Telugu Cinema

సున్నితమైన భావోద్వేగాలను సంకల్పంతో చెక్కబడిన చిత్రం.. శుభసంకల్పం..

అద్భుతాల ఆరంభాలు శుభసంకల్పం చాలా సాదాసీదాగా ఉంటాయని అంటుంటారు. ఏ చినుకు వరదగా మారుతుందో ఎవరికి తెలుసు. పైరగాలి సుడిగాలిలా విజృంభిస్తుందని ఎవరు ఊహించగలరు. దర్శకులు కె.విశ్వనాథ్ గారి చిత్రాలు కూడా ఇవే కోవకు చెందినవి. తెలుగు వారి సంస్కృతీ సంప్రదాయాలకు, వారు ఎంతగానో అభిమానించే సంగీత సాహిత్య నృత్యాలకు జీవంపోస్తూ ఆయన తెరకెక్కించిన ప్రతీ చిత్రం ప్రేక్షకుల హృదయవేదికపై పదికాలాల పాటు పట్టాభిషేకం జరుపుకుంటూనే వుంటుంది.

ఒక్క ముక్కలో చెప్పాలంటే కొన్ని జీవితాలను, మరికొన్ని జీవితాలకు పరిచయం చేసే ఓ కళాత్మక ప్రయోగంగా తన సినిమాలు కనిపిస్తాయి. తన సినిమాల్లో కథా బలం వుంటుంది, కమ్మని పాటలుంటాయి, మనసును కట్టిపడేసే కళాత్మక విలువలు వుంటాయి. విశ్వనాథ్ గారి సినిమాల్లో సంగీత సాహిత్యాలు సమతూకంగా కనిపిస్తాయి. సహజత్వానికి అద్దం పడుతూ నిజజీవితాలను ప్రతిబింబిస్తాయి.

హీరో, హీరోయిన్ల క్రేజ్, ఇమేజ్ లపై ఆధారపడి తాను ఏనాడూ సినిమాలు చేయలేదు. విశ్వనాథ్ గారు సామాజిక స్పృహ ఉన్న సినిమాలనే ఎక్కువగా ఎంచుకునేవారు. ఈ సామాజిక స్పృహ ఉన్న సినిమాల ప్రత్యేకత ఏమిటంటే, తాను ఎప్పుడూ ఉపన్యాసం చేయడానికి ప్రయత్నించరు. చాలా సాపేక్షంగా రూపొందించబడిన పాత్రల ప్రయాణం ద్వారా దర్శకుడు చెప్పడానికి ప్రయత్నిస్తున్న సందేశాన్ని పరిచయం చేస్తాడు.

తాను తన సినిమాలో ఆలోచనలను తీసుకురావడానికి తన సంభాషణలు, సంగీతం మరియు పాటలలో అనేక అంశాలను కూడా ఉపయోగిస్తారు. తాను చిత్రీకరించిన ఆణిముత్యాలు చాలానే వున్నాయి. సిరి సిరి మువ్వ, శంకరాభరణం, సిరివెన్నెల, స్వాతిముత్యం, స్వర్ణకమలం మొదలగున్నవి. వాటిలో “శుభసంకల్పం” ఒకటి. ధనిక, పేద తారతమ్యాలకు తావివ్వకుండా, కులం కంటే గుణం, తరం కంటే అంతరంగం గొప్పవని చాటి చెప్పిన చిత్రం ఇది.

“ఈ సంస్థ మీ వల్లే ఇంత పెద్దగా విస్తరించిపోయింది, అనుకుంటున్నారు, దానికి మీరేం అంటారు సార్” అని కథనాయకుడిని ఒక టీవీ వ్యాఖ్యత అడుగుతారు. దానికి సమాధానంగా రథం లో “దేవుడు ఊరేగుతుంటే రథం కదులుతుంది, చక్రాలు కదులుతాయి. దేవుడు నావల్లే ఊరేగుతున్నాడు అని చక్రాలు అనుకుంటే అది తెలివి తక్కువ తనమే కదా” అని చెప్పే సంభాషణ కథనాయకుడి వ్యక్తిత్వాన్ని తెలియపరుస్తుంది.

