
భారతీయ చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడానికి బాలచందర్ ఎంతోమంది దోహదపడ్డారు. అనేక మంది దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, నటీనటులు పని చేస్తూ వివిధ రకాల సినిమాలు తీస్తూ ప్రేక్షకులను రంజింపజేస్తూ వస్తున్నారు. భారతీయ చిత్ర రంగానికి కూడా అమూల్యమైన సేవల్ని, అపురూపమైన విలువల్ని ఆపాదించి పెట్టి, అరుదైన సేవలు చేసిపెట్టిన దర్శకులు చాలా మంది ఉన్నారు. వారిలో బాలచందర్ గారు ఒకరు.
తారలతో సినిమాలు తీసిన వారు గా కాకుండా తారలను తయారు చేసిన వారు గా ముడిసరుకు లాంటి నటీ నటులను తీసుకుని, శిల్పాలుగా చెక్కిన దర్శక శిల్పి కె.బాలచందర్ గారు. తెలుగు చిత్ర రంగానికి, దక్షిణ భారతీయ చిత్ర రంగానికే కాకుండా భారతీయ చిత్ర రంగానికి నైతిక విలువలు ఆపాదించి పెట్టిన అపూర్వ దర్శకులు. ఆకాశం లో తారలు ఎన్ని ఉన్నా, చంద్రుడు ఒక్కడే. ఋతుక్రమంలో ఎన్ని ఋతువులు వచ్చినా వసంతం ఒక్కటే. అలాగే ఎంతమంది దర్శకులున్నా, ఎన్ని సినిమాలు వస్తున్నా, బాలచందర్ గారు ఒక్కరే, తాను తీసే సినిమాల శైలి ఒక్కటే.
విలక్షణత, విభిన్నత, వినూత్నత, వైవిధ్యత వీటన్నిటికి చిరునామా కె.బాలచందర్ గారే. తెలుగులో డబ్బింగ్ చిత్రాలు గానీ, నేరుగా విడుదలైన సినిమాలు గానీ విశ్లేషిస్తే అత్యధిక విజయవంతమైన చిత్రాలు తీసిన తెలుగు మాతృభాష కాని దర్శకులు కె.బాలచందర్ గారు ఒక్కరే. స్త్రీ పాత్రలు, స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ మనోభావాలు లాంటి అంశాలమీద తాను తీసిన చిత్రాలు ఆరోజుల్లోనే విప్లవాత్మకమైన సంచలనాలు. తాను సృష్టించిన స్త్రీ పాత్రలు జీవితాన్ని సవాలు చేస్తాయి. జీవితంలోని చీకటి కోణాలను ప్రశ్నిస్తాయి. సమాజాన్ని ఆత్మవిమర్శ చేసుకునేలా హెచ్చరిస్తాయి. తాను తీసిన చిత్రాల కథలలో ఉన్న విభిన్నత, ఏ ఇతర దర్శకులు తీసిన సినిమాలలో ఉండదు అనేది అతిశయోక్తి కాదు.
ఒక సినిమా కి ఇంకో సినిమా కి అస్సలు పోలిక లేకుండా, ఏ సినిమాకి ఆ సినిమా లోనే సంక్లిష్టమైన కథాంశం, సంక్లిష్టమైన మనస్తత్వం గల పాత్రలు లాంటి వాటిని అల్లుకుంటూ వ్యాపారాత్మకంగా విజయవంతం చేస్తూ, సమాజానికి ఒక సందేశాన్ని లేదా ఒక ఆత్మ విమర్శ చేసుకునే ఉద్దేశ్యం తో తాను తీసిన సినిమాలు100 పైనే ఉన్నాయి. అందులో వినోదపరమైన సినిమాలు మినహాయిస్తే ఆలోచింపజేసే సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.
గుప్పెడు గుండెను పిండేస్తాయి. మనసు చెమర్చకుండా, కళ్ళు తడికాకుండా బయటికి రాలేము. అలాంటి చిత్రాలు చాలానే ఉన్నాయి. ఇది కథ కాదు, గుప్పెడు మనసు, ఆకలి రాజ్యం, ఆడాళ్లు మీకు జోహార్లు, తొలి కోడి కూసింది, అంతులేని కథ మొదలగున్నవి. ఈ సినిమాలలో తాను పొదిగిన భావోద్వేగాలు, మనుషులు తమను తాము ఐడెంటిఫై చేసుకునే పాత్రలు, తమను తాము ఆత్మ విమర్శన చేసుకునే పాత్రలు తమను తాము ఆత్మ విమర్శన చేసుకునే సంభాషణలు, మన కళ్ళ ముందు సృష్టించిన సన్నివేశాలు బాలచందర్ గారి సినిమాల్లోని ప్రత్యేకతలు..
