CINEMATelugu Cinema

హంస అందం, కోకిల స్వరం కలగలిసిన నేపథ్య గాయని… సునీత..

మన సినీ వినీలాకాశంలో ఎన్నెన్నో తారలు. కొన్ని తారలు తెర ముందు అద్భుతమైన  అభినయాన్ని పండిస్తే, మరి కొన్ని కనిపించని తారలు ఆ అభినయానికి రాగాల వన్నెలు అద్దుతాయి. వారే నేపథ్య గాయకులు. ఉత్కంఠగా సాగిపోతున్న చిత్రంలో అలవోకగా మెరిసే గీతాలు మనసుకు ఎంతో హాయిని కలిగిస్తాయనటం ఏమాత్రం అతిశయోక్తి కాదు. నేపథ్య గాయనిలకు ఎక్కువగా గాత్రం మధురంగా ఉంటుంది. అందం, అందమైన గాత్రం రెండూ ఒకరికే ఉండటం చాలా అరుదు. కానీ గాయని సునీత గారి విషయంలో మాత్రం ఇది సాధ్యమైంది. యేండ్ల తరబడి తన పాటలతో సంగీత సామ్రాజ్యంలో తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్న పాటల రాణి సునీత గారు. సరసాలు, శృంగారం, హృదయవిదారకం, దుఃఖం, సంతోషం, దుఃఖం వంటి అన్ని రకాల భావోద్వేగాలను ఆమె తన గాత్రంతో చెప్పగలరు. సందర్భం లేదా సన్నివేశం ఏదైనా ఆమె పాటకు ఎందరో ఫిదా అయ్యారు. అలా ఆమెను మెచ్చుకున్న వారిలో దివంగత అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారట.

“ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు” అంటూ ఆమె 28 యేండ్ల సుదీర్ఘ సంగీత ప్రస్థానపు తొలిరోజులు అందరికీ నవనవోన్మోహంగా గుర్తుంటాయి. ఆ పాటతో ప్రేమికుల హృదయాలను కొల్లగొట్టిన వైనం ఇప్పటికీ మరువలేము. తెలుగుజాతి ముద్దుబిడ్డ సంగీతాభిమానులకు అందించిన పాటలు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు వేలకు పైగానే. ఆమె పాటలో లేని సొగసు వుండదు, ఆమె పాటలో పలకని స్వరం వుండదు, ఆ మధుర గాయని పాటల పల్లకి కారు మేఘాల చాటుకు వెళ్ళినా, ఆ మేఘమాలికలు చిరుజల్లులుగా మధుర స్మృతులను అందిస్తూ సంగీత ప్రియుల హృదయాల్లోకి, పంచేంద్రియాల్లోకి ప్రవేశించి గూడుకట్టుకొని కాపురం చేస్తూనే వున్నాయి, వుంటాయి కూడా. ఆమె మధుర గాయని చందమామ రూపం, చెదరని దరహాసం, ఆత్మవిశ్వాస బలం. ఆమె పాడుతుంటే సుస్వరాల అమృత ధార ఆమె గొంతునుండి జాలువారుతుంది. శీతాకాలం మంచుతెరలు, గువ్వపిట్టల కిలకిలలు తన స్వరరూపంలో ఆవిష్కరించగలిగిన అరుదైన గొంతు సునీత గారి సొంతం. సునీత గారు పాడుతుంటే బాగా పాడుతుంది అనే వాళ్ళు ఒక్క క్షణం ఆగి ఆమె ఆహార్యం భలే ఉంది అనుకోకుండా ఉండలేరు. అంతటి సాందర్యం ఆమె సొంతం.

