Telugu Cinema

తెలుగు సాహిత్య యవనిక పై ఒక అమృత ధార.. రావి కొండలు రావు.

ప్రేమించి చూడులో కొండలు రావు అక్కినేని గారి తండ్రి ఒక తెలుగు మాస్టారు. తెలుగు మాస్టారు ముక్కోపి. అక్కినేని గారికి సినిమాలో పూటకు టికాన లేదు. ఎలాగో మిత్రుడు జగ్గయ్య దగ్గర అప్పు చేసి ఏదో ఒక ఉద్యోగం వెలగ పెడుతున్నట్టు మనియార్డరు పంపిస్తుంటారు. ఆ నెల పోస్ట్ మాస్టారు వస్తాడు కానీ మనియార్డరు రాదు. తెలుగు మాస్టారుకు చిర్రెత్తుకువస్తుంది. మనియార్డరు ఏదోయ్ అంటాడు. రాలేదండి అంటారు పోస్ట్ మాన్ భయంగా. రాకపోయినా తెచ్చివ్వాలి. వచ్చాక తెస్తే నీ గొప్పతనం ఏముంది బోడి అని బెదరగొడతాడు. హాల్లో అందరూ నవ్వుతారు. ఆ తెలుగు మాస్టారు పాత్రధారి “రావి కొండలు రావు” గారు. తాను అలా నవ్విస్తూ తెలుగు వారి నవ్వుల్లో ఒక భాగం అయ్యారు.

ఏ పాత్రనైనా ఒకే విధంగా పోషించే నటులు కొందరున్నారు. అయితే పాత్రల స్వభావాన్ని బట్టి సంభాషణల స్థితిని బట్టి నటనను మార్చుకోవడం రావి కొండలు రావు గారి ప్రత్యేకత. తాను నటించిన పాత్రలు చిన్నవైనా ఎంతో సహజంగా ఉండి ప్రేక్షకుల మనసును ఆకట్టుకునేలా సంభాషణలకు వ్యవహారశైలిని జోడించి చెప్పడం తన ప్రత్యేక శైలి. ఉదాహరణకు నిర్దోషి (1967) సినిమాలో కొండలు రావు గారు సంగీత ప్రియుడైన వైద్యుని (డాక్టరు) పాత్ర వేశారు. అందులో ఆయన కనిపించినప్పుడల్లా “రామచిలుకనొకటి పెంచి, ప్రేమ మీద మాటలాడె” పాడుతూ ఉంటారు. కూనిరాగం తీస్తూ డాక్టరు కొండలు రావు తీరు హాస్యాస్పదం గా విజయవంతం అయ్యింది.

కథలు, నాటికలు, నాటకాలే కాకుండా సినిమాకి సంబంధించిన కొన్ని పుస్తకాలు కూడా వ్రాశారు రావి కొండలరావు గారు. అక్కినేని గారి నట జీవితాన్ని విశ్లేషిస్తూ వ్రాసిన “మనసులోని మాట”, నటులు నాగయ్య గారి స్వీయ చరిత్ర సహా “మాయాబజార్”, “మల్లీశ్వరి”, “హ్యూమరథం”, “రావి కొండలరావు కథలు”, “వాహిని” లాంటి రచనలు చేశారు. తన ఆత్మ కథను “నాగావళి నుంచి మంజీరా వరకు” పేరిట తీసుకొచ్చారు. అలాగే “బ్లాక్ అండ్ వైట్” పేరుతో రావి కొండల రావు గారు సంకలనం వ్రాశారు. అలనాటి సినిమా విశేషాలను ఆ సంకలనంలో అందించేవారు. తెలుగు సినిమాకు చెందిన ఉత్తమ పుస్తకంగా 2004లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది పురస్కారానికి ఎంపికైంది.