  చిత్ర విశేషాలు…

దర్శకత్వం    :    కె. విశ్వనాథ్

నిర్మాణం     :    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

కథ              :    కె. విశ్వనాథ్ 

తారాగణం   :    కమల్ హాసన్, ఆమని, ప్రియా రామన్

సంగీతం    :   ఎం.ఎం. కీరవాణి

నేపథ్య గానం    :    యస్.పి. బాలసుబ్రహ్మణ్యం , కె.యస్ చిత్ర , యస్.పి శైలజ, యస్.పి. పల్లవి & కోరస్

గీతరచన      :     వేటూరి, వెన్నెలకంటి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి..

ఛాయాగ్రహణం   :   పి.సి. శ్రీరామ్

నిర్మాణ సంస్థ   :   శ్రీ కోదండపాణి ఫిల్మ్ సర్క్యూట్

పంపిణీ   :   రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (తమిళ వెర్షన్)

విడుదల తేదీ   :     28 ఏప్రిల్ 1995

భాష        :      తెలుగు

చిత్ర కథ సంక్షిప్తంగా…

సముద్రం ఒడ్డున ఉన్న ఒక ఊర్లో ఒక ధనవంతుడు రాఘవయ్య (కె.విశ్వనాథ్) ఉండేవారు. తనకు కొడుకులు లేరు. దాంతో కొడుకు లేని రాఘవయ్య “దత్తుడి” ని దత్తత తీసుకున్నారు. ఈ దత్తుడు వ్యసనాలకి బానిస. అదే ఊర్లో ఉండే చేపలు పట్టే జాలరి కుర్రాడు దాసు (కమలహాసన్) అంటే రాయుడికి చాలా చాలా అభిమానం. చదువుకోలేదనే మాటే కానీ దాసుకు జ్ఞాపకశక్తి అమోఘం. ఓసారి విన్న ఏ అకౌంటు లెక్కని కూడా మర్చిపోడు దాసు. ఇక దాసుకు రాయుడు అంటే భయభక్తులు. రాయుడు మాట అచ్చంగా వేదవాక్కే. రాయుడు అంతరంగికుడు చెన్నకేశవ (గొల్లపూడి మారుతిరావు), వంటవాడు భీమరాజు (రాళ్లపల్లి). వీళ్ళెవరికి రాయుడుతో లేని చనువు దాసుకు ఉంది.

మణిపాల్ లో ఉండి మెడిసిన్ చదువుతున్నారు రాయుడు అమెరికా మనవరాలు సంధ్య (ప్రియా రామన్) కి తాత అంటే విపరీతమైన ఇష్టం. కేవలం తాతకి దగ్గరగా ఉండటం కోసమే అమెరికాలో స్థిరపడిన తన తల్లిదండ్రులను వదిలి ఇండియా వచ్చి మెడిసిన్ లో చేరింది. దాసుకు తనకంటూ ఉన్నది నాయనమ్మ లక్ష్మమ్మ (నిర్మలమ్మ) ఒక్కతే. దాసుకు ఒక సంబంధం చూసి పెళ్లి చేయాలన్నది లక్ష్మమ్మ గారి ఏకైక ఆశయం. అందగాడైన దాసుకు ఎన్నో సంబంధాలు వస్తూ ఉంటాయి. కానీ అతనికి ఎవ్వరూ కూడా నచ్చరు. వడ్రంగి పనిచేసుకునే గంగా మహాలక్ష్మి (ఆమని) తో ప్రేమలో పడతాడు దాసు.

