CINEMATelugu Cinema

చిత్ర సంగీత చరిత్రలో కొండొక స్వర్ణాధ్యాయానికి నాయిక.. కుమారి కె.జమునా రాణి..

ఆమె పాట “నాగమల్లి కోనలో నక్కిన లేడి పిల్ల తుళ్ళింత”. ఆమె పాట “హైలో హైలెస్స అంటూ హంసలాగే సాగే పడవ”. ఆమె పాట “పద పదవే వయ్యారి గాలిపటమా” అంటూ గాలిలో చెక్కర్లు కొట్టే చమత్కారి. ఆమె పాట “ముక్కు మీద కోపం ఉన్న ముఖానికి అందం తీసుకొచ్చేది”. ఆమె చిత్ర సంగీత చరిత్రలో కొండొక స్వర్ణాధ్యాయానికి నాయిక. ఆమె పేరు కుమారి కె.జమునా రాణి. కె అంటే ఇంటి పేరు మొదటి అక్షరం కుమారిని సూచించడం కోసమే లెస్సగా కుదిరిందేమో అనుకోవచ్చు. తన జీవితాన్ని సంగీత సేవకే అంకితం చేసిన కె.జమునా రాణి గారు అవివాహిత గానే ఉండిపోవడం కళాసేవకే చేయబడిన అపురూపమైన త్యాగం అనడం కూడా సబబే. అందరితోనూ సరదాగా మాట్లాడే జమునా రాణి తన దృష్టిని వృత్తి ధర్మం పైనే కేంద్రీకరించి పాడే ప్రతీ పాటకు శక్త్యానుసారం పరిపూర్ణ న్యాయం చేకూర్చగలిగే సాటిలేని మేటి పాటగత్తె.

ఆ రోజుల్లో ఆంధ్ర దేశంలో వాడవాడలా, మాటిమాటికి, దశదిశలా మార్మోగిన “మామ మామా మామా, ఏమే ఏమే భామా, పట్టుకుంటె కందిపోవు పండువంటి చిన్నదుంటె చుట్టుచుట్టు తిరుగుతావు మరియాద, తాళికట్టకుండ ముట్టుకుంటె తప్పుగాదా” పాట “మామ” (కె.వి.మహదేవన్) గారి సంగీత దర్శకత్వంలో ఈమెకు దక్కిన ఘనతకు, విజయానికి చిన్న సూచన. ఆది యుగ గాయకరత్న స్వర్గీయ శ్రీ ఘంటసాల గారితో కలిసి జమునా రాణి గారు పాడిన యుగళగీతం అదని అందరికీ తెలిసిన నిజమే. ఆగీతం “మంచి మనసులు” చిత్రానికే వన్నె తెచ్చింది. తనకి అమితంగా నచ్చిన గీతం “భీష్మ” లో పాడిన “హైలో హైలెస్సా” అన్న విషయం ఆమె నొక్కి వక్కానిస్తారు. ఈ నొక్కి పలకడం ఆమె మాటలలోనూ, పాటలలోను కూడా కొట్టొచ్చినట్టు కనపడి, వినబడే వైశిష్ట్యం. సింహాల భాషలో ఈ జమునా రాణి గారు పాడిన గీతాలు శ్రీలంకలో నేటికీ జనరంజకాలై మ్రోగుతున్నాయి. విదేశ పర్యటన సందర్భాన లండన్ (బ్రిటన్), ప్యారిస్ (ప్రాన్స్), స్విజర్లాండ్, జర్మనీ, దక్షిణాఫ్రికా, అమెరికా, మలేషియా మొదలగు నగరాలలోనూ, దేశాలలోనూ జమునా రాణి గారు పలు కార్యక్రమాలు నిర్వహించారు. సింగపూర్, దుబాయ్ లలో కూడా మంచి పేరు గడించారు. ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఈమె జరిపే సంగీత కార్యక్రమాలు కోకొల్లలు.