ఆరు దశాబ్దాల సినీ ప్రయాణంలో నటుడిగా, రచయితగా, పాత్రికేయుడిగా ప్రతి విభాగంలో తనదైన ప్రతిభా పాటవాలతో రాణించారు రావి కొండలరావు గారు. విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పించారు  ఎన్టీఆర్, ఏఎన్నార్ మొదలుకొని నేటితరం తారల వరకు ప్రతి ఒక్కరితో చక్కటి స్నేహ సంబంధాలను కొనసాగించారు రావి కొండల రావు గారు. చిత్రసీమలో నాటి తరానికి నేటి తరానికి వారధిగా వ్యవహరించారు. సినీ రంగంలోని ఎన్నో మలుపులను అక్షరబద్ధం చేశారు. సినిమాకు సంబంధించి ఏ సాహిత్య సమావేశమైనా కొండలు రావు గారు లేకుండా జరిగేది కాదు. తాను అంతటి సాహితీ ప్రియుడు, మంచి వక్త. అందరిని సరదాగా నవ్విస్తూ ఉండేవారు. రావి కొండలరావు గారి ప్రతి రచన తెలుగు సాహిత్య యవనిక పై ఒక అమృత ధారగా సజీవంగా ఉంటుంది. తన సినిమాలు, నటన తెలుగు జాతి ఉన్నంతకాలం అమృతంగా మనల్ని అలరిస్తూనే ఉంటాయి.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    రావి కొండలరావు  

జననం    :  11 ఫిబ్రవరి 1932

స్వస్థలం   :   సామర్లకోట, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం

తండ్రి   :   రావి చిదంబరం  

వృత్తి      :    పాత్రికేయుడు, నటుడు, దర్శకుడు, రచయిత

శీర్షిక       :      కళాప్రపూర్ణ

గుర్తించదగిన సేవలు  :   నాగావళి నుండి మంజీరా వరకు

జీవిత భాగస్వామి   :  రాధాకుమారి

చదువు      :    బి.యస్సీ.ఆనర్స్ 

పిల్లలు    :    రావి వెంకట శశికుమార్

మరణ కారణం   :    గుండెపోటు

మరణం    :   28 జూలై 2020

అవార్డులు  :     ఇంటూరి మెమోరియల్ అవార్డు

ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు

తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకంగా నంది అవార్డు

జననం…

రావి కొండలరావు గారు ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా సామర్లకోటలో 11 ఫిబ్రవరి 1932 నాడు జన్మించారు. తన తండ్రి పోస్ట్ మాస్టర్ అవ్వడం వలన తనకు ఎల్లప్పుడూ బదిలీలు అవుతుండేవి. దాంతో కాకినాడ, విజయనగరం శ్రీకాకుళంతో పాటు పలు ప్రాంతాల్లో కొండలు రావు గారికి అనుబంధం ఏర్పడింది. రావి కొండల రావు గారి ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం శ్రీకాకుళంలోనే జరిగింది. చిన్నతనం నుంచి తనకు చదువు కంటే నాటకాలపై అమితాసక్తి ఉండేది. సోదరులు ఆర్కే రావు, రావిచలం గార్ల ప్రోద్భలంతో రంగస్థలం పై అడుగుపెట్టిన రావి కొండలరావు గారు అనేక నాటకాలు వేశారు. గురజాడ గారి స్ఫూర్తితో హాస్య రచనలు చేయడం ప్రారంభించారు. తొలినాళ్లలో స్వయంవరం, కుక్కపిల్ల దొరికింది, దొంగ దొరికాడు లాంటి హాస్య నాటికలు కొండలు రావు గారికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. యుక్త వయసులో తాను కొంతకాలం ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలక సభ్యుడిగా పని చేశారు.

