
20వ శతాబ్దపు తెలుగు రచయిత, “కవి సమ్రాట్” బిరుదాంకితులు విశ్వనాథ సత్యనారాయణ. అతని రచనలలో కవిత్వం, నాటకీయ నాటకం, నవలలు, ప్రసంగాలు, చిన్న కథలు ఉన్నాయి. మతం, తత్వశాస్త్రం, చరిత్ర, సామాజిక శాస్త్రం, భాషాశాస్త్రం, జ్ఞాన శాస్త్రం, రాజకీయ శాస్త్రం, మనస్తత్వశాస్త్రం, స్పృహ అధ్యయనాలు, ఆధ్యాత్మికత, సౌందర్యం వంటి అనేక రకాల విషయాలను మేళవింపజేస్తాయి. విశ్వనాథ సత్యనారాయణ ఆధునిక శైలిలో, శాస్త్రీయ శైలిలో, సంక్లిష్ట రీతుల్లో రచనలు చేశారు. 20వ శతాబ్దంలోని ఆంధ్ర సాహిత్యానికి, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యానికి పెద్ద దిక్కు విశ్వనాథ సత్యనారాయణ.
ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు. తిరుపతి వెంకట కవులు ద్వయానికి చెందిన ప్రముఖ తెలుగు రచయిత చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి యొక్క విద్యార్థి విశ్వనాథ సత్యనారాయణ. ఈయన కవితలు, కావ్యాలు, నవలలు, పద్యకావ్యాలు, నాటకాలు, ప్రయోగాలు, కథలు, విమర్శలు, వ్యాసాలు, చరిత్రలు, పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. “నేను వ్రాసిన పద్యాల సంఖ్య , ప్రకటింపబడిన వాటి సంఖ్య సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును ” అన్నారు విశ్వనాథ సత్యనారాయణ. ఆయన వ్రాసిన రచనలన్నీ కలిపితే లక్ష పుటలు ఉండవచ్చును.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం నందమూరులో తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబంలో శోభనాద్రి, పార్వతి దంపతులకు జన్మించిన విశ్వనాథ సత్యనారాయణ చిన్నతనంలో సుఖప్రదమైన జీవితాన్ని అనుభవించాడు. కానీ తన తండ్రి శోభనాద్రికున్న దాతృత్వ గుణం వల్ల కష్టదశ ఏర్పడి దారుణమైన పేదరికాన్ని అనుభవించారు. తరువాత రోజులలో శోభనాద్రి కేవలం అంగవస్త్రం, పంచె మాత్రమే సర్వవస్త్రాలుగా మిగిలాకా కూడా దానాలిచ్చి దూసిన స్వర్ద్రువై మిగులు ధోవతినొక్కడు దాల్చిన స్థితిలో జీవించాల్సి వచ్చింది.
తన బాల్యంలో విశ్వనాథ సత్యనారాయణ పుట్టిపెరిగిన గ్రామంలో దేశికవితా రీతులతో గానం చేసే భిక్షుక బృందాలూ, పురాణగాథలు నేర్చి ప్రవచించడంతో నిత్యం గడిపే స్వజనం కలిసి ఆయన కవిత్వానికి పునాదులు వేశాయి. తెలుగు ఉపాధ్యాయులు చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి వద్ద చేరి ఎన్నెన్నో భాషా, సాహిత్య విశేషాలను నేర్చుకుని తుదకు గొప్ప పండితులుగా మారిపోయారు విశ్వనాథ సత్యనారాయణ. 1934లో తన నవలలలో అత్యంత ప్రసిద్దమైన నవలగా ప్రజాదరణ పొందిన “వేయిపడగలు” నవలను విశ్వనాథ సత్యనారాయణ రచించారు. ఈ నవలను విశ్వనాధ సత్యనారాయణ ఆశువుగా చెబుతుండగా సరిగ్గా 29 రోజుల్లో 999 అరటావుల మీద అతని తమ్ముడు వేంకటేశ్వర్లు వ్రాశారు. ఈ నవల పలుమార్లు పునర్ముద్రితమైనది.
