Telugu Special Stories

దళిత హృదయాలని మేల్కొల్పిన జాతీయకవి… బోయి భీమన్న…

లోకులు కాకులే   కోకిల పిల్ల… లోకువిచ్చావంటే  నూకలు కల్ల… చేతికందిన పూలు  చిదిమిపారేస్తారు…

అందకపోతే  ఆరని పెడతారు… పైనున్న వాళ్ళ కాళ్ళు  పట్టుకు వేలాడుతారు…

తక్కువ వాళ్ళను   తొక్కుకుపోతారు….

అంటారు కవి బోయి భీమన్న… 

కులం ఒక జాతిగా, మతం ఒక వర్గంగా, నిత్యం పోరాడుతూ అంతరించిపోతున్న జాతిని సమన్వయం ద్వారా సమైక్యపరచాలన్నదే నా మతం అంటారు బోయి భీమన్న. వ్యక్తుల మౌలిక మనస్తత్వాలను గుర్తించడం ద్వారా జాతిని ఏకీకృతం చేయవచ్చునని బోయి భీమన్న గారు భావించారు. వ్యవస్థను ధిక్కరించే వారికి కొదవలేదు, ధిక్కరించే వారిలో వివక్షను అనుభవించిన వారు కొందరే. ప్రత్యామ్నయ సంస్కృతిని ప్రతిపాదించిన వారు మరీ అరుదు. భీమన్నలో వివక్ష అనుభవం, ధిక్కార చైతన్యం, ప్రత్యామ్నయ సంస్కృతిని ప్రతిపాదించిన అనితర తత్వం ఉన్నాయి.

“మధు మయ ఫణితీనాం మార్గదర్శి మహర్షిః” అన్న సుకవి సూక్తి కి ఉజ్జ్వలమైన ఉదాహరణ బోయి భీమన్న గారు.

బోయి భీమన్న గారు సాహితీ లోకానికే కాక యావత్ భారతదేశానికి పద్మశ్రీ భీమన్నగా, ఉత్తమ కవిగా సుపరిచితులు. భీమన్న గారు తెలుగుజాతిలో మేధావి వర్గంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలవారు. పండితులుగా, రచయితగా తన ప్రత్యేకతను నిలుపుకొన్నవారు. బోయి భీమన్న గారు 1940 నుండి 1945 వరకు ఉపాధ్యాయులు గాను, 1950 నుండి 1955 వరకు “ఆంధ్రప్రభ” పత్రిక యొక్క సబ్ ఎడిటర్ గాను పనిచేశారు. స్వతంత్ర్య పోరాట కాలంలో తాను పొందిన సాంఘిక, రాజకీయ, ఆర్థిక అనుభవాలు అనేకం. బోయి భీమన్న గారు ఉత్తమ నాటక రచయిత,

వాలి “పాలేరు”, “కూలి రాజు” ప్రసిద్ధమైన రూపకాలు. బోయి భీమన్న గారు గొప్ప విమర్శకులు, గేయ రచయిత, ఉత్తమ కవి, తాత్వికుడు, సోషలిస్టు, హేతువాది వీటన్నింటిని మించి మానవతావాది. తన మాతృభాష అయిన తెలుగులోనే కాక తాను ఆంగ్లంలో కూడా కవితలు వ్రాశారు.

★ది సెవెంత్ సీజన్ (కవితా సంపుటి)

“లేదు నాకు వ్యుత్పన్నత, వేదచయము

ఉపనిషత్తులు వాని శాఖోపశాఖ

లేని బోధించునో ఇంతయే నెరుంగ

చదువులే లేని నాకు ప్రాజదువులేడ”

“నేను కానిది సమస్తం నాదే” అంటూ విశ్వాన్నే తన ఆలింగనంలోకి తీసుకొన్నారు భీమన్న.

“నా సుఖాలు, సంతోషాలూ, గౌరవాలు

సమస్తమూ సర్వవతీ ప్రీత్యర్థం

నా కష్టాలూ, నష్టాలూ, దురదృష్టాలూ

అన్నీ శివార్పణం”

అంటూ తన సర్వస్వాన్ని శివ సరస్వతులకు వదిలేసి తాను కేవలం నిస్సంగిలా నిలిచిపోయిన రాసాద్వైతా చార్యులు భీమన్న గారు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    బోయి భీమన్న

