
భారత్ కు స్వాతంత్ర్యం అందించడమే లక్ష్యంగా తన ప్రాణాల్ని సైతం ఆపదలో పెట్టి ఏళ్లకెళ్లు బంధిగానే గడిపిన మహనీయుడు.
తొలుత లండన్ లో విప్లవోద్యమానికి తెర లేపి, ఆపై అండమాన్ లో దుర్భరమైన జైలు జీవితాన్ని గడిపారు. భారతీయుల్లోహిందుత్వాన్ని నేర్పి, జాతి సమైక్యతకు కార్యరూపం దాల్చారు. ఫలితంగా హిందూ మహాసభకు అధ్యక్షులయ్యారు.ఏటా విశేషంగా జరుపుకునే గణేష్, శివాజీ ఉత్సవాలను తీసుకొచ్చింది ఆయనే..ఎన్నో గ్రంథాల్ని రాసి, మనకు అందించారు.. వీటిల్లో అభ్యుదయ, వైజ్ఞానిక, శాస్త్రీయ దృక్పథాలు కీలకంగా కనిపిస్తాయి.
ఆధునిక భారతీయ రాజనీతిజ్ఞులలో ఒకరైన సావర్కర్.. మహోన్నత ఆదర్శవాది, మానవతా వాది, హేతువాది కూడా.
స్వాతంత్ర యోధునిగానే కాక చరిత్రకారునిగా, సాహితీవేత్తగా కూడా ప్రసిద్ధి పొందారు. అటువంటి వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి నేడు(మే 28న). ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలతో పాటు స్వాతంత్ర్యం కోసంఆయన చేసిన కృషి గురుంచి ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం:
బాల్యం, విద్యాభ్యాసం…
1883 మే 28న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా భాగూర్ గ్రామంలో దామోదర్ పంత్ సావర్కర్, రాధాబాయి దంపతులకు జన్మించారు వినాయక దామోదర్ సావర్కర్. అన్న గణేష్ దామోదర్ సావర్కర్, తమ్ముడు నారాయణరావు సావర్కర్. వీరిచిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. బ్రిటిష్ ఆగడాలకు భారతీయులు పడరాని పాట్లు పడుతూ జీవనం సాగిస్తున్నదీనమైన రోజులవి.ఈ పరిస్థితులను చూసి చలించిపోయిన ముగ్గురు అన్నదమ్ముళ్లు తమ కులదైవం సాక్షిగా దేశ స్వాతంత్య్రం కోసం తమప్రాణాలను సైతం అర్పించేందుకు సంసిద్ధులని ప్రమాణం చేసుకున్నారు. ఈ ఆశయ సాధన కోసం అభినవ భారత్ వంటిసంస్థల్ని స్థాపించారు.
విద్యాభ్యాసం నాసిక్ లో జరుగగా, బీ.ఏ, పూణెలోని పెర్గ్యూసన్ కళాశాలలో పూర్తి చేశారు. బార్-ఎట్-లా చదువు కోసం 1906లోలండన్ వెళ్లారు. అప్పటికే సావర్కర్ కు వివాహమై, ఒక కొడుకు కూడా ఉన్నాడు.
విప్లవం మొదలైంది.. తెల్లోళ్ళ గడ్దపైనే…
తెల్లవాళ్ల గడ్డ అయిన లండన్ నుంచే తన విప్లవాన్ని నడిపించాలని నిర్ణయించుకున్న సావర్కర్ కు లా చదువు ఒక సాకుమాత్రమే…అక్కడి విప్లవకారులతో పరిచయాలు పెంచుకొని, వారితో కలిసి నడిచారు.

న్యాయవిద్య పూర్తి చేసుకున్నప్పటికీ, పట్టా అందుకోలేదు. కారణం అప్పటి బ్రిటిష్ రాణి పట్ల సావర్కర్ కనీస విధేయతప్రదర్శించకపోవడమే… అంతేకాకుండా మరో సందర్భంలో బ్రిటిష్ ఆర్మీ అధికారిని హతమార్చిన కారణంగా వినాయక్ దామోదర్సావర్కర్ మీద, అతని కుటుంబం చర్యల మీద నిఘా పెరిగింది. ఎలాగోలా నిర్బంధించిన సావర్కర్ ను స్టీమర్ లో భారత్ కుతీసుకొస్తున్న సమయంలో, తప్పించుకునేందుకు యత్నించినా విఫలమయ్యాడు.