విశ్వనాథ సత్యనారాయణ రచనా పరంపర పుంఖానుపుంఖాలుగా కొనసాగింది. తెలుగుభాషకు వందల్లో రచనలందించిన విశ్వనాథ 25 పైచిలుకు కావ్యాలు, 6 శతకాలు, 13 గేయకావ్యాలు, 15 నాటకాలు, 58 నవలలు, 10 సంస్కృత నాటకాలు, 10 విమర్శన గ్రంథాలు, మరెన్నో వ్యాసాలు, ఉపన్యాసాలు తెలుగువారికి అందించారు. అంతేకాకుండా తన రచనలను కొన్ని ఇతర భాషలలోకి కూడా అనువదించారు. ఆల్ ఇండియా రేడియో కోసం నాటకాలను , ప్రసంగాలు రూపొందించారు. ఆనాటి యువతరాన్ని ఆకట్టుకొనే వ్యావహారిక భాషలో కోకిలమ్మ పెళ్ళి, కిన్నెరసాని పాటలు వ్రాశారు. విశ్వనాథ నవలలలో పురాణవైర గ్రంథమాల క్రింద వచ్చిన 12 నవలలు మహాభారతానంతర పూర్వయుగ భారతదేశ చరిత్రను మరొకవిధంగా చూపుతాయి.
వీటిలో ప్రతి నవలా ఉత్సుకతతో నిండిన కథ, అనితరమైన అతని శైలి, విశేషమైన పాత్రలతో పాఠకులను ఆకట్టుకొంటాయి. అయితే ఇన్ని రచనలు చేసిన విశ్వనాథ సత్యనారాయణ తెలుగు సినిమారంగం కోసం కేవలం ఒకే ఒక స్క్రిప్టును రచన చేశారు. త్రిమూర్తి ఫిల్మ్స్ పతాకంపై 1951 లో జంధ్యాల గౌరీనాథశాస్త్రి నిర్మించిన “ఆకాశరాజు” చిత్రానికి కథా కల్పన, మాటలు, పాటలు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అందించారు. ఆ తరువాత గౌరీనాథశాస్త్రి నిర్మించగా 1948 లో పరాజయం పాలైన “గీతాంజలి” చిత్రాన్ని పునః విడుదల కోసం ఆ చిత్ర కథను, మాటలను మార్పులు చేర్పులు చేయడానికి మద్రాసు వెళ్లి రచన చేశారు. దురదృష్టవశాత్తు గీతాంజలి చిత్రం పునః విడుదలకు నోచుకోలేదు. ఆ వివరాలు మీకోసం..
నష్టాన్ని మిగిల్చిన “గీతాంజలి” (1948)…
నిండైన విగ్రహమూ, విశాల నేత్రాలు గల “జంధ్యాల గౌరీనాథ శాస్త్రి”కి ఏ రకమైన నాటకానుభవం లేకపోయినా సినిమాలోకి తీసుకున్నారు కె.వి.రెడ్డి. 1942 లో సినిమా రంగ ప్రవేశం చేసిన తరువాత కొన్నాళ్ళకు నిర్మాతగా మారి గీతాంజలి (1948) అనే చిత్రాన్ని నిర్మించారు. ఆయన శ్రీ శ్యామల ఫిల్మ్స్ పతాకంపై తంగిరాల హనుమంతరావు దర్శకత్వంలో 1947లో గీతాంజలి సినిమా చిత్రీకరణ మొదలుపెట్టారు. 09 మార్చి 1948 శివరాత్రి నాటికి విడుదలైంది. అప్పటికే మహాత్మా గాంధీ హత్యకు గురై నెల దాటిపోయింది. దాంతో గీతాంజలి సినిమాలో మహాత్మా గాంధీకి ఇష్టమైన రఘుపతి రాఘవ రాజారాం మరియు వైష్ణవ జనతో అనే పాటలను కూడా చేర్చారు. ఇదే విషయాన్ని ప్రచార ప్రకటనలో ప్రముఖంగా వాడుకున్నారు. ఆ చిత్రంలో జంధ్యాల గౌరీనాథశాస్త్రి కథానాయకుడిగా నటించగా శ్రీరంజని కథానాయిక. వీరితోపాటుగా టంగుటూరి సూర్యకుమారి, పూర్ణిమ తదితర తారగణం నటించారు.