ఇతర పేర్లు  :     భీమన్న 

జననం    :     19 సెప్టెంబరు 1911    

స్వస్థలం   :    మామిడికుదురు, తూర్పు గోదావరి జిల్లా

వృత్తి      :      ఉపాధ్యాయుడు

తండ్రి    :      పుల్లయ్య 

తల్లి     :     నాగమ్మ

జీవిత భాగస్వామి :   హైమావతి భీమన్న 

ప్రముఖ పాత్రలు :   గుడిసెలు కాలిపోతున్నాయి, పాలేరు

పురస్కారాలు   :     పద్మ భూషణ్ (2001)

మరణం  :   16 డిసెంబరు 2005

నేపథ్యం…

బోయి భీమన్న గారు ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి, కోనసీమ, మామిడి కుదురు గ్రామంలో 19 సెప్టెంబరు 1911 నాడు జన్మించారు. వీరి తల్లిదండ్రులు బోయి పల్లయ్య, నాగమ్మ దంపతులు. వీరు సనాతన ధర్మ కుటింభికులు. ఆది బ్రాహ్మణ సంతతి వారు. భీమన్న తండ్రి పల్లయ్య గారు అద్వైతి. వారు వేదం తెలిసినవారు. పల్లయ్య గారు సీతారామయ్య గారి వద్ద పాలేరుగా ఉండేవారు. సీతారామయ్య గారు కులబేధాలు లేనివారు. అందువలన పల్లయ్య గారు భాగవతంలోని పద్యాలు సీతారామయ్యగారి వద్దనే నేర్చుకున్నారు. ఆ విజ్ఞానంతో తాను జ్ఞానిగా పేరు పొందారు. వారికి ఉభయ గోదావరిలలో శిష్యులు ఉండేవారు. శిష్యులు గ్రామాలలో వేదాంత గోష్ఠులు చేసేవారు.

బోయి భీమన్న గారి తల్లి నాగమ్మ గారు జానపద గాయని. పొలం పనిలో ఉన్నప్పుడు పొలం పాటలు, పిల్లవాడిని నిద్రపుచ్చేటప్పుడు ఊయల పాటలు, తుమ్మెద పాటలు పాడేవారు. దళితులలోనూ పల్లె జనులలోను పుల్లయ్య, నాగమ్మలు గౌరవ మర్యాదలు పొందెడివారు. భారతదేశం లోని ప్రధాన సౌందర్య కేంద్రాలలో కోనసీమ ఒకటి. కోనసీమ భూలోక స్వర్గము గాను, మామిడికుదురు ఒక మందార వనం గాను భీమన్న గారు తన రచనలలో అభివర్ణించారు. ఇతని బాల్యం కోనసీమ లోనే గడిచింది. చిన్నప్పుడు భీమన్నకున్నంత భయం మరెవరికి లేదని చెప్పవచ్చు. భీమన్న గారికి మెరుపు అంటే భయం, ఉరుమంటే భయం, వాన చినుకు మీద పడినా వాన వెలిసే వరకు ఏడుస్తూనే కూర్చుండేవారు.

గ్రామీణ జీవనం అచ్చటి వ్యక్తులు, అనుభవాలు, జ్ఞాపకాలు భీమన్న రచనలన్నింటిలోనూ చోటు చేసుకున్నాయి. యోగి వేమన లాగే లాగే భీమన్న గారు కూడా సహజ కవి. సంపూర్ణ సాహిత్యం భీమన్న గారిది. భీమన్న గారు పూర్ణపురుషుడు, ఆది బ్రాహ్మణుడు. ప్రకృతిలోని సహజ సౌందర్యమంతా అలంకరించిన కోనసీమలో ప్రకృతి పురుషుల లాంటి తల్లిదండ్రుల సన్నిధిలో తన బాల్యం గడిపారు భీమన్న గారు. భీమన్న గారు తన బాల్యంలో పొందిన అనుభూతులు, సంఘటనలు తన రూపకాలన్నింటిలోనూ కనిపిస్తాయి.

ఒకచోట భీమన్న గారు ఇలా అంటారు..

“నగ్న సత్యం వేదాంతం

అలంకృత సత్యం కవిత్వం”….

విద్యాభ్యాసం…

బోయి భీమన్న గారు 1920లో తొమ్మిది ఏళ్ల వయసున్నప్పుడు పాఠశాల యందు  5వ తరగతిలోనే చేరాడు. తన 5వ తరగతిలోనే తొలి రచన చేశాడు. అదే బోయి భీమన్న గారి సాహితీ జీవితానికి నాంది అయ్యింది. ఆ పద్యం..