ఈమె 17 సంవత్సరాల వయస్సులో మొదటిసారిగా సినిమాలలో నేపథ్యగాయనిగా ప్రవేశించారు. శశి ప్రీతం సంగీత దర్శకత్వంలో గులాబి సినిమా కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన “ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు” అనే పాటతో తన ప్రస్థానాన్ని ఆరంభించి తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సుమారు 3,000 సినిమా పాటలు పాడారు. కేవలం పాటలే కాకుండా తెలుగు సినిమాలలో నటించే ఇతర భాషా నటీమణులకు డబ్బింగ్ కూడా చెబుతుండేవారు. తొలిసారి పెళ్లిపందిరి (1998) సినిమాలో నటి రాశి కి తొలిసారి డబ్బింగ్ చెప్పారు. అలా ప్రారంభమైన డబ్బింగ్ చూడాలని వుంది (1998) సినిమాలో సౌందర్య తో బాటు, తమన్నా, అనుష్క, జెనీలియా, శ్రియా సరన్, జ్యోతిక, ఛార్మి, నయనతార, సదా, త్రిష, భూమిక, మీరా జాస్మిన్, లైలా, స్నేహ, సోనాలి బెంద్రే, కమలినీ ముఖర్జీ, కత్రినా కైఫ్ మొదలైన వారికి గాత్రదానం (వాయిస్ ఓవర్) ఇచ్చారు. ఎక్కువ చిత్రాలలో 110 మంది నటీమణులకు గాత్రదానం చేసిన ఆమె 750 కంటే ఎక్కువ చిత్రాలలో తాను డబ్బింగ్ చెప్పారు.

సునీత కళాకారిణిగా 19 విదేశాల్లో విస్తృతంగా పర్యటించారు. 1999 నుండి దాదాపు ప్రతి సంవత్సరం అమెరికా, రష్యా, అరబ్ దేశాలు, సింగపూర్, మలేషియా, ఉగాండా, నైజీరియా, టాంజానియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, ఐర్లాండ్, శ్రీలంక, థాయిలాండ్, జపాన్, ఒమన్, బహ్రెయిన్, ఖతార్, మారిషస్ దేశాలలో పర్యటించారు. ఆమె తొమ్మిది నంది అవార్డులు మరియు వివిధ విభాగాల్లో రెండు సౌత్ ఫిలింఫేర్ పురస్కారాలు   అందుకున్నారు. ఆమె తన 15 సంవత్సరాల వయస్సులో లైట్ మ్యూజిక్ విభాగంలో ఆల్ ఇండియా రేడియో నుండి జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. ఆమె 1999 సంవత్సరంలో తన మొదటి నంది అవార్డును అందుకున్న సునీత 2002 నుండి 2006 సంవత్సరాల వరకు మరియు మళ్లీ 2010 నుండి 2012 సంవత్సరాల వరకు వరుసగా నంది అవార్డులను అందుకున్నారు. ఆమెను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2011 సంవత్సరానికి లతా మంగేష్కర్ ఉత్తమ గాయని అవార్డుతో సత్కరించింది.

జీవిత విశేషాలు…

  • జన్మ నామం :    ఉపద్రష్ట సునీత
  • ఇతర పేర్లు  :  గాయని సునీత
  • జననం    :    10 మే 1978 
  • స్వస్థలం   :    విజయవాడ, ఆంధ్రప్రదేశ్ 
  • వృత్తి      :     గాయని, డబ్బింగ్ కళాకారిణి
  • తండ్రి     :   ఉపద్రష్ట నరసింహారావు
  • తల్లి      :    సుమతి 
  • జీవిత భాగస్వామి :   కిరణ్ (విడాకులు), రామ్‌ వీరపనేని(2020 – ప్రస్తుతం)
  • పిల్లలు    :     ఆకాష్, శ్రేయ

నేపథ్యం…

ఉపద్రష్ట సునీత గారు 10 మే 1978 నాడు ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడలో జన్మించారు. సునీత గారి నాన్న నరసింహారావు, అమ్మ సుమతి. ఆమెకు ఒక చెల్లెలు. సునీత గారు పుట్టింది విజయవాడలోనే అయినా పెరిగిందంతా గుంటూరులోనే. తన అమ్మకు సంగీతం అంటే ప్రాణం. ఆమె పెళ్ళయ్యాక అత్త నాగలక్ష్మి తో కలిసి సంగీతం నేర్చుకున్నారు. వారిద్దరూ కలిసి సంగీత కళాశాలలు ప్రారంభించారు. ఆ కళాశాలలో సంగీతం నేర్చుకునేందుకు రోజు చాలా మంది వచ్చేవారు. సునీత గారికి సంగీతంపై ఆసక్తి కలగడానికి ఒక రకంగా వాళ్ళ అమ్మ గారే కారణం. ఆ సంగీత వాతావరణం చూసి ఆమెకు సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తి కలిగింది. ఒకరకంగా చెప్పాలంటే వాళ్ళ అమ్మే ఆమెకు తొలి గురువు. తాను మూడేళ్ల వయస్సు నుంచి పోటీలో పాల్గొనడం మొదలుపెట్టారు.