రచయిత గా…

రావి కొండలు రావు గారు రచయితగా, పాత్రికేయుడుగా సాహిత్య పత్రిక రంగంలో తనదైన ముద్ర వేశారు. కొండలు రావు గారు నండూరి రామ్మోహన్ రావు, రమణల సహచర్యం తో ఎన్నో రచనలు చేశారు. సుకుమార్ అనే కలంతో పేరుతో 60 కి పైగా కథలు వ్రాశారు. అలాగే అలనాటి సినిమా విశేషాలను నేటి తరానికి పరిచయం చేస్తూ బ్లాక్ అండ్ వైట్ పేరుతో పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకానికి రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాన్ని కూడా అందుకున్నారు. సినీ రంగంలోని మంచి చెడులను వ్యంగ్యంగా ఆవిష్కరిస్తూ నీతిచంద్రిక “హ్యూమరసం పుస్తకాల్ని రచించారు. శ్రీకాకుళం నుండి హైదరాబాద్ వరకు తాను సాగించిన ప్రయాణాన్ని, ఈ ప్రస్థానంలో తనకు ఎదురైన అనుభవాల్ని “నాగావళి నుంచి మంజీరా వరకు” అనే పేరుతో ఆత్మకథ గా వ్రాశారు. పాత్రికేయునిగా సుదీర్ఘ అనుభవం ఉన్న తాను విజయ, చిత్ర జ్యోతి, ఆనంద వాణి, ఉదయం, రచన వంటి పత్రికల్లో పని చేశారు.

ద్విదృక్ష కథ…

రావి కొండలు రావు గారు ద్విదృక్ష అనే కథ వ్రాశారు. ఆ కథ అచ్చు అయినప్పుడు కుటుంబరావు, దాసరి సుబ్రహ్మణ్యం గార్లు కొండలు రావు గారిని చందమామ కార్యాలయం కు పిలిపించారు. ద్విదృక్ష అంటే “చూడాలనుకోవడం” అని అర్థం. ఒక మనిషి తాను చచ్చిపోతే తన వాళ్ళందరూ ఎలా బాధపడతారో చూడాలని తను పోయాడని టెలిగ్రామ్ ఇచ్చి ఇంట్లో వాళ్ళ దుఃఖాన్ని రహస్యంగా గమనిస్తూ ఉంటాడు. వాళ్ళ బాధ చూసి తట్టుకోలేక నిజం చెప్పాలనుకుంటాడు. తాను ఇంటి లోపలికి వస్తుండగా పాము కాటేసి నిజంగానే చచ్చిపోతాడు. ఈ కథ చదివి కథ ముగింపు మంచిగా ఉంది అని కుటుంబరావు గారు మెచ్చుకున్నారు. కానీ శిక్ష అంతలా ఉండకూడదు అంటారు సుబ్రహ్మణ్యం గారు. అలా వాళ్ళిద్దరు కథల గురించి చర్చించుకునేవారు. బాపు గారు “కథ” అని ఒక కథల సంకలనం వేశారు. అందులో రావి కొండలు రావు గారి “మాయమైన మనీ పర్స్” అనే కథను వేశారు. అందులో కూడా ఊహించని ముగింపు ఉంటుంది. ఈ కథ బాపు గారికి బాగా నచ్చింది. కథను పూర్తిగా రచయిత చెప్పకూడదని బాపు గారి ఉద్దేశ్యం. కొంత పాఠకుల ఊహకు కూడా వదిలేయాలి అంటారు. అప్పుడు ఆ కథ పాటకు బాగా గుర్తుంటుంది అనేది బాపు గారి అభిప్రాయం.

వైవాహిక జీవితం…

రావి కొండల రావు గారిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. తన భార్య రాధా కుమారి విజయనగరంలో నాటకాలలో నటిస్తుండేవారు. కొండలు రావు గారు శ్రీకాకుళం నుండి తన ట్రూప్ తో విజయనగరానికి నాటక పోటీలకు వెళ్లినప్పుడు రాధాకుమారి తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఆ తరువాతి కాలంలో డబ్బింగ్ అవకాశాల కోసం చేసే ప్రయత్నంలో భాగంగా రాధా కుమారి కొండలరావు గారి ఇంట్లోనే అద్దెకు దిగారు. ఈ క్రమంలో వీరిరువురి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అప్పట్లో సాధారణంగా నాటకాలలో ఆడ వేషాలు ఎక్కువగా మగవారే వేసేవారని రాధా కుమారిని పెళ్లి చేసుకుంటే ఆ కొరత తీరుతుందని భావించిన రావికొండలు రావు గారు ఆమెను తిరుపతి లో వివాహమాడారు. నిజ జీవితంలో వీరిద్దరు భార్యాభర్తలు గా ఉండడమే కాకుండా వెండితెరపై కూడా భార్య భర్తలుగా నటించడం అరుదనే చెప్పాలి. రావి కొండలు రావు, రాధ కుమారి గార్లు కలిసి 120 సినిమా లలో భార్యాభర్తలు గా నటించారు. రాధాకుమారి గారు 2012 లోనే కన్నుమూశారు.