 కేలన్ గేల్, పయిటన్ బయటంగొని

సంకీర్ణ ప్రలాపాను హా

స్యాలాపంబుల, ముద్దు నవ్వుల, విలా

సార్థంబ యేతెంచుచున్

లీలా మానుష గాన మాధురికి హా

ళిన్ ధూళి మొహార్తులై

బాలల్ వేలుగ గూడి రందు, ధవళం

జై జోత్స్న లాలింపగన్… 

ఒకవైపు పాఠం జరుగుతూనే ఉంటే తరగతి గదిలోనే తన తొలి రచన చేశారు బోయి భీమన్న గారు. 1923లో మిడిల్ స్కూల్లో చేరారు భీమన్న గారు. తాను మూడవ ఫారం చదువుతున్న సమయంలోనే మహాభారతం లోని 18 పర్వాలు, భాగవతము పూర్తిగా చదివగలిగారు. తన గ్రాడ్యుయేషన్ను 1935లో పి.ఆర్ కళాశాల కాకినాడ నుండి  పూర్తి చేశారు. పేదగా పుట్టి పేదగా పెరిగినా, పేదగా బ్రతికినవాడు కాదు బోయి భీమన్న గారు. కష్టాలు, బాధలు ఎన్నో అనుభవిస్తూ కూడా నిత్య సంతోషిగా జీవించినవాడు.

అవమానాలను, అవతల నెడుతూ, అభిమానాలను పదిల పరుచుకుంటూ అగ్రస్థానానికి చేరుకున్నారు బోయి భీమన్న గారు. కాకినాడ పిఠాపురం రాజా కళాశాలలో చదివే రోజుల్లో తనకు గోరా గారితో స్నేహం ఏర్పడింది. గోరా (గోపరాజు రామచంద్రరావు) గారు నాస్తిక వాదం కలవారు. గోరా తన విద్యార్థులకు నాస్తికత్వాన్ని బోధిస్తే, బ్రహ్మర్షినాయుడు గారు ఆస్తికతను బోధించేవారు. వీరిద్దరి పట్ల భీమన్న గారికి గౌరవభావాలు ఉన్నాయి. ముఖ్యంగా భీమన్న గారికి సాహిత్య సేవ, సుందర ప్రకృతి ఆరాధన అంటే మక్కువ. విద్యార్థి దశలో ఉండగానే భీమన్న గారిపై జాతీయ ఉద్యమ ప్రభావం పడింది. ఉద్యమాలలో పాల్గొంటూనే సాహిత్య కృషికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు.

“నా కవితా లక్ష్యం

చీకట్లో బ్రతికే వాళ్ళను మెప్పించడం కాదు

వాళ్ళను తిట్టైనా కొట్టైనా సరే

అక్కడ నుంచి లేపడం

అరుణోదయం కేసి తరమడం”…

భీమన్న నిర్వహించిన పదవులు..

బోయి భీమన్న గారు కవిగానే కాక అనేక ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలలో అనేక పదవులు నిర్వహించి తన మేథాసంపత్తి చేత తగు సలహాలిచ్చి ఆయా సంస్థలకు ప్రజా సేవ చేశారు.

1940 – 1945 సంవత్సరాలలో భీమన్న గారు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. ఒక ప్రక్క ఉపాధ్యాయ వృత్తిని నెరవేరుస్తూనే తన సాహిత్య కృషిని కూడా కొనసాగించారు. తరువాత ఉపాధ్యాయ వృత్తిని వదిలి 1946లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.

ప్రదేశ్ కాంగ్రెస్ ఆర్గనైజర్ గా, హరిజన సేవక్ సంఘ్ సంయుక్త కార్యదర్శిగా పదవులు నిర్వహించారు. ఆ తరువాత మళ్లీ మద్రాసు రాష్ట్రంలో అసిస్టెంట్ పబ్లిసిటీ అధికారి గా ఉద్యోగంలో చేరారు.

1950లో మద్రాసు నుండి నార్ల వెంకటేశ్వరరావు గారి సంపాదకత్వంలో వెలుపడే “ఆంధ్రప్రభ” లో సహాయ సంపాదకులుగా మళ్లీ సాహిత్య సేవ ప్రారంభించారు. 1955లో పాత్రికేయ రంగానికి స్వస్తి చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో అనువాద శాఖ మరియు పుస్తకాల నమోదు అధిపతిగా తిరిగి ఉద్యోగ రంగ ప్రవేశం చేశారు.

