Telugu Cinema

సినీ కళామ్మతల్లి సిగలో విరబూసిన సువర్ణ కమలం..  స్వర్ణ కమలం..

మన భావాలను పూర్వీకులు శృంగారం, స్వర్ణ కమలం వీరం, కరుణ, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం అని తొమ్మిది విధాలుగా సిద్ధాంతీకరించారు. వీటిలో కరుణ లేదా ఆర్ద్రత, శాంతం మినహా మిగిలిన ఏడు రసాలకూ వాటిని వ్యక్తీకరించే భౌతిక రూపాలు వున్నాయి. ఆర్ధ్రత, శాంతాలు పూర్తిగా (వ్యక్తిగత) ఆత్మ సంబంధాలు. వాటిని ఆస్వాదించడం తప్ప చూపించడం చాలా చాలా కష్టం.

సుఖదుఖాల నుంచి వచ్చే అనుభవాలును, ఉద్వేగాలను ఎక్కడ ఎలా తారసపడినా ఆ క్షణాలను కౌగలించుకోవాలని అనిపిస్తుంది. అలాంటివి వుంటాయి కాబట్టే సినిమాలు మనకి ఇష్టమనిపిస్తాయి.

ఉద్రేక పూరిత భావాలను, నవరసాలను ప్రభావితం చేయగల కళారూపాల్లో సినిమా అనేది అత్యంత శక్తివంతమైనది. ఏ సినిమా అయినా నవరసాలనూ ఎంతో కొంత తాకుతుంది, తట్టుతుంది, కన్నీళ్లు పెట్టిస్తుంది. ప్రేక్షకుల జ్ఞానేంద్రియాల ను  కాస్త గట్టిగా, లోతుగా తట్టగల దర్శకులు ఇలా ఏడిపించగలుగుతారు. వారిలో కె.విశ్వనాథ్ గారు ప్రముఖులు..

పాశ్చాత్య సంగీతపు హోరులో కొట్టుకుపోతున్న దక్షిణ భారతీయ సాంప్రదాయ కర్నాటక శాస్త్రీయ సంగీతానికి నృత్య కళల గొప్పతనాన్ని, విశిష్టతను వాటి పూర్వవైభవాన్ని పునస్థాపించాలనే ఉద్దేశ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని తమ చలనచిత్రాల ద్వారా ఆవిష్కరించారు కళాతపస్వి విశ్వనాథ్ గారు. భావోద్వేగాన్ని  కళాత్మకంగా, ప్రతీ మనిషి మనసును హత్తుకునేలా సన్నివేశాన్ని తీర్చిదిద్దగల సిద్ధహస్తులు విశ్వనాథ్ గారు. 

ఏ దర్శకుడి జీవితంలోనైనా ఒకటికి మించి క్లాసిక్ సినిమాలు ఉండవు. కానీ విశ్వనాథ్ గారి సినీ జీవితం లో క్లాసికల్స్ కు కొదువేలేదు. అలాంటి క్లాసిక్స్ లలో “స్వర్ణ కమలం” ఒకటి..

మీనాక్షి(భానుప్రియ) వారి ఇంటి పక్కన ఇంట్లోకి దిగిన చంద్రశేఖర్ (వెంకటేష్) అనే చిత్రకారుడు తన శిష్యుడు టింకు కలిసి ఎలా అయినా శర్మ గారివద్ద కూచిపూడి నాట్యంలో శిక్షణ తీసుకోవాలని శర్మగారి ఇంటికి వచ్చి గురుదక్షిణ ఇచ్చి నాట్యం ప్రారంభించటం, మీనాక్షి(భానుప్రియ) వాళ్ళని ఆటపట్టించటం, మీనాక్షి(భానుప్రియ), శర్మగారు,  చంద్రశేఖర్ (వెంకటేష్) తన శిష్యుడు మధ్య సాగిన ఇతివృత్తం…

  చిత్ర విశేషాలు…

దర్శకత్వం    :    కె. విశ్వనాథ్

రచన     :     కె. విశ్వనాథ్ (స్క్రీన్ ప్లే/కథ),

మాటలు   :    తోటపల్లి సాయినాథ్ 

నిర్మాణం     :    సి. హెచ్. వి. అప్పారావు,

సమర్పణ     :   కె. ఎస్. రామారావు 

కథ              :    కె. విశ్వనాథ్ 

తారాగణం   :    వెంకటేష్, భానుప్రియ

సంగీతం    :      ఇళయరాజా

కూర్పు     :      జి.జి కృష్ణారావు

నేపథ్య గానం    :    యస్.పి. బాలసుబ్రహ్మణ్యం, జానకి , వాణీ జయరాం..

