Telugu News

సరిహద్దు అంచున నిప్పురవ్వ

లడఖ్‌లో హింస రగులుతోంది, లెహ్ నగరం కాలిపోతోంది. 2025 సెప్టెంబర్ 24న బీజేపీ కార్యాలయం ధ్వంసం కావడం, పోలీసు వాహనాలు బూడిదవడం వంటి హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఈ ఘర్షణల్లో ఐదుగురు మరణించారు, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ హింసకు ప్రధాన కారణం ఆ ప్రాంత జెన్-జెడ్ (Gen-Z) యువత అసంతృప్తి. కేంద్ర పాలిత ప్రాంత హోదాకు బదులుగా తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో తమ ప్రాంతాన్ని చేర్చాలని, తమ గిరిజన సంస్కృతికి, భూములకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు. ఈ నిరసనలు కేంద్ర ప్రభుత్వంపై తిరుగుబాటు కాకుండా, వారి నిత్య జీవన సమస్యలు, న్యాయమైన డిమాండ్ల నుంచి పుట్టుకొచ్చినవే.

* నిత్య జీవన సమస్యలు

లడఖ్‌లో రగులుతున్న ఈ ఉద్యమానికి స్థానిక ప్రజలు, ముఖ్యంగా యువత యొక్క న్యాయమైన డిమాండ్లు మూలం. వారు ప్రధానంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఇందుకోసం ప్రత్యేకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ (PSC)ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. తమ భూములపై స్థానికులకే హక్కులు ఉండాలని, బయటివారి ప్రవేశం వల్ల తమ వనరులు దోచుకోకుండా భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ గిరిజన సంస్కృతికి, భాషకు రక్షణ కల్పించాలని అడుగుతున్నారు. ఈ సమస్యలు కేవలం రాజకీయపరమైనవి కావు. కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన తర్వాత స్థానిక ప్రజల స్వయంప్రతిపత్తి (అటానమీ) పోవడం, ఉద్యోగాలు బయటివారికి వెళ్లడం, కొత్త ఉద్యోగాలు లేకపోవడం వంటి నిత్య జీవన సమస్యలు వారి జీవనాన్ని ప్రమాదంలో పడేశాయని అక్కడ వారు ఆందోళన చెందుతున్నారు. 

* ఆర్టికల్ 370 రద్దు పరిణామాలు

చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే.. 1947లో లడఖ్ భారత్‌లో చేరినప్పుడు జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. అప్పటి రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 వారికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించింది. అయితే, బీజేపీ ప్రభుత్వ హయాంలో 2019లో ఈ ఆర్టికల్ 370 రద్దు కావడం పెను మార్పులకు దారితీసింది. లడఖ్ను జమ్మూ కశ్మీర్ నుంచి వేరు చేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా (యూనియన్ టెరిటరీ) మార్చారు. ఈ మార్పును తొలుత ప్రజలు స్వాగతించినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రక్షణ, అభివృద్ధి వాగ్దానాలు ఆచరణలో నెరవేరలేదు. ఫలితంగా ఉద్యోగాలు స్థానికులకు దక్కకుండా పోయాయని, దీంతో స్థానిక జీవనం ప్రమాదంలో పడిందని అక్కడివారు వాధిస్తున్నారు.

* 5 కీలక డిమాండ్లు

లడఖ్ ప్రజలు కేంద్రం ముందు పెట్టిన ప్రధాన డిమాండ్లలో స్పష్టమైన న్యాయం ఉంది. వాటిలో ముఖ్యమైనవి ఐదు.

కేంద్ర పాలిత ప్రాంతం నుండి పూర్తి స్వరాష్ట్రం కావాలి: ఇది వారి తొలి, ప్రధాన డిమాండ్, స్వయం ప్రతిపత్తిని తిరిగి సాధించడం లక్ష్యం.

రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చాలి: ఇది వారి భూములకు, గిరిజన సంస్కృతికి రక్షణ, ఉద్యోగ రిజర్వేషన్లు కల్పిస్తుంది.

రెండు పార్లమెంట్ సీట్లు: ప్రస్తుత ప్రాతినిధ్యాన్ని పెంచాలని, తద్వారా తమ గొంతు పార్లమెంట్‌లో బలంగా వినిపించాలని కోరుతున్నారు.

ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్: స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ ఏర్పాటు అత్యవసరం.

గిరిజన భాష, సంస్కృతికి రక్షణ: తమ ప్రత్యేకతను కాపాడుకోవాలని, లడఖ్ భూములు స్థానిక గిరిజనులకే చెందాలని డిమాండ్ చేస్తున్నారు.

సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష, ఉద్యమ నేతృత్వం

ప్రస్తుత పరిణామాల్లో నిరసనలకు సోనమ్ వాంగ్చుక్ నేతృత్వం వహించారు. 2025 సెప్టెంబర్ 10న ఆయన వారి డిమాండ్ల సాధన కోసం నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు. ఆయనతో పాటు మరో 15 మంది ఈ దీక్షలో పాల్గొన్నారు. 15 రోజులు గడిచిన తర్వాత సెప్టెంబర్ 23న మరో ఇద్దరి ఆరోగ్యం క్షీణించి, హాస్పిటల్‌కు తరలించారు. ఈ సంఘటనలకు నిరసనగా, లెహ్ ఆపెక్స్ బాడీ (LAB) యూత్ వింగ్ సెప్టెంబర్ 24న లడఖ్ బంద్‌కు పిలుపునిచ్చింది. మార్టిర్స్ పార్క్‌లో సోనమ్ వాంగ్చుక్ స్పీచ్‌తో యువతలో ఉత్సాహం పెరిగి, ‘జెన్-జెడ్ రెవల్యూషన్’ వైపు ఉద్యమం మళ్లింది.

హింస చెలరేగడం, సెక్యూరిటీ చర్యలు

సెప్టెంబర్ 24న బంద్‌లో భాగంగా యువత ఆగ్రహంతో ముందుకు కదిలింది. ఈ సందర్భంలోనే మాబ్ హింస చెలరేగింది. బీజేపీ కార్యాలయం ధ్వంసమైంది. పరిస్థితిని అదుపులోకి తేవడానికి బోర్డర్ సెక్యూరిటీ పోలీసులు టియర్ గ్యాస్, లాఠీ ఛార్జ్, ఫైరింగ్ చేశారు. ఈ హింసాత్మక చర్యల్లో నలుగురు మరణించారు. 80 మంది నిరసనకారులకు, 30 మంది సెక్యూరిటీ సిబ్బందికి గాయాలయ్యాయి. హింస తీవ్రరూపం దాల్చడంతో సెప్టెంబర్ 25 నుంచి ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. భారీగా సెక్యూరిటీ బలగాలను మోహరించారు. 50 మందికి పైగా ఉద్యమ నేతలను గృహ నిర్బంధం చేశారు. ఈ చర్యల కారణంగా ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఉద్రిక్తత కొనసాగుతోంది.

భారతదేశ ‘ఐక్యతకు’ ఒక పరీక్షా సమయం

చివరిగా, లడఖ్‌లో జరుగుతున్న ఈ హింస కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. ఇది భారతదేశ ‘ఐక్యతకు’ ఒక పరీక్షా సమయం. ఈ సమస్యలను సత్వరమే పరిష్కరించకపోతే, దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఉద్యమాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా యువత నిరాశ, నిస్పృహల నుండి పుట్టుకొస్తున్న, ప్రత్యేక రాజకీయ నాయకత్వం లేని ఉద్యమాలను చూస్తున్నాం. ఈ యువతకు రాజకీయ నాయకులంటే నెగిటివ్ ఒపీనియన్ ఉంది. వారు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తేడా చూడటం లేదు. కనుక, కేంద్ర ప్రభుత్వం స్థానిక ప్రజలతో సంభాషణలు జరిపి, వారి న్యాయమైన డిమాండ్లను అభివృద్ధి, రక్షణ చర్యల ద్వారా పరిష్కరించాలి. అప్పుడు లడఖ్ మళ్లీ శాంతి, సమృద్ధి చిహ్నంగా మారుతుంది. ఇది కేవలం ఒక ప్రాంతం కాదు, దేశ భవిష్యత్తుకు చెందిన కీలక భాగం.

Show More
Back to top button