ఎవరి వృత్తిలోనైనా గానీ, ముఖ్యంగా చిత్ర సీమలో ఒడిదుడుకులు మేడుపల్లాలు, విభిన్న విచిత్ర పరిణామాలు, సహజమైనవే. క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొని, ధైర్య స్థైర్యాలతో ముందుకు సాగే అదృష్టం అందరికీ లభించదు. అట్టి అరుదైన అదృష్టం జమునా రానణికి దక్కడం అభినందనీయం. ఓటమిని ఓడించి, ఎన్నెన్నో గెలుపులు సాధించిన వీర గాయికామణి జమున రాణి. ఆమె బహుముఖ ప్రతిభావతి. “మామ మామ” అని ఆ పాట తప్పెటతో పాటు మోగుతూ ఉంటే వినే వాళ్లకు కాళ్లు, చేతులు కుదురుగా ఉండడం కష్టం. “కంపుగొట్టు ఈ సిగరెట్టు కాల్చకోయి నా మీదొట్టు” అని ఆ గొంతు ఒట్టేయించుకుంటుంటే నవ్వకుండా ఉండటం పెదాలకు కష్టమే. తెలుగు సినిమా పాటలో ఎన్నో మైలురాళ్లు దాటి వచ్చిన జమునా రాణి, ఎన్ని ఏళ్ళు దాటిన “నా మనసే దీపావళి” అంటూ వెలుగులు చిమ్మే మాటలు, పాటలతో ప్రేక్షకులను ఆలరిస్తూ ఉంది.

జీవిత విశేషాలు…

జన్మ నామం : కె. జమునా రాణి 

జననం : 17 మే 1938 

స్వస్థలం : ఆంధ్రప్రదేశ్ 

వృత్తి : నేపథ్య గాయని 

తండ్రి : వరదరాజులు నాయుడు 

తల్లి : ద్రౌపది 

జీవిత భాగస్వామి : అవివాహితురాలు 

పురస్కారం : కళైమామణి (1998)

నేపథ్యం..

జమునా రాణి గారు 17 మే 1938 నాడు ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు. ఆమె అమ్మగారి పేరు ద్రౌపది, నాన్న గారి పేరు కె.వరదరాజుల నాయుడు. జమునా రాణి గారి తల్లి ప్రొఫెసర్ సాంబమూర్తి ఆర్కెస్ట్రాలో వీణ వాయించేవారు. అలాగే ఆల్ ఇండియా రేడియోలో కూడా పాడేవారు. జమునా రాణి గారు కూడా వాళ్ల అమ్మ గారితో బాటుగా రేడియో కేంద్రానికి వెళ్లేవారు. అందువలన రేడియో కేంద్రంలో గాయనీ, గాయకులు పాడుతుంటే శ్రద్ధగా వినేవారు. ఆవిధంగా ఎలాంటి కష్టం లేకుండానే ఆమెకు స్వరజ్ఞానం అలవడింది. ఆమె తన తల్లి వద్దే సంగీతం నేర్చుకున్నారు. అలా చిన్నతనంలోనే సంగీతం నేర్చుకున్న జమునా రాణి మొట్టమొదటిసారిగా వై.వి రావు గారు తీసిన తహసిల్దార్ (1944) చిత్రంలో “అహా ఏమందునే చినవదినా నీ నిక్కు నీ టెక్కు” అనే పాట పాడారు. అప్పటికి జమునా రాణి గారి వయస్సు కేవలం ఏడు సంవత్సరాలు మాత్రమే. కానీ ఆమె పాడిన ఆ పాటకు ఆమె పేరు సినిమా తెరపై వేయలేదు. ఆనాటి సంప్రదాయాన్ని అనుసరించి పాత్రధారిణి బేబి కమల కుమారి పేరే వేశారు. అలనాటి తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి గారికి జమునా రాణి గారి బంధువు ఒకరు తెలిసినవారు. ఆ విధంగా ఆమెకు తహసిల్దార్ సినిమాలో మొదటి అవకాశం లభించింది.

