CINEMATelugu Cinema

మద్యం మత్తులో సినీ జీవితం కోల్పోయిన అందాల నటులు. హరనాథ్.

హీరో అంటే అందంగా ఉండాలి, ఆరడుగులు ఉండాలి, దర్శకులను మెప్పించాలి, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను సినిమా థియేటర్లకు రప్పించాలి. అలనాటి అందాల నటులు హరనాథ్ గారు ఆచ్చం సినిమా హీరోలా ఉన్నాడు అనే మాటకు సరిగ్గా సరిపోయే నటులు. నిజంగా హరనాథ్ అందగాడు. ఎంత అందగాడు అంటే రోడ్డు మీద వెళ్తున్న హరనాథ్ గారిని చూసి ఒక నిర్మాత పిలిచిమరీ సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చాడు. అంతటి అందగాడు తను.

తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి తారక రామారావు గారి తరువాత అంతటి అందగాడు ఆజనుబాహుడు ఎవరైనా ఉన్నారు అంటే అందాల నటులు “హరనాథ్” గారి పేరే చెప్పేవారు. సాంఘిక చిత్రాలతో పాటు పౌరాణిక చారిత్రక జానపద చిత్రాలలో నటించి అలనాటి అగ్ర హీరోల తర్వాత వరుసలో తాను ఉన్నానని గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే నటుడిగా ఎదిగే సమయంలో ఏ కళాకారుడు అయినా వృత్తి పట్ల జాగ్రత్త వహించకపోతే అధోగతి పాలవుతారు అనేది దానికి ప్రత్యక్ష నిదర్శనం. హీరోగా గుర్తింపు తెచ్చుకుని పరిశ్రమలో బిజీ అవుతున్న తరుణంలో వ్యసనాలకు బానిసయిన హరనాథ్ గారు ఆ తరువాత చేజేతులారా తన వృత్తిని నాశనం చేసుకున్నారని అంటుంటారు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉంటే జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది. తన కుటుంబ సభ్యులతో , స్నేహితులతో హాయిగా సంతోషంగా జీవితాంతం గడిపేయవచ్చు.

అదే మనిషి.. జీవితంలో ఎదిగే సమయంలో విలాసాల బాట పట్టి.. వృత్తిని నిర్లక్ష్యం చేసి, డబ్బుని వృధా చేస్తే.. వారి జీవితం అస్తవ్యస్తమవుతుంది.

పాండీబజార్లో రోడ్డు పక్కన అమ్మే షాపులో హవాయి చెప్పులు కొనుక్కుంటున్న హరనాథ్ గారిని చూసి మీరు హరనాథ్ గారేనా అని అభిమానులు అడిగేంతగా తన రూపం మారిపోయింది.

తెలిసిన వారిని సహాయం అర్థించటంలో తప్పు లేదు.

కాని ఆ సహాయం మందు బాటిల్ కొనుక్కో టానికి అయితే ఎవరైనా ఎంతమాత్రం, ఎన్ని రోజులు సహాయం చెయ్యగలరు.

తన మేలు కోరిన హీరోయిన్ జమున గారు చేసిన హెచ్చరికలు, మార్చాలన్న ప్రయత్నాలు అన్నీ వృథా అయ్యాయి.

అందాల నటులు గారు సినిమా వృత్తి మొదటిలోనే మత్తుకు అలవాటు పడిపోయారు. కొందరు జాగ్రత్తలు చెప్పినా అప్పటికే ఇతరుల మాటలు వినలేనంత మత్తులో పడిపోయారు.

ఎస్‌.వి.రంగారావు , హరనాథ్‌ల స్నేహం బాగా ముదిరిపోయిందనేది అప్పట్లో ఒక టాక్. ఇద్దరూ గొప్ప నటులే. నటనలో పోటీ పడితే బాగుండేది కానీ ఇద్దరూ వ్యసనంలో పోటీ పడ్డారు.

ఆ దెబ్బతో హరనాథ్ గారికి సినిమా అవకాశం ఇస్తే ఆ సినిమా షూటింగ్‌కు వస్తారో? రారో తెలియదు. వస్తే మద్యం మత్తులో వస్తారో, మామూలుగా వస్తారో కూడా తెలియదు.

అవకాశాలు ఒక్కొక్కటిగా జారిపోయాయి. దాంతో అందాల నటులు హరనాథ్ గారికి మెల్లగా అవకాశాలు తగ్గాయి.