తాను ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడు సంగీత పాఠాలకు “శ్రీ పెమ్మరాజు సూర్యారావు” గారి దగ్గర చేర్పించారు. ఆమె అప్పుడు నేరుగా సంగీతంలో వర్ణాలు నేర్చుకోవడం మొదలుపెట్టారు. అలాగే కర్ణాటక గాత్రంలో కలగ కృష్ణ మోహన్ గారి నుండి తేలికపాటి సంగీతంలో శిక్షణ పొందారు. కొంచెం పెద్దయ్యక స్కూల్లో టీచర్లు స్నేహితులు ఎప్పుడంటే అప్పుడు నాతోపాటు పాడించుకునే వాళ్ళు. సునీత గారు 13 సంవత్సరాల వయస్సులో, ఆమె తన గురువు పెమ్మరాజు సూర్యారావు గారితో కలిసి “త్యాగరాజ ఆరాధన” ఉత్సవాలలో కూడా పాల్గొనేవారు. అతి పిన్న వయస్సులో ఆమె ప్రతిభ కనబరిచినందుకు పలు పోటీలలో అనేక పురస్కారాలు మరియు ప్రశంసలను అందుకున్నారు.

తన పాటలతో, తన ప్రతిభతో అతి చిన్న వయస్సులోనే, ఆల్ ఇండియా రేడియో అందించే కార్యక్రమాలతో సహా అనేక కచ్చేరీలలో పాల్గొనడానికి, కచ్చేరీలు ప్రదర్శించడానికి ఆమెకు అనేక అవకాశాలు వచ్చాయి. ఆమె అప్పట్లో చిలకలూరిపేట కళానిలయంలో సంగీత పోటీలు జరిగేవి. అందులో పాల్గొనడానికి  చిన్నా, పెద్ద సంబంధం లేదు. అందులో పాల్గొన్న 50 మందిలో సునీత గారు ఒకరు. సుమారు 50 ఏళ్ల వయస్సు ఉన్న వారు, ఎంతో అనుభవం ఉన్నవారు అందులో పాల్గొన్నా కూడా అందరితో పోటీపడి మరీ రెండో బహుమతి గెలుచుకున్నారు. ఆల్ ఇండియా రేడియో వారు నిర్వహించిన జాతీయ స్థాయి ప్రసారం కోసం మ్యూజిక్ ఫీచర్స్ లోనూ ఆమెకు పాడే అవకాశం వచ్చింది. అలా పదో తరగతి పూర్తి చేశారు.

సినీ నేపథ్యం…

★ తొలిపాట “ఈ వేళలో నీవు” (గులాబి సినిమా)…

పదవతరగతి పూర్తయ్యి ఇంటర్మీడియట్ కు వచ్చేసరికి చదువు పూర్తిగా సాగలేదు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పూర్తయ్యాక వేసవి సెలవులపై హైదరాబాదులో తమ బంధువుల ఇంటికి వచ్చారు సునీత గారు. అనుకోకుండా అదే సమయంలో దూరదర్శన్ లో “పాడవే కోయిల” కార్యక్రమంలో శశిధర్ గారు సునీత గారికి ఒక పాట పాడే అవకాశం ఇచ్చారు. అప్పటినుంచి ఆమెకు సంగీతమే ప్రపంచమైంది. ఆల్బమ్ లలో, క్యాసెట్ లలో ఆమెకు పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. అనుకోకుండా ఒకరోజు సినిమా కోసం జరుగుతున్న ఆడిషన్ జరుగుతున్నాయని తెలిసి  ఉత్సాహంగా వెళ్ళారు, ఎంపికయ్యారు. కృష్ణవంశీ గారి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తొలి సినిమా “గులాబి” లో మొదటిసారిగా అవకాశమిచ్చారు. 