“త్యాగయ్య” లో అంపకాల పాట..

తహసీల్దార్ సినిమా పూర్తయిన కొద్ది రోజుల తరువాత చిత్తూరు వి.నాగయ్య గారు త్యాగయ్య (1946) సినిమా తీసే ప్రయత్నంలో ఉన్నారు. ఆ సమయంలో ఆ సినిమాలో చిన్న పిల్లలకు పాట పాడే గొంతు గురించి వెతుకుతున్నారు. ఈ విషయం తెలిసిన సహాయ దర్శకులు “భరణి రామకృష్ణ” గారు జమునా రాణి గురించి నాగయ్య గారికి చెప్పారు. భరణి రామకృష్ణ గారు త్యాగయ్య సినిమాకు కూడా సహాయ దర్శకులు ఆ సమయంలో పనిచేస్తున్నారు. ఆయన జమునా రాణి వాళ్ళ కుటుంబ మిత్రులు కావడం, ప్రతిరోజు ఆమె గాత్రం వింటుండడంతో భరణి రామకృష్ణ గారు ఆమెను నాగయ్య గారికి పరిచయం చేశారు.

అప్పుడు నాగయ్య గారు జమునా రాణి గారి గాత్రం విని సంతోషపడిపోయి త్యాగయ్య సినిమాలో పాడే అవకాశం ఇచ్చారు. అందులో ఆమె ఏ.పి.కోమలతో కలిసి మధురానగరిలో అనే జావలి పాడారు. ఆ తరువాత భరణి వారి తొలి చిత్రం “రత్నమాల” (1947) లో సి.ఎస్.ఆర్ ఆంజనేయులు, భానుమతి గార్లతో కలిసి “పోయిరా మాయమ్మా పోయిరా” అనే అంపకాల పాట ఆలపించారు. రక్త కన్నీరులో “సీత” నాట్యానికి “వగలాడి నిను చేరురా” అనే నాట్య గీతం పాడారు. “రత్నమాల” (1947) సినిమాలోనే ఉడుత సరోజినితో కలిసి అంపకాల పాటలో భానుమతి గారి చెలికత్తెగా నటించారు. నటన అనేది ఆమె లక్ష్యం కాదు. జీవితాంతం పాటలు పాడుతూనే ఉండాలనేది ఆమె దృక్పథం. అందువలన ఆమెకు నటన పట్ల పెద్ద ఆసక్తి ఉండేది కాదు.

విడుదల కాని “శివగంగ” పాటలు.. 

జమునా రాణి తల్లి గారి మేనమామ రామానుజులు రావు నాయుడు గారు అప్పట్లో “పచ్చయ్యప్ప కళాశాల” లో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. వారే భానుమతి, రామకృష్ణ గార్ల వివాహం దగ్గరుండి జరిపించారు. అప్పటినుంచి భానుమతి దంపతులు జమునా రాణి గారి కుటుంబంతో పరిచయం ఉంది. భానుమతి గారు ఎప్పుడూ జమునా రాణి గారిని తన కుటుంబంలో ఒక వ్యక్తిగా చూసుకునే వారే గానీ, తాను ఒక నిర్మాతగా, జమునా రాణి గారిని ఒక గాయకురాలుగా ఎప్పుడూ చూసేవారు కాదు. ఆ పరిచయంతోనే భానుమతి గారు జమునా రాణి గారిని ప్రముఖ నిర్మాత డి.ఎల్.నారాయణ గారికి పరిచయం చేశారు.