అదే సమయంలో అప్పుడే చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన కృష్ణ, శోభన్‌బాబు లాంటి వారు అవకాశాలను అందిపుచ్చుకుని తమ స్థానాలను సుస్థిరపరుచుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

అదే సమయంలో హరనాథ్ గారు మాత్రం మద్యం మత్తులోనే మునిగిపోయారు.

అంత అందమైన రూపం ఉండి ఏం లాభం. హరనాథ్‌కు కొద్ది పాటి ముందు చూపు లేక జీవితంలో దెబ్బతిన్నారు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    బుద్ధరాజు అప్పల వెంకట రామ హరనాథ్ రాజు

ఇతర పేర్లు  :    హరనాథ్ 

జననం    :     02 సెప్టెంబర్ 1936  

స్వస్థలం   :    రాపర్తి , తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్,

వృత్తి      :    నటుడు

తండ్రి    :   వరహాల రాజు 

తల్లి     :   సుభద్రమ్మ  

వారసులు    :    శ్రీనివాస్ బుద్ధరాజు, పద్మజ

బంధువులు    :      జి.వి.జి.రాజు (అల్లుడు)

మరణం    :    1 నవంబర్, 1989

నేపథ్యం…

హరనాథ్ గారు ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం  తాలూకాలో గల రాపర్తి గ్రామంలో 02 సెప్టెంబర్ 1936 నాడు జన్మించారు. హరనాథ్ గారి తండ్రి పేరు వరాహల రాజు, తల్లి సుభద్రమ్మ. వీరికి హరనాథ్ గారు కాకుండా మరో ఇద్దరు కొడుకులు ఒక కూతురు కూడా ఉన్నారు. వరాహల రాజు, సుభద్రమ్మ. దంపతులకు చిన్నతనం నుంచి నాటకాలు చూడడం అలవాటు కావడంతో వాటిల్లో నటించాలనే కోరిక హరినాథ్ గారిలో వయస్సు తోపాటు పెరుగుతూ వచ్చింది. అయితే చదువు ముఖ్యమైనదని భావించిన హరనాథ్ గారు దాని మీదనే దృష్టి కేంద్రీకరించారు. రాపర్తిలో కొంతకాలం విద్యనభ్యసించిన హరనాథ్ గారు ఆ తరువాత చెన్నైలో మరికొంత కాలం చదివి అటుపిమ్మట హరనాథ్ గారు కాకినాడ పీ.ఆర్.కళాశాలలో బి.ఎ పూర్తి చేశారు.

చదువు పూర్తయ్యాక నాటకాల మీద మనసు పెట్టారు హరనాథ్ గారు. నటన ఒక అలవాటుగా పెట్టుకొని నాటకలలో ప్రధాన పాత్రలు పోషించారు తాను. ఆ తరుణంలో మద్రాసు ఆంధ్ర విజ్ఞాన సమితికి, గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాల యూనియన్ కి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అనతి కాలంలో హరనాథ్ మంచి నటుడిగానే కాకుండా క్రీడాకారుడి గా కూడా పేరు తెచ్చుకున్నారు. ఫుట్ బాల్, వాలీబాల్, క్రికెట్ ఆటల్లో తన నైపుణ్యం ప్రదర్శించేవారు. ముఖ్యంగా క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. అందుకే ఎక్కడ నాటి నాటక పోటీలు జరుగుతున్నా, ఆటల పోటీలు ఉన్నా ఉత్సాహంతో పాల్గొనేవారు.

సినిమా నేపథ్యం…

కొన్ని కొన్ని సార్లు అదృష్టం కలిసి వస్తే మన ప్రయత్నం, ప్రమేయం లేకుండానే మంచి జరుగుతుంది అంటారు. అందాల నటులు హరనాథ్ విషయంలో అలాగే జరిగింది. ఒకసారి మద్రాసులోని టీ.నగర్ లోని భోగ్ రోడ్లో ఉన్న బస్ స్టాప్ లో తన స్నేహితులతో మాట్లాడుతుండగా కళాదర్శకుడు సూరన్న అక్కడికి వచ్చి హరనాథ్ గారి స్నేహితుని పలకరించారు. మాటల మధ్యలో హరినాథ్ గారిని సూరన్నకు పరిచయం చేశారు. ఆ పరిచయం హరినాథ్ గారి జీవితాన్ని మలుపు తిప్పింది.