గీతరచన      :     సిరివెన్నెల సీతారామ శాస్త్రి, అన్నమయ్య 

ఛాయాగ్రహణం   :     లోక్ సింగ్

నిర్మాణ సంస్థ   :   భాను ఆర్ట్ క్రియేషన్స్

విడుదల తేదీ   :     15 జులై 1988

భాష        :      తెలుగు

కథ సంక్షిప్తం గా…

 చిత్రకారుడైన యువకుడు చంద్రశేఖర్ (వెంకటేష్) తన పొరుగింటిలో ఉండే వృద్ధబ్రాహ్మణ విద్వాంసుని కుమార్తె మీనాక్షి(భానుప్రియ) లోని నాట్యకళా కౌశలం గుర్తించి ఆమెను ప్రోత్సహించి ఉన్నత శిఖరాలకు చేరేలా చేయడం కథాంశం. 

మీనాక్షి (భానుప్రియ), సావిత్రి (దేవీ లలిత) కూచిపూడి నాట్యంలో నిష్ణాతులైన శేషేంద్ర శర్మ యొక్క ఇద్దరు కూతుర్లు. ఆయన నాట్యంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన వాడైనా పెద్దగా కలిగిన కుటుంబం కాకపోవడంతో తన ఇద్దరు కూతుళ్ళకూ అందరిలాగే చదువు చెప్పించలేక పోతాడు. కానీ సావిత్రికి కర్ణాటక సంగీతం లో, మీనాక్షికి కూచిపూడి నాట్యంలో తానే స్వయంగా శిక్షణ ఇస్తాడు. సావిత్రి తనకు తెలిసిన విద్యను గౌరవప్రదంగా ఎంచుకుని దాన్నే జీవనాధారంగా భావిస్తుంటుంది.

కానీ రెండవ కూతురు మీనాక్షి మాత్రం నాట్యం లాంటి కళలు కడుపు నింపవనే భావన కలిగి ఉంటుంది. సాధారణంగా అందరూ అభిమానించే విలాసవంతమైన జీవనం గడపాలని కోరుకుంటుంది. ఇవన్నీ కేవలం ఆమె తన అక్కతోనే చెప్పుకుంటుంది. ఇదిలా ఉండగా వారి ఇంటి పక్కన ఇంట్లోకి చంద్రశేఖర్ (వెంకటేష్) అనే చిత్రకారుడు అద్దెకు దిగుతాడు. ఆమెలోని నాట్యాన్ని చూసి విపరీతంగా అభిమానిస్తాడు. కానీ ఆమె అయిష్టతను గమనించి బాధపడతాడు.

వారి కుటుంబానికి చిన్న చిన్న పనుల్లో సహాయపడుతూ వారికి చేదోడు వాదోడుగా ఉంటాడు. ఆమె చేత ఎలాగైనా నాట్య ప్రదర్శన ఇప్పించాలని ఒక ప్రదర్శన కూడా ఏర్పాటు చేయిస్తాడు. అయితే ఆమె అయిష్టంగా అందుకు ఒప్పుకొని నాట్యం మధ్యలో సగంలో నిలిపివేయడంతో ఆమె తండ్రి నాట్యాన్ని కొనసాగిస్తాడు. కానీ దురదృష్టవశాత్తూ ఆయన నాట్యం చేస్తుండగానే మరణిస్తాడు.

తన తండ్రి మరణానికి తానే కారణమయ్యానని బాధ పడుతుంటుంది. ఆమెకు అమెరికాకు వెళ్ళే ఆసక్తిని గమనించిన చంద్రశేఖర్ ఆమెను కూచిపూడి నృత్యంలో మంచి ప్రావీణ్యం సంపాదించేలా ప్రయత్నించి భారతీయ నృత్యంలో ప్రసిద్ధురాలైన ఒక అమెరికా నర్తకి “షారోన్ లోవెన్” సహాయంతో అక్కడికి వెళ్ళేలా ప్రోత్సహిస్తాడు. అమెరికా వెళ్ళడానికి ఎయిర్‌పోర్ట్ దాకా వెళ్ళిన ఆమె, చంద్రశేఖర్ కు తనమీద ఉన్న ప్రేమను అర్థం చేసుకుని తిరిగి వచ్చేస్తుంది. ఇద్దరూ కలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.