@ జీవిత విశేషాలు…
జన్మ నామం : కైలాసం బాలచందర్
జననం : 8 జూలై 1966 (వయసు 56)
స్వస్థలం : నన్నిలం, తంజావూరు, తమిళనాడు, భారతదేశం
తండ్రి : దండపాణి కైలాసం
తల్లి : సరస్వతి
వృత్తి : నాటక రచయిత , చిత్ర దర్శకుడు , చిత్ర నిర్మాత , కథా రచయిత , నటుడు
జీవిత భాగస్వామి : రాజం
కుమారులు : కైలాసం, ప్రసన్న
కుమార్తె : పుష్ప కందస్వామి
పురస్కారాలు : కలైమామణి, పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ANR జాతీయ అవార్డు
మరణం : 23 డిసెంబరు 2014 (వయసు 84)
బాల్యం..
కైలాసం బాలచందర్ గారు 09 జులై 1930 నాడు తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లాలోని నన్నిలం గ్రామం లో జన్మించారు.
వస్త్రాలపై వేసే రంగురంగుల పెయింటింగులకు ఈ గ్రామం ప్రసిద్ధి. వారిది సామాన్య మధ్యతరగతి కుటుంబం. నాన్న దండపాణి కైలాసం.
అమ్మ సరస్వతి. చిన్నప్పట్నుంచి బడిలో మొదటి బెంచ్ లోనే కూర్చునే వారు. చదువంటే విపరీతమైన శ్రద్ధ ఉండేది.
చదువంటే ఎంత శ్రద్ధనో, కథలు చదవడంలో నాటకాలు చదవడంలో అంతే ఆసక్తి ఉండేది.
త్యాగరాజు భాగవతార్ అనే తమిళ నటులు నటించిన సినిమాలు బాలచందర్ గారు ఎక్కువగా చూస్తూండేవారు. “అన్నామలై యూనివర్సిటీ” చిదంబరంలో బి.ఎస్సి లైఫ్ సైన్సెస్ చదివారు.
@ ఉద్యోగం…
బాలచందర్ గారు హైస్కూల్లో ఉన్నప్పటి నుంచే చిన్న చిన్న నాటకాలు వ్రాయడం, చిన్న చిన్న నాటకాలు వేయించడం చేసేవారు. కళాశాలలో కూడా వాటిని కొనసాగించారు. చదువుతూనే నాటకాల మీద కూడా సమయం వెచ్చించేవారు. తాను 20 సంవత్సరాల వయస్సు లో తంజావూరు దగ్గర్లో ఉన్న ఉచ్చుపేట లో ఉపాధ్యాయులు గా ఉద్యోగం వచ్చింది. ఒక సంవత్సరం టీచర్ గా పని చేశారు. ఆ తర్వాత మద్రాస్ కు వచ్చి ఏ.జీ కార్యాలయం లో అకౌంటెంట్ గా పని చేశారు. ఆ ఉద్యోగం చేస్తూనే తనకు ఇష్టమైన నాటకాలు చూస్తుండేవారు.
అకౌంటెంట్ గా ఉంటూనే ఒక నాటకం రచించి ఏ.జీ కార్యాలయంలో ఉన్న ఉద్యోగస్తుల చేత ఆ నాటకం వేయించారు. ఆ నాటకం అద్భుతంగా వచ్చింది. ప్రశంసలు కూడా అందుకున్నారు. బాలచందర్ గారు “రాగిణి క్రియేషన్స్” అనే నాటక సంస్థను స్థాపించి నాటకాలు వేయిస్తుండేవారు. జీవన భృతి కోసం ఒక ప్రక్క ఏ.జీ కార్యాలయం లో ఉద్యోగం చేస్తూనే, మరో ప్రక్క నాటకాలు వేయిస్తుండేవారు. ఏ.వియం క్రియేషన్స్ అధినేత, ఏ.వీ.ఎం చెట్టియార్ గారు బాలచందర్ గారు వ్రాసిన “సర్వర్ సుందరం” నాటకాన్ని సినిమాగా తీయాలని అనుకున్నారు. స్క్రిప్ట్ వర్క్ వ్రాయడానికి అసిస్టెంట్ గా బాలచందర్ గారిని ఎంచుకున్నారు.
కుటుంబం…
1956లో కైలాసం బాలచందర్ గారు అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు “రాజం” అనే ఆవిడను ను వివాహం చేసుకున్నారు. వీరిరువురి దంపతులకు కైలాసం మరియు ప్రసన్న అనే ఇద్దరు కుమారులు మరియు ఒక కుమార్తె పుష్ప కందస్వామి జన్మించారు. రాజం గారు, వారి నిర్మాణ సంస్థ కవితాలయ ప్రొడక్షన్స్‌కు అధ్యక్షురాలు కాగా, దానికి కైలాసం ఒక వ్యవస్థాపకుడు.
ప్రసన్న ఒక చార్టర్డ్ అకౌంటెంట్. భారతదేశంలోని ప్రముఖ పెట్టుబడి బ్యాంకుకు మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEO. బాలచందర్ గారి పెద్ద కుమారుడు బాల కైలాసం 15 ఆగష్టు 2014న న్యుమోనియా బారిన పడి తన 54 ఏళ్ల వయసులో మరణించాడు. అతను టెలివిజన్ నిర్మాణ సంస్థ మిన్బిన్బంగల్కు అధిపతి మరియు తమిళంలో బాలచందరిన్ చిన్నతిరై, కైలావు మనసు , రైలు స్నేహం మరియు మర్మ దేశం లాంటి చిరస్మరణీయమైన ధారావాహికలను కూడా అందించాడు.