నటించడం పట్ల అందాల నటులు హరనాథ్ గారికి ఆసక్తి ఉందని తెలుసుకొని దర్శకుడు గుత్తా రామినీడు గారికి హరనాథ్ గారిని పరిచయం చేశారు సూరన్న. ఆ సమయంలో “మా ఇంటి మహాలక్ష్మి” చిత్రాన్ని నిర్మించే సన్నాహాల్లో ఉన్నారు రామినీడు గారు. ఆ సినిమా ద్వారా కొంతమంది కొత్త వాళ్ళని పరిచయం చేయాలనుకున్న రామినీడు గారు హరనాథ్ గారిని చూడగానే అవకాశం ఇచ్చారు. అలా అనుకోకుండా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు హరనాథ్ గారు.

అయితే ఆయన కెమెరా ముందు నిల్చున్న తొలి చిత్రం మాత్రం ఋష్యశృంగ. ఈ చిత్రాన్ని ఊటీలో తొలిసారిగా పూర్తిస్థాయిలో  చిత్రీకరణ జరిపించారు. ఈ చిత్రంలో హరనాథ్ గారు టైటిల్ పాత్రను పోషించారు. ఋష్యశృంగ అనే చిత్రాన్ని నటులు ముక్కామల గారు దర్శకత్వం వహించారు. కానీ ముందుగా విడుదల అయిన సినిమా మాత్రం “మా ఇంటి మహాలక్ష్మి”. హైదరాబాదులో తొలిసారిగా షూటింగ్ జరుపుకున్న చిత్రం ఇదే. అలా హరినాథ్ గారు నటించిన తొలి రెండు చిత్రాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

శ్రీరాముడు పాత్రతో గుర్తింపు…

“మనోరమ” , “సహస్ర శిరచ్ఛేద”, “అపూర్వ చింతామణి”, “భక్త శబరి” లాంటి చిత్రాలు హరనాథ్ గారికి మంచి గుర్తింపు ఇచ్చాయి. 1960లో వచ్చిన “సీతారామ కళ్యాణం” చిత్రంలో హరనాథ్ గారికి శ్రీరాముడిగా నటించే అవకాశం రావడం తన వృత్తికి మేలు చేసిందనే చెప్పాలి.

పౌరాణిక పాత్రలను పోషించడంలో దిట్ట అయిన ఎన్టీఆర్ గారి నుండి అవకాశం రావడం హరనాథ్ గారికి అదృష్టం అని అంతా పొగిడారు.

ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా “సీతారామ కళ్యాణం” లో శ్రీరాముడిగా హరనాథ్ గారిని ఎన్నుకున్నారు.

ఎన్టీఆర్ గారి నమ్మకాన్ని నిలబెడుతూ శ్రీరామునిగా హరనాథ్ గారు మెప్పించారు. ఇక ఎన్టీఆర్ గారికే సొంతమనుకున్న శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పాత్రల్లో హరనాథ్‌ గారు నటించి మెప్పించారు.

పౌరాణిక పాత్ర పోషించడంలో ఎంతో నిష్టగా ఉండే ఎన్టీఆర్ గారి దగ్గర జాగ్రత్తగా మసులుకోవాలని తన శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారు.

అప్పటికే సిగరెట్లు తాగే అలవాటు ఉన్న హరినాథ్ గారు ఎన్టీఆర్ గారికి తెలియకుండా సెట్లో చాటుగా సిగరెట్లు తాగేవారు.

శ్రీరాముడు వేశధారణలో ఉండి కూడా హరనాథ్ అలా చేయడం విన్న ఎన్టీఆర్ గారు చాలా బాధపడేవారట.

ఎన్టీఆర్ గారు చెప్పిన జాగ్రత్తలలో కనీసం కొన్నింటిని అయినా పాటిస్తే తన వృత్తి పరంగా తన జీవితం మరోలా ఉండేదని హరనాథ్ గారు తర్వాత కాలంలో పలుమార్లు చెప్పుకొని బాధపడేవారు.

హరినాథ్ గారి అలవాట్లు గురించి తెలిసి కూడా ఒక మంచి నటనను ప్రోత్సహించాలనే అభిప్రాయంతో తాను నటించే “భీష్మ” చిత్రంలో శ్రీకృష్ణుని పాత్రను హరనాథ్ గారి చేత వేయించారు ఎన్టీఆర్ గారు.

ఆ పాత్ర కూడా హరనాథ్ గారికి మంచి పేరు తెచ్చి పెట్టింది.