భానుమతి రామకృష్ణ గారి ప్రోత్సాహంతోనే 1947లో సి.ఎస్.ఆర్.ఆంజనేయులు గారు నిర్మించిన “శివగంగ” చిత్రంలో జమునా రాణి గారికి తొలిసారి పాడే అవకాశం లభించింది. అప్పట్లో కథనాయికల కోసం పాడేందుకు ప్రత్యేకంగా నేపథ్య గాయనిలు ఎవ్వరూ ఉండేవారు కాదు. పి.శాంతకుమారి, పుష్పవల్లి, యస్.వరలక్ష్మి, జి.వరలక్ష్మి, కృష్ణవేణి, బెజవాడ రాజరత్నం, టి.జి.కమలాదేవి మొదలగు వారంతా తామే స్వయంగా పాడుకునేవారు. కావున నేపథ్య గాయకులు చాలా అరుదుగా ఉండేవారు. “శివగంగ” సినిమాలో పాత్ర కోసం పెండ్యాల నాగేశ్వరావు గారు జమునా రాణి గారి చేత చాలా మంచి పాటలు పాడించేవారు. ప్రగతి స్టూడియోలో ఆ పాటలు రికార్డు అయ్యాయి. కానీ ఆ చిత్రం యొక్క రికార్డులు విడుదల కాలేదు.

తొలి సినిమా “ద్రోహి”..

శివగంగ సినిమా తరువాత స్వతంత్ర వారి ద్రోహి (1948) చిత్రంలో పాడే అవకాశం వచ్చింది. ఈ చిత్రానికి కూడా సంగీతం పెండ్యాల నాగేశ్వరావు గారే. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయిక “లక్ష్మీరాజ్యం” గారు తన పాత్రకు తానే పాటలు పాడుకున్నారు. కానీ ఆమె గొంతు దెబ్బతిని పాట సరిగ్గా రాకపోయేసరికి ఎవరితోనైనా తొందరగా పాడించాలని అనుకున్నారు. ఆ పాట కోసం చిత్రీకరణ కూడా చేయకుండా కూర్చున్నారు. అదే సమయంలో అందుబాటులో జమునా రాణి గారు ఉండటంతో ఆ పాట ఆమెతో పాడించారు. నిర్మాత కె.ఎస్.ప్రకాశరావు గారు ఆమెను చూసి ఇంత చిన్న పిల్ల గొంతు ఎలా పొసగుతుందని సందేహించారు. కానీ ఆమె పాడిన పాట రికార్డ్ అయ్యాక ఆమె గొంతు బాగా ఉండి కచ్చితంగా సరిపోవడంతో ఆమెతోనే పాడించారు. అలా తన మొదటి పాట సినిమాల్లోకి వెళ్ళింది. జమునా రాణి గారు అందులో మొత్తం మూడు పాటలు పాడారు. “ఆలకించండి బాబు ఆదరించండి అదృష్టం ఉన్న అమ్మలారా” అనేది జమునా రాణి గారు పాడిన మొదటి పాట. “ఎందుకీ బ్రతుకు ఆశలే ఎడారియే” అంటూ విషాదగీతంలో వచ్చేది రెండో పాట. 

“ఓహో రోజా పూలారాజా ఆహా నీదే జన్మ పూచావే” అన్న పాట మూడవది. జమునా రాణి గారు పాడిన ఈ పాటలు ఆమెకు బాగా పేరు తెచ్చాయి. ఇంత పేరు తెచ్చినా సినిమాలలో రాణిస్తానని ఆమెకు నమ్మకం ఉండేది కాదు. ఆమెను గాయనిగా చూడాలని జమునా రాణి గారి అమ్మ గారు ఉవ్విళ్లూరేవారు. ద్రోహి సినిమాలోని పాటలు ప్రజాదరణ పొందినా కూడా సామాన్య ప్రజలకు మాత్రం జమునా రాణి గారి పేరు తెలియదు. అప్పుడప్పుడే నేపథ్య గానం మొదలవుతుంది. ఆ రోజుల్లో రికార్డులపై గానీ, తెరపై గానీ నేపథ్య గాయనీ, గాయకుల పేర్లు వేయడం కానీ మరే విధంగా వారి పేర్లు ప్రచారంతేవడం గానీ ఉండేది కాదు. వినోద వారి “దేవదాసు” (1953) లోను “ఓ దేవదా చదువు ఇదేనా” చిన్నపిల్లల పాట ఉడుత సరోజతో కలిసి పాడారు. అది బ్రహ్మాండమైన ప్రజాదరణ పొందింది. “అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా”, “చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు ఉన్నదంత చీకటైతె”, పాటలు పాడినా కూడా అక్కడ కూడా జమునా రాణి గారి పేరు వేయలేదు. మరొకరు పేరు వేశారు.