1910 జులై 10వ తేదిన మోరియా ఓడలో బందీగా భారత్ వస్తున్న సమయంలో ఫ్రాన్స్‌లోని మార్సెల్స్ రేవు పట్నంలో ఓడ లంగరు వేసి నిలబడింది. అదే సమయంలో నేను బయటికి వెళ్ళాలి అని తనను కాపలా కాస్తున్న రక్షక భటులను అడిగాడు. ఒక రక్షకభటుడు అతన్ని మరుగుదొడ్డి దగ్గరకు తీసుకువెళ్లాడు. బందీలోనికి వెళ్లి తలుపు వేసుకున్నాడు. మరుగుదొడ్డిలోని రంధ్రం గుండాసముద్రంలోకి జారిపోయాడు. ఈదుకుంటూ ఫ్రాన్స్ భూభాగం మీద అడుగుమోపాడు. అంతలోనే గస్తీ నావలో అక్కడ సిద్ధంగాఉన్న బ్రిటిష్ పోలీసులు సావర్కర్‌ను తిరిగి నిర్బంధంలోకి తీసుకున్నారు. అతడ్ని బంధించి భారతదేశానికి చేర్చారు.
అండమాన్ జైలులో రెండు యావజ్జివ కారాగార శిక్షలు విధించింది బ్రిటిష్ ప్రభుత్వం. అంటే, దాదాపు యాభై ఏళ్ళు. అరెస్టుఅనంతరం సావర్కర్ ఆస్తిని సైతం ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంది. జైలులో ఎంతో కఠినమైనా జీవితం గడిపారు దామోదర్. అయినప్పటికీ, ఆయన అక్కడ ఉండే తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. తోటి ఖైదీలకు చదువు చెప్పారు. అయితే, దేశంలో వివిధ వర్గాల నుంచి బ్రిటిష్ ప్రభుత్వం మీద సావర్కర్ ను విడుదల చేయాలనే అంశం గురుంచి ఒత్తిడి పెరిగింది. ఈనేపథ్యంలో సావర్కర్ ను అండమాన్ నుంచి మహారాష్ట్రలోని ఎరవాడ జైలుకు తరలించారు. కొన్నాళ్ళకు, ఎట్టి పరిస్థితుల్లోనూరత్నగిరి జిల్లా దాటి పోవద్దని, రాజకీయాల్లో పాల్గొనని వంటి షరతుల మీద పూర్తిగా విడుదల చేసేసింది.
జాతి సమైక్యత కోసం…
చాన్నాళ్లు జైలు జీవితం చవిచూసిన తర్వాత, సావర్కర్ పూర్తిగా హిందూ సమాజ సంస్కరణలో భాగమైపోయారు. అప్పట్లోహిందూ సమాజం అనైక్యత, అస్పృశ్యత(అంటరానితనం), సాంఘిక దురాచారాలలో మగ్గిపోతూ ఉంది. ఈ అసమానతలనుసమూలంగా రూపుమాపి సమాజంలో జాతిని సమైక్యం చేసేందుకని నడుం బింగించారు.
1929లో రత్నగిరిలోని విఠలేశ్వరాలయంలోకి హరిజనులకు ప్రవేశం కల్పించారు సావర్కర్. పాఠశాలల్లో అన్ని వర్ణాల విద్యార్థులుకలిసి చదువుకునేలా ప్రోత్సహించారు. అంతేకాక 1931లో ఏకంగా పతిత పావన అనే మందిరాన్ని నిర్మించి, శంకరాచార్యులవారిచే ప్రారంభించారు. వివిధ మతాల మధ్య ఐక్యత కోసం సహాపంక్తి భోజనాలను సైతం ఏర్పాటు చేశారు. అప్పట్లో గణేష్ఉత్సవాలను, శివాజీ ఉత్సవాలను మొదలుపెట్టి, పెద్ద ఎత్తున నిర్వహించిన ఘనత కూడా ఆయనదే. ఈ రకంగా ఉద్యమంలాజాతి సమైక్యత కోసం ఎంతగానో పోరాడారు.