ఎన్టీఆర్ గారితో చేసిన చిత్రాలన్నీ విజయాలే…

ఎన్టీఆర్, ఏ.ఎన్‌.ఆర్ గార్ల తరువాత స్థానం హరనాథ్‌ గారిదే అని పరిశ్రమలో తన పేరు స్థిరపడిపోయింది. సాధారణ అభిమానులే కాదు, హీరోయిన్లు కూడా హరనాథ్‌ గారికి అభిమానులుగా మారిపోయారు. 1961 నుంచి 72 వరకు తెలుగు సినిమాలలో హరనాథ్ గారిది స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో హరినాథ్ గారు నటించిన అన్ని సినిమాలను హిట్ లే అని చెప్పాలి. “పాండవ వనవాసం”, “పల్నాటి యుద్ధం”, “పుణ్యవతి”, “గుండమ్మ కథ”, “చిట్టి చెల్లెలు”, “కలిసి ఉంటే కలదు సుఖం”, “నాది ఆడజన్మే” మొదలగు చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. ఎన్టీఆర్ గారి నుండి నటన పరంగా ఎంతో నేర్చుకున్న హరనాథ్ గారు తన క్రమశిక్షణ, వృత్తి పట్ల అంకిత భావాన్ని అలవర్చుకోలేకపోయారని చెప్పాలి.

హిట్ పెయిర్ జమున – హరనాథ్  జంట..

జమున, హరనాథ్ గార్లు జంటగా నటించిన దాదాపు అన్ని సినిమాలు విజయవంతం అయ్యాయి. అనుకోని సంఘటనతో ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్‌లు జమున గారిపై నిషేధం విధించారు. ఆ వివాదంతో  జమున గారితో నటించేందుకు వారిరువురూ నిరాకరించారు. ఆ సమయంలో జమున, హరనాథ్‌ల జంటకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. నిజానికి హరనాథ్, జమున గార్లు ఒకే వయస్సు వారు. ఇద్దరూ 1936లోనే జన్మించారు. జమున గారు హరనాథ్ గారి కంటే మూడు రోజులు పెద్దవారు. వారిద్దరూ తొలిసారి నటించిన “మా ఇంటి మహాలక్ష్మి” ఆదరణ పొందగా, ఆ తరువాత “లేతమనసులు” అద్భుతమైన విజయం సాధించింది.

“నాదీ ఆడజన్మే” , “పల్నాటియుద్ధం” , “పెళ్ళిరోజు” , “ఆడజన్మ” , “మా ఇంటి దేవత” వంటి చిత్రాలలో హరనాథ్, జమున గార్ల జోడీ అలరించింది. “లేత మనసులు” చిత్రంలో “అందాల ఓచిలక అందుకో నా లేక” ఎంత ప్రజాధరణ పొందిందో, ఆ సినిమా విడుదలైన తర్వాత ఆ జంట అంత పాపులర్ అయ్యింది. రొమాంటిక్ హీరోగా ఆ రోజులలో హరనాథ్ గారికి గుర్తింపు ఉండేది.

అలాగే జయలలిత, కే.ఆర్.విజయ, ఎల్.విజయలక్ష్మి, రాజశ్రీ ఇలా చాలామంది కథానాయికలు హరనాథ్ గారితో నటించారు.

అందగాడైన హరనాథ్ గారితో నటించడానికి హీరోయిన్లు విపరీతమైన ఆసక్తి చూపించేవారు.

తరువాతి రోజుల్లో హరనాథ్ గారు తాగుడుకు బానిసై తన వృత్తి జీవితాన్ని తానే నాశనం చేసుకున్నారు.

తెలుగుతో పాటు, తమిళ, కన్నడ చిత్రాలలో కూడా హరనాథ్ గారు నటించారు. తెలుగు, కన్నడ భాషలలో రూపొందిన “అమరశిల్పి జక్కన్న” చిత్రానికి రెండు భాషలలో హీరోలు వేరైనా, ఆ రెండు భాషలలో హరనాథ్ గారు నటించారు. అలాగే “కహా జా రహే హై” హిందీ చిత్రంలో కూడా నటించారు హరనాథ్ గారు.

మత్తుకు చేరువగా ప్రేక్షకులకు దూరంగా…

త్రాగుడు ప్రస్తావన చిత్ర పరిశ్రమలో వచ్చినప్పుడల్లా హరనాథ్ గారి పేరు, హరనాథ్ గారి పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా త్రాగుడు గుర్తుకురావడం ఎందుకో చెప్పలేం.

కానీ మద్యానికి ఆయనకే అంత అనుబంధం ఉన్నట్లు విపరీతమైన ప్రచారం జరిగింది.

సినీ రంగంలో మందు త్రాగని వారి సంఖ్య తక్కువే. అయినా మందంతా హరనాథ్ గారే త్రాగేసినట్టు ప్రచారం జరగడం నిజంగా తన దురదృష్టం.