1960లో నవ్య సాహితీ సమితి అధ్యక్షుడిగా అఖిలభారత ప్రథమ తెలుగు రచయితల సభలకు సారథ్యం వహించారు. ఇదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఎంపిక చేయబడ్డారు.

బోయి భీమన్న గారు 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా సంఘం సభ్యులుగాను, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సంస్థ కార్యదర్శి గాను పదవులు నిర్వహించారు. అలాగే తెలుగు అకాడమీలో పాలకమండలి (బోర్డ్ ఆఫ్ గవర్నర్స్) సభ్యులుగా ప్రభుత్వం నియామకం చేసింది.

1975 – 76 ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం అవార్డ్స్ కమిటీలో రెండు మార్లు సభ్యులుగా ఎన్నిక చేయబడినారు. ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ సభ్యులు (ఎమ్మెల్సీ) గా ప్రభుత్వం చేత నియమింపబడినారు. ఇంకా అంతర్జాతీయ తెలుగు సంస్థల పాలక మండలి (గవర్నర్ బోర్డ్) సభ్యులుగా నియమింపబడి సాహిత్య సేవకు అంకితమైనారు.

ఇంకనూ డాక్టర్ బోయి భీమన్న గారికి దిగువ సంస్థలతో వివిధ హోదాలలో సంబంధాలు ఉన్నాయి.

★ ఆంధ్ర, ఉస్మానియా విశ్వవిద్యాలయాలలో సెనేట్ సభ్యత్వం..

★ కేంద్ర సాహిత్య అకాడమీ

★ ఆకాశవాణి ప్రాంతీయ సలహా సంఘం

★ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ

★ ఆంధ్రప్రదేశ్ సంగీత తెలుగు రచయితల మహాసభలు

★ అఖిల భారత తెలుగు రచయితల మహాసభలు

★ నవ్య సాహితీ సమితి

★ సుఖేలా నికేతన్ స్థాపన..

రచయిత గా…

బోయి భీమన్న గారు ప్రముఖ రచయిత. ఈయన సుమారు 70 పుస్తకాలు వ్రాశారు. పద్య, గేయ, వచన రచనలతో పాటు, నాటకాలను కూడా వ్రాశారు. తాను వివిధ పుస్తకాలకు వ్రాసుకున్న పీఠికల్లో పరిశోధనాత్మక దృష్టి కనిపిస్తుంది. వాటిలో కొన్నేవో కొత్త ప్రతిపాదనల్ని, కొత్త సిద్ధాంతాల్నీ చెప్తున్నట్లు మనకు అనిపిస్తుంది. భీమన్న గారు ఆకాశవాణిలో ప్రసారం కోసం అనేక భావగీతాల్ని వ్రాశారు. వీటన్నింటితో పాటు అంబేద్కర్‌ గారు వ్రాసిన కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించడంతో పాటు, తన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని కీర్తిస్తూ వ్రాశాడు. వీరు వ్రాసిన “జయ జయ జయ అంబేడ్కర” దళితులకు జాతీయ గేయమై నేటికీ ఊరూరా ప్రార్థనా గీతంగా మార్మోగుతోందని డా.దార్ల వెంకటేశ్వరరావు గారు వ్యాఖ్యానించారు. “జాతీయ కవి బోయి భీమన్న” పేరుతో 28 ఫిబ్రవరి 2011 వతేదీన సూర్య దినపత్రిక సాహిత్య అనుబంధంలో డా.దార్ల వెంకటేశ్వరరావుగారు ఒక వ్యాసాన్ని వ్రాస్తూ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఆ వ్యాసంలోని భాగాల్ని గమనిస్తే, బోయి భీమన్న గారి వ్యక్తిత్వం, సాహిత్య దృక్పథం మనకు స్ఫష్టమవుతుంది.

సాహిత్య సేవ…

భారతదేశంలోని “భిన్నత్వంలోని ఏకత్వం” లాగే, భీమన్న గారి రచనల లోనూ ఆ లక్షణం కనిపిస్తుంది. భీమన్న గారు కుల, మతాల కంటే మానవత్వాన్నే ఆశించిన జాతీయవాది. భారతజాతీయదృక్పథంలో అంతర్భాగంగా ప్రవహించే హిందూమతంలో కులాన్ని ప్రత్యేకంగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్‌ గారు విశ్లేషించిందీ, భీమన్న గారు వ్రాసిందీ అదే. భీమన్న గారు జీవితాంతం తాను జాతీయవాదిగానే ఉన్నారు. 