ఈ ప్రేమ కథని సంధ్య ద్వారా తెలుసుకున్న రాయుడు దాసు-గంగాల పెళ్లి జరిపించడమే కాకుండా వాళ్ళని హనీమూన్ కి పంపుతాడు కూడా. తన ఖర్చులకు డబ్బులు ఇవ్వని తండ్రి, దాసు కోసం ఇంత ఖర్చు చేయడం కంటగింపు అవుతుంది. దత్తుడు తన జల్సాల కోసం కళ్యాణం (కోట శ్రీనివాసరావు) దగ్గర అప్పులు చేస్తూ ఉంటాడు. డబ్బు కోసం దత్తుడి ఆగడాలు శృతిమించడంతో తన డబ్బుని దాసు దగ్గర ఉంచి, దానితో జాలర్ల కోసం పక్కా ఇళ్ళు, ఆస్పత్రులు కట్టించడం, వాళ్లకి పడవలు కొనివ్వడం లాంటి కార్యక్రమాలు చేయాలని నిర్ణయిస్తారు రాయుడు.

ఓ పసి బిడ్డకి తల్లి అయిన గంగ తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ డబ్బును కాపాడుతుంది. మరోపక్క రాయుడు ప్రాణాలు కాపాడడం కోసం గంగ జీవించలేదని సత్యాన్ని దాస్తారు దాసు, సంధ్య. ఈ నిజం రాయుడికి తెలియడం, రాయుడి సంకల్పాన్ని దాసు నెరవేర్చడంతో కథకు ముగింపు..

తారాగణం…

దాసు…   కమల్ హాసన్

గంగ…    ఆమని

రాయుడి…   కె. విశ్వనాథ్

సంధ్య…     ప్రియా రామన్

కోట శ్రీనివాసరావు

చెన్నకేశవరావు..   మారుతీరావు

గొల్లపూడి

నిర్మలమ్మ

భీమరాజు…   రాళ్లపల్లి

సాక్షి రంగారావు

సమీర్

మల్లిఖార్జునరావు

సంజయ్ అస్రానీ

శ్రీలక్ష్మి

వైష్ణవి

కథ నడిపిన విధానం…

శుభసంకల్పం చిత్రానికి ఇక కమలహాసన్, ఆమని, విశ్వనాథ్ ప్రియారామన్ లు నలుగురు నాలుగు స్తంభాలుగా నిలిచారు. ఆమని దాసు మనసు దోచుకున్న ప్రియురాలుగా, రాయుడి ఆశయ సాధన కోసం పరితపించే ఇల్లాలుగా గంగ పాత్రను సమర్థంగా పోషించారు. ఇక ప్రియారామన్ దాసు మీద సముద్రమంత ప్రేమను గుండెలోనే దాచుకునే పరిణితి గల అమ్మాయి సంధ్య పాత్రను పోషించిన తీరు కూడా తక్కువేమీ కాదు. నిజానికి తన రెండవ సినిమాకే తనకు దొరికిన అద్భుతమైన పాత్ర ఇది.

ఈ చిత్రానికి సహ నిర్మాతగా ఉన్న కమల్ హాసన్ గారు , కె. విశ్వనాథ్‌ గారిని నటుడిగా “శుభసంకల్పం” సినిమాలో అరంగేట్రం చేసేలా ఒప్పించి విజయం సాధించారు. ముందుగా ఈ పాత్రకు చాలా మందిని అనుకున్నారు. కానీ కుదరలేదు. ఎవరిని తీసుకోవాలా అని తర్జన భర్జన పడుతున్న సమయంలో కమల్ హాసన్ పాత్రకు తాను నమస్కరించే వ్యక్తిగా నటించడానికి పేరున్న వ్యక్తి అవసరమని, అది వేరే వ్యక్తి అయితే, అతని ప్రాముఖ్యతను స్థాపించడానికి సన్నివేశాలను ఉపయోగించాల్సి ఉంటుందని గ్రహించి ఎలాగోలా కె.విశ్వనాథ్ గారిని ఒప్పించారు.