తారాగణం…

చంద్రశేఖర్…   దగ్గుబాటి వెంకటేష్..

మీనాక్షి..    భానుప్రియ..

శేషేంద్ర శర్మ…   ఘంటా కనకా రావు..

సావిత్రి..   దేవి లలిత..

శ్రీనివాస్…   షణ్ముఖ శ్రీనివాస్..

పించను అధికారి…   ఎస్.కె. మిశ్రో..

నూకాలు…  పావలా శ్యామల..

ఓంకారం..   సాక్షి రంగారావు..

అఖిలం…   శ్రీలక్ష్మి..

డబ్బింగ్ జానకి..

ముచ్చర్ల అరుణ..

రామానుజాచార్యులు..

కామేశ్వరరావు..

షారన్ లోవెన్..

విన్నకోట విజయరామ్..

కె. వి. సత్యనారాయణ..

ఎన్. శివరామకృష్ణయ్య..

కె. ఎస్. టి. సాయి..

ఎస్. ఎస్. వాజపేయి..

అరుణ్ కుమార్..

కథ నడిపించిన విధానం…

“ఏకళలో అయినా రససిధ్ధి సాధించాలంటే కేవలం కళ్లకు చూపించి చెవులకు వినిపిస్తే సరిపోదు. మనసును కదిలించి కరిగించినపుడే ఆ కళ సజీవ కళ అవుతుంది. ఆ కళాకారుడు చరితార్థుడవుతాడు”. ఆత్మను వికసింపజేసే అద్భుత మాధ్యమమే కళ.

మీనాక్షి పాత్రలో భానుప్రియ నటన చాలా బావుంటుంది. ఎంతో హుందాగా కనిపించే కథనాయకుడు చంద్రశేఖర్ పాత్ర మీనాక్షిలోని చిలిపిని, అల్లరిని అంతే హుందాగా గా తిప్పికొట్టడం ఆకట్టుకుంటుంది. సంగీతం, నాట్యం, చిత్రకళల సమ్మిళితం ఈ చిత్రం. తనలో దాగిఉన్న కళను ఏమాత్రం గౌరవించలేని ఆమ్మాయికి ఆ కళ గొప్పతనాన్ని అర్థం చేసుకునేలా చేయడమే నిజానికి ఈ సినిమా కథాంశం.

మీనాక్షి గజ్జెలు బావిలో వేసే సన్నివేశం అప్పటి మధ్యతరగతి జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్టు ఎంతో సహజంగా ఉంటుంది. ఆ సన్నివేశంలో ఆ సినిమాలోని దాదాపు అన్ని పాత్రలు ఒకే చోట చేరి ఆకార్యక్రమంలో తమ వంతు పాత్ర పోషించడాన్ని మాటల్లో వర్ణించలేము. ఈ రోజుల్లో పిల్లలకు పరిచయం చేసిన భావన కలిగుతుంది. మన పాండిత్యం ఇంగ్లీషు చదువుల ముందు ఎలా చులకనైపోయిందో చూపించే సన్నివేశంలో కలెక్టర్ కార్యాలయంలో పేద పండితుడికి జరిగే అవమానం మన సంస్కృతి పట్ల మనకున్న నిర్థక్ష్యం, పరధర్మం పట్ల మనకున్న వ్యామోహానికి నిదర్శనమేమో అనిపిస్తుంది.

మొదటి సారి తనకు తానుగా కాళ్లకు గజ్జెలు కట్టుకుంటున్న కథనయికకు సాయంగా ఉంటానంటూ కొత్తగా రెక్కలొచ్చెనా అనే పల్లవి అందుకుంటాడు. ఐహిక సౌఖ్యానికి ఏమాత్రం దోహదం చెయ్యని తలచి కళలని చిన్నచూపు చూసిన ఆమెకు ఆ కళే ఆమెను అమెరికా వరకు వెళ్లే అవకాశాన్ని అందిస్తుంది. కానీ ఆమె నృత్యం దేహంతో కాదు చెయ్యాల్సింది. ఆమె ఆత్మ నర్తించాలన్నది ఒక షరతు. ఆమెలో కలిగిన కనువిప్పు ఆమెను నర్తించే ప్రకృతి ఆకృతి పార్వతిని చేస్తుంది.