జర్నలిజం మీద వ్యామోహం..

కొండలు రావు గారికి చదువు మీద శ్రద్ధ తగ్గిపోయింది. అప్పుడు తన మనసు జర్నలిజం మీదకి మళ్ళింది. అప్పట్లో “ఆనందవాణి” పత్రిక చాలా ప్రసిద్ధి. దానికి ప్రచురణ ఆగిపోతే ఉప్పులూరు కాళిదాసు గారు దానిని మళ్లీ మొదలుపెడుదాం అనుకున్నారు. ఆయన విశాఖపట్నం వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో కొండలు రావు గారు తన రచనలు చూపించారు. వారం రోజులకు పత్రికలో చేరమనికొండలు రావు గారికి మద్రాసు నుండి టెలిగ్రామ్ వచ్చింది. తన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కొండలు రావు గారికి అప్పటికే ముళ్ళపూడి రమణ గారితో పరిచయం ఉంది. తనను మద్రాసులో ఆదుకున్నది రమణ గారే. తనకు ఆశ్రయం కల్పించారు. రమణ గారి ప్రోద్భలంతో సినిమాలో ప్రయత్నాలు మొదలుపెట్టారు.

సినీ రంగ ప్రవేశం…

రావి కొండలరావు గారు ఓ సిని చరిత్రకారుడు. సినిమా పుట్టిన సంవత్సరం పుట్టిన రావి కొండలు రావు గారు సినీ రంగంలో తన సుదీర్ఘ ప్రస్థానం ఆరు దశాబ్దాల నట జీవితం తనది. రచయితగా తొలి అడుగులు వేసిన తర్వాత దర్శకునిగా, పాత్రికేయునిగా జీవితం కొనసాగించారు. బాల్యంలోనే టూరింగ్ టాకీస్ లో చూసిన “యోగి వేమన” సినిమా తన మస్తిష్కంలో సినిమా రంగంలోకి రావాలనే విపరీతమైన తపనను కలిగించింది. తన చదువుపై తనకున్న అశ్రద్ధనే నాటకాలపై ఆసక్తి పెంచింది. ఓసారి ఒక నాటకంలో వేసిన చిన్న పాత్రకు లభించిన ప్రోత్సాహం నటన పట్ల ఇష్టాన్ని పెంచింది.

హాస్యాన్ని అమితంగా ఇష్టపడే తాను ఆ ఇష్టంతో “దొంగ దొరికాడు” అనే నాటికను వ్రాశాడు. ఇంకా కథలు కూడా వ్రాశాడు. కళాశాలలో ప్రదర్శించేందుకు ఆడ పాత్రలు లేని నాటిక కావాలని “స్వయంవరం” పేరుతో వ్రాసిన నాటిక అప్పటి జిల్లా జడ్జి ప్రశంసలు అందుకుంది. తన హాస్య రచనలకు గురజాడ గారే స్ఫూర్తి అని రావి కొండలరావు గారు చెప్పేవారు. తాను హాస్యం వ్రాయడానికి స్ఫూర్తి గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం. ఎంతో గంభీరమైన విషయాన్ని ఎంత సరదాగా, విమర్శగా వ్రాశారు. తాను అలా వ్రాయకపోతే ఆ నాటిక అంత రక్తి కట్టేది కాదు. ఆ కథలో ఉన్న ఎలిమెంట్ సీరియస్ గా ఉన్నా, హాస్యంగా చెప్పడం అలవాటు చేసుకున్నారు గురజాడ గారు.