తనకు ఇష్టమైన పాటలు…

జమునా రాణి గారు తెలుగులో దాదాపు అందరు కథానాయికలకు పాడారు. అయినా కూడా ఆమెకు తెలుగులో కన్నా కూడా అరవంలోనే అధికంగా అవకాశాలు, ప్రోత్సాహకాలు లభించాయి. ఆమె పాడిన ఆరు వేల పాటలలో సుమారు డెబ్భై అయిదు శాతం అరవంలో పాడినవే కావడం విశేషం. ఆమె పాడిన పాటలలో తనకు ఇష్టమైన పాటలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా “భీష్మ” చిత్రంలోని “హైలో హైలెస్స హంస కదా నాపడవా” అనే పాట అంటే ఆమెకు విపరీతమైన ఇష్టం. చక్కని స్వర మాధుర్యం ఉండి సందర్భానికి తగిన విధంగా పదాలు చక్కగా పొదిగి అమరిన పాట అది. ఇంకా మూగమనసులు సినిమాలో “ముక్కు మీద కోపం”, చివరకు మిగిలేది సినిమాలో “అందానికి అందం నేనే” పాటలు అంటే జమునా రాణి గారు చాలా చాలా ఇష్టపడతారు. తమిళంలో పాశమలార్ అనే చిత్రంలో “పాటొండ్రు” అనే పాట ఆమెకు చాలా బాగా నచ్చుతాయి అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

సంగీత దర్శకుల సారథ్యంలో..

జమునా రాణి గారు కె.వి.మహదేవన్ గారి సంగీత దర్శకత్వంలో పాడాలంటే చాలా కష్టంగాగా భావించేవారు. కానీ కె.వి.మహదేవన్ గారు ఆమెకు ఇష్టమైన సంగీత దర్శకులు. ఆయన జమునా రాణి గారిని ఎంతగానో ప్రోత్సహించారు. మహదేవన్ గారు ఆమెకు మంచి పాటలు ఇచ్చారు. ఆయన ప్రమీలర్జులయం సినిమా నుండి “జాజిరి జాజిరి జాజిరి చిలక జాజిరి హోయి వన్నెచిన్నెల”, ఉయ్యాల జంపాల సినిమా నుండి “రుక్మిణమ్మా రుక్మిణమ్మా కృష్ణమూర్తితో నువ్వు కులికావమ్మా” మొదలైన పాటలన్నీ పెండ్యాల నాగేశ్వరావు గారి సంగీతం దర్శకత్వంలో పాడినవే.

అలాగే ఘంటసాల లాంటి సంగీత దర్శకులు లభించడం చాలా అరుదు అని చెప్పే జమునా రాణి గారు “కూరిమి గొనుమా ఓ రాజశేఖర కూరిమి తీరక” అనే పాటను (దీపావళి 1960) ఘంటసాల గారు ఆమె చేతనే పాడించారు. ఇంత శాస్త్రీయత ధ్వనించే పాటను పాడడానికి ఆమె ముందుగా సంకోచించినా ఘంటసాల గారు తనపై ఉంచిన నమ్మకానికి ఆమె సరైన న్యాయం చేశారు. పాట తప్పుగా పాడితే తిట్టి తరువాత ప్రోత్సాహకరమైన సూచనలు చేసే సంగీత దర్శకులు ఎమ్మెస్ విశ్వనాథన్ గారి సంగీత దర్శకత్వంలోనూ, క్లిష్టమైన పాటలు పాడించే సుసర్ల దక్షిణామూర్తి గారి సంగీత దర్శకత్వంలోనూ అనేక పాటలు పాడారు. కృష్ణ లీలలు (1959) సినిమాలో ఆరుద్ర గారు వ్రాసిన “కొలది నోములు నోచినానేమో వెలది ఆ యశోదకన్నను కొలది నోములు” అనే చాలా బరువైన పాటను సుసర్ల దక్షిణామూర్తి గారు జమునా రాణి గారి చేత పాడించారు.

