Telugu News

రాష్ట్రంలో రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌ను ఆత్మగౌరవం, సంస్కృతికి నిలయంగా అభివర్ణించారు. కర్నూలు శివారులోని నన్నూరు వద్ద జరిగిన ‘సూపర్‌ జీఎస్టీ- సూపర్‌ సేవింగ్స్‌’ బహిరంగ సభలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ సహా ఇతర ప్రముఖుల సమక్షంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రూ. 13,429 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సైన్స్‌, ఆవిష్కరణల కేంద్రంగా ఏపీని పేర్కొంటూ, రాష్ట్రంలో ఉన్న అనంత అవకాశాలు, యువత అపార శక్తిని ఆయన కొనియాడారు.

అహోబిలం నర్సింహస్వామి, మహానంది ఈశ్వరుడు, మంత్రాలయం రాఘవేంద్రస్వామిని స్మరించుకుంటూ, తన జన్మస్థలం గుజరాత్‌, సేవ చేస్తున్న కాశీతో పాటు ఈ రోజు శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆశీస్సులు పొందడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ రూపంలో ఆంధ్రప్రదేశ్‌కు శక్తిమంతమైన నాయకత్వం లభించిందని, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని భరోసా ఇచ్చారు. గత 16 నెలల్లో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఆధ్వర్యంలో ఏపీ అపూర్వ ప్రగతి సాధిస్తోందని, దిల్లీ, అమరావతి వేగంగా అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని ప్రధాని అన్నారు. 2047 నాటికి దేశాన్ని వికసిత్‌ భారత్‌గా మార్చడంలో ఈ అభివృద్ధి కీలకం అన్నారు.

ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, ఈ కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో కనెక్టివిటీ బలోపేతం అవుతుందని, పరిశ్రమలకు ఊతం లభించి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని వివరించారు. దేశం లేదా రాష్ట్ర అభివృద్ధికి ఇంధన భద్రత చాలా ముఖ్యమని, ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టుల ద్వారా దేశ ఇంధన సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా, గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌ ప్రాజెక్టుతో ఏపీ సబ్‌ సీ గేట్‌వేగా మారుతుందని, ఇది విశాఖను ఏఐ, కనెక్టివిటీ హబ్‌గా తీర్చిదిద్దుతుందని, దీని ద్వారా భారత్‌తో పాటు ప్రపంచానికి కూడా సేవలు అందుతాయని మోదీ తెలిపారు. వికసిత్‌ భారత్‌ కల సాకారం కావాలంటే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి అత్యంత అవసరమని, అదేవిధంగా ఏపీ అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి అంతే ముఖ్యమని ప్రధాని నొక్కి చెప్పారు. ఈ కొత్త ప్రాజెక్టులు రాయలసీమలోని ప్రతి జిల్లాలో ఉద్యోగాలు సృష్టించి, ప్రాంత ప్రగతికి సరికొత్త మార్గాలు తెరుస్తాయని హామీ ఇచ్చారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధనకు ఆంధ్రప్రదేశ్‌ కీలక పాత్ర పోషించనుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఓర్వకల్లు, కొప్పర్తి వంటి పారిశ్రామిక కారిడార్ల వల్ల ఉపాధి అవకాశాలు పెరిగాయని, ఈ ప్రాజెక్టుల ద్వారా పారిశ్రామిక అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని అన్నారు. ప్రపంచ దేశాలు భారత్‌ను 21వ శతాబ్దపు తయారీ కేంద్రంగా చూస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో ఏపీ సామర్థ్యాన్ని విస్మరించాయని విమర్శించిన ప్రధాని, దేశాన్ని ముందుకు నడిపించే శక్తి ఆంధ్రప్రదేశ్‌కు ఉందని స్పష్టం చేశారు. ఎన్‌డీఏ హయాంలో రాష్ట్రం యొక్క ముఖచిత్రం పూర్తిగా మారుతోందని, అభివృద్ధి, ప్రగతి దిశగా రాష్ట్రం వేగంగా పయనిస్తోందని ఆయన ముగించారు. 

Show More
Back to top button