చదువుపై ఆసక్తి లేకపోవడంతో జర్నలిజం పై మనసు మళ్ళింది. “ఆనందవాణి” పత్రికలో ఉద్యోగం సంపాదించారు. మద్రాసు చేరుకున్నారు. కొన్నాళ్ళ తర్వాత ఆ పత్రిక నిలిచిపోయింది. అప్పటికే పరిచయం ఉన్న ముళ్లపూడి వెంకటరమణ గారు వారి ఇంట్లో కొండలు రావు గారికి కొద్దిరోజులు ఆశ్రయం కల్పించారు. ఓ రోజు రమణ గారు కొండలు రావు గారిని సినిమాలకు రచనలు చేయాల్సిందిగా, నటుడిగా ప్రయత్నించాల్సిందిగా సూచించారు. వారి మాటల ప్రభావం కావచ్చు పొన్నలూరు బ్రదర్స్ అనే సంస్థలో రచయిత డి.వి.నరసరాజు గారు అవకాశం కల్పించారు. నటుడు, రచయిత తరువాత కాలంలో దర్శకుడు అవుతాడని “కమలాకర కామేశ్వరరావు” గారు అనడంతో స్టోరీ డిపార్ట్మెంట్ వదిలేసి దర్శకత్వ శాఖలో చేరి ఎన్టీఆర్, అంజలీదేవి గార్లు నాయకా, నాయికలుగా 1958లో “శోభా” అనే సినిమాకు సహాయ దర్శకుడిగా చేశారు. ఇదే సినిమాలో డాక్టర్ గా చిన్న పాత్రను పోషించారు కొండలు రావు గారు.

కేవలం 150 రూపాయలజీతంతో సహాయ దర్శకుడిగా జీవితం దుర్భరంగా ఉండటంతో నటుడుగా మారమని బాపు, రమణ, బి.రామినీడు గార్లు ప్రోత్సహించారు. “బంగారు సంకెళ్ళు” చిత్రంలో నటుడిగా మంచి పాత్ర దక్కింది. ఆ తర్వాత “దాగుడుమూతలు” సినిమాలో గుర్తుండే పోయే పాత్ర చేశారు. ఆ చిత్రాలు నటుడిగా కొండలు రావు గారికి మంచి పేరు తెచ్చిపెట్టడంతో వెనుతిరిగి చూడలేదు. ఆరు ఏళ్ల పాటు సహాయ దర్శకులు గా పనిచేసిన తాను ఆ తర్వాత నటనపై దృష్టి సారించారు.  

ప్రేమించి చూడు, వింత కాపురం, వరకట్నం, శ్రీమంతుడు, సొమ్మొకడిది సోకొకడిది, ఊరుకిచ్చిన మాట, అందాల రాముడు, దసరా బుల్లోడు, రాధా కళ్యాణం, మంత్రి గారి వియ్యంకుడు, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, చంటబ్బాయి, మేడమ్, బృందావనం, పెళ్లి పుస్తకం తో పాటు దాదాపు 600కు పైగా సినిమాల్లో హాస్యనటుడుగా, గుణ చిత్ర నటులుగా కనిపించారు.

హాస్యస్పోరక సంభాషణలు, అయోమయ స్వభావంతో కూడిన అభినయంతో ఎన్నో పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి అలనాటి అగ్ర కథానాయకులు మొదలుకొని చిరంజీవి, నాగార్జున వంటి నేటి తరం స్టార్ హీరోలతో కలిసి నటించారు. హాస్యనటుడు గానే కాకుండా “అర్థరాత్రి” సినిమాలో విలన్ గా నటించారు. తనకు సినీ జీవితాన్ని ప్రసాదించినది బాపు రమణలేనని ఎప్పుడూ చెబుతుండేవారు కొండలు రావు గారు.

విజయచిత్ర లో..

ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు గారు లాంటి పెద్దల ప్రోత్సాహంతో “నాగిరెడ్డి – చక్రపాణి” గార్లు నడుపుతున్న “విజయచిత్ర” సినీ మాసపత్రికలో చేరారు కొండలు రావు గారు. తాను ఆ సంస్థలో కొన్ని దశాబ్దాల పాటుగా పనిచేశారు. 1966 నుంచి 1992 దాకా “విజయచిత్ర” కు సహాయ సంపాదకుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. కొండలు రావు గారు కొన్ని తరాల పిల్లలకు, పెద్దలకు కథల అమృతాన్ని పంచిన “చందమామ” పత్రిక నిర్వహణలో, కథల ఎంపికలో కీలకపాత్ర పోషించారు. అలా విజయా సంస్థకు అత్యంత అప్తుడుగా, నమ్మకస్తుడిగా ఉన్నందు వలననే చందమామ-విజయా కంబైన్స్‌ వారు నిర్మించిన బృందావనం, భైరవద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం వంటి చిత్రాల రచన, నిర్వహణ బాధ్యతలను కొండలు రావు గారికి అప్పజెప్ప వలసిందిగా నాగిరెడ్డి గారు సూచించారు. రావి కొండల రావు గారు ఆ బాధ్యతలను చాలా అద్భుతంగా నిర్వర్తించారు.

నర్తనశాల పాట కథ…

నర్తనశాల చిత్రం లోని “సలలిత రాగసుధారససారం” పాట ఎంత విజయవంతం అయ్యిందో అందరికీ తెలిసిందే. “సుసర్ల దక్షిణామూర్తి” గారు స్వరపరిచిన ఆ పాటను  మొదట్లో ఘంటసాల, జానకి గార్ల చేత పాడిద్దాం అనుకున్నారు. రికార్డింగ్ జరిగే లోపు ఆ సినిమా కు సహాయ దర్శకులు గా ఉన్న కొండలు రావు గారు వాళ్ళ సొంత ఊరు వెళ్ళవలసి వచ్చింది. తిరిగి వచ్చేసరికి దక్షిణామూర్తి గారు వేరే పాటను స్వరపరుస్తున్నారు. ఇదేమిటని కొండలు రావు గారు అడుగగా ట్యూన్ చాలా క్లాస్ గా ఉంది జనాలకు ఎక్కదు. నిర్మాత ఒప్పుకోవట్లేదు ఏం చేస్తాం అంటూ కొంత బాధగానే చెప్పారు దక్షిణామూర్తి.

దాంతో సంతృప్తి చెందని కొండలు రావు గారు దర్శకులు కామేశ్వరరావు, సముద్రాల రాఘవచార్య, నిర్మాత లక్ష్మీరాజ్యం గార్ల ను వేడుకొని ఒప్పించారు. అయితే ఘంటసాల, జానకి గార్ల కు కుదరకపోవడంతో బాలమురళీకృష్ణ, బెంగుళూరు లత లతో ఆ పాట పాడించారు. నువ్వేదో సహాయ దర్శకునివి నీకెందుకు నోరు మూసుకో అని ఎవ్వరూ అనలేదు. ఏదో పిచ్చి చేష్టలు చేసి అందరిని ఒప్పించావు. రికార్డింగ్ టైం లో  ఇదిగో నీ పాట ఏమవుతుందో నిర్మాత, కొండలు రావు గారిని సరదాగా అంటుండేవారు. ఆ పాట విజయవంతం అయిన తరువాత రామారావు గారు చాలా బాగా ఆనందించారు. పంపిణీదారులు ఆ పాటను చూసి చాలా బాగా మెచ్చుకున్నారు.

బాపు రమణలతో మైత్రి…

సినీ రంగంలో కొన్ని బంధాలు, కొందరి మధ్య అనుబంధాలు అపురూపంగా అనిపిస్తాయి. రావి కొండల రావుకు బాపు, రమణలతో అలాంటి అపురూపమైన అనుబంధమే ఉండేది. “బాల” పత్రికలో రావి కొండలరావు గారి రచనలు రెండు ప్రచురితం కావడంతో తాను ఆ పత్రిక నడిపే రేడియో అన్నయ్య, అక్కయ్య వద్దకు వెళ్లారు. నిక్కరు, చొక్కా వేసుకున్న ఓ కురాడ్రు అదే సమయానికి అక్కడికి వచ్చి తాను వేసిన కార్టూన్లు రేడియో అన్నయ్యకు ఇచ్చాడు. ఆ కుర్రాడు ఎవరో కాదు, కొంటె బొమ్మల బాపు గారు. అప్పటికే ఆయన కార్టూన్లను చూసి ఉన్న రావి కొండల రావు గారు “మీరేనా బాపు” అని అడిగితే, అవునని చెప్పారాయన.

