ఆస్థాన విద్వాంస పదవికి బానిసవ్వని “వైణిక సార్వభౌమ”.. పొడుగు రామమూర్తి..

బంగారు పంజరంలో బంధించిన ఏ చిలుకను ప్రశ్నించినా, బెంగగా ఒకేమాట చెబుతుంది, అడవికి వెళ్లి అడుక్కుతినాలని ఉంది” అని. నిజమే కదా. ఈ ప్రపంచంలో ఉద్భవించిన ప్రతీ జీవి కోరుకునేది ఒక్కటే, అది స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛే లేకుంటే జీవి జీవనమే నరకం. కళాకారుడు స్వేచ్చాజీవి. తన కళను ఇష్టమొచ్చిన చోట, తనకు నచ్చినప్పుడు ప్రదర్శించాలని కోరుకుంటాడు. స్వేచ్ఛగా ఆలోచించే ఆ కళాకారుడు సామాన్యులకు అనుభవంలోకి రాని సృజనాత్మక శక్తిని తాను తన స్వేచ్ఛ నుండి ఆవిర్భవింపజేసి, కొత్తకోణంలో ఆవిష్కరింపజేసి, అందరినీ ఆశ్చర్యపరుస్తాడు, ఆనందపరుస్తాడు, చివరికి తృప్తిగా నిట్టూరుస్తాడు కూడా.
వైణిక సార్వభౌమగా ప్రసిద్ధి చెందిన పొడుగు రామమూర్తి ఇదే కోవకు చెందినవారు. విజయనగరంలో జన్మించిన పొడుగు రామమూర్తి తాను అభ్యసించిన సంగీత విద్యను నలుగురికి నేర్పించాలనే సదుద్దేశ్యంతో విజయనగరం ఆస్థాన విద్వాంసులుగా అవకాశం వచ్చినా కూడా అందుకు ససేమిరా ఒప్పుకోలేదు. కేవలం వారి వద్ధ వాగ్గేయకారులుగా బందీగా ఉండడం కంటే, తనకు వచ్చిన సంగీతాన్ని నలుగురికి నేర్పించి, ఆ సంగీతంతో ఎందరినో తరింపజేసే మహాత్కర అవకాశాల కోసమే రామమూర్తి ఎదురుచూసేవారు.
“బెదిరించి ఓ సింహాన్ని బంధించగలవేమో గానీ, శాసించి ఒక పూవును కూడా వికసింపజేయలేవు” అనే మాట అక్షరసత్యం. విజయనగరం సంస్థానంలో ఆస్థాన విద్వాంసులుగా ఉన్న సాలిగ్రామం గోపాలం పల్లకిలో రాజాస్థానానికి వెళ్లేవారు. రాజవైభోగం అనుభవించేవారు. పెద్ద ఇల్లు, ఇల్లుకు తగ్గ పెద్ద వాకిలి. నౌకర్లు, చాకర్లు, మందీమార్భలం, పొద్దున్నే స్తోత్రాలు ఇలా అంగరంగ వైభవంగా ఉన్న ఆ విద్వాంసుల వారు రాజావారి ఆస్థానంలో రాజావారు పాడమంటే పాడాలి, ఎవ్వరిమీద పాడమంటే వారిమీద పాడాలి. ఎక్కడికైనా వెళ్లాలన్నా రాజావారి అనుమతి తప్పనిసరి. తన సొంత నిర్ణయాలు ఉండేవి కాదు. ఇదంతా గమనిస్తున్న శిష్యుడు పొడుగు రామమూర్తికి తన గురువుగారిది బానిసత్వంలా తోచేది. తన గురువుకు స్వేచ్ఛ లేదని భావించేవారు. తనకు ఆ పరిస్థితి రాకూడదని భావిస్తూండేవారు. తనను ఎక్కడ ఆ రాజావారి ఆస్థానంలో బందీగా చేస్తాడో అని ముందుగానే భావించిన పొడుగు రామమూర్తి తన విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే తన గురువు సాలిగ్రామం గోపాలం వద్ధ అనుమతి తీసుకుని తమిళనాడులోని తచ్చూరి సింగాచార్య సోదరుల వద్ద చేరి మిగిలిన వీణా వాయిద్యాలను నేర్చుకున్నారు.
