
నేటి డిజిటల్ యుగంలో ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే గూగుల్ ఏఐని ఆశ్రయించడం ఒక అలవాటుగా మారింది. అయితే, గూగుల్ కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఏఐ ఓవర్ వ్యూ’ అందించే ఆరోగ్య సమాచారంపై తాజాగా బెర్లిన్‌కు చెందిన ‘ఎస్ఈ ర్యాంకింగ్’ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చింది. గూగుల్ ఏఐ అందించే సమాధానాలు ప్రామాణికమైన వైద్య సంస్థల నుంచో లేదా ప్రభుత్వ పోర్టల్స్ నుంచో కాకుండా, ప్రధానంగా యూట్యూబ్ వీడియోల నుంచే సేకరిస్తున్నట్లు ఈ పరిశోధనలో తేలింది.
సుమారు 50 వేల ఆరోగ్య సంబంధిత ప్రశ్నలను విశ్లేషించగా, మొత్తం 4,65,000 ఏఐ డేటా వనరులలో యూట్యూబ్ ఏకంగా 20,621 సార్లు ప్రత్యక్షమైంది. అంటే, నమ్మదగ్గ మెడికల్ వెబ్‌సైట్ల కంటే 4.43 శాతం ఎక్కువగా యూట్యూబ్ కంటెంట్‌నే గూగుల్ ఏఐ యూజర్లకు సిఫార్సు చేస్తోంది. ఇది వైద్య రంగ నిపుణులను తీవ్ర ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేస్తోంది.
యూట్యూబ్ అనేది ఎవరైనా కంటెంట్‌ను అప్‌లోడ్ చేయగల ఒక ఓపెన్ ప్లాట్‌ఫామ్. ఇందులో కేవలం నిపుణులైన డాక్టర్లే కాకుండా, ఎటువంటి మెడికల్ శిక్షణ లేని ఇన్‌ఫ్లుయెన్సర్లు, సామాన్య క్రియేటర్లు కూడా తమకు తోచిన ఆరోగ్య సలహాలు ఇస్తుంటారు. గూగుల్ ఏఐ కేవలం వ్యూస్, పాపులారిటీ ఆధారంగా ఇటువంటి వీడియోలను సమ్మరీ రూపంలో చూపించడం వల్ల తప్పుదోవ పట్టే ప్రమాదం ఉంది.
ఏ ఆస్పత్రి నెట్‌వర్క్ లేదా విద్యాసంస్థ అందించే డేటా కన్నా యూట్యూబ్ వనరులకే ఏఐ పెద్దపీట వేస్తుండటం అత్యంత ప్రమాదకరమని రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు. కేవలం డిజిటల్ తెరపై కనిపించే సమాచారాన్ని గుడ్డిగా నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, శారీరక సమస్యలు తలెత్తినప్పుడు ఏఐని కాకుండా నేరుగా డాక్టర్లను సంప్రదించడమే శ్రేయస్కరమని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. డిజిటల్ వైద్యం కేవలం అవగాహనకు మాత్రమే తప్ప, అసలైన చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలి.






