CINEMATelugu Cinema

సినిమాకు జీవితాన్నిచ్చిన దర్శక దార్శనికుడు.. దాసరి నారాయణ రావు..

బిందువులా జీవితాన్ని ప్రారంభించి సింధువులా విస్తరిస్తారు కొందరు. తమ ప్రస్థానంలో వారు ఎందరికో స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తారు. శతాధిక చిత్ర దర్శకులు దాసరి నారాయణరావు గారి జీవితాన్ని పరికించి చూస్తే అది అక్షర సత్యం అనిపిస్తుంది. వెండితెర తారల్ని తమ ఇలవేల్పుగా భావిస్తూ అపార గౌరవాభిమానాలు ప్రదర్శించే తెలుగు సినీ స్వర్ణయుగ కాలంలో పరిశ్రమలోకి అడుగుపెట్టిన దాసరి నారాయణరావు గారు దర్శకత్వ శాఖకే కొత్త శోభను తీసుకొచ్చారు. దర్శకుడు “కెప్టెన్ ఆఫ్ ది షిప్” అంటూ తెరవెనుక సృజనశీలురకు మహోన్నతమైన గౌరవాన్ని సంపాదించి పెట్టారు. తెలుగు సినిమాను జనం బాట పట్టించారు. తెలుగు సినిమా చరిత్రను “న భూతో న భవిష్యతి” అన్నట్లుగా ఎప్పటికప్పుడు సరికొత్త మలుపులు తిప్పుతూ ప్రతీ చిత్రాన్ని అజరామరమైన రీతిలో మలిచారు. యాభై ఏళ్ల తన సుదీర్ఘపు  సినీప్రస్థానంలో ప్రతీ అడుగులో తనదైన ముద్రవేశారు. విలక్షణ కథా చిత్రాలతో తెలుగు సినీచరిత్రలో సంచలనాల్ని సృష్టించారు.

రాసి కంటే వాసి ముఖ్యమని భావించే దాసరి తన ప్రతీ సినిమాను తలమానికమైన రీతిలో మలచిందుకే ప్రయత్నం చేశారు. నటుడిగా చిన్నపాత్రతో మొదలైన దాసరి గారి సినీ ప్రస్థానం తాతా – మనవడు సినిమాతో అనూహ్యమైన ఖ్యాతినార్జించింది. 151 చిత్రాలకు దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించి అత్యధిక చిత్రాల దర్శకుడుగా “గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్” ఎక్కారు. ఎందరో ఔత్సాహికులకు పాఠ్యగ్రంథంలా బాసిల్లారు. ఆయన తీసిన ప్రతీ సినిమా కూడా జనానికి నచ్చింది, జనం మెచ్చింది కావడం వలన దర్శకుడిగా ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేయడానికి, ఆ ప్రయోగాలతో మోహన్ బాబు లాంటి నటులతో సహా ఎందరో కొత్త నటులను పరిచయం చేయడానికి ఆయనకు అవకాశాన్ని ఇచ్చింది. దర్శకుడిగా, నటుడిగా, రచయితగా, నిర్మాతగా, పత్రికాధిపతిగా, కార్మిక నాయకుడిగా, రాజకీయ వేత్తగా, మంచి బహుముఖ ప్రజ్ఞాశాలిగా అసమాన కీర్తి ప్రతిష్టల్ని సముపార్జించుకున్నారు. తెలుగు సినీ ప్రపంచంలో దర్శక మేరుగధీరుడుగా నీరాజనాల అందుకున్నారు. తెలుగు సినీ చరిత్రలో ఒక మహాధ్యాయాన్ని లిఖించుకున్నారు.

రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, తొమ్మిది నంది పురస్కారాలు, నాలుగు ఫిలింఫేర్ అవార్డులు దక్కడమంటే దర్శకుడిగా దాసరి నారాయణ రావు గారు సాధించిన విజయాలకు నిలువెత్తు నిదర్శనం. దర్శకుడే నటుడైనప్పుడు, ఆ నటుడే సంభాషణ రచయిత అయినప్పుడు సన్నివేశాలను చిత్రీకరించే శైలి భిన్నంగా ఉంటుంది. సన్నివేశాల రూపకల్పన గానీ, సంభాషణ శైలి గానీ సూటిగా ప్రేక్షకుల హృదయాల్లోకి చొచ్చుకపోగలుగుతుంది. “దాసరి లేని తెలుగు సినిమాను గానీ, తెలుగు పరిశ్రమను గానీ ఊహించడమే కష్టం” అన్నట్లుగా ఆయన ప్రతి అంశంలోనూ చొచ్చుకొనిపోయేవారు. విభిన్న బాధ్యతలను ఏకకాలంలో పోషించడం ద్వారా తెలుగు సినిమాకి సంబంధించిన ప్రతీ అంశంపైన ఆయన బలమైన పట్టు సాధించారు. గీత రచయితగా కూడా “సిత్తరాల తోటలో ఉత్తరాలు దొరికాయి” సహా ఎన్నో జనరంజకమైన గీతాలను దాసరి గారు రచించి ప్రతీ ఒక్కరిని మెప్పించారు. దాసరి సినిమా అంటేనే ఒక దశలో విపరీతమైన ఆదరణ ఉండేది.

రాఘవేంద్రరావు గారు వాణిజ్య కథాంశాలను తెరకెక్కిస్తే, దాసరి గారు తనదైన శైలిలో కుటుంబ కథలను, వినూత్న సాంఘిక చిత్రాలను తెరకెక్కించారు. దాసరి గారు స్పృజించిన ప్రతీ పాత్ర కూడా సామాన్య జనానికి చేరువైంది, వారి హృదయాలను అందుకున్నది. దర్శకుడిగా ఆయన ప్రతిభకు నిదర్శనంగా నిలిచే సినిమాలకు ఎన్టీఆర్ గారు అయినా, అక్కినేని గారు అయినా దాసరి గారి సినిమాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారంటే దర్శకుడిగా ఆయన ప్రతిభ పట్ల వారికి ఉన్న నమ్మకమేనని చెప్పక తప్పదు. నేడు అగ్ర నటులుగా రాణిస్తున్న ఒకనాటి చిన్న నటులెందరికో దాసరి గారు నటనభ్యాసం చేయించారు అనడం అతిశయోక్తి ఏమి కాదు. అవినీతి సామాజిక దురన్యాయాలు, లింగ వివక్ష వంటి ఎన్నో సమకాలీన అంశాలను అద్భుతమైన రీతిలో వెండితెర దృశ్య కావ్యాలుగా ఆయన మలిచారు. ఇందుకు నిదర్శనం “బలిపీఠం”. అప్పట్లో ఆ సినిమా సాధించిన విజయం అద్భుతమే.

ఏ దర్శకుడు సాహసించని రీతిలో వినూత్న కథలను ఎంచుకొని వాటిని ప్రేక్షకులు మెచ్చే విధంగా దర్శకుడుగా, నటుడిగా విలక్షణమైన రీతిలో దాసరి విజయం సాధించగలిగారు. ఎన్టీఆర్ గారితో దాసరి గారు చేసిన సినిమాలన్నీ కూడా నిరుపమానమైనవి. “మనుషులంతా ఒక్కటే” అంటూ నటరత్న నుండి అద్భుతమైన రీతిలో ఒక దృశ్య కావ్యాన్ని అందించిన ఘనత దాసరి గారిదే. “బొబ్బిలి పులి”, “సర్దార్ పాపారాయుడు” వంటి సినిమాలు నటుడిగా ఎన్టీఆర్ ను మరో మెట్టు ఎక్కేలా చేస్తే, దర్శకుడిగా దాసరికి ఎనలేని ఖ్యాతిని తీసుకువచ్చాయి. అలాగే అక్కినేనితో “ప్రేమాభిషేకం”, “మేఘసందేశం”, “ప్రేమ మందిరం” వంటి చిత్రాలను తెరకెక్కించి ఇద్దరు అగ్రనటుల నుంచి భేషైన దర్శకుడు అన్న అభినందనలు అందుకోవడం దాసరి గారికే చెల్లింది.