జానపద గేయాలు…

జమునా రాణి గారు ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో 1962లో బాబూ మూవిస్ పతాకం మీద సి. సుందరం నిర్మించిన విజయవంతమైన “మంచిమనసులు” చిత్రంలో ఘంటసాల గారితో కలిసి పాడిన “మామ మామా మామా, ఏమే ఏమే భామా” చిత్రం ఆమెకు గొప్ప పేరు తెచ్చి పెట్టింది. ఆ పాటతో జమునా రాణి అంటే ఏమిటో పరిశ్రమకు తెలిసింది. వాసంతికి నేపథ్య గానం అది. అదే పాట తమిళంలో “కుముదం” అనే చిత్రంలో టి.యం.సౌందర రాజన్ కలిసి పాడారు. కానీ ముందుగా తమిళంలోనే విడుదలైంది. “మంచి మనసులు” లో మామ పాట తర్వాత తెలుగులో చాలా అవకాశాలు లభించాయి. జానపద గేయాల స్పెషలిస్ట్ గా పేరు వచ్చింది. మంచి మనసులు లో “ఎంత టక్కరివాడు నారాజు ఏమూలనో నక్కినాడు”, అనురాగం సినిమాలో “పూసలోల్ల రాజమ్మా”, ముందడుగు సినిమాలో “అందాన్ని నేను ఆనందాన్ని నేను అందీ అందక నిన్ను ఆడించుతాను”, శభాష్ రాజా సినిమాలో “ఓ వన్నెల వయ్యారి”, అన్న తమ్ముడు సినిమాలో “రగులుతుంది రగులుతుంది” మొదలైన పాటలన్నీ ఆమెకు గుర్తింపు తెచ్చి పెట్టినవే. 

ఘంటసాల, పి.బి.శ్రీనివాస్ లతో కలిసి…

జమునా రాణి గారు కేవలం జానపద గీతాలు మాత్రమే కాకుండా అనేక హాస్య గీతాలను కూడా పాడారు. ఆ సమయంలో జిక్కీకి, ఏ.ఎమ్.రాజా గారితో పెళ్లి కావడంతో ఆమె కొంతకాలం పరిశ్రమకు దూరం అయ్యింది. అందువలన ఆమె శైలి పాటలు కూడా జమునా రాణి గారికే వచ్చాయి. ఒకవైపు మాధవ పెద్ది సత్యంతోనూ, మరోవైపు పిఠాపురం నాగేశ్వరావు గారితో కలిసి ఎన్నో హాస్య గీతాలు పాడారు. రాముడు భీముడు నుండి “సరదా సరదా సిగరెట్టు”, శభాష్ రాముడు నుండి “హలో డార్లింగ్ మాట్లాడవా” మొదలైన పాటలన్నీ కూడా వారితో కలిసి జమునా రాణి గారు పాడారు. అలాగే ఘంటసాల, పి.బి.శ్రీనివాస్ గారితో కలిసి కూడా ఎన్నో పాటలు పాడారు. జమునా రాణి గారు ఘంటసాల గారితో కలిసి సవతి కొడుకు నుండి “అరె పాలపొంగుల వయసేమో నీలేత చెంపల తళుకేమో”, మర్మయోగి సినిమా నుండి “నాజూకైన గాడిద”, “మధువు మనకేల సఖియరో”, కులదైవం సినిమా నుండి “పద పదవే వయ్యారి గాలిపటమా” మొదలైనవి పాడారు. అలాగే పి.బి.శ్రీనివాస్ గారితో కలిసి ఆమె పాడిన పాటలన్నీ అద్భుతమైన విజయాలే. ఆత్మబంధువు సినిమా నుండి “దక్కెనులే నాకు నీ సొగసు”, కుల గోత్రాలు సినిమా నుండి “రావే రావే బాలా, హలో మైడియర్‌ లీలా” ఇలా ఎన్నో పాటలు జమునా రాణి గారు పాడారు.