హరనాథ్ గారికి ముందు అంటే ఎంత ఇష్టమో, ప్రేక్షకులు కూడా హరనాథ్ గారు అంటే అంత ఇష్టం.

తాను ప్రేక్షకులను వదులుకున్నారు కానీ, తన అలవాటును మాత్రం మార్చుకోలేకపోయారు.

ఒక దశలో హరినాథ్ గారిని మార్చడానికి, తిరిగి నటుడుగా నిలబెట్టడానికి తన శ్రేయోభిలాషులు ప్రయత్నించారు. కానీ అవి సత్ఫలితాలను ఇవ్వలేదు.

వ్యక్తిగత జీవితం…

ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే హరనాథ్‌ గారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడి పేరు శ్రీనివాసరాజు, కుమార్తె పేరు పద్మజా రాజు. హరనాథ్ గారి తనయుడు బి.శ్రీనివాసరాజు గారు నిర్మాతగా కూడా కొనసాగారు. “గోకులంలో సీత” , “రాఘవేంద్ర”, “మా అశోక్ గాడి లవ్ స్టోరీ” వంటి చిత్రాలను శ్రీనివాసరాజు గారు నిర్మించారు. ప్రముఖ నిర్మాత జి.వి.జి.రాజు గారు హరనాథ్ గారి అల్లుడే. హరనాథ్ గారి కూతురు పద్మజా రాజు భర్తనే జి.వి.జి.రాజు గారు. హరనాథ్ గారి కూతురు పద్మజా రాజు గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.

మరణించే నాటికి తన వయస్సు 54 సంవత్సరాలు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పద్మజా రాజు భర్త జి.వి.జి.రాజు గారు పవన్ కళ్యాణ్ గారు హీరోగా “గోకులంలో సీత” , “తొలిప్రేమ” వంటి చిత్రాలను నిర్మించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన “గోదావరి” చిత్రాన్ని కూడా జి.వి.జి.రాజు గారే నిర్మించారు. ఒక్క విషపు చుక్క మొత్తం పాలను పనికిరాకుండా చేసినట్టు మద్యం అనే ఒక్క వ్యసనం చాలు ఎంత గొప్ప వ్యక్తి జీవితనాన్ని అయినా కాల్చి బూడిద చేస్తుందని చెప్పడానికి.

అయితే ఆ వ్యసనానికి బానిసగా తన జీవితాన్నే పోగొట్టుకున్న నటుడికి ఉదాహరణగా నిలుస్తుంది హరినాథ్ గారి జీవితం.

నిష్క్రమణం…

హరనాథ్ గారి మద్యం వెనుక ఒక పెద్ద కథ ఉందని, ఆనతి కాలంలోనే హీరోగా మంచి స్థాయిని చేరుకోవడం చూసి సహించలేని ఒక వర్గం అతని ఉన్నతిని దెబ్బతీయడం.

కోసం పన్నిన కుట్రలో తాను చిక్కుకుని ఇలా తయారయ్యాడని చాలామంది చెబుతుంటారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు.

అయినా ఒకరు అలవాటు చేసినంత మాత్రాన దానికి బానిస అవ్వాలని ఎక్కడ ఉంది. మందు మైకంలోంచి బయట పడేసరికి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది.

స్టార్ డమ్ రావడం ఒకెత్తయితే, దానిని నిలబెట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు.

పరిశ్రమలో పెరిగిన పోటీ, వయస్సు ప్రభావం, కాలం తెచ్చిన మార్పులు హరనాథ్ గారి భవిషత్తును ప్రభావితం చేశాయి.

అడపాదడపా పాత్రలు తాను చేసినా , అవి అంత చెప్పుకోదగ్గవి కాదు. హీరోగా చిత్ర రంగ ప్రవేశం చేసిన హరనాథ్ గారు వరస అవకాశాలతో కారులో తిరిగే దశకు చేరుకున్నారు.

అయితే వ్యసనంతో సంపాదించింది పోగొట్టుకుని బ్రతకడానికి చివరకు చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించారు. 1984లో చిరంజీవి హీరోగా వచ్చిన “నాగు” సినిమాలో అసలు డైలాగులే లేని పాత్రలో హరినాథ్ గారు నటించారు. అదే హరినాథ్ గారి చివరి సినిమా.

పరిశ్రమలో ఒక వెలుగు వెలిగినా స్వయంకృతాపరాథం తో హరనాథ్ గారు 01 నవంబరు 1989లో స్వర్గస్తులయ్యారు.

Show More
Back to top button