ఒకప్పుడు “బ్రాహ్మణ” శబ్దాన్ని చదువుకున్నవారినీ, ఆలోచనాపరులని సూచించడానికి ప్రయోగించారు. సామాజిక నిర్మాణంలో చాతుర్వర్ణ వ్యవస్థలోకి చేరిన తర్వాత కులం సూచికగా మారిపోయింది. తమ తెలివితేటలతో ఆధిపత్యంలో ఉన్న వాళ్ళు, క్రమేపీ ఒక వర్గంగా తయారయ్యారు. ఈ ఆలోచనాపరులు ఒక క్రమబద్ధమైన జీవన విధానాన్ని మతమని ప్రబోధిస్తూనే, ఆచార, వ్యవహారాల పేరుతో, కర్మ సిద్ధాంతం వైపు నడిపించుకొనిపోయిన హిందూమతం పైనే డా. అంబేద్కర్‌ గారు ముందుగా తన దృష్టిని కేంద్రీకరించారు.

పురాణేతిహాసాలు, సాంప్రదాయ సాహిత్యాల పేరుతో పాలకవర్గాలతో “ఆలోచనాపరులు” కలిసి కొనసాగించిన కుట్ర ఫలితంగా, నేటికీ కులాధిపత్య సాహిత్యమే ఉత్తమసాహిత్యంగా కొనసాగిపోతోంది. దురదృష్టమేమిటంటే, నాటిభావజాలాన్ని నేటికీ కొనసాగించడాన్ని ఆ భావజాలం వల్ల నష్టపోయిన, ఇంకా నష్టపోతున్న వాళ్ళు వ్యతిరేకిస్తుంటే, నాటి ఆధిపత్య భావజాలానికి ప్రతినిధుల్లా వాటిని సమర్ధించేవాళ్ళు కొంతమంది తయారయ్యారు. అందువలననే తమ ప్రజలంతా దేని వల్లనైతే మోసపోతున్నారో, దాని నుండి రక్షించుకోవడానికి సామాజిక ఉద్యమాన్ని నడిపే బాటలో పయనించిన వారు అంబేద్కర్‌ గారు. అలాంటి ఆశయాన్నే సాహిత్యంలో కొనసాగించిన రచయిత బోయి భీమన్న గారు కూడా.

పాలేరు నాటకం…

బోయి భీమన్న గారు తాను వ్రాసిన “పాలేరు” నాటకంలో వెంకన్న, వనబాలల ప్రేమకథలోను, 1959లో వ్రాసిన “రాగవాసిష్ఠం” నాటకంలో గల అరుంధతి, వశిష్ఠుల ప్రణయ గాథలోను, మరికొన్ని రచనలలోను కులాంతర వివాహాల పేరుతో కులనిర్మూలన అవకాశాల్ని చర్చించారు. సమాజంలో కులం వల్ల గౌరవం పొందుతున్న కుటుంబం నుండి వచ్చిన వనబాల, కులం వల్ల సమాజంలో అవమానాలకు గురవుతున్న వెంకన్న పరస్పరం ప్రేమించుకుంటారు.

పాలేరుగా పనిచేయాల్సిన వాడు, అగ్రకులంగా గౌరవమర్యాదల్ని పొందుతున్న అమ్మా యిని పెళ్ళి చేసుకోవాలంటే, ఎన్ని బాధలకు గురికావాల్సివస్తుందో, అన్నింటినీ అగ్రకుల, భూస్వామి కుబేరయ్య వల్ల పాలేరు వెంకన్న ఎదుర్కొంటాడు. చివరికి “ఉపకారి” మాస్టారు సహాయంతో చదువుకుని, వెంకటే శ్వరరావుగా గౌరవం పొంది, డిప్యూటీ కలెక్టరుగా ఉన్నతోద్యోగం సాధిస్తాడు. ఉద్యోగిగా తన గ్రామానికే వచ్చి, భూస్వాముల దురాగతాలను చట్టబద్ధంగా అడ్డుకుంటాడు. అస్పృశ్యతను పాటించే వాళ్ళనీ, ప్రోత్సహించేవాళ్ళనీ నిరోధిస్తాడు. ప్రజాస్యామ్యబద్ధంగా దళితులు తమ హక్కుల్ని సాధించుకోవాలనే అంబేద్కర్‌ ఆశయాన్ని దీని ద్వారా ప్రేరేపించాడు రచయిత.