జీవిత విశేషాలు…

  • జన్మ నామం :    దాసరి నారాయణ రావు 
  • ఇతర పేర్లు  :   దాసరి, దర్శక రత్న
  • జననం    :    04 మే 1947
  • స్వస్థలం   :   పాలకొల్లు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం..
  • వృత్తి      :    సినిమాలు, రాజకీయం
  • తండ్రి   :   లక్ష్మయ్య చౌదరి
  • తల్లి     :  వెంకట్రావమ్మ 
  • భార్య        :   దాసరి పద్మ
  • ​​పిల్లలు    :     ప్రభు,   అరుణ్ కుమార్,    హేమాలయ కుమారి
  • మతం        :      హిందూ
  • రాజకీయ పార్టీ    :    భారత జాతీయ కాంగ్రెస్
  • మరణ కారణం  :   మూత్రపిండాల సమస్య
  • మరణం   :              30 మే 2017, హైదరాబాదు, తెలంగాణ..

నేపథ్యం…

దాసరి నారాయణ రావు గారు 04 మే 1947 నాడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో లక్ష్మయ్య చౌదరి, వెంకట్రావమ్మ దంపతులకు జన్మించారు. వారు మొత్తం ఆరుగురు సంతానం. ముగ్గురు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు. వారిలో దాసరి గారు మూడవ వారు. దాసరి గారిది పాలకొల్లులో అసామాన్యమైన కుటుంబం. వారికి ఆస్తిపాస్తులు బాగానే ఉండేవి. దాసరి గారి నాన్నా, పెదనాన్నలు కలిసి పొగాకు వ్యాపారం చేసేవారు. ఒకసారి దీపావళి సమయంలో పొగాకు గోదాము తగలబడిపోయింది. వాస్తవానికి అప్పట్లో ఇన్సూరెన్సులు ఉండేవి కాదు. దాంతో తన కుటుంబం ఆర్థికంగా చాలా దెబ్బతిన్నది. ఆ కష్టకాలంలోనే వారి పొలాలు కూడా అమ్మేయాల్సివచ్చింది. వారి నాన్న తరం వరకూ వారి కుటుంబంలో ఎవ్వరికీ చదువులేదు. దాసరి వాళ్ళని మాత్రం చదివించారు వాళ్ళ నాన్న. దాసరి గారు ఆరో తరగతికి వచ్చేసరికి వారి ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది. బడి ఫీజు మూడుంపావలా కట్టడానికి కూడా డబ్బులేక ఆయనను బడి మాన్పించి ఒక వడ్రంగి దుకాణంలో పనిలో పెట్టారు వాళ్ళ నాన్న గారు. అక్కడ జీతం నెలకి రూపాయి. ఆ దృశ్యాన్ని చూసిన తన మాష్టారు తిరిగి తనను బడిలో చేర్పించి తోటి విద్యార్థుల వద్ద చందాలు వసూలు చేసి తన బడి ఫీజు కట్టించారు. ఆరో తరగతిలో ఉత్తమ విద్యార్థిగా ఆయనకు బహుమతి వచ్చింది. అలా తన మాస్టారు సాయంతో మళ్ళీ చదువు కొనసాగించారు.

అరటిపండ్లు అమ్మిన దాసరి…

దాసరి గారు చదువులో చురుకుగా ఉన్నారు. పిల్లలందరూ ఒకవైపు, దాసరి గారు ఒకవైపు. ఉన్నట్టుండి బుద్ధిగా చదువుకుంటున్న దాసరి గారి మనసు నాటకాలువైపు మళ్ళింది. వేరేవాళ్లు వేస్తున్న నాటకాలు చూసి మనం ఎందుకు నాటకాలు వ్రాయకూడదు అనుకుని నాటకాలు వ్రాయడం మొదలుపెట్టారు. ఆ సమయానికి దాసరి గారి వయస్సు పది సంవత్సరాలు. నాటకాలు వ్రాయడం, నాటకాలలో నటించడం బహుమతులు అందుకోవడం. ఇలా కళాశాలకు వచ్చేసరికి నాటకాల మీద ఇంకా ప్రేమ పెరిగిపోయింది. కానీ ఏ దశలోనూ చదువును నిర్లక్ష్యం చేయలేదు. దాసరి గారు ఏరోజూ పుస్తకాలు కొనుక్కోవడం కోసం తల్లిదండ్రుల మీద ఆధారపడలేదు. కావిడి వేసుకుని వీధి వీధి తిరిగి అరటి పండ్లు అమ్మారు. టైపు రైటింగ్ హయ్యర్ లో బంగారు పతకం అందుకున్నారు. షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నారు. బీకాం పట్టా పుచ్చుకున్నాక ఎర్ర బస్సు ఎక్కిన దాసరి గారు పాలకొల్లు నుండి హైదరాబాదుకు మకాం మార్చారు.