అసలైన హిందూత్వానికి అర్థం…
హిందుత్వమంటే… సింధు నది నుంచి హిందూ మహా సముద్రం వరకున్న ఈ భారత భూమిని మాత, పితృ భూమిగా, పుణ్యభూమిగా ఎవరైతే భావిస్తారో… వారంతా కూడా హిందువులే అవుతారని స్పష్టమైన నిర్వచనం చేశారు.
అసలైన హిందుత్వం అనేది మన జాతీయతను సూచిస్తుంది. దేశంలో మతాలు ఎన్ని ఉన్నా జాతీయత ఒక్కటే. జాతీయత అనేనదిలో అన్ని మతాలు, వర్గాలు సెలయేర్లలా కలిసిపోవాలని కోరుకున్నారు సావర్కర్.
హిందువుల ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఎవరు ప్రవర్తించినా అనవసరమైన ఘర్షణ తప్పదు. ఈ స్వీయ రక్షణ కోసంహిందూ సంఘటనోద్యమాన్ని ప్రారంభించారు వీర సావర్కర్. స్వాతంత్య్రంతో పాటు దేశ విభజన కూడా తప్పదని చాలాముందుచూపుతో గ్రహించారాయన. ఆనాటి బ్రిటిష్ ఇండియా సైన్యంలో హిందువులు చాలా తక్కువ. అందుకే హిందువులుసైన్యంలో చేరాలని ప్రోత్సహించిన ధీశాలి సావర్కర్. ఈ పిలుపు ఇవ్వడాన్ని అప్పట్లో తప్పుబట్టిన వారంతా, తర్వాతి కాలంలోఆయన దూరదృష్టిని చూసి, అభినందించారు.
ఎనలేని సాహితీ కృషి…
1938నాటికి బ్రిటిష్ ప్రభుత్వం వినాయక్ దామోదర్ సావర్కర్‌పై విధించిన ఆంక్షలను పూర్తిస్థాయిలో ఎత్తివేసింది. తరువాతహిందూ మహాసభకు ఆయనను అధ్యక్షునిగా ఎన్నుకుంది.ఆయన రాసిన గ్రంథాలు ప్రజల్లో దేశభక్తిని రగిలించేవిగా ఉండేవి. ఈ కారణం వల్లే బ్రిటిష్ ప్రభుత్వం ఆయన రచనలపై గట్టి నిఘాపెట్టింది. చాలా ఏళ్లపాటు నిషేధం కూడా అమలులో ఉంది. భారతదేశంతో పాటు విదేశీ చరిత్రలను సైతం ఎంతో లోతుగాఅధ్యయనం చేసి, మనకు సాహిత్య సంపదను అందజేశారు సావర్కర్.
మరీ ముఖ్యంగా.. 1908లో లండన్‌లో చదువుకుంటున్న రోజుల్లోనే ‘1857- స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర’ అనే గ్రంథాన్ని రాశారు. ఆనాడు జరిగిన ఉద్యమాన్ని బ్రిటిష్ చరిత్రకారులు కేవలం సిపాయిల తిరుగుబాటుగా అభివర్ణించారు. కానీ అది స్వాతంత్య్రసంగ్రామమని స్పష్టంగా లోకానికి చాటి చెప్పారు సావర్కర్. అనంతరం దీన్ని ప్రపంచంలోని పలు భాషల్లోకి అనువదించారు. బ్రిటిష్ ప్రభుత్వం ప్రచురణకు ముందే ఈ గ్రంథాన్ని నిషేధించింది. దీన్ని ముద్రణకోసం భారత్ లోని తన అన్న గణేష్ సావర్కర్కుకాపీ పంపగా, బ్రిటిష్ వారు పసిగట్టారు. అనంతరం ఆయన్ను ఆరెస్టు చేసి అండమాన్‌కు పంపింది ఈ కేసులోనే. మహారాష్ట్రలోనిఅన్ని ముద్రణాలయాలపై ముందు జాగ్రత్తగా దాడులు జరిపారు కూడా.