సమాజంలోని వాళ్ళంతా చెడ్డవాళ్ళే కాదనీ, మంచివాళ్ళూ ఉంటారనేది భీమన్న సాహిత్యంలో కనిపించే ఒక విశిష్ట గుణం. ఈ పాలేరు నాటకంలో వనబాల కూడా అగ్రవర్ణానికి చెందిన కుంటుంబం నుండే వచ్చినా, సంకుచిత మూర్ఖ కులతత్వ వాదులు లేని వాళ్ళూ ఉంటారనే మరో పార్శ్వాన్ని కూడా చూపారు. వెంకన్న తండ్రి పుల్లయ్య తన తండ్రి బాటలోనే తానూ పయనించి, తన కొడుకునీ పాలేరుతనానికి పంపుతాడు. అలాంటి సేవ చేయడానికే తాము జన్మించామనే భ్రమను కల్పించి, కొన్ని తరాలుగా కర్మసిద్ధాంతం పేరుతో దళితుల్ని అగ్రవర్ణభూస్వాములు వంచించిన తీరుతెన్నుల్ని ఈ నాటకం ద్వారా వివరించారు.

“గుడిసెలు కాలిపోతున్నై”…

“గుడిసెలు కాలిపోతున్నై” (1973) కావ్యంలో ఏడాది కోసారి దళితుల గుడిసెలెందుకు కాలిపోతున్నాయో, మరలా కొత్తగుడిసెలు మాత్రమే ఎందుకు వస్తున్నాయో ఓట్లకోసం వచ్చేవారిని నిలదీసే చైతన్యం దళితులలో కలగాలనే ఆశయం రచయితకు కనిపిస్తుంది. చీమలను శ్రామిక దళితులకు, పాములను కులదోపిడీదారులకు ప్రతీకలుగా చేసి ఆ కవితా సంపుటిలో వర్ణించారు. దళితుల మధ్య ఉండాల్సిన సమైక్యతను అందులో ప్రబోధిస్తారు. “కూలిరాజు” (1946) నాటకంలో కులంతో పాటు ఆర్థికాంశాల్ని కూడా స్పర్శించారు. “ధర్మం కోసం పోరాటం” లో బహుజనులంతా రాజ్యాధికార దిశగా పయనించడానికి సూచనలు చేశారు. వాల్మీకి, వేదవ్యాసుడు, ధర్మవ్యాధుడు మొదలైన వాళ్ళు దళితులేనని వాదిస్తూ, వాళ్ళు వ్రాసిన భారత, రామాయణ, భాగవతాలు తమవేనని చెప్పడంలో భీమన్న గారి దృక్పథాన్ని లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది.

హింసావాదానికి భీమన్న గారు వ్యతిరేకి. దళితులందరూ శ్రామికులనే వారిని భీమన్న వ్యతిరేకించారు. కమ్యూనిస్టుపార్టీలో పనిచేసి, కులం, వర్గం వేరని వాదించిన కోనాడ సూర్యప్రకాశరావు గారికి పాలేరు నాటకాన్ని అంకితమిచ్చాడు. భీమన్న రచనల గురించి మాట్లాడుతున్న వాళ్ళు మూడు ప్రధానాంశాల్ని గుర్తించాలి. మొదటిది ఆర్యఅనార్య సిద్ధాంతాన్ని అంబేద్కర్‌ గారి ఆలోచనతోనే “రాగవాసిష్ఠం” లాంటి నాటకాన్ని వ్రాశాడు. రెండవది, వర్ణం విషయంలో భారతదేశంలో కులమనే అవగాహన చేసుకోవాలి. ఇది ప్రపంచ దేశాలన్నింటికీ సమన్వయించినప్పుడు కుదరదు. దీనిని కూడా అంబేద్కర్‌ గారు ఆంత్రోపాలజీ, సామాజిక శాస్త్రాల్ని ఆధారంగా చేసుకుని చెప్పిన సిద్ధాంతమే. దీన్నే భీమన్న కూడా తన రచనల్లో సమన్వయించాడు.