బంగారు తిమ్మరాజు లో..

తమిళ సంగీత దర్శకులలో పేరుగాంచిన జి.రామనాథన్ గారు పెణ్ కులత్తిన్ పెరుమై లో పాడించారు. ఆమెకు కోదండపాణి గారి వద్ద ఎక్కువ చనువు ఉండేది. ఆ చనువుతో “బంగారు తిమ్మరాజు” చిత్రంలోని “నాగమల్లి కోనలోనా నక్కింది లేడికూనా ఎర వేసి గురిచూసి పట్టాలి మావా” పాట రికార్డు చేసినప్పుడు “చూపుల్లో కైపుంది మామ” లాంటి వాటి ఎఫెక్ట్ అన్నీ ఆమెనే స్వయంగా ప్రణాళిక వేసుకొని కోదండపాణి గారికి పాడి వినిపించారు. కోదండపాణి గారు, చిత్ర నిర్మాత ఎస్.భావనారాయణ గార్లు ఇద్దరు కలిసి ఆమె అభిప్రాయాన్ని ఏకీభవించారు. నీ ఇష్టం వచ్చినట్టు పాడేసేయమ్మా అని అన్నారు. ఆ తరువాత ఆమె పాడిన ఆ పాటలోని జిమ్మిక్కు వల్ల పాట ఎంత విజయవంతం అయ్యిందో అందరికీ తెలుసు. మాస్టర్ వేణు, వేద, సాలూరి రాజేశ్వరరావు తదితరులు అందరి వద్ద పాటలు పాడారు జమునా రాణి గారు.

మణిరత్నం “నాయకన్” లో చివరి పాట…

1970 వ దశకంలోకి వస్తున్నా కొద్దీ పాటలు తగ్గుతూ వచ్చాయి. సంగీత దర్శకులు కె.చక్రవర్తి గారికి తల్లి కూతుళ్ళు సినిమాలో “సిగ్గులేని మావయ్య”, వరకట్నం సినిమాలో పిఠాపురంతో “గిలకల మంచం ఉంది చిలకల పందిరి పొందు”, “మల్లెపూల పందిట్లోన చందమామ వెన్నెట్లోన చల్లగాలికి” అనే రెండు యుగళ గీతాలు పాడారు. ఆ తరువాత కలెక్టర్ జానకిలో “నీవన్నది నీవనుకున్నది” పాడారు. ఆ పాట తరువాత ఆమెకు అవకాశాలు రాలేదు. దాంతో ఆమెను పిలిచే వారే లేకపోయారు. దాదాపు 20 సంవత్సరాల తరువాత హఠాత్తుగా ఓ రోజు ఇళయరాజా గారి నుంచి కబురు వచ్చింది.

మణిరత్నం గారి తమిళ సినిమా “నాయకన్” లో “నాన్ సిరిచ్చా దీపావళి” అనే పాట జమునా రాణి గారితో పాడించారు. ఆ పాట తమిళనాట మారు మ్రోగిపోయింది. ఇదే పాటను తెలుగులో “నా నువ్వే దీపావళి” అంటూ పాడారు. తెలుగులో కూడా మంచి పేరు వచ్చింది. కానీ మళ్ళీ అవకాశాలు మాత్రం రాలేదు. కానీ ఈ పాటకు వచ్చిన స్పందన వల్ల సింహాళీలు అక్కడి సినిమా రంగం ఆమెను పిలిపించి మరీ పాడించుకున్నారు. సినిమాల్లో పాడకుండా ఇలా రకరకాల వేదికలలో పాడమని అందరూ పిలవడం జమునా రాణి అనే గాయాని ఇంకా బ్రతికే ఉందని ప్రజలు గుర్తుపెట్టుకుని ఆదరించడం అనేది నా వరకు చాలా గొప్ప అని భావిస్తుంటాను అని పలు సందర్భాలలో ఆమె చెప్పేవారు.