ఆ విధంగా సునీత గారు తన 17 యేండ్ల వయస్సులో తొలిసారిగా చలనచిత్ర రంగంలో నేపథ్య గాయనిగా తన తన ప్రస్థానాన్ని ప్రారంభించచారు. సంగీత దర్శకులు శశి ప్రీతమ్ గారు ఆమెతో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వ్రాసిన “ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు” పాటను పాడించారు. ఆ తరువాత జే.డి.చక్రవర్తి , శ్రీకాంత్ మరియు లైలా కలయికలో యస్వీ కృష్ణారెడ్డి గారు తెరకెక్కించిన “ఎగిరే పావురమా” చిత్రంలో “మాఘమాసం ఎప్పుడొస్తుందో”, “గుండె గూటికి పండుగొచ్చింది”, సహ నాలుగు పాటలు సునీత గారు పాడారు. అవన్నీ కూడా హిట్ అవ్వడంతో ఆమెకు మంచి పేరు వచ్చింది. కష్టపడితే ఎక్కడైనా నిలదుక్కుకోగలను అనే ఆత్మవిశ్వాసం ఆమెకు కలిగింది. అప్పటినుంచి ఆమె వెనుతిరిగి చూసింది లేదు.

డబ్బింగ్ కళాకారిణిగా…

నిజానికి సునీత గారు నేపథ్య గాయనిగానే తన ప్రస్థానాన్ని కొనసాగించాలి అనుకున్నారు. కానీ కొన్ని కొన్ని అనుకోకుండా జరుగుతాయి. అలాంటిదే ఆమె డబ్బింగ్ చెప్పడం కూడా. ముందుగా డబ్బింగ్ చెప్పమంటూ వచ్చిన అవకాశాల్ని ఆమె తిరస్కరించారు. ఆ తరువాత ఒక సినిమాకు డబ్బింగ్ చెప్పి చూద్దామని ముందుగా నటి రాశి నటించిన పెళ్లి పందిరి (1998) సినిమా కోసం నటి రాశికి డబ్బింగ్ చెప్పారు. ఆ తరువాత చూడాలని వుంది (1998) లో సౌందర్య గారికి కూడా అయిష్టంగానే డబ్బింగ్ చెప్పారు. అందులో ఆమె చెప్పిన “పద్మావతి” సంభాషణ తనకు మంచి పేరు రావడంతో డబ్బింగ్ అంటే సునీత గారికి ఇష్టం ఏర్పడింది.

1998లో మెగా స్టార్ చిరంజీవి మరియు సౌందర్య గార్లు నటించిన “చూడాలని ఉంది” చిత్రం విడుదలైన తర్వాత సునీత గారు పూర్తిస్థాయిలో డబ్బింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. అలా డబ్బింగ్ లోకి అడుగుపెట్టిన మొదలు ఇప్పటివరకు దాదాపు 750 పైగా చిత్రాలకు డబ్బింగ్ చెప్పారు. అలాగే సుమారు 110 మందికి పైగా నటీమణులకు తన గాత్రాన్ని అందించడంలో రికార్డు బద్దలు కొట్టడం ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా చాలా అరుదైన ఘనతను సాధించారు. ఆమె ఒకే సంవత్సరంలో సుమారు 60 సినిమాలకు గాత్రదానం చేసిన రికార్డు కూడా తన సొంతం. డబ్బింగ్ కళాకారిణిగా “గౌతమీపుత్ర శాతకర్ణి” ఆమెకు 750వ చిత్రం. ఇందులో ఆమె శ్రియ శరణ్‌ గారికి తన గాత్రాన్ని అందించారు. “చూడాలని వుంది”, “నిన్నే ప్రేమిస్తా”, “నువ్వు వస్తావని”, “శంకర్ దాదా యం.బి.బి.యస్” , “మన్మధుడు”, “శ్రీరామదాసు”, “నేనున్నాను”, “ఆనంద్”, “గోదావరి”, “జయం” వంటి చిత్రాలు ఆమె గాత్రం అందించిన చిత్రాలలో టాప్ 10 సినిమాలు ఉన్నాయి.