ఇక కమలహాసన్, కె.విశ్వనాథ్ గార్లు నటనలో అక్షరాలా పోటీపడ్డారు. అప్పటివరకు నటుడిగా కె.విశ్వనాథ్ గారి మీద ఎలాంటి అంచనాలు లేకపోవడం వలన సినిమా చూసినప్పుడు దాసు కన్నా రాయుడు నటనే బాగుందనిపిస్తుంది. గంగ చనిపోయిన తర్వాత వచ్చే సన్నివేశాల్లో దాసుగా కమలహాసన్ గారి నటనని మరే ఇతర నటుడు నుండి ఆశించలేము. చెన్నకేశవగా గొల్లపూడి గారు చక్కటి నటనను తెరమీద ఆవిష్కరింపజేశారు. పాత్రలు చిన్నవే అయినా నిర్మలమ్మ, రాళ్లపల్లి సాక్షి రంగారావు, వైష్ణవి గార్లకు చక్కని పాత్రలే దొరికాయి. కె.విశ్వనాథ్ గారి సినిమా అంటేనే కథను ఎంచుకోవడం దగ్గరినుండి తెరకెక్కించడం వరకు సున్నితమైన భావోద్వేగాలని తనదైన శైలిలో చిత్రీకరించగల సినీ తాపస్వి. కె.విశ్వనాథ్ గారి హాస్యం కోసం ఇరికించిన ఒకటి రెండు సన్నివేశాలు మినహాయిస్తే సినిమా ఎక్కడ కూడా విసుగురాని విధంగా సాగుతుంది.

పిసి శ్రీరామ్ ఛాయాగ్రహణం, గొల్లపూడి సంభాషణలు ఇవన్నీ కూడా చక్కగా సమకూరాయి. ఫ్లాష్ బ్యాక్ కథనంతో దాసు, గంగాల కొడుకుని తీసుకొని సంధ్య అమెరికా నుండి ఇండియా రావడంతో సినిమా మొదలవుతుంది. పతాక సన్నివేశాలలో దాసు మీద తనకున్న ప్రేమకు తాతయ్యకు తెలియపరుస్తుంది. రాయుడు ద్వారా దాసుకు తెలుస్తుంది. ఊహించని మలుపుతో సినిమా ముగుస్తుంది. సగటు ప్రేక్షకునికి అద్భుతమైన చిత్రాన్ని చూసిన అనుభూతిని కలిగిస్తుంది.

కీరవాణి సంగీతం…

శుభసంకల్పం చిత్రానికి కథ ఒక ఎత్తయితే, సంగీతం మరొక ఎత్తు అని చెప్పుకోవాలి.

ఈ చిత్రానికి నిర్మాత అయిన ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు స్వయాన సంగీత దర్శకులు కూడా అయినప్పటికీ ఈ సినిమాకి కీరవాణి చేత సంగీతం చేయించాడని ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

నిజానికి కె.విశ్వనాథ్ గారి చిత్రాలకు ఎక్కువగా కె.వి.మహాదేవన్, ఇళయరాజా గార్లను కాదని కె.విశ్వనాథ్ గారు కీరవాణి గారి వైపు మొగ్గు చూపడం ఒక రకంగా విశేషమే అని చెప్పుకోవాలి. కీరవాణి గారు మాత్రం దొరికిన అవకాశాన్ని చాలా చక్కగా వినియోగించుకున్నారు. ఇప్పటికే కీరవాణి గారు సంగీత దర్శకత్వం వహించిన అత్యుత్తమ పది సినిమాల జాబితా తీస్తే అందులో “శుభసంకల్పం” సినిమాకి తప్పక చోటు ఉంటుంది.

శుభసంకల్పం చిత్రానికి సంగీతం ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకుర్చారు.

ఈ చిత్రానికి యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర , యస్.పి.శైలజ, మరియు పల్లవి గార్లు స్వరాలు అందించారు. అన్ని పాటలు భారీ విజయాన్ని సాధించాయి.

ఇందులో ప్రత్యేకించి “సీతమ్మ అందాలు” (యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర & శైలజ ఆలపించిన) పాట, దీనిని శైలజ గారు స్పష్టంగా పాడారు.