యు.సూర్యనారాయణరావు కథ, మాటలు సమకూర్చగా తంగిరాల హనుమంతరావు తెరకెక్కించిన ఈ సినిమా విడుదలకు వారం రోజుల ముందు నుండే దినపత్రికల్లో ప్రకటన ఇస్తూ వచ్చారు. ప్రకటనలో నవీన గాథ, అపూర్వమైన సంగీతం, సంతోషకరమైన తెలుగు సాంఘిక చిత్రం అన్నారు. కానీ “గీతాంజలి” చిత్రాన్ని ప్రేక్షకులు ఎవ్వరూ పట్టించుకోలేదు. అగ్రనటులు, సినీ ప్రముఖులు చాలామందితో జంధ్యాల గౌరీనాథ శాస్త్రికి పరిచయం ఉంది. అయినా ఎందుకనో అప్పటికి పెద్దగా పేరులేని నటీనటులతో, అనుభవం లేని సాంకేతిక వర్గంతో, మొట్టమొదటి చిత్రాన్ని అలా ఎందుకు నిర్మించారో తెలియదు. ఏదేమైనా నిర్మాతగా జంధ్యాల గౌరీనాథ శాస్త్రి మొట్టమొదటి సినిమా “గీతాంజలి” భారీగా నష్టాలు మిగిల్చింది. దాంతో తన ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది.
విశ్వనాథ స్క్రిప్టు అందించిన ఏకైక చిత్రం “ఆకాశరాజు” (1951)…
ఒకవైపు గీతాంజలి (1948) సినిమా ఆర్థికంగా దెబ్బతిన్నా కూడా జంధ్యాల గౌరీనాథశాస్త్రి మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. ఆ రెండో చిత్రం పేరు “ఆకాశరాజు” (1951). ఈసారి నిర్మాణ బ్యానరు పేరు మార్చేసి త్రిమూర్తి ఫిల్మ్స్ అని పేరు పెట్టారు. వాహిని కుమారి అనే నటికి బాగా పేరుంది. మద్దెల నగరాజకుమారిగా పేరున్న ఆమె తక్కువ చిత్రాలలో నటించినప్పటికీ తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి ఆమె ఇందులో కథానాయిక. అద్దంకి శ్రీరామమూర్తి, చిలకలపూడి సీతారామాంజనేయులు, జంధ్యాల గౌరీనాథశాస్త్రి, లక్ష్మీరాజ్యం, వంగర, ఎస్వీ రంగారావు తదితర బాగా పేరున్న తారాగణం నటించారు. జ్యోతిష్ సిన్హా ఈ చిత్రానికి ఛాయాగ్రహణంతో బాటుగా దర్శకత్వం కూడా వహించారు.
మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ సినిమాకి మాటలు, పాటలు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అందించారు. ఆయన స్క్రిప్టు సమకూర్చిన ఏకైక చిత్రం “ఆకాశరాజు”. ఆ తరువాత దశాబ్దాలలో ఆయన వ్రాసిన “ఏకవీర” నవలను చిత్తజల్లు శ్రీనివాసరావు దర్శకత్వంలో “ఏకవీర” (1969) సినిమాగా తీశారు. కానీ విశ్వనాథ సత్యనారాయణ సినిమా రచన చేసిన చిత్రం “ఆకాశరాజు”. ఆ సినిమా ప్రకటనలో కూడా కథాకల్పన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అని ప్రచారంలో పేర్కొన్నారు. ఈ చిత్రం 16 ఫిబ్రవరి 1951 నాడు విడుదలైంది. అయితే జంధ్యాల గౌరీనాథశాస్త్రి చేసిన రెండో ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. ఆకాశరాజు చిత్రం కూడా నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది. దాంతో ఆయన కష్టాల ఖాతా కూడా నిర్మానుష్యంగా పెరిగిపోయింది.