ఆనంద్ సినిమాకి ట్యాగ్ లైన్ సూచించిన సునీత…

అదేవిధంగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన “ఆనంద్” సినిమాకు “మంచి కాఫీలాంటి సినిమా” అనే ట్యాగ్ లైన్ కూడా సునీత గారు సూచించినదే. అప్పటికే ఆమె డబ్బింగ్ కళాకారిణిగా తీరికలేకుండా ఉన్నారు. “ఆనంద్” చిత్రీకరణ సమయానికి శేఖర్ కమ్ముల గారు ఒక రోజు సునీత గారి వద్దకు వచ్చారు. “ఆనంద్” చిత్రాన్ని ఓ సినిమాలా తీయలేదు. మా ప్రాణాలను పెట్టి తీశాం. మీరు ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పాలి. కేవలం ఇరవై వేల రూపాయలు మాత్రమే ఇచ్చుకోగలను అని చెప్పారు. ఆ మాటలకు కదిలిపోయిన సునీత గారు వెంటనే ఒప్పుకున్నారు. సినిమా ట్యాగ్ లైన్ ఎలా చెబుతారో ఏమో మీ ఇష్టం అన్నారు శేఖర్ కమ్ముల గారు. సునీత గారు ట్యాగ్ లైన్ చెప్పారు. సినిమా విడుదలైంది.  విడుదలైన నాలుగు రోజుల తర్వాత సునీత గారికి ఎస్.ఎం.ఎస్ వచ్చింది. కాఫీకి మీరు షుగర్ యాడ్ చేశారు, మీ గొంతు లేకపోతే ఆ కాఫీ చేదుగా ఉండేదని” ఆ సందేశం సారాంశం.

ఆ తరువాత “మళ్లీశ్వరి”, “రాధాగోపాలం”, “మన్మధుడు”, “శంకర్ దాదా ఎంబిబిఎస్”,  “గోదావరి” వంటి చాలా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. “శ్రీరామరాజ్యం” సినిమా చేస్తున్నప్పుడయితే ఆమె డబ్బింగ్ పూర్తిగా వాయిదా వేసేవారు. అందుకు గల కారణం దర్శకులు బాపు పాపు గారితో ఎక్కువ రోజులు కలిసి పని చేయాలన్న స్వార్థమే అందుకు కారణం అంటారు ఆమె. ఆ సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక పావు గంట ఏడ్చేసి తేరుకొని వెనక్కి తిరిగి చూస్తే బాపు గారితో సహా అందరు నిల్చుని చప్పట్లు కొట్టి ఆమెను ప్రశంసించారు. శ్రీరామదాసు సినిమాలో స్నేహకు బాబు చనిపోతాడు. ఆ సన్నివేశాని డబ్బింగ్ చెప్పడానికి ఆమె చాలా ఇబ్బంది పడ్డారు. జయం సినిమా లో వెళ్ళవయ్యా, వెళ్ళు అన్న డైలాగ్ కూడా అంతే. అలా చెప్పగలనన్నప్పుడు ఇబ్బందిగా అనిపించిందట ఆమెకు. కానీ అదే సినిమా గుర్తింపుని మరియు పురస్కారాన్ని అందించింది. ఇప్పటివరకు సునీత గారికి ఎనిమిది నంది అవార్డులు వస్తే అందులో డబ్బింగ్ కి అయిదు నందులు వచ్చాయి.

కీరవాణి గురువుగా…

సునీత గారు తన 28 ఏళ్ల సంగీత ప్రయాణంలో అనేకమంది సంగీత దర్శకులు, అనేకమంది గాయనీ గాయకులతో కలిసి పనిచేసే అవకాశం ఆమెకు లభించింది. ఇళయరాజా, కీరవాణి, సుశీలమ్మ, బాలసుబ్రమణ్యం, వేటూరి, చిత్ర ఇలా గారు ఒక్కొక్కరిది ఒక్కో శైలి, ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత. ప్రతీ ఒక్కరి వద్ద ఎంతో కొంత నేర్చుకోవడం వలన గుర్తింపు తెచ్చుకోగలిగారు. ఓసారి విజయవాడలో పాటల పోటీకి కీరవాణి జడ్జిగా వచ్చారు. అందులో బాగా పాడి మొదటి స్థానంలో వచ్చిన వారికి కీరవాణి గారి వద్ద పాడే అవకాశం లభిస్తుంది చెప్పారు. అందులో సునీత గారు “కలికి చిలకల కొలికి మాకు మేనత్త” అనే పాట పాడారు. ఆమె మొదటి స్థానంలో ఏమి రాలేదు. అయినా కూడా ఈ పోటీ జరిగిన కొన్నాళ్లకు కీరవాణి గారి నుండి పిలుపు వచ్చింది. వారు “సీతారాముల కళ్యాణం చూతము రారండి” సినిమాలో పాడే అవకాశం ఇచ్చారు. తరువాత రోజులలో కీరవాణి గారి వద్ద పాడిన పాటలలో గుండుసూది గుండుసూది (చత్రపతి), జుం జుం మాయ జుం జుం మాయ (విక్రమార్కుడు) లాంటి ఎన్నో విజయవంతమైన పాటలు కూడా ఉన్నాయి. పదాల మధ్య అంతరం, మాటల విరుపు, మాడ్యులేషన్ వంటివి తన గురువుగా భావించే కీరవాణి గారి వద్దనే నేర్చుకున్నారు.

