Telugu News

భారత్-అమెరికా సంబంధాలు.. డొనాల్డ్ ట్రంప్ విధానాలపై ఆందోళనలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్‌ పట్ల అనుసరిస్తున్న విధానాలు ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలను దెబ్బతీసేలా ఉన్నాయని రాజకీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే ఆక్రోశంతో అమెరికా మన దేశంపై అదనంగా 25 శాతం సుంకాలు విధించింది. ఇది తీవ్ర చర్చకు దారితీసింది. అయితే, అమెరికా సుంకాలు విధించవచ్చు కానీ దేశ సార్వభౌమత్వంపై కాదంటూ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా గతంలో ట్వీట్ చేశారు. తాజాగా, ఆయన భారత్-అమెరికా సంబంధాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ, ఈ భాగస్వామ్యం ఎందుకు ముఖ్యమో ఏడు అంశాలను వివరించారు.

గోయెంకా ప్రకారం, అమెరికా ఇప్పటికీ ఏకైక సూపర్ పవర్, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, బలమైన మిలటరీ వ్యవస్థతో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. చైనా కాకుండా, అమెరికానే భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అమెరికాతో భారత్‌కు $40 బిలియన్ల వాణిజ్య మిగులు ఉండగా, చైనాతో $100 బిలియన్ల వాణిజ్య లోటు ఉంది. రక్షణ, సాంకేతికత, ఆవిష్కరణలు వంటి రంగాల్లో అమెరికాతో భారత్‌కు వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నాయి. కార్గిల్ యుద్ధం, కరవు వంటి సంక్షోభ సమయాల్లో అమెరికా మనకు మద్దతు ఇచ్చింది. చైనా, రష్యా వంటి ఏ ఇతర దేశాన్నీ మనం దీర్ఘకాలిక భాగస్వామిగా విశ్వసించలేం. అమెరికాతో స్నేహం భారత్ పురోగతి, భద్రత, ప్రపంచ గుర్తింపునకు సహాయపడుతుంది.

మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబరులో న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్య సమితి 80వ సమావేశాలకు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Show More
Back to top button