ఈ పాటకు గానూ తాను మొదటి సారిగా నంది అవార్డును అందుకున్నారు. ఈ చిత్రానికి సాహిత్యం వేటూరి, సీతారామశాస్త్రి గార్లు వ్రాశారు.

ఈ చిత్రానికి సంగీతం అందించినందుకు గానూ కీరవాణి గారు కూడా ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్ని గెలుచుకున్నారు.

ఈ చిత్రంలో సంధ్య పాత్రకు కీరవాణి గారు చిత్ర గొంతు ని, ఆమని (దీనికి జానపద టచ్ అవసరం) కోసం శైలజ గొంతుని, అలాగే పల్లవి గొంతుని హాలీవుడ్ నేపథ్య సంగీతం అందించడానికి ఉపయోగించారు.

యస్.పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన “నరుడు బ్రతుకు నర్తన” పాట ఇళయరాజా సంగీతంలో వచ్చిన సాగర సంగమం యొక్క హిట్ ట్రాక్‌ మరియు ఆ ట్రాక్‌లో ఈ చిత్రం యొక్క 2 ట్రాక్‌లు ఉన్నాయి (చిరంజీవి సౌభాగ్యవతి-సీతమ్మ అందాలు).

వేటూరి సాహిత్యం…

శుభసంకల్పం పేరు చెప్పగానే మొట్టమొదట మనకు స్ఫురణకు వచ్చే పాట “సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు”. ఆమని, కమలహాసన్ గార్ల తొలి పరిచయాన్ని ఈ పాటతోనే ప్రారంభించి, ఈ పాటలోనే వారిద్దరి మధ్య చిగురించిన ప్రేమను చూపిస్తారు దర్శకులు. “మొవ్వాకు చీర పెడత మొగిలిరేకులు పెడత నన్నే పెళ్లాడతావా కన్నె సిలక” అంటూ తన మనసులోని మాటను హీరో చెప్పకనే చెబుతాడు. అప్పుడు “శృంగార పెళ్లికొడక బంగారు వన్నె సిలక మొవ్వాకులిస్తే రాదు మోజుపడక, అని చెబుతూనే “మనిసిచ్చి పుచ్చుకోర మావ కొడకా” అంటూ తన ప్రేమ లో ఉన్న అంతర్మథనాన్ని తెలియజేస్తుంది కథానాయిక.

అయితే సాహిత్య పరంగాను, చిత్రీకరణ పరంగాను గంగ చనిపోయిన విషయాన్ని దాసు రాయుడు దగ్గర దాచే సందర్భంలో వచ్చే “నరుడు బ్రతుకు నటన” పాటతో తానేమిటో మరో మారు నిరూపించుకున్నారు వేటూరి సుందర రామ్మూర్తి గారు. ముఖ్యంగా “ఆది విష్ణు పాదమంటి ఆకశాన ముగ్గు పెట్టి జంగమయ్య జంట కట్టి కాశిలోన కాలు పెట్టి కడలి గుడి కి కదలి పోయే గంగా” సాహిత్యం అద్భుతంగా వ్రాశారు.

“ఎవరు ఇచ్చారు అమ్మ ఇన్ని అక్షరాలు” అనే పాటలోని సాహిత్యాన్ని తీసుకుంటే “గుడి లేని దేవత నడిచి పోతా ఉంటే అడుగడుగు దండాలు పాదాలకి పసుపు పాదాలకి పసుపు వేదాలకి” అనే సాహిత్యం అనితర సాధ్యం అని చెప్పుకోవాలి. అలాగే “హరిపారాధన పుట్టావంటే గంగమ్మ” అనే పాటలో చివర్లో వచ్చే “నీలాల కన్నుల్లో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే” అనే అంటూ రచయిత కలం నుండి జాలువారిన సాహిత్యపు స్వాతిముత్యాలకు నిదర్శనం. “చినుకులన్నీ కలిసి చిత్రకావేరి” అంటూ కంట తడి పెట్టిస్తూ ప్రేక్షకుల హృదయాలను పిండేశారు వేటూరి గారు.