సినీ రంగ ప్రవేశం…
మెయ్యప్ప చెట్టియార్ ఎంజీఆర్ గారితో “దైవతాయ్” అనే సినిమా చేస్తూ స్క్రిప్ట్ బాలచందర్ గారితో వ్రాయించారు. ఇదే బాలచందర్ గారికి మొదట సినీరంగ ప్రవేశం. మెయ్యప్ప చెట్టియార్ బాలచందర్ గారి “సర్వర్ సుందరం” నాటకం యొక్క హక్కులను పొంది , దాని ఆధారంగా సినిమా తీశారు. అది విజయం సాధించింది. ఏకే వేలన్ అనే నిర్మాత “నీర్కు మిలి” అనే నాటకం సినిమాగా తీయాలని, బాలచందర్ గారినే దర్శకత్వం చేయమని అడిగారు. దాంతో గతంలో స్క్రీన్ రైటర్‌గా పనిచేసిన కె. బాలచందర్ గారు దర్శకత్వం వహించిన తొలి చిత్రం నీర్కుమిళి. అదే పేరుతో తన రంగస్థల నాటకం ఆధారంగా రూపొందించబడింది.

ఈ చిత్రాన్ని తిరుమలై ఫిలిమ్స్ పతాకంపై ఎ.కె.వేలన్ నిర్మించారు. సినిమాటోగ్రఫీ నిమయ్ ఘోష్, కళా దర్శకత్వం రంగన్న నిర్వహించారు. నాటకంలో భాగమైన సౌకార్ జానకి , నగేష్ , మేజర్ సుందరరాజన్ మరియు వి.గోపాలకృష్ణన్ చలనచిత్ర అనుకరణకు తిరిగి వచ్చారు. టైటిల్ మార్చమని స్నేహితులు మరియు బంధువులు తనకు సలహా ఇచ్చారని, అయితే తాను మొండిగా ఉండి టైటిల్‌ను అలాగే ఉంచానని బాలచందర్ చెప్పారు. మొట్టమొదట దర్శకత్వం వహించిన సినిమానే అద్భుతమైన విజయం సాధించింది.
“నీర్కు మిలి” చిత్రం విజయం సాధించడంతో ఏ.వీ.ఎం వారు బాలచందర్ గారికి మూడు సినిమాలు ఇచ్చి భరోసా ఇవ్వడంతో తన ఉద్యోగానికి రాజీనామా పెట్టారు. మేజర్ చంద్రకాంత్ అనే సినిమా అంతకుముందు సంవత్సరం హిందీలో ఊంచే లాగ్‌గా చిత్రీకరించబడింది . తమిళ వెర్షన్ మేజర్ చంద్రకాంత్ (1966 చిత్రం)లో జయలలిత ప్రధాన కథానాయికగా నటించారు. 1967లో అతను భామ విజయం , పూర్తి-నిడివి గల హాస్య కుటుంబ నాటక చిత్రం తీశారు. ఈ చిత్రం చాలా విజయవంతమైంది. దాంతో బాలచందర్ గారు దీనిని స్వయంగా తెలుగులోకి రీమేక్ చేసారు. రెండు వెర్షన్ల విజయం సాధించాయి.
1969లో, బాలచందర్ గారి దర్శకత్వంలో జెమినీ గణేశన్ తో “ఇరు కొడుగల్” అనే కుటుంబ కథా చిత్రాన్ని తమిళంలో రూపొందించారు. ఈ చిత్రంలో జెమినీ గణేశన్ , సౌకార్ జానకి , జయంతి , నగేష్ , విఎస్ రాఘవన్ , ఎస్ఎన్ లక్ష్మి తదితరులు నటించారు. ఇద్దరు స్త్రీలను వివాహం చేసుకున్న ఒక వ్యక్తి చుట్టూ కథ తిరుగుతుంది. ఇరు కొడుగల్ తమిళంలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. బాలచందర్ గారు ఈ చిత్రం తోనే మొదటి సారి జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఈ చిత్రాన్ని కన్నడలో “ఎరడు రేఖేగలు” గా , తెలుగులో “కలెక్టర్ జానకి” గా మరియు హిందీలో “సంజోగ్” గా రీమేక్ చేయబడింది .
కె. బాలచందర్ గారు దాదాపు 80 చిత్రాలకు రచన మరియు దర్శకత్వం వహించారు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ మరియు కన్నడ మొదలగు బహుళ భాషలలో దర్శకుడిగా 100 కంటే ఎక్కువ చిత్రాలలో పనిచేశారు. కె.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన “అందమైన అనుభవం, గుప్పెడు మనసు, ఇదికథ కాదు, ఆకలి రాజ్యం, ఆడవాళ్ళు మీకు జోహార్లు, తొలికోడి కూసింది, 47 రోజులు, కోకిలమ్మ, రుద్రవీణ, అంతులేని కథ, ఓ సీత కథ, తూర్పు పడమర, జీవిత రంగం, లోకం మారాలి, సత్తెకాలపు సత్తెయ్య” వంటి తెలుగు చిత్రాలు సైతం జనాన్ని ఆకట్టుకున్నాయి.