సుశీలమ్మకు ఏకలవ్య శిష్యురాలు…

వేటూరి సుందర రామూర్తి గారిని కలవడానికి సునీత గారు వెళ్ళారు. ఆ సమయంలో నవ్వుతూ పలకరించిన వేటూరి గారు నీవు అందంగా ఉంటావని నీకు తెలుసా అని సునీత గారిని అడిగారు. దానికి సమాధానంగా ఆవిడ చిరునవ్వు నవ్వుతూ తలవూపారు.  అప్పుడు వేటూరి గారు నీకు సంబంధించిన పాట కాదు గాని నీవు ఈ పాట పాడితే నీకు మంచి పేరు వస్తుందని పాటకు సంబంధించిన పేపర్లు చేతికి ఇచ్చారు. “అందంగా లేనా అసలేం బాలేనా” అనే పాట అది. గోదావరి సినిమాలోని ఆ పాటను ఎంతో శ్రద్ధగా ఆలపించారు. ఆ పాటకు సునీత గారికి విపరీతమైన పేరు వచ్చింది. “ఈ వేళలో నీవు ఏంచేస్తూ ఉంటావూ” పాటను చిత్రా గారు తమిళంలో పాడారు. తెలుగులో పాడినట్లుగా ఆమె తమిళంలో పాడలేకపోయానని సునీత గారి భుజం తట్టి చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయానని సునీత గారు పలు సందర్భాలలో చెప్పారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే చిత్ర గారి తీరును అభినందించకుండా ఉండలేము అంటారు సునీత గారు. సుశీలమ్మ గారికి సునీత గారు ఏకలవ్య శిష్యురాలు. ఆవిడం గారంటే సునీత గారికి అంటే చెప్పలేనంత ఇష్టం.

ఇళయరాజా సమక్షంలో “పుణ్యవతి” తమిళ సినిమాలో…

“పుణ్యవతి” తమిళ సినిమాలో ఉనక్కోరుతి అనే పాటను ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా గారి సంగీత సారథ్యంలో సునీత గారు పాడారు. ఆ పాట ఇళయరాజా గారి  సంగీతంలో పాడడం ఆమె తన అదృష్టంగా భావిస్తారు. ఎందుకంటే ప్రతీ గాయనీ, గాయకుడు కనీసం ఒక్క పాటైనా ఇళయరాజా గారి దగ్గర పాడాలనుకుంటారు. ఆమె ఇళయరాజా , ఏఆర్ రెహమాన్, ఎంఎం కీరవాణి , విద్యాసాగర్ , ఎస్వీ కృష్ణా రెడ్డి , వందేమాతరం శ్రీనివాస్, మణిశర్మ, కోటి, రాజ్, సందీప్ చౌతా , మిక్కీ జె. మేయర్ , రమణ గోగుల , ఎస్‌ఏ రాజ్ కుమార్ , దేవిశ్రీ వంటి సంగీత దర్శకుల సమక్షంలో, వారి పర్యవేక్షణలో పనిచేశారు. చక్రి, ప్రసాద్ , ఆర్.పి.పట్నాయక్ , కళ్యాణి మాలిక్, నిహాల్, అనూప్ రూబెన్స్ , సాలూరి వాసురావు, సునీల్ కశ్యప్, మాధవపెద్ది సురేష్, . హరికృష్ణ, సాకేత సాయిరామ్, బంటి, వి జాస్సీ గిఫ్ట్, ఎస్. థమన్ మొదలైన వారి వద్ద దాదాపు 3000 పైగా పాటలు పాడారు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో సునీత గారు తెలుగు, తమిళం మరియు కన్నడ భాషలలో పాడారు. కేవలం సినిమాలకే కాకుండా రెండు మూడు వందల పైగా ఆధ్యాత్మిక పాటలు కూడా సునీత గారు పాడారు.

