
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయ ప్రశస్తం వర్ణనాతీతం. కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారమై విరాజిల్లుతున్న ఈ క్షేత్రం తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఉంది. చాళుక్యులచే విశేషంగా నిర్మిపంబడిన ఆలయం ఇది. దక్షిణ కాశీగా పిలువబడుతున్న ఈ క్షేత్రం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 160 కిలోమీటర్లు, కరీంనగర్‌కు 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిత్యం శివనామస్మరణ, శ్రీ రుద్ర నమక చమకంతో వేద పారాయణ జరుగుతూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏకైన క్షేత్రమైన వేములవాడ రాజన్న దేవాలయంలోని స్వామి వారికి కోడె ను కట్టుట అనే సంప్రదాయం ఉంది. భక్తులు ప్రేమతో రాజన్నా అని పిలుస్తూ రాజన్నకు ఆవుదూడను మొక్కుకొని దేవాలయ ప్రదక్షణ చేపించి దేవాలయానికి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. దీనివల్ల సంతానప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తారు.
శివ భక్తులు, వైష్ణవులు, జైనులు, బౌద్ధులు అందరూ రాజన్న దేవాలయాన్ని దర్శిస్తారు. దేవాలయంపై ఉన్న శిల్పాలు కూడా జైన, బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ ఉంటాయి. దేవాలయ ప్రాంగణంలో 400 ఏళ్ళ నాటి మసీదు ఉంటడం మతసామరస్యానికి ప్రతీకగా ఉంది. ఇస్లాం మతానికి చెందిన ఒక శివభక్తుడు ఈ గుళ్ళో ఉంటూ, స్వామిని సేవిస్తూ ఇక్కడే మరణించాడని.. అందువళ్లే అతని స్మృత్యర్ధం ఈ మసీదు నిర్మించారాని చెబుతారు.
ఈ క్షేత్రం పౌరాణికంగా, చారిత్రాత్మకంగా పలు విశిష్టతలను సంతరించుకున్నది. ఈ దేవాలయంలో శ్రీ రాజరాజేశ్వరీదేవి సమేతుడై రాజరాజేశ్వరీదేవి లింగరూపంలో వెలసి నిత్యం పూజలందుకుంటున్నాడు. భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా పిలవబడే ఈ క్షేత్రం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వరఖండంలో విపులంగా వర్ణింపబడింది. పురాణాల ప్రకారం.. భారతంలోని అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని వదిలించుకోడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి, జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట. కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజించిన నరేంద్రుడికి.. పరమేశ్వరుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలిగించాడని అక్కడి శాసనాలు చెబుతున్నాయి. ఆ శివలింగమే ఇప్పుడున్న మూలవిరాట్టని స్థలపురాణం వివరిస్తుంది.
రాజరాజ నరేంద్రుని పేరు మీదుగా శ్రీ రాజ రాజేశ్వర స్వామి అని, రాజన్న అని పిలువబడుతున్నాడు. మూలవిరాట్టుకు కుడి పక్కన శ్రీరాజరాజేశ్వరీ దేవి, ఎడమపక్కన శ్రీ లక్ష్మీసహిత సిద్ధివినాయక విగ్రహాలు భక్తులను అనుగ్రహిస్తుంటాయి. ధర్మగుండం కోనేటిపై మూడు మండపాలు నిర్మించబడ్డాయి. మధ్యలో పరమశివుని విగ్రహం ప్రతిష్ఠించబడింది. ధ్యాన ముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ ఐదు శివలింగాలు ఉంటాయి.ముఖ్యంగా ఈ దేవాలయంలో శివరాత్రి రోజున వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుగుతుంది. అమావాస్య దాటి ఏకాదశి మొదలైన అర్ధరాత్రివేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. ఈ అద్భుత ఘట్టం చూడటానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు దేవాలయానికి తరలివస్తారు.
మహా శివరాత్రి రోజుల విద్యుత్ దీప కాంతులతో రాజన్న ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. ఆరోజున అతిపెద్ద జాతర జరుగుతుంది. ఆలయం బయట బద్దిపోచమ్మ ఆలయం ఉంటుంది. భక్తులు కల్లుశాక, బెల్లం శాఖ కోళ్లను కోసి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఆలయం పక్కన భీమన్న దేవాలయం ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో అతిపెద్ద ఆలయ గోపురంతో రాతికట్టడంగా శిల్పకళారీతిలో అలరాలుతుంది. వేములవాడ ప్రధాన ఆలయంలోని శివలింగం కంటే ఈ ఆలయంలో అతిపెద్ద శివలింగం ఉండటం విశేషం. ఈ దేవాలయాన్ని సందర్శించుకున్న భక్తులు నాంపెల్లి నరసింహస్వామిని దర్శించుకుంటారు. అక్కడినుంచి బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామంలోని శ్రీ త్రిలింగేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుంటారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారు విలాసాగర్ గ్రామం నుంచి వేములవాడలో స్థిరపడ్డారని అక్కడి శాసనం చెబుతోంది.
రాజన్న ఆలయ సందర్శనవేళలు : ఉదయం గుడి తలుపులు 4 గంటలకు తెరుచుకుంటాయి. రాత్రి 10:20 గంటలకు మూస్తారు. భక్తులకు ఏసీ రూములు, ఏసీ కాటేజీలు, ఏసీ సూట్ రూములు, నాన్ – ఏసీ రూములు అద్దెకు దొరుకుతాయి.
వేములవాడ ఎలా చేరుకోవాలి ??
హైదరాబాద్ , కరీంనగర్ నుండి ప్రతిరోజు పరిమిత సమయంలో మాత్రమే బస్సులు ఉన్నాయి. ప్రయాణ సమయం ప్రభుత్వ బస్సులో అయితే 4 గంటల 3 నిమిషాలు, అదే త్వరగా చేరుకోవాలంటే క్యాబ్ ద్వారా 2 గంటల 52 నిమిషాల సమయం పడుతుంది.
వాయు మార్గం: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ దగ్గరలో ఉన్నది.
రైలు మార్గం: కామారెడ్డి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నది.