హైదరాబాదు నుండి మద్రాసుకు…

దాసరి నారాయణ రావు గారు హైదరాబాదుకు వచ్చిన తర్వాత కూడా నాటకాలు వ్రాయడం, నాటకాలు వేయడం చేస్తుండేవారు. గాంధీభవన్, రవీంద్రభారతి లలో దాసరి గారు వేసే నాటకాలంటే జనాలు ఎగబడి మరీ టిక్కెట్టు కొనుక్కునే వారు. దాసరి గారికి నాటకాల మీద ఉన్న మామకారమే తనను సినిమాల్లోకి తీసుకువచ్చింది. అప్పటికి సినిమా పరిశ్రమ ఇంకా మద్రాసులోనే ఉంది. సినిమాలలో చేయాలంటే మద్రాసు వెళ్లక తప్పదు. చెన్నైలో అడుగు పెట్టిన మొదటి రోజునే దాసరి గారు నటుడిగా మేకప్ వేసుకున్నారు. వాహినీ స్టూడియోస్ లో “అందం కోసం పందెం” అనే సినిమాలో తనకు హాస్య పాత్ర లభించింది. అప్పటికే హాస్యపాత్రలో అనుభవంతో దూసుకెళ్తున్న హాస్యనటులు బాలకృష్ణ గారు పలకాల్సిన సంభాషణలను దాసరి గారితో చెప్పించారు. హాస్య నటుడికి కోపం రావడానికి ఆ మాత్రం చాలు. దాంతో చిత్రీకరణలో దాసరి గారిని ముప్పుతిప్పలు పెట్టారు బాలకృష్ణ గారు. దాంతో దాసరి గారు నిరాశకు గురయ్యారు.  మద్రాసు నుంచి వెనక్కి వెళ్ళిపోతే? అని ఆలోచించారు దాసరి. చిన్నచిన్న దెబ్బలు తట్టుకోలేక పోతే ఎలా అని మనసులో ఒక ఆలోచన. ఒక్క క్షణం తనకు తాను ధైర్యం చెప్పుకున్నారు దాసరి గారు.

మాటల రచయితగా.. 

దాసరి నారాయణ రావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. తనకు నటించడం వచ్చు, వ్రాయడం వచ్చు. దర్శకత్వం నటన కంటే రచయితగా స్థిరపడడం సులభం అనే అభిప్రాయానికి వచ్చిన దాసరి రచయిత పాలగుమ్మి పద్మరాజు దగారి గ్గర సహాయకుడిగా చేరారు. దాసరి గారి అన్నయ్య చదివిన కళాశాలలో పాలగుమ్మి పద్మరాజు గారు అధ్యాపకులు. ఆ పరిచయంతో దాసరి గారు పద్మరాజు గారిని కలిశారు. జీతం లేని సహాయకుడిగా తన వద్ద చేరిపోయారు. అలా దాసరి గారి సినీ జీవితం కొత్త మలుపు తిరిగింది. సహాయ రచయితగా పనిచేస్తూనే ఆర్థిక అవసరాల కోసం పార్ట్ టైం టైపిస్ట్, ట్యూషన్ మాస్టర్ ఇలా రకరకాల ఉద్యోగాలు చేశారు. పాలగుమ్మి పద్మరాజు గారి ద్వారా దాసరి నారాయణరావు గారికి బి.యన్.రెడ్డి, ఎస్.భావనారాయణ వంటి సినీ ప్రముఖులతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే దాసరి గారిని చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి పునాది వేసింది.