అయినప్పటికీ విదేశాల్లో ముద్రించిన ‘1857-స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర’ రహస్యంగా భారతదేశం చేరింది. ఈ గ్రంథం తర్వాతికాలంలో ఎంతోమంది స్వాతంత్య్ర సమర వీరులకు, విప్లవ యోధులకు స్పూర్తినిచ్చింది.
వాస్తవానికి, స్వతహాగా ఆయనొక కవి. శిక్ష సమయంలో జైలు గోడల మీదే కవితలు రాశారు. వీటిని కంఠస్తం చేసి, గుర్తు పెట్టుకొని, తర్వాత కాలంలో గ్రంథస్తం చేశారు. కొద్ది నెలల తర్వాత జైలు సిబ్బంది ఆయనకు కాగితాలు, కలం సమకూర్చారు. అండమాన్‌జైలులో ఉన్న సమయంలోనే కమల, గోమాంతక్, మహాసాగర్ వంటి గొప్ప కావ్యాలను పూర్తి చేశారు.
1922లో జైలు గోడల మధ్యే హిందుత్వ గ్రంథ రచనకు పూనుకున్నారు సావర్కర్. హిందుత్వానికి సమగ్ర నిర్వచనం ఇచ్చిన గ్రంథం ఇదే.
సావర్కర్ తన ఆరోగ్యం క్షీణిస్తున్న దశలో కూడా రచనా వ్యాసాంగాన్ని వదిలిపెట్టలేదు. 1963లో ఆయన రాసిన ‘భారత ఇతిహాసంలో ఆరు స్వర్ణపుటలు’ మన చరిత్రలోని ముఖ్య ఘట్టాలను ఉల్లేఖిస్తున్నట్లుతెలుస్తోంది. అంతేకాక అండమాన్ జైలులో తాను గడిపిన దుర్భర జీవితంపై రాసిన ఆత్మకథ మరాఠా సాహిత్యంలో చిరస్థాయిగానిలిచిపోయింది. దీని ఆధారంగా ఎన్నో రంగస్థల నాటకాలు కూడా వచ్చాయి.
ఇతర విశేషాలు…
సావర్కర్ జీవితమంతా సంఘర్షణలతోనే సాగింది. బ్రిటిష్ ప్రభుత్వంతో పాటు స్వదేశీ ప్రభుత్వం కూడా ఆయనపట్ల నిర్దయగానేవ్యవహరించిందనేది నమ్మలేని సత్యం. భారత్ నుంచి వేరు కావాలని కోరుకున్న పాకిస్తాన్ కోరికను ఆయన తీవ్రంగా ఖండించారు. లక్షలాదిమంది హిందువులు పాకిస్తాన్లోఊచకోత కోయబడ్డారు. అంతేనా, 1948లో గాంధీజీ హత్య చేయబడ్డారు..ఈ హత్యోదంతంలో ఆయనను అన్యాయంగా అరెస్టుచేశారు. అనంతరం నిర్దోషిగా విడుదల చేసింది.
దేశం కోసం జీవితాన్ని అర్పితం చేసిన ఆ మహానీయునికి దక్కాల్సిన గౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వనేలేదు. కానీ 1964లో మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ‘అప్రతిహతీ స్వాతంత్య్ర వీర’ అనే బిదురుతో గౌరవించింది.
- 1918 నుంచి సావర్కర్‌కు తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. జీవిత చరమాంకంలో, తన 86వ ఏట జీవితం చాలించ దలచి ఆహారాన్ని సైతం త్యజించారు సావర్కర్.
- 1959లో పూణె విశ్వ విద్యాలయం ద్వారా గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.
- 1963లో సావర్కర్ భార్య అయిన యమునాబాయి మరణించింది.
- 1966 ఫిబ్రవరి 26న ఈ లోకం నుంచి శాశ్వత విముక్తి పొందారు సావర్కర్.
అయితేనేం,ఆ మహనీయుడు అందించిన స్ఫూర్తి కోట్లాదిమంది భారతీయుల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది.