
దీపావళి అనగానే ఇంటి ముందు దీపాలు వెలిగించడం, సాయంత్రం వేళ ఇంట్లో బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకోవడం మాత్రమే కాదు. దాని వెనుక ఓ కథ ఉంది. ఒక రాక్షసుడి కారణంగా ఎంతోమంది మునులు, దేవతలు భరింపరాని క్షోభకు గురయ్యారు. ఆ సమయంలో నందగోపాలుడి రూపంలో అందరికి సాంత్వన లభించింది. నరకుడి మరణాన్ని ప్రజలు సంతోషంతో వేడుక చేసుకున్నారు. అదే అమావాస్యనాడు నరక చతుర్దశిగా మారి, ప్రతి ఏటా చీకటిని దీపాల వెలుగులతో పారదోలే ఆనవాయితీగా వచ్చింది. భారతదేశంలో ఆనాటి నుంచి ఈనాటివరకు చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా మిఠాయిలు పంచుకుంటూ పండుగను జరుపుకుంటున్నాం. మరి ఆ దీపావళి పండుగ వెనుక ప్రాశస్త్యం గురుంచి మనం ఇప్పుడు తెలుసుకుందాం:
నరకచతుర్దశి…
ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు నరకాసురుడు మరణించాక, తర్వాత రోజు ఆనందంతో చేసుకున్నా సంబరాలే దీపావళి పండుగకు కారణమైంది.
ఇకపోతే, వరహావతారంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించిన తర్వాత విష్ణుమూర్తికి, భూదేవికి నరకుడు పుడతాడు. అతడిలో అసుర లక్షణాలున్నాయని విష్ణుమూర్తి చెప్తాడు. అందుకు తన బిడ్డను రక్షించుకోవడానికి భూదేవి భర్తను వేడుకోగా, తల్లి వల్లే తాను మరణిస్తాడని బదులిస్తాడు. ‘ఏ తల్లి తన బిడ్డను చంపుకోదు’ కదా అని తనకు తాను అనుకుని అంతటితో సరిపెట్టుకుంటుంది.
మరో కథనం ప్రకారం, భూదేవే సత్యభామగా అవతరిస్తుంది, పుత్రుడు లోకకంఠకుడు అని తెలిసి, శిక్షిస్తుంది. అదెలాగంటే..
నరకుడు రాజధాని అయిన ప్రాగ్జ్యోతిషపురాన్ని పాలిస్తూ ఉంటాడు. అతడు బుద్ధిరీత్యా మొదట్నుంచీ స్త్రీలను గౌరవించేవాడు, మర్యాదస్తుడు. అలాంటిది బాణాసురుడి చెడు స్నేహంతో పూర్తిగా మారిపోతాడు. దేవతలను బాధ పెడుతూ, మునులను వేధించేవాడు. వేలాదిమంది పరాయి స్త్రీలపై పైశాచికత్వాన్ని చూపిస్తూ ఆఖరికి లోకకంటకుడిగా తయారవుతాడు. అంతటితో ఆగకపోగా, చివరకు ఇంద్రుడి అధికార ముద్రను సైతం అపహరిస్తాడు. ఇందుకు ఇంద్రుడు ఆపద రక్షకుడైన నందగోపాలుడితో మొర పెట్టుకుంటాడు. దాంతో శ్రీకృష్ణుడు, సత్యభామతో కలిసి యుద్ధానికి బయలుదేరుతాడు.
నరకాసురుడి విషపు బాణాన్ని నిలువరించడానికి సత్యభామ ఆగ్రహించి భయంకరమైన తన బాణాలను విసిరింది. ఇదే అదనుగా శ్రీకృష్ణుడు నరకుడిపై సుదర్శనాన్ని ప్రయోగించి అతడి తలను నరికేస్తాడు. దీంతో నరకుడు మరణం పొందుతాడు. అలా ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు లోకకంటకుడైన నరకుడి మరణం సంభవించింది. ఈ సంఘటన తర్వాత, తన పుత్రుడి పేరుని ఎప్పటికి గుర్తిండిపోయేలా ఉండాలని సత్యభామ(తల్లి) కోరగా, అందుకు శ్రీకృష్ణుడు ఆ రోజునే ‘నరక చతుర్దశి’గా వరం ప్రసాదించాడు. నరకాసురుడి మరణాన్ని ప్రజలు సంబరంగా జరుపుకునేరోజు అమావాస్య కావడంతో చీకటిని వెలివేస్తూ, దీపాలతో తోరణాలను కట్టి, బాణసంచా కాల్చుతూ వేడుకలను చేసుకున్నారు.