తమిళంలో తాను రూపొందించిన ‘అవల్ ఒరు తోడర్ కథై’ ఆధారంగా తెలుగులో ఆయన దర్శకత్వంలోనే రూపొందిన ‘అంతులేని కథ’ ఇక్కడ కూడా విశేషాదరణ చూరగొంది. ఈ చిత్రం ద్వారా కమల్ హాసన్, రజనీకాంత్ తెలుగు తెరకు పరిచయం కాగా, ఇందులో నటించిన జయప్రదకు నటిగా ఎంతో పేరు లభించింది. తెలుగు భాష రాకున్నా కూడా తెలుగు సాహిత్యం అంటే ఎంతో అభిమానం. అందువలన తెలుగులోనే ఓ స్ట్రెయిట్ మూవీ రూపొందించాలని ‘మరో చరిత్ర’ను తెరకెక్కించారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ సినిమాతో కమల్ హాసన్, సరితకు ఎంతో పేరు లభించింది. ఇదే చిత్రాన్ని హిందీలో ‘ఏక్ దూజే కే లియే’గా రూపొందించారు బాలచందర్ గారు. ఆ సినిమాతోనే కమల్ హాసన్ హిందీ సినిమా రంగంలో అడుగు పెట్టారు. అదే చిత్రంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ గాయకునిగా రెండో నేషనల్ అవార్డు లభించింది. ఈ హిందీ చిత్రాన్ని ప్రఖ్యాత దర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్ నిర్మించడం విశేషం.
అంతు లేని కథ…

ఒక స్త్రీ తమ కుటుంబ బాధ్యతలను తనపై వేసుకుని సంసారాన్ని ఓ దరికి చేర్చగలదు అన్న చిన్న లైన్‌ని తీసుకుని ఆ రోజులకు తగ్గట్టు మరికొన్ని అంశాలను జోడించి బాలచందర్ గారు తమిళం లో తెరకెక్కించిన చిత్రం “అవల్ ఓరు తొడర్ కథై”. అండాళ్ మూవీస్ బ్యానర్‌పై “రామ ఆరంగళ్” నిర్మించిన చిత్రం ఇది. సుజాత, విజయ్‌కుమార్, శ్రీప్రియా, ఫటాఫట్ జయలక్ష్మీ లు నటించగా, అతిథి పాత్రలో కమల్‌హాసన్ గారు అభినయించారు. ఇదే చిత్రాన్ని తెలుగు తీయాలనీ ఆలోచన కలిగిన సందర్భంలో కె. బాలచందర్ గారి దృష్టాంతా కొత్త ఆర్టిస్ట్లపైనే ఉంది.
ఇందులో జయప్రద, రజినీ కాంత్, కమల్ హాసన్, సరిత, నారాయణ రావు ముఖ్యపాత్రలు పోషించారు. మధ్య తరగతి ఇంటిలో పనికిమాలిన వారికోసం, చాదస్తాలతో డబ్బు తగలేసే వారికోసం ఉద్యోగం చేస్తూ ఒక దృఢమైన అమ్మాయి అనుభవించే నరక యాతనలపై సాగుతుంది ఈ చిత్రం. కుటుంబ బాధ్యతను మోసేందుకు ఓ బ్రాహ్మణ యువతి పడుపు వృత్తిని ఎంచుకుని ఆ కుటుంబాన్ని ఎలా పోషించిందనే కథాంశంతో తెరకెక్కించారు బాలచందర్ గారు. తన దర్శకత్వం, కథనం, కౌశల్యం, ఏ మాత్రం స్టార్ వాల్యూ లేని ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేశాయి.
అంతులేని కథ 1976లో రజనీకాంత్ మరియు కమల్ హాసన్ ఇద్దరూ కలిసి నటించిన తమిళ చిత్రం “అవల్ ఒరు తొడర్ కథై” యొక్క తమిళ రీమేక్. ఇది రజనీకాంత్ మరియు కమల్ హాసన్ ఇద్దరూ నటించిన మొదటి తెలుగు చిత్రం. జయప్రద ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం తన ఉత్తమ పాత్రలలో ఒకటిగా చెప్పుకునేవారు. ఆమె కెరీర్ లో ఉత్తమ నటిగా నంది అవార్డు మరియు సౌత్ ఫిల్మ్‌ఫేర్ ప్రత్యేక అవార్డును అందుకున్నారు. ఈ చిత్రం తరువాత బెంగాలీలో పునర్నిర్మించబడింది మరియు బెంగాలీ సినిమాలో కమల్ హాసన్ అరంగేట్రం చేశారు. అతను తమిళ ఒరిజినల్లో పోషించినపాత్రను, బెంగాలీ చిత్రం కబిత కోసం అదే పాత్రను తిరిగి పోషించాడు.