పాలేరు నాటకానికి వ్రాసిన ముందుమాటలో భీమన్న స్పష్టంగానే వర్గం, కులం పట్ల తన అభిప్రాయాల్ని ప్రకటించారు. “భారత్‌లో వర్గపద్ధతి లేదు. వర్ణవ్యవస్థ అంటే కుల వ్యవస్థ వుంది. ఇక్కడ కూలీలంతా అభ్యుదయం సాధించాలంటే ముందుగా అంటరానితనాన్ని తొలగించాలి” అన్నారు. వర్గపోరాటాలు జరుగుతున్న తీరుని విమర్శిస్తూ “నాయకులంతా దేశీయ స్థితిగతులను గుర్తించకుండా ప్రపంచ కార్మిక దృష్టిమాత్రమే కలిగిన ధనిక సవర్ణులు” అని ప్రకటించారు. ఇంత స్పష్టంగా కులనిర్మూలనను ఆశించిన భీమన్న గారి సాహిత్యాన్ని వివిధ జాతీయసదస్సుల్లో కులం లేదన్నారని వక్రీకరిస్తున్నారు. మూడవది వర్ణాంతవివాహాల వల్ల కులనిర్మూన జరగడాన్ని ఆకాంక్షించారు. ఈ విషయాలన్నీ బాధ్యతగల సాహితీవేత్తలు గుర్తించాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్‌ గారి భావజాలానికి సాహిత్య ప్రతిఫలమే భీమన్న సాహిత్యమని గుర్తించాల్సి ఉందని డా.దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించింది నూటికి నూరుశాతం నిజమని తెలుస్తుంది.

భీమన్న వ్యక్తిత్వం…

బోయి భీమన్న గారిని ఇతరులతో పోల్చడం తాను ఒప్పుకోరు. అలా పోల్చడం అతని వికాసానికి అడ్డుకట్టలు వేస్తున్నట్లుగా భావిస్తారు. ముఖ్యంగా వీరు స్వీయ గౌరవం గల వ్యక్తులు, బలీయమైన ఆత్మీయ విశ్వాసం పెంపొందించుకున్న వ్యక్తిత్వం వీరిది. బోయి భీమన్న గారు తనలోని ప్రత్యేకతను, విశిష్టతను గుర్తుంచుకొని వాటికి అనుగుణంగా తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు. అంతేకానీ ఇతరులను అనుకరించడం, అనుసరించడం తనకు ఎంతో హానికరం అని గుర్తించారు. తాను సొంత వ్యక్తిత్వం మేథా నైశిత్యం ఉన్న వ్యక్తి. బోయి భీమన్న గారు ఎవర్ని ఆదర్శంగా తీసుకోలేదు. తనకు తానే ఆదర్శం.

“ఒక గొప్ప వ్యక్తి ఎప్పుడు సామాన్యుల నుంచి, సాధారణ వ్యక్తుల నుంచి ఘర్షణను ఎదుర్కోవాల్సి ఉంటుంది” ఇది అక్షరాల బోయ భీమన్న విషయంలో జరిగినట్టు అతని వ్యక్తిత్వం ద్వారా తెలుస్తుంది. ఇంకా బోయి భీమన్న గారి వ్యక్తిత్వం ఏమిటో తన రచనల ద్వారా, తన చింతన ద్వారా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రజాస్వామ్యం, మానవతావాదం ఈ రెండు భీమన్న జీవిత ధ్యేయాలు. డాక్టర్ బోయి భీమన్న గారు విశ్వాన్నంతటినీ ఆకలింపు చేసుకున్న తత్వవేత్త. తన తాత్విక దృష్టితో ప్రపంచానికి కొత్తదారులు చూపించిన మహనీయులు, గొప్ప మానవతావాదులు.

ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత తత్వాలు ప్రసాదించే పాక్షిక సత్యాలను సదావగాహన చేసుకుని అసంతృప్తుడైన భీమన్న గారు మానవానంద ప్రణయ మూల బీజానికి సంపూర్ణ సర్వతోముఖ వికాసం కలిగించే చేతన రససృష్టిగా రసాద్వైత తత్వ సృష్టి చేసిన కళా స్రష్ట తాను. అవ్యాజ ప్రేమను, అనంత సౌందర్యాన్ని, అవిచ్ఛిన్న విశ్వాత్మను ఆవిష్కరించే ఈ రసాద్వైత దృష్టి తన విభిన్న రచనలన్నింటిలో అంతర్జ్వాలగా ప్రజ్వలిస్తున్నది. పద్మశ్రీ భీమన్న గారు సాహిత్యం ద్వారా ప్రజల్లో నూతన చైతన్యాన్ని కలిగించడానికి ప్రజాస్వామ్యం, మానవతా దృక్పథం కలిగిన సాహిత్యంతో సాహిత్య సేవ చేస్తున్న విశిష్ట వ్యక్తిత్వం కలవారు. మహాకవి భీమన్న గారు వినయ స్వభావం కలవారు. ద్వేషము, అసూయ తన మృదు స్వభావమునకు విరుద్ధములు.