ఆ సందర్భంలో వచ్చే పాట “అందెల రవమిది పదములదా” ఆ చిత్రములోని పాటలన్నింటిలోనూ అత్యున్నతమైనదిగా చెప్పుకోవచ్చు. ఇది ఈ సినిమాకి పతాకస్థాయి పాట. నర్తకి గా కథానాయిక భానుప్రియ విశ్వరూపం చూడొచ్చు. తన నట జీవితంలో తనకు ఇటువంటి ప్రదర్శనకి మరో అవకాశం వచ్చి ఉండదు. మొత్తానికి కథనాయకుడి తపన తీరింది. ఆమె నర్తకిగా మారింది. ఆ నాట్యం ఆమె ఆశలు తీర్చగలుగుతోంది. ఆ సమయంలో అతడి ప్రేమను, శ్రద్ధను అర్థం చేసుకొని ఆమె అతడితో కలిసి పోవడంతో కథ సుఖాంతం అవుతుంది.

కళ అనగానే అందమైన ప్రదర్శనో లేక హావభావ విన్యాసమో కాదు. అది ఒక ఆత్మ సమర్పణ. మాటల్లో చెప్పలేని తదాత్మ్యకత. అలా జరిగే కళా సాధన ఆత్మను శతదళ శోభలతో వికసించే సువర్ణకమలంగా నిలుపుతుంది. ఈ విషయాన్ని ఎంతో సున్నితంగా, సందేశాత్మకంగా ఆవిష్కరింపజేసి చూపించారు విశ్వనాథ్ గారు.

సిరివెన్నెల సాహిత్యం…

ఏళ్ళు గడుస్తున్నా స్వర్ణ కమలం చిత్రంలోని ప్రతీ పాట సినీ సాహిత్య ప్రేమికుల మనసుల్లో మెదులుతూనే ఉంటాయి. ఇప్పటికీ వీనుల విందు చేస్తాయి. ఆకాశంలో విహరింప చేస్తాయి. తెలుగు నేలపై పుట్టినందుకు సగర్వంగా తలెత్తుకునేలా చేస్తాయి. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఋజువు చేస్తాయి. కేవలం ఒక పల్లవి రెండు చరణాలతో సాగే తెలుగు పాట చిరస్థాయిగా నిలిచిపోయేలా రచన చేయడం చాలా చాలా కొద్దిమందికే సాధ్యం.

ఒక పాట యొక్క ఔన్నత్యం, సాహిత్య విలువలు ఆ పాటకి జీవం పొసే కవి యొక్క పరిణితి, భాషపై పట్టు, అంకిత భావం మీద తప్పకుండా ఆధారపడి ఉంటాయి. “స్వర్ణకమలం”లో సిరివెన్నెల గారు వ్రాసిన పాటలు చాలా క్లిష్టమైనవి, తనకు చాలా ఇష్టమైనవి కూడానూ. కవిగా తన సత్తా చూపించాలి అని అనుకునే ఎవరికైనా, సరైన ఛాలెంజ్ ఎదురైతే ఎంతో ఆనందం కలుగుతుంది. తన సర్వశక్తుల్నీ ధారపోసే అవకాశం దొరికిన సంతోషం అది. అసలు “స్వర్ణకమలం” సినిమా కథలోనే గొప్పతనం ఉంది. ఆ సినిమా కథకి పాటలు రాయడం అనేక విధాల కత్తిమీద సాములాంటిది.

ఈ చిత్రంలోని అందెల రవమిది పదములదా (పాట) కు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారం వరించింది. అన్నమయ్య గారు “వ్రాసిన చేరి యశోదకు శిశువితడు” పాట తప్ప మిగతా పాటలన్నింటికీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారే సాహిత్యం అందించారు.