“ప్రేమకు పర్మిట్” అనే కన్నడ సినిమా హక్కులను కొనుగోలు చేసిన నిర్మాత భావనారాయణ గారు ఆ సినిమాను “పర్వతాలు – పానకాలు” పేరుతో పునర్నిర్మాణం చేయాలని భావించారు. ఆ సినిమాకు దాసరి నారాయణరావు గారి చేత సంభాషణలు కూడా వ్రాయించారు.  ఆ సినిమా కోసం రచయితగా తొలిసారి 300 రూపాయల పారితోషికం అందుకున్నారు దాసరి. కానీ అనివార్య కారణాలవల్ల ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. దాసరి రచయితగా తొలి సినిమా అది. “జగత్ జెట్టీలు” చిత్రంతో తన పేరును తొలిసారిగా వెండి తెరపై చూసుకున్నారు దాసరి. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించడంతో చిత్రసీమలో దాసరి గారి పేరు మార్మోగిపోయింది. రచయితగా “కూతురు కోడలు”, “మహమ్మద్ బీన్ తుగ్లక్”, “మా నాన్న నిర్దోషి”, “స్నేహబంధం”, “మల్లమ్మ కథ” తో పాటు 50 చిత్రాలకు సంభాషలను అందించారు దాసరి. ఆ చిత్రాలు ఆయనకు తిరుగులేని గుర్తింపును తీసుకొచ్చాయి.

దర్శకుడిగా తొలి చిత్రం తాత – మనవడు…

నాటక రంగంలో ఉన్నప్పుడు నాగభూషణం గారితో ఏర్పడిన పరిచయం దాసరి గారికి చిత్రపరిశ్రమలోకి ప్రవేశించచడానికి మార్గం సుగమం అయ్యింది. దర్శకుడు భీమ్ సింగ్ గారికి దాసరి గారిని పరిచయం చేశారు నటులు నాగభూషణం గారు. అప్పటికి దర్శకుడు భీమ్ సింగ్ గారు ఎన్టీఆర్ గారితో “ఒకే కుటుంబం” అనే సినిమా తీస్తున్నారు. దానికి దాసరి గారిని సహాయ దర్శకులుగా తీసుకున్నారు. సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయ్యక భీమ్ సింగ్ గారికి హిందీలో దిలీప్ కుమార్ గారు తీసిన “గోపి” చిత్రంతో డేట్స్ సర్దుబాటు అవ్వలేదు. దాంతో భీమ్ సింగ్ గారి స్థానంలో సహాయ దర్శకుడి హోదాలో ఉన్న దాసరి గారు ఆ సినిమాను పూర్తి చేశారు. దాంతో దాసరి గారి ప్రతిభను గుర్తించిన ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత కె.రాఘవ గారు దాసరి నారాయణ రావు గారికి మొదటి సినిమా తాతా మనవడు లో అవకాశం ఇచ్చారు. ఎవరికైనా మొదటి సినిమాకు వాణిజ్యంశాలతో తీయడానికి ప్రయత్నిస్తారు. కానీ దాసరి గారు తాను సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నారో అదే తన తొలి చిత్రంతోనే ప్రారంభించారు. తాను దర్శకత్వం వహించి తొలిచిత్రంతోనే దాసరి నారాయణరావు గారు తెలుగు పరిశ్రమలో సంచలనాన్ని సృష్టించారు.

తాతా – మనవడు అనుబంధానికి, మానవ సంబంధాలకు అందమైన దృశ్యరూపంలో నిలిచిన ఈ చిత్రం హృద్యమైన భావోద్వేగాలతో ఆబాలగోపాలన్ని అలరించింది. ఎస్వీ రంగారావు, రాజబాబు తాత మనవళ్లుగా నటించిన ఈ చిత్రం 23 ఆగస్టు 1972 చెన్నైలోని విక్రమ్ స్టూడియోలో ప్రారంభమై కేవలం 100 రోజులలో నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. 23 మార్చి 1973 న విడుదలైన ఈ చిత్రం శతదినోత్సవాన్ని దాటి రజతోత్సవాన్ని జరుపుకుంది. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ కేంద్రాల్లో శత దినోత్సవాలు నిర్వహించారు. ఈ సినిమా విడుదలైన సమయంలో ఎన్టీఆర్ నటించిన దేశోద్ధారకుడు, ఏఎన్ఆర్ నటించిన బుద్ధిమంతుడు చిత్రాలు విడుదలయ్యాయి. ఎలాంటి భారీతారాగణం లేకుండా, ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన తాత – మనవడు చిత్రం ఇద్దరు అగ్ర హీరోలకు మించి ప్రజాదరణను సొంతం చేసుకుంది. దీంతో దాసరి నారాయణరావు గారి పేరు తెలుగు చిత్రసీమలో మార్మోగిపోయింది. తొలి సినిమాకే నంది పురస్కారాన్ని అందుకున్న దాసరి గారు అందరి దృష్టిని ఆకర్షించారు.