అలా నేర్చుకున్న సంగీత విద్యతో ఎన్నో కచేరీలు చేసి అనేకమందితో ప్రశంసలు పొందారు పొడుగు రామమూర్తి. విజయనగర సంస్థాన ప్రభువు విజయరామ గణపతి సంస్థానంలో ఆస్థాన విద్వాంసుడిగా నియమితులైనా కూడా అక్కడే ఉండడానికి ఇష్టపడని రామమూర్తి మైసూర్, నిజాం, తిరువాన్కూర్, సింథియా మొదలగు సంస్థానాలకు వెళ్లి తన వీణ గాన ప్రతిభను ప్రదర్శించి అనేక సన్మానాలు, సత్కారాలు పొందిన వైణిక వాగ్గేయకారులు పొడుగు రామమూర్తి. తాను నేర్చుకున్న విద్య ప్రదర్శించాల్సింది రాజుల వద్ధ, ప్రభువుల వద్ధ కాదని తెలుసుకుని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఒక గురుకులం స్థాపించి ఉచితంగా సంగీత బోధన చేసేవారు పొడుగు రామమూర్తి. తాను సంపాదించిన ధనంతో గురుకుల విద్యార్థులకు కనీస వసతులు, ఉచితంగా భోజన సదుపాయాలు కల్పించేవారు. శ్రీకాకుళం చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలలో ఉన్న జమీందారుల వద్దకు వెళ్లి, వార్షిక ధనం తెచ్చి గురుకుల విద్యార్థులకు ఉచితంగా సంగీత పాఠాలు బోధించేవారు పొడుగు రామమూర్తి. వీరు చేసే సంగీత విద్యాప్రచారం చుట్టుప్రక్కల వారికి తెలిసి, రామమూర్తిని ఆర్థికంగా ఆదుకునేందుకు సంగీత సభలను చేయాలనే తాపత్రయంతో అక్కడక్కడా ఉత్సవాలు కూడా జరుపుతుండేవారు.
గురువు సాలిగ్రామం గోపాలం నేపథ్యం..
సాలిగ్రామం గోపాలం విజయనగర సంస్థానంలో పెద్ద సంగీత విద్వాంసుడు. ఆయనకు పెద్ద ఇల్లు, ఇల్లుకు తగ్గ పెద్ద వాకిలి, అనేకమంది నౌకర్లు, చాకర్లు, మంది మార్భలంతో నిండి ఉన్న ఆ ప్రాంగణం పొద్దుపొద్దున్నే స్తోత్రం పాటలతో అందరినీ మేల్కొల్పుతూ ఉండేవారు. అనుష్టానం (తొలి సంధ్యావందం నుంచి మలి సంధ్యావందనం వరకు చేయవలసిన దైవిక, మనుష్య, భూత ఇంకా ఇతర కర్మలు) గబగబా చేస్తుండేవారు. ఆ వెంటనే పల్లకి ఎక్కి రాజాస్థానానికి వెళ్లేవారు. అక్కడి నుంచే కళా – కార్మికత్వం చేసేవారు. ఎప్పుడు పాడమంటే అప్పుడు, ఏమి పాడమంటే అది, ఎవ్వరి మీద పాడమంటే వారి మీద పాడేవారు. ఇట్టి విషయాన్ని ఆయన దగ్గర శిష్యరికం చేస్తున్న చిరంజీవి పొడుగు రామ్మూర్తి గమనిస్తున్నాడు.
గురువుగారు సాలిగ్రామం గోపాలం పట్టుమని పది నిమిషాలు కూడా పరమేశ్వరుడికి ప్రశాంతంగా అభిషేకం చేసేవారు కారు. ఎప్పుడు ఎవరో తరుముతున్నట్టే నిరంతరం తీరికలేకుండానే ఉండేవారు. ఐశ్వర్యానికి, కీర్తి ప్రతిష్టలకు కొదువేలేదు. పట్టు పంచె కట్టుకుని, జరీ శాలువా ధరించి, చేతులకు కంకణాలు, కాళ్ళకి బంగారు కడియాలు, నవరత్నాల దండను మెడలో అలంకరించి, నుదుటున కస్తూరి దిద్దుకుని, వెండి పొన్ను కర్ర వెండి పొడుం డబ్బా, కంఠానికి మంచి గంధం పూసుకుని, బంగారు గొలుసులతో బంధింపబడ్డ గంగిగోవులాగా వుండేవారు. వివిధ సంస్థానాలలో పనిచేసే ఆస్థాన విద్వాంసులు ఎప్పుడూ ఆస్థాన యాజమాన్యానికి కట్టుబడి ఉండాల్సిందే. వారు ఆస్థానం అనుమతి లేకుండా బయటకి రాలేరు. అలాంటి సంగీత విద్వాంసులు సాలిగ్రామం గోపాలం వద్ద శిష్యుడిగా చేరారు పొడుగు రామమూర్తి.
పొడుగు రామమూర్తి నేపథ్యం…
పొడుగు రామమూర్తి 1871 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం లో జన్మించారు. చిన్నప్పటి నుండే సంగీతం అంటే మక్కువ ఉన్న ఆయన తన పదవ యేట సంగీత విద్యాభ్యాసం నిమిత్తం గురువు సాలిగ్రామం గోపాలం వద్ద శిష్యుడిగా చేరారు. అలా చేరిన పొడుగు రామమూర్తి సుమారు 12 సంవత్సరాల పాటు తన “వీణ” విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. ఎంతటి 12 ఏళ్ల ఆహరహం నిరంతర సాధన చేసి, వీణ వాయిద్యంలో అపారమైన ప్రావీణ్యం సంపాదించారు. వీణ వాయిస్తూ, వాయిస్తూనే నిద్రలోకి జారుకునేవేరు రామమూర్తి. వీణ అంతలా తన శరీరంలో భాగమైపోయింది. నిద్రలోకి జారుకున్న శిష్యుడిని చూసిన సాలిగ్రామం గోపాలం కు కసితీరా శివలింగాన్ని కావలించుకున్న మార్కండేయుడిలా రామమూర్తి అనిపించేవారు. ఆ సమయంలో రామ్మూర్తిని గురువు గోపాలం లేవదీసి ప్రక్కమీద పడుకోబెట్టి ఆయనకు దుప్పటి కప్పేవారు. అలా పన్నెండేళ్ల వీణ విద్యాభ్యాసంలో అద్భుతంగా వీణ వాయించడం నేర్చుకున్న పొడుగు రామమూర్తికి గురువుగారిలా ఆస్థాన విద్వాంసుడిగా వుండిపోవడం ఇష్టం లేదు.
స్వేచ్ఛా వాయువులు పీల్చే మనసున్న రామమూర్తికి కళాసేవచేసి తరించాలన్నదే తన ఆకాంక్ష. మొదటి నుండి కూడా తాను దానినే ఆవలంభించాలని ఆశించేవారు కూడా. కానీ గురువు సాలిగ్రామం గోపాలం తనను ఆస్థానానికి రమ్మంటారేమోనని తన గుండెల్లో చిన్న గుబులుగా ఉండేది. ఎందుకంటే ఆస్థానంలో ఒక్కసారి వాయిస్తే, ఇక జీవిత ఖైదు పడ్డట్టే అని మదనపడుతూ ఉండేవారు రామమూర్తి. అందువలన ఉన్నట్టుండి ఒకరోజు తీరిక సమయం చూసుకుని గురువుగారి పాదాలకు నమస్కరించి “స్వామి తమరు అనుమతిస్తే, నాకు దక్షిణ దేశం వెళ్లి సంగీతాన్ని మరింత నేర్చుకోవాలని అభిలాషగా ఉంది” అన్నారు. అందుకు సంతోషించిన గురువు సాలిగ్రామం గోపాలం శిష్యుని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు పంపించారు. స్వాతంత్య్రం లభించి, స్వేచ్ఛగా ఆకాశంలో ఎగిరిపోతున్న పక్షిలా, అక్కడి నుండి బయలుదేరి తమిళనాడులోని తచ్చూరి సింగరాచార్య సోదరుల ప్రాంగణంలో వాలిపోయారు రామమూర్తి.
తచ్చూరి సింగాచార్య సోదరులు
“నిన్నే కోరి యున్నార నెనరుంచి నన్నేలుకోరా, పన్నగశయనుడౌ శ్రీ పార్థసారథి దేవ, సుమశరుని బారికోర్వలేరా” అనేది “వసంత” రాగం, ఆదితాళంలో కూర్చబడిన జగత్ప్రసిద్ధమైన “వర్ణం“. పాడేవారికే కాకుండా, సంగీత రసజ్ఞులందరికి సుపరిచితమైనది సుప్రియమైన “వర్ణం” కూడాను. దీని వాగ్గేయకారుడు, తచ్చూరు పెద్దసింగరాచార్య ఈయన త్యాగరాజ స్వామి వారికి యువ సమకాలీనుడు. వీరి తమ్ముడు అళహ సింగరాచార్యులు. వీరు ఉభయులూ బయకారులే. అంటే సంగీత కృతికర్తలే. అంతే కాకుండా సంగీత – సాహిత్యాలలో సృజనాత్మకరచనలు, శాస్త్రరచనలుచేసి సుప్రసిద్ధులైనవారు.