శ్రీప్రియ మరియు ఫటాఫట్ జయలక్ష్మి సహాయక పాత్రలు పోషించగా, పాటలను ఆత్రేయ గారు వ్రాశారు. యం.యస్.విశ్వనాథన్ గారు స్వరాలు స్వరపరిచారు. 1973 నుంచి 1975 వరకు డి.వి.యన్.రాజు, బి.ఎన్.రెడ్డి, పుల్లయ్య, కె.బాలచందర్ వంటి మహామహులు కమిటీగా ఏర్పడి సౌతిండియన్ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో స్థాపించిన ఫిల్మ్ ఇన్స్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్ కోర్స్ చేసి బయటికొచ్చిన రజనీకాంత్, జి.వి.నారాయణరావు, ప్రదీప్శక్తిలను నటీనటులగా ఎంపిక చేసుకున్నారు బాలచందర్ గారు. వీరితోపాటు తమిళ వర్షన్లో నటించిన వారిని కూడా కొందరిని ఎంపిక చేసుకుని 1975లో తెలుగు వర్షన్ చిత్రీకరణ ప్రారంభించారు. ఆ చిత్రమే “అంతులేని కథ”. 27 ఫిబ్రవరి 1976 నాడు విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది.
మరోచరిత్ర…
మరో చరిత్ర చిత్రం 1978లో విడుదలైన భారతీయ తెలుగు భాషా శృంగార విషాద చిత్రం.
ఇది కె. బాలచందర్ గారు రచించి, దర్శకత్వం వహించారు. ఇందులో కమల్ హాసన్ , సరిత ప్రధాన పాత్రలు పోషించగా, మాధవి కీలక పాత్రల్లో కనిపించింది.
ఈ చిత్రం ఒక తమిళ యువకుడు మరియు తెలుగు యువతి మధ్య జరిగే క్రాస్-కల్చరల్ రొమాన్స్. 19 మే 1978 విడుదలైన ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయవంతమై, కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోయింది.
ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడులో కూడా విడుదలై విజయం సాధించింది.
ఇది తమిళనాడు మరియు కర్ణాటకలోని థియేటర్లలో అత్యధిక కాలం నడిచిన తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది.
బెంగళూరులో రెండున్నర సంవత్సరాల పాటు నిరంతరాయంగా థియేటర్లలో ప్రదర్శింపబడింది. “యే తీగ పూవునో” అనే పాట పాపులర్ అయింది. సదరన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఈ చిత్రానికి బాలచందర్ గారు 1979లో ఉత్తమ దర్శకునిగా పురస్కారం గెలుపొందారు.
తర్వాత 1981లో, బాలచందర్ గారు ఈ చిత్రాన్ని హిందీలో ఏక్ దుయుజే కే లియే అనే పేరుతో పునర్నిర్మించగా అందులో కూడా కమల్ హాసన్ గారు మళ్లీ తన పాత్రతో ఆకట్టుకున్నారు.
అయితే కథానాయికగా సరిత స్థానంలో పంజాబీ నటి “రతీ అగ్నిహోత్రి” ని తీసుకున్నారు .
హిందీ రీమేక్ కూడా విజయవంతమైంది. ఈ రెండు చిత్రాలు 2013లో CNN-IBN యొక్క ఆల్ టైమ్ 100 భారతీయ చిత్రాలలో జాబితా చేర్చబడ్డాయి.
ఇది ఆంధ్ర ప్రదేశ్‌లో 450 రోజుల పాటు నడిచి బాక్సాఫీస్ వద్ధ విజయంగా ముగిసింది.
ఆ చిత్రం బెంగళూరులో రెండున్నర సంవత్సరాల పాటు నిరంతరాయంగా 596 రోజులు థియేటర్లలో ప్రదర్శింపబడింది.
చెన్నైలోని సఫైర్ థియేటర్, కోయంబత్తూర్‌లోని రాయల్ థియేటర్లో 450 రోజులు, బెంగళూరులో కల్పనా థియేటర్లో 693 రోజులు, అలాగే మైసూర్‌లోని కయాత్రీ థియేటర్లో 350 రోజులు నడిచింది.
ఈ చిత్రం మలయాళంలో “తిరకల్ ఎఝుతియ కవిత” గా డబ్ చేసి 1980లో విడుదచేశారు.
ఇది కథ కాదు…
ఇది కథ కాదు అనే చిత్రాన్ని కె.బాలచందర్ గారు పెద్ద హంగులు, తారాగణం లేకపోయినా, నలుపు-తెలుపు రంగులలో తీసి 1979లో విడుదల చేశారు. ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది.
వెంట్రిలాక్విజం ద్వారా ఒక వ్యక్తి భావాలు తెలియబరచడమే దర్శకుడు చేసిన గొప్ప ప్రయోగం.
చివరి ఘట్టంలో హీరోయిన్ “గొంతు నీదేనని తెలుసు. కాని భావం కూడా నీదేనని తెలుసుకోలేకపోయాను” అంటుంది. చిరంజీవి ప్రతినాయకునిగా నటించిన కొద్ది సినిమాలలో ఇది కూడా ఒకటి.