దాసరికి పౌరుషం ఎక్కువ…

ఒంట్లో ఊపిరి లేకపోయినా పర్వాలేదు. కానీ పౌరుషం ఉండాలనే విషయంలో దాసరి గారికి మించిన వాళ్లే లేరు. దాసరి గారి చిత్రాల్లో ఎప్పుడూ నాగభూషణం గారి లాంటి గొప్ప నటుడు నటించకపోవడానికి ఆ పౌరుషమే కారణం. నాగభూషణం గారితో దాసరి గారికి మంచి స్నేహం ఉండేది. ఆయన కోసమే తొలి చిత్రం తాత – మనవడు లో పరమాత్మ రావు పాత్రను సృష్టించారు దాసరి గారు. నాగభూషణం గారు అప్పటికే అగ్రనటులు. పారితోషికం విషయములో పేచీ వచ్చి నీకోసం ఉచితంగా చేస్తాను, కానీ పారితోషికం తగ్గించుకోనని నాగభూషణం గారు తెగేసిచెప్పారు. దాసరి గారి మాట మీద నిర్మాత రాఘవ గారు అడిగినంత ఇవ్వడానికి సరే అన్నారు. కానీ కొంత ఇప్పుడు, మిగిలింది సినిమా విడుదలైన 50 రోజుల తర్వాత ఇస్తానని చెప్పారు. అప్పటికి ఈ సినిమా 50 రోజులు ఆడుతుందో లేదో ఎవరు చూడొచ్చారు అన్నారు నాగభూషణం గారు. అలా అనేసరికి దాసరి గారికి కోపం వచ్చేసింది. దాంతో ఆ పాత్రను గుమ్మడి గారికి కేటాయించారు దాసరి. ఆ చిత్రం 350 రోజులు ఆడింది. ఆ తరువాత దాసరి గారి ఏ సినిమాలోనూ నాగభూషణం గారికి చోటు దక్కలేదు. అలా తొలి నుంచి పట్టుదలతో, పౌరుషంతో ఎక్కడ కూడా రాజీ పడకుండా ముందుకు సాగిన దాసరి చివరికంటా అదే తీరును కాపాడుకుంటూ తనదైన ముద్రను చిత్ర రంగంలో మిగిల్చారు.

మానవ సంబంధాలే కథా వస్తువులుగా…

దాసరి గారు తన చిత్రాల్లో మానవ సంబంధాలకు పెద్దపీట వేశారు. దాసరి నారాయణరావు గారు మనిషిలోని స్వార్థం, జీవితాల్లో డబ్బు సృష్టించే సంక్షోభం, నిస్సహాయుల పట్ల సమాజం వివక్ష, భార్యాభర్తల అనుబంధాలు, విఫల ప్రేమికుల యదార్థ గాథలు ఇలా మానవ జీవితం తాలూకు సకల పార్శ్వాలని తన సినిమాలలో దృశ్యమానం చేశారు. అదే సమయంలో అనేక సినిమాల్లో అధికారం, ఆధిపత్యం పై ధిక్కారస్వరాన్ని వినిపించారు. దాసరి గారి సినిమాల్లో ప్రశ్నించే స్వభావం, తిరుగుబాటు తత్వం, సమాజ పోకడలపై వ్యంగస్త్రాలు విరివిగా కనిపిస్తుంటాయి. “తాత మనవడు”, “మనుషులంతా ఒక్కటే”, “దేవదాసు మళ్లీ పుట్టాడు”, “స్వర్గం నరకం”, “శ్రీవారి ముచ్చట్లు”, “కోరికలే గుర్రాలైతే”, “రాముడు కాదు కృష్ణుడు”, “అద్దాలమేడ”,  “స్వయంవరం”, “మేఘసందేశం”,   “బొబ్బిలి పులి”, “శివరంజని”, “సర్దార్ పాపారాయుడు”, “తూర్పు పడమర”, “బంగారు కుటుంబం”, “ప్రేమాభిషేకం”, “ధర్మ పీఠం”, “సూరిగాడు”, “అమ్మ రాజీనామా”,  “ఒసేయ్ రాములమ్మ” ఇలా ఎన్నో అజరామరమైన చిత్రాలు దాసరి నారాయణరావు గారి కీర్తి కిరీటంలో కలికితురాళ్ళుగా నిలిచాయి. దాసరి గారు దర్శకత్వం వహించిన చివరి చిత్రం “ఎర్ర బస్సు”.