బాపు గారి ద్వారా ముళ్లపూడి వెంకటరమణ గారితో కొండలు రావు గారికి పరిచయమైంది. అలా అల్లుకున్న బంధం కొన్ని దశాబ్దాల పాటు సాగింది. మిస్సమ్మ కథను మార్చి కొండలరావు గారు “పెళ్లి పుస్తకం” కథ రాస్తే అది నచ్చి బాపు గారు రాజేంద్ర ప్రసాద్, దివ్యవాణి లతో సినిమాగా తీశారు. ఆ సినిమాతోనే కొండలరావు, బాపు, రమణ గార్లు ముగ్గురికి నంది బహుమతులు వచ్చాయి. ఎంతో కాలంగా అనుబంధంగా ఉన్న ఆ బృందంలో తొలుత ముళ్లపూడి గారు, ఆ తర్వాత బాపు గారు, ఆ తరువాత రావి కొండల రావు గార్లు ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తూ అనంతలోకాలకు తరలిపోయారు.

పాక్షిక చిత్ర సమాహారం…

శోభ, ప్రేమించి చూడు ,

వింత కాపురం

వరకట్నం

ప్రేమకానుక

శ్రీకృష్ణ విజయం

శ్రీమంతుడు

దసరా బుల్లోడు

అందాల రాముడు

ఇల్లు – వాకిలి

ఇదెక్కడి న్యాయం

సొమ్మొకడిది సోకొకడిది

రాధా కళ్యాణం

ఊరికిచ్చిన మాట

మంత్రి గారి వియ్యంకుడు

రుద్రకాళి

చంటబ్బాయ్

సాహసం చేయరా డింభకా

చలాకీ మొగుడు చాదస్తపు పెళ్లాం

ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం

పెళ్ళి పుస్తకం

బృందావనం

మేడమ్

శ్రీ కృష్ణార్జున విజయం

నిన్నే ఇష్టపడ్డాను

మీ శ్రేయోభిలాషి

కింగ్

రచయితగా…

భైరవ ద్వీపం (సంభాషణలు)

బృందావనం  (సంభాషణలు)

పెళ్ళి పుస్తకం  (కథ)

చల్లని నీడ  (రచయిత)

నిర్మాతగా…

శ్రీకృష్ణార్జున విజయం (పర్యవేక్షక నిర్మాత)

భైరవ ద్వీపం (పర్యవేక్షక నిర్మాత)

బృందావనం (పర్యవేక్షక నిర్మాత)…

నిష్క్రమణ…

బృందావనం, భైరవద్వీపం లాంటి చిత్రాలుకు అద్భుతమైన సంభాషణలు, పెళ్లి పుస్తకం లాంటి సూపర్ హిట్ సినిమాకు కథ అందించారు. తెలుగు సినిమా పరిశ్రమ పుట్టిన సంవత్సరం 1932లో పుట్టి తెలుగు సినీ రంగానికి స్వర్ణ ఏకంగా భావించే సమయంలో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తరానికి ఈ తరానికి అనుసంధానంగా నిలిచిన కొద్దిమందిలో కొండలు రావు గారు ఒకరు. ఆరు దశబ్దాల పాటు తనదైన నటనతో అలరించిన విలక్షణ నటుడు, ప్రముఖ రచయిత, జర్నలిస్టు, కాలమిస్టు, బహుముఖ ప్రజ్ఞాశాలి రావి కొండలు రావు గారు మరలి రాని లోకాలకు తరలిపోయారు. మోతి నగర్ లో నివాసం ఉంటున్న రావికొండలరావు మంగళవారం ఉదయం అస్వస్థకు గురి కావడంతో సోమాజిగూడ లోని ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ గుండెపోటుతో  28 జులై 2020 మంగళవారం నాడు తుది శ్వాస విడిచారు. కొండలు రావు గారి భార్య రాధ కుమారి ప్రముఖ నటి. ఆమె 2012లోనే మృతి చెందారు. రావి కొండల రావు, రాధాకుమారి దంపతులకు అబ్బాయి శశి కుమార్ ఉన్నారు.

Show More
Back to top button