మధ్యతరగతి కుటుంబాల వారి మనస్తత్వాలను ఆవిష్కరించడంలో దిగ్గజ దర్శకులు కె.బాలచందర్ గారి శైలే వేరు.
మనింటి కథనో లేదంటే పక్కింటి కథనో వెండితెరపై వీక్షిస్తున్న అనుభూతిని కలిగించే కథనాలు, పాత్రల స్వభావాలు ఆయన సినిమాల్లో కనిపిస్తుంటాయి.
అలా ఈ దర్శకదిగ్గజం గారు రూపొందించిన అపూర్వ చిత్రాల్లో “ఇది కథ కాదు” ఒకటి.
జయసుధ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో చిరంజీవి, కమల్ హాసన్, శరత్ బాబు ముఖ్య పాత్రలు పోషించారు.
మెగాస్టార్ చిరంజీవి గారి తొలినాళ్ళలో వచ్చిన ఈ చిత్రం, నటుడిగా చిరు స్థాయిని మరింత పెంచింది. ముఖ్యంగా ప్రతినాయకుడి పాత్రలో చిరు అభినయం రమణీయం, చిరస్మరణీయం.
ఇక బాలచందర్ సినిమాలలో కథ, కథనాలు, పాత్రలే కాదు, పాటలకి కూడా సముచిత స్థానం ఉంటుంది.
ఆయన సినిమాల్లో వచ్చే పాటలన్నీ సందర్భోచితంగానూ, పాత్రలనో, పాత్రల స్వభావాలనో తెలియజేసే విధంగానూ ఉంటాయి.
“ఇది కథ కాదు” లోనూ అదే శైలి కనిపిస్తుంది. ఈ సినిమాలోని పాటలకు మనసు కవి ఆచార్య ఆత్రేయ గారు గీత రచన చేస్తే, బాలచందర్ ఆస్థాన సంగీత దర్శకుడు ఎం.ఎస్.విశ్వనాథన్ స్వరకల్పన చేసారు.
వాటిలో ముఖ్యంగా “జూనియర్ జూనియర్”, “గాలికదుపు లేదు”, “సరిగమలు గలగలలు” వంటి పాటలు పాత్రల స్వభావాలను చెబితే, “తకధిమి తక” పాట మాత్రం సినిమా కథను ప్రతిబింబించేలా ఉంటుంది.
భారత్ ఫిలిమ్స్ పతాకంపై టి.విశ్వేశ్వరరావు గారు నిర్మించిన ఈ సినిమా 27 జూన్ 1979 నాడు విడుదలై విశేషాదరణ పొందింది. ‘ఇది కథ కాదు’… జీవితం అన్నట్టుగా తెరకెక్కిన ఈ చిత్రం… నేటితో 40 వసంతాలను కూడా పూర్తి చేసుకుంటోంది.
ఆకలి రాజ్యం…
బాలచందర్ గారు దర్శకత్వం వహించగా తెలుగు మరియు తమిళ్ లో ఒకేసారి షూటింగ్ జరుపుకొని గొప్ప విజయాన్ని అందుకున్న చిత్రం ఆకలి రాజ్యం. 1981 లో వచ్చిన ఈ సినిమా నిరుద్యోగం తో ఉన్న ఎంతో మంది యువకుల జీవితాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించింది. ఇక ఈ చిత్రానికి కమల్ హాసన్ గారి అభినయం పెద్ద ఆస్థి. కమలహాసన్ మరియు శ్రీదేవి నాయక, నాయికలుగా గా నటించిన ఈ చిత్రంలో పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం అనే చెప్పాలి. ఇప్పటికీ చాల మంది పొట్ట కూటికోసం పాడుకుంటూ ఉంటారు.

ఈ సినిమాకు సంగీత అందించింది ఏం.యస్.విశ్వనాథన్ గారు. మరో చరిత్ర సినిమా తర్వాత కమల్ హాసన్, బాల చందర్ గార్ల మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఇది కథ కాదు, ఆకలి రాజ్యం, కోకిల వంటి సినిమాల్లో వరసగా కమల్ హాసన్ గారికి అవకాశం ఇచ్చారు బాలచందర్ గారు. ఇక ఆకలి రాజ్యం సినిమా హిట్ అయిన వెంటనే కమల్ హాసన్ మరియు శ్రీదేవి జంటగా కోకిల సినిమా తీస్తే అది కూడా చాల పెద్ద విజయాన్ని అందుకుంది.
ఆకలి రాజ్యం సినిమా చూసిన ప్రతిసారి తమతో ఆ సినిమాను కనెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఇక ఈ సినిమాకి వందేళ్ల భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడు తమ భవిష్యత్తు ఏంటి ? మనం ఎటు పోతున్నాం అని ఆలోచించకుండా ఉండరు. మనిషి వ్యక్తిత్వం, ఆకలి, మానవ సంబంధాలు, సమాజం వంటి అనేక విషయాలను దర్శకుడు ఈ సినిమాలో చూపించిన తీరు ఎంతో ప్రత్యేకం.