ఈ సినిమాలోని పాటలను జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో చిత్రీకరించారు. ఈ సినిమాలో పాటలకు నృత్యాన్ని నృత్య దర్శకులు కె.వి.సత్యనారాయణ గారు సమకూర్చారు. కె.వి.సత్యనారాయణ గారు శృతిలయలు, స్వాతికిరణం, సూత్రధారులు మొదలైన సినిమాలకు కూడా నృత్య దర్శకత్వం వహించారు.

పాటలు…

1.            “అందెల రవమిది పదములదా”..

2.            “ఆకాశంలో ఆశల హరివిల్లు”     ..

3.            “ఆత్మాత్వం”..

4.            “ఘల్లు ఘల్లు ఘల్లు”     ..

5.            “కొత్తగా రెక్కలొచ్చెనా”..

6.            “కొలువై ఉన్నాడే దేవదేవుడు”  ..

7.            “చేరి యశోదకు”…

8.            “నటరాజనే”…

9.            “శివపూజకు చివురించిన”..

నిర్మాణం…

విశ్వనాథ్ గారి సినిమాలలో నటి, నటులకు ఇద్దరికీ సమాన ప్రాధాన్యతలు ఉంటాయి. ఈ సినిమాలో కీలక భాగం కథానాయిక చుట్టూనే తిరుగుతుంది. ఈ పాత్రను భానుప్రియ గారు పోషించగా, ఆమెకు స్ఫూర్తి కలిగించే కథానాయకుడి పాత్రలో వెంకటేష్ గారు నటించారు. ఈ సినిమాలో కథానాయికకు స్ఫూర్తిని కలిగించే నర్తకి పాత్రలో షారన్ లోవెన్ తన నిజ జీవిత పాత్రలో నటించింది. మొదట్లో ఈ పాత్రకు యామిని కృష్ణమూర్తి, సంయుక్త పాణిగ్రాహి మొదలైన వారిని అనుకున్నారు. షారన్ లోవెన్ ఒడిస్సీ గురువు కేలూచరణ్ మొహాపాత్రా గారికి శిష్యురాలు.

ఒకసారి షారన్ దూరదర్శన్ కి ఇచ్చిన ముఖాముఖిలో ఆమెను చూసిన చిత్రబృందం ఆ పాత్ర ఈమెకు సరిగ్గా సరిపోతుందని భావించారు. షారన్ తర్వాత వేరే సినిమాల్లో నటించడానికి అవకాశాలు వచ్చినా తాను మళ్ళీ నటించలేదు. తాను స్వతహాగా ఒడిస్సీ కళాకారిణి. కాబట్టి ఆమెకు కూచిపూడి గురువైన వెంపటి చిన్నసత్యం తో ఒక నెలరోజుల పాటు ఆ నృత్యం నేర్పించి సినిమా కోసం చిత్రీకరిద్దామనుకున్నారు. కానీ ఆమె స్వల్ప సమయంలో తాను అందులో మెలకువలు పూర్తిగా ఆకళింపు చేసుకోలేకపోవచ్చుననీ, ఇంకా ఈ సినిమా తర్వాత ఆమెను ఎవరైనా కూచిపూడి ప్రదర్శన కోసం ఆహ్వానించడం తనకు ఇష్టం లేదని తెలిపింది. దర్శకుడు ఆమె అభిప్రాయాన్ని గౌరవించి ఒడిస్సీ నృత్యాన్నే సినిమాలో ఉంచడానికి అంగీకరించాడు.

ఈ చిత్రం కోసం భారతదేశంలోని పలు ప్రాంతాల నృత్యకళాకారులు ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేశారు. ఈ చిత్రంలో మీనాక్షి తండ్రి పాత్రను పోషించిన ఘంటా కనకారావు గారు నిజజీవితంలో కూడా నాట్యాచార్యులే. తనది ఏలూరు. తాను ఈ చిత్రంలో నాట్యం చేస్తూ వేదిక మీదే మరణించినట్లుగానే నిజజీవితంలో కూడా తాను మరణించడం యాధృచ్చికం. మీనాక్షి అక్క పాత్ర పోషించిన నటి దేవిలలిత. తనను ఓ టీవీ సీరియల్ లో చూసిన తర్వాత ఈ పాత్రకి ఎంపిక చేశారు దర్శక నిర్మాతలు.