అవివాహితులు…

జమునా రాణి గారికి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో గడపడం అలవాటు. నిజానికి ఆమెకు కుటుంబ బాధ్యతలు విపరీతంగా ఉండడంతో ఆమె వివాహం చేసుకోలేదు. తన అన్నయ్య కె.వి.స్వామి గారంటే పంచప్రాణాలుగా, ఆయన కుటుంబమే తన కుటుంబంగా భావించుకున్నారు. తన అన్నయ్య మరణించాక ఆయన కుమారుడు కె.వి శ్రీనివాసును ఆమె అల్లారు ముద్దుగా పెంచారు. కె.వి శ్రీనివాసు విదేశాలలో కంప్యూటర్ ఇంజనీర్ గా స్థిరపడ్డాడు. జమునా రాణి గారికి తీరిక దొరికినప్పుడల్లా విదేశాలలో వారి కుటుంబంతోనే కాలక్షేపం చేస్తుంటారు. ఆమెకు మిత్రులు అయిన జిక్కి, లీల లతో కూడా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఆమెకు అత్యంత సన్నిహితురాలు జిక్కీ ఒకసారి అనారోగ్యానికి గురైనప్పుడు జమునా రాణి గారు చాలా భయపడ్డారు. తాను ఒంటరినే కదా, ఆమె ఒంటరిగా పోతాననే భావనతో నిద్ర పట్టని రాత్రులు కూడా ఉన్నాయి అని చెప్పేవారు. దైవ సంకల్పం వలన మరియు తమిళనాడు ఆంధ్ర ప్రభుత్వాలు ఆమెకు ఆర్థికంగా సహకరించడంతో జిక్కీ గారి ఆరోగ్యం కుదుటపడింది. 

తమిళనాడు పురస్కారాలు…

జిక్కీ గారి అనారోగ్య పరిస్థితి తెలిసిన వెంటనే హైదరాబాదులో “కళారాధన” సంజయ్ కిషోర్ గారు ఎంతగానో స్పందించి కచేరి ఏర్పాటు చేశారు. ఆ సభకు హాజరైన జిక్కీ, జమునా రాణి గార్లకు విపరీతమైన ఆదరణ లభించింది. ఆ సభలో నాటి కథానాయిక జమున గారు, కొత్తతరం సంగీత దర్శకులు ఆర్.పి.పట్నాయక్ గారు మొదలైన వాళ్ళందరూ మాకు ఇచ్చిన గౌరవం మర్చిపోలేనిది, మరచిపోదామన్నా మరపురాకున్నది అని జమునా రాణి గారు చెప్పుకునేవారు. తమిళనాడు ప్రభుత్వం 1996 వ సంవత్సరం ఉగాది పురస్కారం, తమిళ ప్రభుత్వం ఏటా ఇచ్చే విశిష్ట పురస్కారం “కలైమామణి” అభినందన వారిచే ఘనసన్మానం, ఘంటసాల అవార్డు, వంశీ అవార్డ్స్ వారి మహానటి సావిత్రి అవార్డు ఇలా ఎన్నో పురస్కారాలు అందుకున్న జమునా రాణి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పురస్కారాల విషయంలో మొండిచెయ్యి చూపిందనే చెప్పాలి. కళాకారులకు ఎప్పుడూ తమ కళకు పరిమితి ఉండదు, అంతం అనేది అస్సలు ఉండదు అని చెప్పే జమునా రాణి గారు అవకాశం వస్తే కొనఊపిరి వరకు పాడుతూనే ఉంటాను అని చెప్పేవారు.

Show More
Back to top button