“గాయక పారిజాతం”, “సంగీత కళానిధి”, “స్వరమంజరి”, “గాయక సిద్ధాంజనం”, “గానేందుశేఖరం”, “గాయకలోచనం”, “భాగవత సారామృతం” ఇలా లోక ప్రసిద్ధిని పొందిన ప్రామాణిక రచనలని ఈ పండితులు ప్రశంసించారు. ఈ గ్రంథాలన్నీ తెలుగు భాషలోనే సులభశైలిలో రచింపబడినవి. ఇంతే కాక చెన్నై – తిరువళ్ళిక్కేణి నివాసులైన వీణావాదన కోవిదులు రామానుజాచార్యులవారు రచించిన “సంగీత సర్వార్థసార సంగ్రహం” అనే గ్రంథాన్ని తచ్చూరు సోదరులు, అనేక శాస్త్రీయ విషయాలతోను, వివిధ వాగ్గేయకారుల సంగీతరచనల ఉదాహరణలతోను పరిష్కరించి ప్రకటించారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన కర్ణాటక సంగీత త్రయంలో ఒకరైన శ్యామ శాస్త్రి కుమారుడు, సుబ్బరాయ శాస్త్రి వద్ద సహాయకుడిగా శిక్షణ పొందిన చంద్రగిరి రంగాచార్యులకు సింగరాచార్య సహోదరులు సన్నిహిత బంధువులు. ఆ చంద్రగిరి రంగాచార్యులు ఈ సింగరాచార్య సహోదరులకు తగిన సంగీత శిక్షణనిచ్చారు. ఆ తరువాత అన్నదమ్ములిద్దరూ తంజావూరు సంగీతం బాణీని స్వరకషంగా అధ్యయనం చేశారు. వారిద్దరూ మద్రాసు పట్టణంలో స్థిరనివాసం ఏర్పరచుకుని విజయనగరం మహారాజా ఆనందగజపతి మహా రాజు గారి ఆస్థాన విద్వాంసులుగా ఉండేవారు. అందువలననే, పెద్ద సింగరాచార్యులు, తమ రచన “సంగీతకళానిధి” గ్రంథాన్ని, ఆనంద గజపతి మహారాజు గారికి అంకితం చేసేశారు. తమిళం, సంస్కృతం, మరాఠీ భాషలలో చక్కని భాషాజ్ఞానం కలిగిన పెద్ద సింగరాచార్యులకి తెలుగుభాషలో సంపూర్ణ సాధికార జ్ఞానం ఉన్నందున, ఆ నాటి చెన్నపట్నం మహానగరంలో గల పచ్చయ్యప్ప కళాశాలలో తెలుగు పండితులుగా పనిచేశారు.
గోకలే హాలులో రామమూర్తి కచేరీ…
ప్రముఖ వాగ్గేయకారులు తచ్చూరి సింగాచార్య సోదరులు వద్ద శిష్యరికంలో చేరి సంగీతాన్ని అభ్యసించారు. అక్కడ సంగీతం నదుల వలె పరవళ్ళు తొక్కుతూ ప్రవహించింది. అలా కొంతకాలం గడిచిన పిమ్మట ఒకరోజు గోకలే హాలులో చిన సింగాచార్య పక్క వాయిద్యంతో సంగీత యజ్ఞం కచేరీ మొదలైంది. ఆ వేడుకకు సంగీత రసజ్ఞులైన ప్రేక్షకులతో, సంగీత అభిమానులతో, అశేష జనంతో కిటికీటలాడుతోంది. అక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథుల్లో తిరువత్తూర్ త్యాగయ్య, సుమతి కృష్ణారావు, బెంగుళూరు నాగరత్నమ్మ (తిరువయ్యారులో త్యాగరాజ స్వామి వారి సమాధికి తన ఆస్తి మొత్తం ధారపోసిన పుణ్యాత్మురాలు) హాజరయ్యారు.