47 రోజులు…

బాలచందర్ గారి దర్శకత్వంలో చిరంజీవి, జయప్రద జంటగా నటించిన చిత్రం “47 రోజులు”. ఈ సినిమాలో చిరంజీవి ప్రతినాయక శైలి ఉన్న రోల్ లో కనిపించారు. అంతకు ముందు బాలచందర్ తెరకెక్కించిన ‘ఇది కథ కాదు’లోనూ భార్యను హింసించే భర్త పాత్రలో చిరంజీవి గారు నటించారు. అందులో జయసుధ కథానాయిక. ఇందులో జయప్రద భర్తగా ఆమెతో 47 రోజులు కాపురం చేసి, మానసికంగా శారీరకంగా ఆమెను హింసించే పాత్రలో చిరు కనిపిస్తారు. ఈ చిత్రం తమిళంలో “47 నాట్కల్” పేరుతో రూపొందింది. రెండు భాషల్లోనూ చిరంజీవి, జయప్రద గార్లు జంటగా నటించారు.
తమిళ చిత్రం “47 నాట్కల్” 17 జూలై నాడు విడుదల కాగా, తెలుగులో “47 రోజులు” 3 సెప్టెంబర్ నాడు వెలుగు చూసింది. చిరంజీవి, జయప్రద తొలిసారి “కొత్త అల్లుడు” చిత్రంలో కలసి నటించారు. అందులో చిరంజీవి విలన్ గా కనిపించారు. ఆ తరువాత వారిద్దరూ ‘చండీప్రియ’లోనూ నటించారు. ఆ సినిమాలో చిరంజీవి హీరో కాకపోయినా, అందులో జయప్రదతో టైటిల్ సాంగ్ “ఓ ప్రియా.. చండీప్రియా”.. అన్నది వీరిద్దరిపైనే చిత్రీకరించడం విశేషం. తరువాతి రోజుల్లో చిరంజీవి, జయప్రద జోడీగా ‘వేట’లో అభినయించారు. చిత్రమేమిటంటే, చిరంజీవి, జయప్రద కలసి నటించిన ఏ చిత్రంలోనూ వారి కథ సుఖాంతం కాకపోవడం.
ప్రేమాలయా పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో కుమార్ గా చిరంజీవి, విశాలిగా జయప్రద, లూసీగా ఆనే ప్యాట్రిసియా, డాక్టర్ శంకర్ గా శరత్ బాబు, పిక్ పాకెటర్ గా రమాప్రభ, విశాలి అన్నగా చక్రపాణి గార్లు నటించారు. ఈ చిత్రానికి ఎమ్.ఎస్.విశ్వనాథన్ బాణీలకు ఆచార్య ఆత్రేయ పాటలు పలికించారు. “ఓ పైడి లేడమ్మా…”, “సూత్రం కట్టాడబ్బాయి…”, “అలాంటి ఇలాంటి అమ్మాయిని కాను”… అనే పాటలు ఉన్నాయి. జయప్రద వైశాలిగా చక్కగా అభినయించారు. ఇక చిరంజీవి కుమార్ పాత్రలో జీవించారనే చెప్పాలి. అయితే ఈ సినిమా ఇద్దరికీ పెద్దగా ఒరగబెట్టిందేమీ లేదు. తనలోని నటుడిలో విలక్షణమైన నటనను ఆవిష్కరించిన కె.బాలచందర్ గారు అంటే చిరంజీవి గారి కి ఎంతో గౌరవం. అందుకే తమ అంజనాప్రొడక్షన్స్ పతాకంపై తొలి చిత్రం “రుద్రవీణ” ను బాలచందర్ దర్శకత్వంలోనే తెరకెక్కించారు చిరంజీవి గారు.
నిర్యాణం…
బాలచందర్ గారి సినిమాల తోనే కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి ,జయప్రద, జయసుధ, శ్రీదేవి వంటివారు నటులుగా మంచి పేరు సంపాదించారు. చిత్రసీమలో తమదైన బాణీ పలికించగలిగారు. ఇలా ఎందరికో సినిమాల్లో రాణించే అవకాశం కల్పించిన బాలచందర్ గారు, తమ కవితాలయా ప్రొడక్షన్స్ పతాకంపై తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ భాషలలో చిత్రాలు నిర్మించారు. మణిరత్నం గారి దర్శకత్వంలో రోజా లాంటి చిత్రాన్ని నిర్మించిన బాలచందర్ గారు, ఇతర దర్శకులతోనూ తన బ్యానర్ లో సినిమాలు నిర్మించి, అలరించారు.
చిత్రసీమలో ప్రతిష్ఠాత్మక అవార్డు దాదాసాహెబ్ ఫాల్కేను అందుకున్న బాలచందర్ గారికి నవంబర్ 2014లో న్యూరో శస్త్రచికిత్స జరిగింది.
ఆ తర్వాత తాను డిసెంబర్ 15న చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు .
తాను జ్వరంతో మరియు మూత్ర నాళాల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడని , అయితే బాగా కోలుకుంటున్నాడని నివేదికలు సూచించాయి.
