ వదులుకోని ఎన్టీఆర్ గారు సర్ధార్ పాపారాయుడు, ఆ తర్వాత మేజర్ చంద్రకాంత్ సినిమాల్లోని పాటల్లో ‘అల్లూరి సీతారామరాజు’గా కనిపించి ఆ పాత్రపై తనకున్న మక్కువ తీర్చుకున్నారు.
ఈ సినిమా కోసం సూపర్ స్టార్ తన స్వీయ నిర్మాణ సంస్థ పద్మాలయ సంస్థపై నిర్మించారు. ఈ సినిమా కోసం త్రిపురనేని మహారథితో ఆరుగురి సభ్యులను మన్యం ప్రాంతంలో ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ రెడీచేయించారు.
ఈ సినిమా షూటింగ్‌ను ఇన్డోర్ సన్నివేశాలను వాహినీ స్టూడియోలో ప్రత్యేకమైన సెట్ వేసి చిత్రికరించారు. ఔట్ డోర్ షూటింగ్ ను చింతపల్లి అడవుల్లో 38 రోజుల పాటు చిత్రికరించారు..
హీరో సూపర్ స్టార్ కృష్ణ గారికి ’అల్లూరి సీతారామరాజు’ 100వ చిత్రం..
అల్లూరి సీతారామరాజు సినిమా కంటే ముందు కృష్ణ గారు “అసాధ్యుడు” సినిమాలో అల్లూరి సీతారామరాజుగా ఓ సన్నివేశంలో కనిపిస్తారు..
అల్లూరి సీతారామరాజు సినిమాలో ప్రియురాలి పాత్రలో చనిపోయే పాత్రలో విజయ నిర్మల గారు నటించారు..
ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన వి.రామచంద్రరావు గారు ఈ చిత్రం 70 షూటింగ్ పూర్తికాగానే అకాల మరణం చెందారు. దీంతో మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కే.యస్.ఆర్. దాస్ తెరకెక్కించారు.
1974 మే 1న విడుదలైన ఈ చిత్రం నేటితో 49 ఏళ్లను పూర్తి చేసుకుంది. సినిమా విడుదలైన మొదటి అట నుండే సూపర్‌హిట్ టాక్‌ను సంపాదించుకుంది..
అల్లూరి సీతారామరాజు చిత్రం తెలుగులో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించిన తొలి సినిమా స్కోప్ చిత్రంగా రికార్డులకు ఎక్కింది.
ఈ చిత్రానికి పి.ఆదినారాయణ రావు గారు అందించిన సంగీతం పెద్ద ఎస్సెట్. ముఖ్యంగా “తెలుగువీర లేవరా” పాటకు జాతీయ స్థాయిలో ఉత్తమ గేయ రచయతగా శ్రీశ్రీ కి అవార్డు వచ్చింది..
సూపర్ స్టార్ కృష్ణ గారి “అల్లూరి సీతారామరాజు” సినిమా 19 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది..
“అల్లూరి సీతారామరాజు” చిత్రం 19 కేంద్రాల్లో 25 వారాలు నడిచింది. హైదరాబాద్‌లో షిఫ్ట్ సిస్టమ్‌లో యేడాదికి పైగా నడిచింది..
“అల్లూరి సీతారామరాజు” చిత్రం మరలా రెండు సార్లు విడుదల చేస్తే రిపీట్ రన్లో కూడా చాలా కేంద్రాల్లో 100 రోజులుకు పైగా నడిచి రికార్డులు క్రియేట్ చేసింది..
1975 మే 1 న శోభన్ బాబు గారి అధ్యక్షతన “అల్లూరి సీతారామరాజు” చిత్రం స్వర్ణోత్సవం జరిగింది.
“అల్లూరి సీతారామరాజు” చిత్రం వచ్చిన 20 యేళ్లకు సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమాకు సీక్వెల్‌గా “తెలుగు వీర లేవరా” అనే సినిమా చేసారు. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నిరాశ పరిచింది..
సూపర్ స్టార్ కృష్ణ గారి సినీ ప్రస్థానంలో చేసిన తొలి చారిత్రాత్మక చిత్రం “అల్లూరి సీతారామరాజు”. ఆ తర్వాత కృష్ణ గారి “విశ్వనాథ నాయకుడు” వంటి ఒకటి రెండు చారిత్రక సినిమాలు చేశారు..
“అల్లూరి సీతారామరాజు” చిత్రం తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన 14 సినిమాలు ఫ్లాప్ అయ్యాయంటే.. ఈ సినిమా ప్రభావం మిగతా సినిమాలపై ఎలా చూపిందో మనకు అర్థమైపోతుంది.. ఈ చిత్రం రష్యాలోని “తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్” లో ప్రదర్శింపబడి కమ్యూనిస్ట్‌ల ప్రశంసలు అందుకుంది.