ఇంటి యజమాని పాత్ర పోషించింది కె.ఎస్.టి.సాయి. ఆయన కుమారుడు, వయొలిన్ కళాకారుడిగా పోషించిన నటుడు కూడా నిజజీవితంలో వయొలిన్ కళాకారుడే. వీరెవరూ కూడా అప్పటికి పేరున్న కళాకారులేమీ కాదు. కానీ దర్శకుడు విశ్వనాథ్ గారు తాను రాసుకున్న పాత్రల కోసం వీరైతేనే బాగుంటుందని ఎన్నుకున్నారు.

హాస్యం కోసం సృష్టించిన ఓంకారం, అఖిలం పాత్రలను సాక్షి రంగారావు, శ్రీలక్ష్మి పోషించారు.

ఈ సినిమా ప్రధాన భాగం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించగా పాటలు కొన్ని జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లాంటి విలక్షణమైన ప్రదేశాల్లో చిత్రీకరించారు.

పురస్కారాలు…

★ నంది పురస్కారాలు 1988…

1988 సంవత్సరంలో స్వర్ణకమలం చిత్రానికి గానూ నిర్మాతగా సి.హెచ్.వి. అప్పారావు గారు ఉత్తమ చిత్రం గా (బంగారు నంది) ని అందుకున్నారు..

స్వర్ణకమలం చిత్రం లో అద్భుతమైన అభినయం ప్రదర్శించినందుకు గానూ 1988 సంవత్సరంలో భానుప్రియ గారు ఉత్తమ నటిగా (బంగారు నంది) ని దక్కించుకున్నారు.. 

1988 సంవత్సరంలో స్వర్ణకమలం చిత్రం లో అద్భుతమైన నటన ప్రదర్శించినందుకు గానూ  వెంకటేష్ గారు ఉత్తమ నటుడిగా ప్రత్యేక జ్యూరీ పురస్కారంను దక్కించుకున్నారు.. 

★ దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు 1988..

1988 సంవత్సరంలో స్వర్ణకమలం చిత్రానికి గానూ నిర్మాతగా సి.హెచ్.వి. అప్పారావు గారు ఉత్తమ చిత్రం గా దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారం అందుకున్నారు..

స్వర్ణకమలం చిత్రం లో చక్కటి అభినయం ప్రదర్శించినందుకు గానూ 1988 సంవత్సరంలో భానుప్రియ గారు ఉత్తమ నటిగా దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారం గెలుచుకున్నారు..

★ సినిమా ఎక్స్‌ప్రెస్ పురస్కారాలు 1988…

1988 సంవత్సరంలో స్వర్ణకమలం చిత్రానికి గానూ నిర్మాతగా సి.హెచ్.వి. అప్పారావు గారు ఉత్తమ చిత్రం గా సినిమా ఎక్స్‌ప్రెస్ పురస్కారం గెలుపొందారు.. 

1988 సంవత్సరంలో స్వర్ణకమలం చిత్రానికి గానూ ఉత్తమ దర్శకులుగా కె. విశ్వనాథ్ గారు సినిమా ఎక్స్‌ప్రెస్ పురస్కారం గెలుపొందారు..

స్వర్ణ కమలం చిత్రం లో చక్కటి అభినయం కనబరిచినందుకు గానూ 1988 సంవత్సరంలో భానుప్రియ గారు ఉత్తమ నటిగా సినిమా ఎక్స్‌ప్రెస్ పురస్కారం గెలుచుకున్నారు..

విడుదల…

స్వర్ణ కమలం చిత్రం కె. విశ్వనాథ్ దర్శకత్వంలో 15 జులై 1988లో విడుదలైన ఘనవిజయం సాధించింది. కె. ఎస్. రామారావు సమర్పణలో భాను ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై సి. హెచ్. వి. అప్పారావు గారు నిర్మించారు. వెంకటేష్, భానుప్రియ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి లోక్ సింగ్ ఛాయాగ్రాహకుడిగా, జి. జి. కృష్ణారావు ఎడిటరుగా పనిచేశారు. ఈ చిత్రానికి దర్శకులు కె. విశ్వనాథ్ కథ, స్క్రీన్ ప్లే అందించగా, తోటపల్లి సాయినాథ్ మాటలు వ్రాశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి వ్రాసిన పాటలకు ఇళయరాజా అందించిన ఈ చిత్ర సంగీతం శ్రోతల ఆదరణ పొందింది. ఈ చిత్రం 12వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించబడింది.