చల్లని పానీయాలకు దూరం..

“బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే” అనే పాటను ఎప్పుడు విన్నా కొత్తగా విన్నట్టు ఉంటుంది. సునీత, జక్కీ, సంధ్య గార్లు కలిసి పాడిన “అలనాటి రామచంద్రుడు” (మురారి) పాట పెళ్లి పాటగా నిలిచిపోయింది. “వేదం” లో ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, “శ్రీరామదాసు” లో “చాలు చాలు చాలు” అలాగే “గంగా నిజంగా” (గంగోత్రి), నేనేదో సెయ్యమాకు (సింహాద్రి), చిరుగాలి వీచేనే (శివపుత్రుడు), అవును నిజం (అతడు), వెళుతున్నా వెళుతున్నా (బాస్), గోవిందుడే కోక చుట్టి ( పాండురంగడు), ఏం సందేహం లేదు (ఊహలు గుస గుస లాడే), చివరకు మిగిలేది (మహానటి), నీలి నీలి ఆకాశం (30 రోజులలో ప్రేమించడం ఎలా), తరాలి తరళి (సీతారామం) ఇలా ఎన్నో ఎన్నెన్నో అద్భుతమైన పాటలను సునీత గారు ఆలపించారు. “పాటలు పాడేటప్పుడు ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా మనసును తెల్ల కాగితంలా ఉంచుకొని పాడటానికి వెళ్తాను. అప్పుడప్పుడు చిరాకు, కోపం, బాధ, ఆనందం అన్నీ భావోద్వేగాలు సహజం. వాటిని సాధ్యమైనంత వరకు నియంత్రించుకుంటూ ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్లే గుర్తుండిపోయే పాటలు పాడగలిగానని అనుకుంటా” అంటుంటారు సునీత గారు. తన గాత్ర మాధుర్యం పాడవ్వకుండా అనేక జాగ్రత్తలు తీసుకునే సునీత గారు చల్లని పానీయాలకు, మసాల ఆహారానికి దూరంగా వుంటారు. ఆమె శాకాహారి. ఎప్పుడూ నవ్వుతూ, హుషారుగా కనిపిస్తారు.

వైవాహిక జీవితం…

జీవితంలో ఎదురయ్యే స‌వాళ్ల‌ను ఎలా అధిగ‌మించాలో సునీత‌ను చూసి నేర్చుకోవ‌చ్చని ఆమె సన్నిహితులే కాదు ఆమెకు పరియమున్నవారు కూడా చెబుతుంటారు. తనపై వచ్చే ఎన్నో రూమర్లను చెదరని చిరునవ్వుతోనే ఎదుర్కొన్నారు. అవాకులు చవాకులు పేలినవారికి ధీటైన సమాధానం చెప్పటంలో తనకు తానే సాటి అన్నట్లుగా వ్యవహరించారు. ఈమెకు 19 సంవత్సరాల వయస్సులో మీడియాలో పనిచేస్తున్న కిరణ్ కుమార్ గోపరాజుతో వివాహం జరిగింది. కాలక్రమంలో తరువాత వారు విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి ఆకాష్, అమ్మాయి శ్రేయ. పిల్లలిద్దరూ కూడా పాటలు పాడడంలో ప్రావీణ్యం సంపాదించారు. 09 జనవరి 2021లో వ్యాపారవేత్త అయిన మ్యాంగో మీడియా గ్రూప్‌ అధినేత రామ్‌ వీరపనేని గారిని వివాహం చేసుకున్నారు.