కానీ యూరినరీ ఇన్ఫెక్షన్ మరియు ఇతర వయో సంబంధిత రుగ్మతల వల్ల వచ్చిన సమస్యల కారణంగా 23 డిసెంబర్ 2014న బాలచందర్ గారు మరణించారు.
మరునాడు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో తన అంత్యక్రియలు జరిగాయి.
వ్యక్తిత్వం, శైలి…
స్త్రీల పట్ల గానీ, యువత పట్ల గానీ బాలచందర్ గారికి విపరీతమైన సానుభూతి ఉందని చెప్పడానికి తన సినిమాలే నిదర్శనంగా నిలుస్తాయి.
ఆకలి రాజ్యం సినిమాలో ఆయన శ్రీశ్రీ కవిత్వాన్ని వాడుకున్న తీరు అప్పట్లో తెలుగు యువతను ఉర్రూతలూగించింది.
తమిళంలో సుబ్రహ్మణ్య భారతి కవిత్వాన్ని వాడుకుంటే, తెలుగులో విప్లవ కవి శ్రీశ్రీ కవిత్వాన్ని వాడుకున్నారు. ఆ సినిమా వచ్చిన కాలంలో తెలుగు సమాజంలోని యువత శ్రీశ్రీని నెత్తికెత్తున్నది.
యువత ఆంతరంగిక ప్రపంచాన్ని లోకానికి సమాజం ముందు బాలచందర్ పరిచారు.
తెలుగు సినిమా రంగం సాంప్రదాయిక మూసలో నడుస్తున్న కాలంలో బాలచందర్ సినిమాలు విప్లవాత్మకమైన మార్పును చూపించాయి.
బాలచందర్ వారసత్వాన్ని తెలుగులో అందుకున్నవాళ్లు కనిపించలేదు. అందుకోవడానికి ప్రయత్నించివారు కూడా ఉన్నట్లు కనిపించరు. కానీ, తన ప్రభావం మాత్రం ఉంది. 47 రోజులు సినిమాలో ఆయన ఓ స్త్రీ కథను అద్భుతంగా చిత్రీకరించారు. దేశం కాని దేశంలో మహిళలు పడుతున్న ఇబ్బందులకు ఆ చిత్రం చిత్రిక కడుతుంది. 47 రోజులు సినిమాలోనూ, ఇది కథ కాదు సినిమాలోనూ చిరంజీవి గారి చేత అద్భుతంగా నటింపజేసిన ఘనత కూడా బాలచందర్ గారికే దక్కుతుందేమో.
మనసు కవిగా పేరు పొందిన ఆత్రేయ గారితో బాలచందర్ గారు ఎక్కువగా తెలుగులో పాటలు వ్రాయించుకున్నారు. ఆ పాటలు కూడా మావన మనో లోకాలకు అద్దం పట్టేవి.
నిజానికి, ఆకలి రాజ్యంలోని “సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్” అనే పాటను అప్పట్లో చాలా మంది విప్లవ కవి శ్రీశ్రీ వ్రాశాడని అనుకున్నారు.
కానీ, ఆ విప్లవాత్మకమైన పాటను కూడా ఆత్రేయ గారే వ్రాశారు.
వ్రాసి ప్రేక్షకులను, వ్రాయక నిర్మాతలను ఇబ్బంది పెడుతారనే పేరు ఆత్రేయకు ఉండేది.
అటువంటి ఆత్రేయతో బాలచందర్ గారు చాలా పాటలు వ్రాయించుకున్నారు.
“గుప్పెడు మనసు” సినిమాలో పాట “మౌనమె నీ భాష ఓ మూగ మనసా”…, “ఒక పొరపాటుకు యుగములు పొగలేవు” అనే పాటను తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేరు.
పాటలు కూడా సినిమాల్లో పాత్రల స్వభావాలకు అనుగుణంగా, పరిస్థితులకు అద్దం పట్టే విధంగా, ప్రేక్షకులను రసోన్ముఖం చేసే విధంగా ఉంటాయి.
విలనీని మేళవించుకుని రూపుదిద్దిన పాత్రలో చిరంజీవి గారు అద్భుతంగా నటించారు.
చిరంజీవి గారు మాస్ అప్పీల్‌ను సంపాదించుకున్న తర్వాత తీసిన “రుద్రవీణ” సినిమాలోనూ ఆయన చేత ఏం కావాలో బాలచందర్ అదే రాబట్టుకున్నారు.
బాలచందర్ గారు పరిచయం చేసిన నటులు..
కమల్ హాసన్
రజినీ కాంత్
మమ్మూట్టి
చిరంజీవి (తమిళ పరిశ్రమకు)
శ్రీవిద్య
శ్రీదేవి
సరిత
వివేక్ (తమిళ హాస్య నటుడు)
ప్రకాష్ రాజ్
వై.జి.మహేంద్రన్ (తమిళ నటుడు)
సుజాత
చరణ్ (తమిళ దర్శకుడు)
రమేష్ అరవింద్
మాధవి
జయసుధ
జయప్రద
శ్రీప్రియ
గీత
చార్లి (తమిళ హాస్య నటుడు)
యువరాణి
విమలా రామన్
నాజర్…