ఎందరో తారలను వెండితెరకు పరిచయం చేసిన దాసరి…

దాసరి నారాయణరావు గారు చిత్ర పరిశ్రమలో నూతన ప్రతిమను ఎప్పుడూ ప్రోత్సహిస్తుండేవారు.  ప్రతిభావంతుల్ని పసిగట్టి ఆయన తన సినిమాల్లో అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించేవారు. దాదాపు 13 మంది కథానాయకులు, 15 మంది పైగా కథానాయికల్ని చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు దాసరి. “స్వర్గం నరకం” చిత్రంతో మోహన్ బాబు గారిని సినీ రంగానికి పరిచయం చేశారు. ఆర్.నారాయణమూర్తి గారికి సినీ జీవితాన్ని ఇచ్చారు. నరసింహ రాజు, ఈశ్వర్ రావు, బాలాజీ, హరి ప్రసాద్, త్రినాధ్, హాస్యనటులు జయప్రకాశ్ రెడ్డి లాంటి నటులను పరిశ్రమకు పరిచయం చేశారు. ఇక కథానాయికల విషయానికోస్తే జయప్రద, జయసుధ, మాధవి, సుజాత, శ్రీదేవి, స్వప్న, రజిని, సిల్క్ స్మిత, అన్నపూర్ణ, శుభశ్రీ, ఫటాఫట్ జయలక్ష్మి వంటి కథనాయికలను పరిచయం చేసి వారిని కథానాయికలుగా తీర్చిదిద్దారు. అలాగే దర్శకత్వ శాఖలో దాసరి గారికి లెక్కకు మించిన శిష్యులు ఉన్నారు. వారిలో రేలంగి నరసింహారావు, కోడి రామకృష్ణ, దవళ సత్యం, ఉప్పలపాటి నారాయణరావు తదితరులు అగ్ర దర్శకులుగా ప్రతిభను చాటిన వారిని కూడా పరిచయం చేసింది దాసరి గారే.

సమాజాన్ని ప్రశ్నించిన విప్లవ చిత్రాలు..

“ఒసేయ్ రాములమ్మ”, “సమ్మక్క సారక్క”, “అడవి చుక్క” సినిమాలతో అభ్యుదయ భావాన్ని ప్రకటించారుదాసరి గారు. “ఒసేయ్ రాములమ్మ”, “మేస్త్రి” చిత్రాలు విప్లవ భావాలతో పీడత ప్రజల సంక్షోభిత జీవితానికి దృశ్య రూపంలో నిలిచాయి. మహిళల పట్ల వివక్షతను, అణగారిన వర్గాల పట్ల అన్యాయాన్ని ఈ సినిమా ద్వారా ప్రశ్నించారు. విజయశాంతి కథానాయికగా నటించిన “ఒసేయ్ రాములమ్మ”, “అడవి చుక్క” చిత్రాలు ఆమె సినీజీవితం లో కీలక మలుపుగా నిలిచాయి. వెండితెరపై శక్తివంతమైన కథానాయకగా విజయశాంతి గారికి కొత్త ఇమేజ్ ని తీసుకొచ్చాయి. ఈ చిత్రంలోని అభ్యుదయ గీతాలు గ్రామీణ ప్రజలను ఉర్రూతలూగించాయి. ఇదిలా ఉండగా హిందీలో దాసరి నారాయణరావు గారి “స్వర్గనరక్”, “ఏ కైసా ఇన్సాఫ్”, “జ్యోతి బనే జ్వాల”, “మెహేంది రంగ్ లాయేంగి”, “ప్యాసా సావన్”, “వఫాదార్”, “ఐసియత్”, “ఆశాజ్యోతి”, “ఆజ్ కా ఎమ్మెల్యే”, “సర్ప్ దోష్”, “యాద్ గార్”, “జక్మిషేర్”, “సంతన్” వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి హింది చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకతలు చాటుకున్నారు. కన్నడంలో “స్వప్న”, “పోలీస్ పాపన్న” చిత్రాలకు దర్శకత్వం వహించారు. దాసరి గారు దర్శకత్వం వహించిన “విశ్వనాథ నాయకుడు”, “ఒరేయ్ రిక్షా”, “ఒసేయ్ రాములమ్మ”, “మజ్ను” లాంటి చిత్రాలు తమిళంలో అనువదింపబడి చక్కని విజయాలు సాధించాయి.