ఆ వివాహ సమయంలో కూడా ఎన్నో ఈటెల్లాంటి మాటలు. ఎదిగిన ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఇప్పుడు రెండో పెళ్లి అవసరమా?అని ఎంతోమంది అనసరపు మాటలు. డబ్బుల కోసమే రామ్ ని పెళ్లి చేసుకుందనే నిందలు. ఆమెను అనేవాళ్లు ఆమె బాగోగులు..పిల్లల జీవితాలను చూస్తారా? వాళ్లకు కష్టమొచ్చిదంటే ఈ వాగిన నోళ్లు కనీసం సలహా చెబుతాయా? ఓదారుస్తాయా? అంటే అదేమీ ఉండదు. అయినా ఆమె పెదవులపై చిరునవ్వు చెదరలేదు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి అలా చాలా నోళ్లే వాగాయి. కానీ ఆమె ఏనాడు వారిపై నోరు పారేసుకోలేదు. చిరునవ్వుతోనే సమాధానం చెప్పారు. “డ‌బ్బు కోస‌మే రామ్ ను పెళ్లి చేసుకున్నాన‌ని అంటున్నారు. కానీ రామ్ ఎంత సంపాదిస్తున్నాడో, అత‌డికి ఎన్ని ఆస్తులున్నాయో, రామ్ వ్యాపార లావాదేవీలేంటో నాకిప్ప‌టివ‌ర‌కు తెలియ‌దు. జీవితంలో ఎన్నో ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎదుర్కొన్న త‌ర్వాత అచేత‌న స్థితిలోకి వెళ్లి వ్య‌క్తుల‌ను న‌మ్మ‌డం మానేశాను. నాకు ఎదురైన ఘటనలు అటువంటివి” అని సునీత గారు స్పందించారు.

సుదీర్ఘ ప్రస్థానానికి దోహదం చేసింది “అమ్మ” నే…

సునీత గారు ఇంతకాలం పాటల, మాటల రంగంలో కొనసాగి గుర్తింపు తెచ్చుకోవడానికి ఒక విధంగా వాళ్ళ అమ్మ గారు అందించిన సహాకారమే అంటారు. సునీత గారు ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే పిల్లల్ని చూసుకోవడానికి అమ్మను ఇంటివద్ద ఉంచి వెళతారు. ఆమె విదేశాలకు వెళ్లినా సరే పిల్లల బాధ్యతను వాళ్ళ అమ్మ గారు తీసుకుంటారు. అమ్మ ఉండబట్టే తన సినీ ప్రస్థానంలో పైకి వెళ్ళగలిగాను అంటారు సునీత గారు. అందుకే అమ్మను హోం మినిస్టర్ అని పిలుస్తారు. పాటలతో ఎంత తీరిక లేకుండా ఉన్నా, కాళీ దొరికితే పిల్లలతో గడుపుతారు సునీత గారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి విపరీతంగా కొలుస్తారు ఆమె. తొలి పాటకు 5000 రూపాయలు పారితోషికం తీసుకున్న స్థితి నుండి ఎంతో ఎత్తుకు ఎదిగారు, మంచి పేరు సంపాదించుకున్నారు.

1995 ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న రోజులలో ఏబీసీఎల్ కార్పొరేషన్ లో అవకాశంతో మొదలైన ప్రస్థానంలో “గులాబీ” సినిమాలో “ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో” పాటకు ఇచ్చిన తొలి పారితోషికం అయిదు వేల రూపాయలతో తొలిసారి గాగ్రా కొనుక్కున్న రోజులు తనకు మధుర స్మృతులుగా మిగిలిపోయాయి. సునీత గారి అమ్మ గారు ఆమెకు సంగీత ఓనమాలు నేర్పించి ఆరేళ్ల వయస్సులో సంగీత క్లాసులలో చేర్పించి శని, ఆదివారాల్లో కూడా సంగీతం క్లాసులకు తీసుకెళ్లేవారు. 

లలిత సంగీతం నేర్చుకున్నారు, లలితమైన సంగీతం, లాలి పాటలు ప్రకృతి పాటలు అంటే బాగా ఇష్టపడేవారు సునీత గారు. చిన్న పూల మొక్కను చేత్తో నిమిరుతూ లాలి పాటలు పాడుకునేవారు. ఇంట్లో వాళ్ల తాతయ్య పెంచిన 500 పైగా మొక్కలు ఉండేవి. ఏ పుట్ట దగ్గర ఉన్నా, చెట్టు కింద ఉన్నా సాధన చేసేవారు. ఇప్పటికీ ఆ పాటలు వింటే ఆ మొక్కలతో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి అంటారామె. మహమ్మద్ రఫీ, సుశీల, బాలు గారి పాటలు బాగా వినే సునీత గారు తాను చదివిన బడిలో మొదటి బహుమతి కాకుండా రెండో బహుమతి వస్తే వెక్కి వెక్కి ఏడ్చేవారు, అలిగేవారు కూడా.

Show More
Back to top button