పొడవు రామమూర్తి ఒక్కసారి గురుస్మరణ చేసుకుని విణ మీటారు. వింటున్న శ్రోతల హృదయాలను మీటినట్లయి, వారంతా ఆనందంతో పరవశించిపోయారు. నారదుడు తన “మహతి” మీటినట్టు, తుంబురుడు తన “కళావతి” ని మీటినట్టు, రసికజనం స్వరసముద్ర తరంగాలలో మునిగితేలుతున్నారు. ఆ వీణా విరాట్ మూర్తికి నమస్కరిస్తూ చప్పట్ల వర్షం కురిసింది. అంత పొడుగు రామ్మూర్తి పరవశంతో వామనుడు అయిపోయారు. ఈ విషయం తెలుసుకున్న విజయనగరం రాజావారు తన ఆస్థానానికి రావలసిందిగా, ఆస్థానాన్ని అంగీకరించవలసిందిగా ఆహ్వానం అందింది. స్వేచ్ఛా స్వతంత్ర్యాలు కోరుకునే పొడుగు రామమూర్తికి ఆస్థానంలో ఉండడం అంటే పంజరంలో ఉన్న పక్షిలాగా అనిపిస్తుంది.
గురుకులం స్థాపించి ఉచితంగా భోజనం, సంగీతం నేర్పిస్తూ…
పొడుగు రామమూర్తికి మొదటి నుండి కూడా స్వేచ్ఛా వాయువులను పీల్చే అలవాటు ఉండేది. అందుచేతనే కాబోలు విజయనగరం ఆస్థాన విద్వాంస పదవికి స్వస్తి చెప్పి ఆయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట గ్రామంలో ఉండడం మొదలుపెట్టారు. నరసన్నపేటలో గురుకులాన్ని స్థాపించారు. గురుకులంలో ఉచిత భోజన సౌకర్యం కల్పించి సంగీతాన్ని బోధించేవారు. గురుకులం నిర్వహణ కోసం రామమూర్తి చుట్టుప్రక్కల ఉన్న టెక్కలి, పర్లాకిమిడి, మందసా, చీకటి కోట, సురంగి మొదలైన జమీందార్ల వద్దకు వెళ్లి వార్షికంగా ధనాన్ని తెచ్చేవారు. ఆ ధనంతో విద్యార్థులకు ఉచితంగా సంగీతం నేర్పేవారు. వీరు చేసే సంగీత విద్యాప్రచారం వల్ల చుట్టుప్రక్కల గ్రామాల వారు సంగీత సభలు చేయాలనే తాపత్రయంతో ఉత్సవాలు జరిపేవారు. ఆ విధమైన ప్రోత్సాహకాలు ఉండడం వలననే ఉర్లాం, పోలాకి, నర్సన్నపేట, శ్రీకాకుళం, బరంపురాలలో సంగీత ఉత్సవాలు జరిపేవారు.
పొడుగు రామమూర్తి విద్యాభిరుచికి, నైపుణ్యానికి మెచ్చిన ఉర్లాం జమీందారిణీ శ్రీ మహా లక్ష్మమ్మ గారు ఒక్కసారి ఆదిభట్ల నారాయణ దాసు అధ్యక్షతన బంగారు కంకణాలను తొడిగారు. అలాగే దివాన్ బహద్దూరు కొమ్మారెడ్డి సూర్యనారాయణ మూర్తి 1911లో పొడుగు రామ్మూర్తిని కాకినాడకు రప్పించి, అతిథిగా గౌరవించి నాలుగు సంవత్సరాలు తన ఇంటనే ఉంచారు. 1912 లో కాకినాడ సరస్వతీ గాన సభలో బందరు రామమూర్తి మృదంగ సహాకారంతో పొడుగు రామమూర్తి వీణా గానం జరిగింది. ఆ సభకు హరి హర నాగభూషణం, మహారాజపురం విశ్వనాథ అయ్యర్, గోవిందస్వామి పిళ్లై ఆహూతులుగా వచ్చారు. ఈ సందర్భంగా సూర్య నారాయణ మూర్తి నాయుడు “వైణిక సార్వభౌమ” అనే బిరుదును బంగారు పతకం మీద చెక్కించి పొడుగు రామమూర్తికి బహుమానంగా ఇచ్చారు. 1942 లో తాను మరణించేవరకు కూడా తన సంగీత సామ్రాజ్యానికి, సార్వభౌమత్వాన్ని ఆపాదించిన పొడుగు రామ్మూర్తి ఎప్పటికీ ధన్యుడే.