వరుసగా పద్నాలుగు శత దినోత్సవాలు…

చిత్రసీమలో ఒకటి, రెండు సినిమాల విజయాలకే గర్వంతో పొంగిపోయే తారలు, దర్శకులు ప్రస్తుతం మనం చూస్తున్నాం. అలాంటిది తొలి సినిమా మొదలుకొని వరుసగా 14 శత దినోత్సవ చిత్రాలను అందించిన ఘనత దాసరి నారాయణ రావు గారు సొంతం చేసుకున్నారు. తెలుగు సినిమా చరిత్రలో 14 చిత్రాలు వరుసగా అప్రతిహత విజయాలు సొంతం చేసుకున్న దర్శకులు దాసరి అని చెప్పడం అతిశయోక్తి కాదు. తాతా-మనవడు తర్వాత ఆయన దర్శకత్వం వహించిన “సంసారం సాగరం”, “బంట్రోతు భార్య”, “రాధమ్మ పెళ్లి”, “తిరుపతి”, “ఎవరికి వారే యమునా తీరే”, “బలిపీఠం”, “దేవుడే దిగివస్తే”, “భారతంలో ఒక అమ్మాయి”, “స్వర్గం నరకం”, “యవ్వనం కాటేసింది”, “మనుషులంతా ఒక్కటే”, “ముద్దబంతి పువ్వు”, “పాడవోయి భారతీయుడా ” లాంటి చిత్రాలు వరుసగా శత దినోత్సవాలు జరుపుకున్నాయి. దర్శకుడిగా పరిచయమైన ఐదేళ్లలోనే తనకంటూ అభిమాన శిష్యగనాన్ని ఏర్పాటు చేసుకున్నారు దాసరి నారాయణరావు గారు.

ప్రేమ వివాహం…

దాసరి గారిది ప్రేమ వివాహం. ఒకసారి దాసరి నారాయణరావు గారు తన చెల్లికి గాజులు కొందామని కోటి దగ్గర గల సుల్తాన్ బజార్ కి వెళ్ళినప్పుడు ఏ సైజు గాజులు కావాలని గాజుల దుకాణం వాళ్ళు అడిగారు. అప్పుడు అక్కడే ఉన్న పద్మ దాసరి గారికి కనిపించింది. అప్పటి వరకు దాసరి గారికి తను ఎవరో కూడా తెలియదు. కానీ ఆమెను చూపించేసి ఆ అమ్మాయి చేతుల కొలత సరిపోతుంది అని చెప్పారు దాసరి. అలా వారి మధ్య మాటలు కలిశాయి. అప్పుడు తాను నాటకాలు వ్రాస్తానని,  దర్శకుడిని అని చెప్పి మర్నాడు వేయబోయే నాటకానికి పాసులు ఇచ్చి పద్మను రమ్మన్నాడు. అలా మొదలైన దాసరి, పద్మల పరిచయం ప్రేమగా మారింది. పెళ్లికి పద్మ వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు, కానీ దాసరి గారి ఇంట్లో మాత్రం పెళ్లికి అంగీకరించలేదు. అయినా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా దాంపత్య జీవితం కొనసాగించారు.

Show More
Back to top button