పాటలు…

★ సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు…

★ మూడు ముళ్ళు వేసినాక..

★ హైలెస్స హైలెస్స…

★ చిరంజీవి సౌభాగ్యవతి..

★ శ్రీశైలంలో మల్లన్న…

★ నరుడి బ్రతుక నటన..

★ చుక్కలన్ని కలిసి..

పురస్కారాలు…

★ నంది పురస్కారాలు…

ఈ చిత్రం లో అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించినందుకు గానూ నటి ఆమని గారికి ఉత్తమ నటిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు…

ఈ చిత్రం లో మంచి అభినయాన్ని చూపినందుకు గానూ నటి వైష్ణవి గారికి ఉత్తమ సహాయ నటిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు…

శుభ సంకల్పంతో నటుడిగా తొలిసారి వెండితెర మీద కనువిందు చేసిన విశ్వనాథ్ గారికి ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ గా నంది పురస్కారాన్ని గెలుచుకున్నారు..

“సీతమ్మ అందాలు” గేయాన్ని ఆలపించినందుకు గానూ ఉత్తమ నేపథ్య గాయని గా ఎస్పీ శైలజ గారు నంది పురస్కారాన్ని దక్కించుకున్నారు..

ఈ చిత్రాన్ని అద్భుతంగా కూర్చినందుకు గానూ ఉత్తమ ఎడిటర్ గా జి.జి.కృష్ణారావు గారు నంది బహుమతి పొందారు..

★ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్…

ఈ చిత్రానికి నేపథ్య గానాన్ని అందించినందుకు గానూ ఉత్తమ గాయకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ బహుమతిని దక్కించుకున్నారు..

శుభ సంకల్పం చిత్రాన్ని అద్భుతంగా మలచినందుకు గానూ ఉత్తమ దర్శకుడు గా కె. విశ్వనాథ్ గారు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ పురస్కారాన్ని పొందారు..

ఈ చిత్రానికి అద్భుతమైన స్వరాలు కూర్చినందుకు గానూ ఉత్తమ సంగీత దర్శకులు గా ఎం.ఎం.కీరవాణి గారు సౌత్ పురస్కారాన్ని అందుకున్నారు..

విశేషాలు…

★ కమల్ హాసన్, ఆమని గార్లు జంటగా నటించిన తొలి సినిమా ఇదే. అలాగే కమల్‌, ప్రియారామన్ గార్లు కలిసి తెర మీద కనిపించిన మొదటి సినిమా కూడా ఇదే…

★ కమల్, కె.విశ్వనాథ్ గార్ల కలయికలో రూపొందిన సినిమాకి తొలిసారి బాణీలు అందించారు కీరవాణి..

★ ఈ సినిమాలోని “సీతమ్మ అందాలు” పాట‌కు గాను నేపథ్య గాయని ఎస్.పి.శైలజ గారు “నంది”

పుర‌స్కారాన్ని కైవసం చేసుకున్నారు. ఆమె సినీ ప్రస్థానంలో ఇదే తొలి “నంది” కావ‌డం విశేషం..

★ క‌మ‌లహాసన్, విశ్వనాథ్ గార్ల గ‌త చిత్రాలు “సాగరసంగమం”, “స్వాతిముత్యం” లకు సంబంధించి ఉత్తమ నటుడిగా కమల్ హాసన్, ఉత్తమ దర్శకుడిగా కె.విశ్వనాథ్ గార్లు “నంది” పురస్కారాలను అందుకోగా.. “శుభసంకల్పం” చిత్రం తో ఉత్తమ నటిగా ఆమని, ఉత్తమ గుణ చిత్ర నటుడిగా కె.విశ్వనాథ్ “నంది” ని సొంతం చేసుకున్నారు..

★ కమల్, కె. విశ్వనాథ్ గార్ల కలయికలో వచ్చిన ఈ చిత్రాన్ని ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు నిర్మించడం ఇదే తొలిసారి.

Show More
Back to top button