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ , నందా దేవి నేషనల్ పార్క్‌లో పాటల సన్నివేశాలు విస్తృతంగా చిత్రీకరించబడ్డాయి. ధౌలిలోని శాంతి స్థూపం మరియు భృంగేశ్వర శివాలయం, విశాఖపట్నంలోని అందమైన ప్రదేశాలలో అత్యంత అందంగా చిత్రీకరించారు. ఆసియా పసిఫిక్ ఫిల్మ్ ఫెస్టివల్ మరియు ఆన్ అర్బోర్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది. ఇది మూడు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అవార్డులు , మూడు రాష్ట్ర నంది అవార్డులు మరియు రెండు సౌత్‌ ఇండియా అవార్డులను పొందింది. ఫిలింఫేర్ అవార్డ్స్ , ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ కొరకు నంది అవార్డు మరియు ఫిల్మ్ ఫేర్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ (తెలుగు) సహా పలు పురస్కారాలు అందుకొంది.

సశేషం…

కళ దైవదత్తం. జన్మ జన్మల పుణ్యం వల్లే అది ప్రాప్తిస్తుంది. ఆ నిజాన్ని గ్రహించలేని ఒక వేదాంతం వారి అమ్మాయి కథనే “స్వర్ణకమలం”.

సమాజం వాయు వేగంతో దూసుకెళ్ళుతోంది. దాంతో పాటుగా మనము వెళ్ళాలి కానీ సాంప్రదాయ కళలని స్వాసిస్తూ అదే మోక్షంగా భావిస్తూ కూపస్త మండూకాల్లా బ్రతకడం ఎంతవరకు సమంజసం అని వాదించే పాత్ర మీనాక్షిది.

35 ఏళ్ల క్రితం కె.విశ్వనాథ్ గారు సృష్టించిన ఈ మీనాక్షి పాత్ర నాటి అమ్మాయిలకే కాదు, నేటి అమ్మాయిలకు, రేపటి అమ్మాయిలకు అద్దమే.

చిత్తశుద్ధి కి ఏకాగ్రత తోడైయితే ఏ కళ అయినా అజరామరం అవుతుందని  ఆ పాత్ర తెలుసుకోవడమే స్వర్ణ కమలం

ఆ పాత్రలో భానుప్రియ గారు చక్కగా ఒదిగిపోయారు. కూచిపూడి నాట్యం’ ప్రధానాంశంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని అనిర్వచనీయమైన అనుభూతికి గురి చేసింది.

సినిమా చూసి నాట్యంపై మక్కువ పెంచుకున్నారు అప్పట్లో. నాట్యం అంటే ఇష్టం లేని అమ్మాయికి ఆ కళ గొప్పదనాన్ని.. తనకే తెలియని తనలోని కళను వెలికితీసే పాత్రలో వెంకటేశ్ సహజమైన నటన ప్రదర్శించాడు.

నాట్యం అంటే ఇష్టం లేని అమ్మాయిగా భానుప్రియ చిలిపి నటన అద్భుతం అని చెప్పాలి.

సినిమా ఆత్మకు తగ్గట్టు ఇళయరాజా అందించిన సంగీతానికి భానుప్రియ తన నాట్య ప్రావీణ్యంతో ప్రాణం పోసింది.

స్వర్ణ కమలం సిరివెన్నెల సాహిత్యం పాటలకు ప్రధాన బలం.

కళ ఇహపరాల మధ్య వారధి అనే వాస్తవాన్ని గ్రహించే దిశగా కథను నడిపించడంలో విశ్వనాథ్ ప్రతిభ మరెవ్వరికీ రాదని అంటే ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే.

స్వధర్మే నిధనం శ్రేయః

పరధర్మో భయావహః

“చక్కగా ఆచరించబడిన పరధర్మం కన్నా, గుణరహితమైనప్పటికీ స్వధర్మమే అత్యుత్తమమైనది. స్వధర్మాచరణంలో మరణం సంభవించినప్పటికీ అది శ్రేయస్కరమే. కానీ పరధర్మం భయంకరమైనది”.

Show More
Back to top button