బిరుదులు…

బోయి భీమన్న గారి ప్రతిభావుత్పత్తులకు, శక్తి సామర్థ్యాలకు, ధీర చిత్త వృత్తిని నిరూపమాన సాహితీసేవకు సన్మానాలు సత్కారాలతో పాటు అనేక బిరుదులు పొందారు.

 ★ మహాకవి..

 బోయి భీమన్న గారికి 1968 లో కాకినాడ ప్రజల ఘనమైన సన్మానం జరిపి “మహాకవి” అనే బిరుదును ప్రధానం చేశారు.

★ సాహితీ వసంత..

బోయి భీమన్న గారికి 1971లో తన స్వగ్రామం మామిడికుదురులో షష్టి పూర్తి ఉత్సవం జరిపి “సాహితీ వసంత” అనే బిరుదు సాహితీ బంధువులచే ప్రధానం చేయించారు.

★ కళా ప్రపూర్ణ..

బోయి భీమన్న గారికి 1971లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారిచే బ్రహ్మాండమైన సభా మంటపమునందు గౌరవప్రదమైన కళా ప్రపూర్ణ అనే బిరుదు ప్రధానం చేయబడింది.

★ పద్మశ్రీ…

బోయి భీమన్న గారికి 1973లో కొత్త ఢిల్లీలోని భారత ప్రభుత్వం తరపున రాష్ట్రపతి శ్రీ వి.వి.గిరి గారి చేత “పద్మశ్రీ” బిరుదు ప్రధానం చేయబడింది. దీనితో భీమన్న గారు భారత దేశ సాహితీ లోకానికి తెలిసిపోయారు.

★ పద్మభూషణ్…

బోయి భీమన్న గారికి 2001 వ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది.

★ డాక్టర్…

బోయి భీమన్న గారికి 1976 లో వారణాసి లోని కాశీ విద్యాపీఠం వారు భీమన్న గారికి సన్మాన సభ ఏర్పాటు చేసి గౌరవ డాక్టరేట్ (డి.లిట్) ప్రధానం చేశారు. ఆ సభ యందు వివిధ గౌరవ మర్యాదలతో సత్కరింపబడినారు భీమన్న గారు. తాను పలువురి ప్రశంసలు అందుకున్నారు.

నిష్క్రమణం…

బోయి భీమన్న గారు ఆనాటి పత్రికా రంగంలో విశిష్టమైన సంపాదకులుగా ఆదరణ పొందారు. తాపీ ధర్మారావు, ఆంధ్ర శేషగిరిరావు, శ్రీశ్రీ, కాసా సుబ్బారావు, నార్ల వెంకటేశ్వరరావు, కాశీనాథుని నాగేశ్వరరావు, గోరా, రఘుపతి వెంకటరత్నం నాయుడు, కళా వెంకట్రావు గార్లు మొదలైన పత్రికా సంపాదనకులతోనే కాక కాంగ్రెస్ నాయకులు, స్వతంత్ర సమరయోధులు, హరిజన ఉద్యమకారులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండేవారు. ఈ నేపథ్యంలో తాను రాజకీయ సాంఘిక ఆర్థిక అంశాల పైన, సాహిత్యంశాల పట్ల మంచి అవగాహన కలిగి ఉండడంతో పత్రిక నిర్వహణ చాలా సులభంగా సాగించేవారు.

నేటి తరానికి భీమన్న గారు మహాకవి గానే తెలుసు. నైపుణ్యం గల పత్రిక సంపాదకులుగా చాలామంది ఎరుగరు. వార్తలను ఒక సమగ్రమైన అర్థవంతమైన ప్యాకేజీలలో పాఠకులకు అందించడంలో భీమన్న అందెవేసిన చేయి. వార్తలకు శీర్షికలను పెట్టడంలో మంచి నేర్పరులు. భీమన్న గారు వార్తలను ప్రచురించడంలో రాజీ పడేవారు కాదు. భీమన్న గారి సంపాదకీయాలు చదివితే తన మొండితనం, నిబద్ధత, గుండె ధైర్యం అవగతమవుతాయి. భీమన్న గారు తెలుగు పత్రికా రంగానికి పాత్రికేయునిగా చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిన తాను అనారోగ్యంతో 16 డిసెంబరు 2005 నాడు ఈ లోకం నుండి నిష్క్రమించారు.

Show More
Back to top button