మరో కథనం…
*రామాయణంలో తండ్రి ఆజ్ఞ మేరకు రాముడు, సీత, లక్ష్మణుడు వనవాసానికి అడవికి వెళ్లారు. రావణుడు మారువేషంలో సీతను ఎత్తుకుపోయాడు. రావణుడితో యుద్ధం చేసి గెలిచిన శ్రీరామచంద్రుడు సతీసమేతంగా అయోధ్యకు వెళ్తాడు.. ఇంతవరకు మనకు తెలిసిందే.. ఆ రోజు అమావాస్య కావడంతో ప్రజలు దీపాలను వెలిగించి, చీకటిని పారద్రోలుతారు. ఆనాటి నుంచి దీపావళి పండుగను మనం ఆనవాయితీగా ఏటా జరుపుకుంటున్నామనే కథనం ప్రాచుర్యంలో ఉంది.
*ఈ దీపావళి నాడు అయోధ్యలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రతువు గత ఎనిమిదేళ్లుగా జరుగుతోంది. మరో విశేషం ఏంటంటే..
ఈరోజు(బుధవారం) రాత్రి 28 లక్షల మట్టి దీపాలను వెలిగించనున్నట్లు ఆలయ ట్రస్టు తెలిపింది.
◆అమృతం కోసం దేవతలు, రాక్షసులు ఇరువైపులా పాలసముద్రాన్ని చిలుకుతుండగా అమవాస్యనాడు(ఈరోజు) లక్ష్మీదేవి ఉద్భవించింది. అందువల్లే సకల అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి దీపావళినాడు సాయంత్రం ప్రత్యేక పూజలు చేస్తారు.
దీపావళి రోజు చేయాల్సినవి…
దీపావళి రోజు సాయంత్రం నువ్వులనూనె లేదంటే ఆవునేతిని మట్టి ప్రమిదెల్లో నింపి, దీపాలను వెలిగించాలి. తోరణాలతో ఇల్లంతా అలంకరించాలి. అందరికీ మిఠాయిలు పంచాలి. పిల్లలు, పెద్దలు కలిసి టపాసులు కాలుస్తూ అమావాస్య చీకట్లను తరిమికొట్టాలి. లక్ష్మీదేవిని తప్పనిసరిగా ఆరాధించాలి. తెలంగాణలో ఈ పండుగను ‘దివ్వెల పండుగ’ అని అంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు నుంచి ఐదు రోజులపాటు కొన్నిచోట్ల బొమ్మల కొలువు పెడతారు.
ఇతర రాష్ట్రాల్లో…
*మరాఠీలో ‘యక్షరాత్రి’ గా..
*గుజరాత్, బెంగాల్ రాష్ట్రాల్లో రైతులు ‘పశుపూజారి’గా, ‘ధన్ తేరాస్’ పేరుతో కొత్త సంవత్సరంగా చేసుకుంటారు.
*ఉత్తర్ ప్రదేశ్ లో ‘భారత్ మిలన్’ పేరిట దీపావళి జరుపుకుంటారు.
*మధురలో ‘అన్నకూట్’ గా పశువులకు, పక్షులకు ఆహారాన్ని పెడతారు.
*పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో ‘జగద్ధాత్రి’గా పిలుస్తూ, అమ్మవారికి కాళీ పూజలు జరుపుతారు.
*కేరళలో బలిచక్రవర్తిని ఓడించన రోజుగా భావించి దీపావళి పండుగను జరుపుకుంటారు.
*బుందేల్ ఖండ్ లో కొన్ని ప్రాంతాల్లో దీపావళి రోజున రావణదహనం చేస్తారు.
*ఈరోజు జైనుల మహావీరుని నిర్వాణదినంగా భావించి దీపాలు వెలిగిస్తూ, ప్రత్యేక పూజలు చేస్తారు.
*మొగల్ చక్రవర్తి అక్బర్ ఈ దీపావళి పండుగను ఘనంగా జరిపించినట్లు అబుల్ ఫజల్ రాసిన ‘అక్బర్ నామా’ అనే పుస్తకంలో పేర్కొన్నారు.
*సిక్కులు అమృత్ సర్ లోని స్వర్ణదేవాలయాన్ని దీపాలతో అలంకరించి ప్రార్థిస్తారు. కారణం వారి మతగురువైన గురు హరగోవింద్ సాహిబ్ మొగల్ చక్రవర్తుల చెర నుంచి విడుదలైన రోజు కావడంతో ఉత్సాహంగా వేడుకలు చేసుకుంటారు.