విశ్వనాథ సత్యనారాయణను మద్రాసుకు పిలిపించి…
జంధ్యాల గౌరీనాథ శాస్త్రి తాను నిర్మించిన రెండు చిత్రాలు పరాజయం మూటకట్టుకోవడంతో ఆయన మరో ప్రయత్నం చేశారు. 1948 వ సంవత్సరంలో తాను నిర్మించి, విడుదల చేసి అపజయం పాలైన చిత్రం “గీతాంజలి” ని మార్పులు, చేర్పులు చేసి మళ్ళీ విడుదల చేద్దాం అని అనుకున్నారు. ఆ ప్రయత్నంలో గౌరీనాథశాస్త్రి పంపిణీదారులను సంప్రదించి ఈ మార్పులు, చేర్పుల ఆలోచన గురించి చెప్పారు. పంపిణీదారులు కూడా ఈ ఆలోచన బాగానే ఉంది, కానీ ఈ మార్పులు, చేర్పులు అనేవి కె.వి.రెడ్డి సమక్షంలో జరిగితే బాగుంటుంది. అలా జరిగితే ఈ సినిమా విడుదల చేయడానికి మాకేమి అభ్యంతరం లేదు అన్నారు. ఆ సమయంలో కె.వి.రెడ్డి తన దర్శకత్వంలో పెద్దమనుషులు (1954) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఆ సమయంలో కె.వి.రెడ్డి దగ్గరకు వెళ్లిన జంధ్యాల గౌరీనాథ శాస్త్రి తనకు గీతాంజలి సినిమా పునః విడుదలకు సహాయం చేయాల్సిందిగా కోరారు. ఆ సినిమాను మళ్లీ విడుదల చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాల్సిందిగా ఆయన కె.వి.రెడ్డిని కోరారు. ఆ సమయంలో పెద్దమనుషులు (1954) సినిమా చిత్రీకరిలో కె.వి.రెడ్డి తీరికలేకుండా ఉన్నారు. అయినా కూడా ఆయన జంధ్యాల గౌరీనాథ శాస్త్రికి సహాయం చేయడానికి ఒప్పుకున్నారు. గీతాంజలి సినిమాలో మార్పులు చేయాలంటే కథలో ఎక్కడో మార్పులు చేయాలి. అందుకోసం ఆయన అంతకుముందు సంవత్సరమే ఆకాశరాజు చిత్రానికి తనతో కలిసి పనిచేసిన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణను ఒప్పించి మద్రాసుకు పిలిపించారు గౌరీనాథశాస్త్రి.
గీతాంజలి స్క్రిప్టుని మళ్ళీ వ్రాసిన విశ్వనాథ సత్యనారాయణ…
పగలంతా “పెద్దమనుషులు” సినిమా పనిలో వుండే కె.వి.రెడ్డి, రాత్రిపూట మాత్రం విశ్వనాథ సత్యనారాయణ మరియు జంధ్యాల గౌరీనాథ శాస్త్రితో కలిసి “గీతాంజలి” సినిమా చర్చలు నిర్వహించేవారు. అయితే ఆ రోజుల్లో గీతాంజలి సినిమా చర్చల గురించి మద్రాసులో ఏం జరిగిందనేది విశ్వనాథ సత్యనారాయణ తన దినచర్య పుస్తకంలో ఇలా వ్రాసుకున్నారు. 01 నవంబరు 1951 మద్రాసు, గీతాంజలి రచన ప్రారంభం.. సాయంకాలం 8:00 గంటల నుండి రాత్రి 11:30 వరకు. ఆ తరువాత నవంబరు 01 నుండి రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు తేదీలు రాత్రి 8:00 నుండి 11:30 వరకు గీతాంజలి రచన గురించి విశ్వనాథ సత్యనారాయణ తో కె.వి.రెడ్డి చర్చలు జరుపుతూ ఉండేవారు.
నవంబరు 07 నాడు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో వారికి ఖద్దరు శాలువా ఇచ్చారు. కోణంగి అప్పారావు అక్కడ అభ్యాసకులు (లెక్చరర్), జంధ్యాల గౌరీనాథ శాస్త్రి, కె.వి.రెడ్డి, ముదిగొండ లింగమూర్తి సాయంత్రం 8:30 నుండి రాత్రి 11:30 సాయంత్రం వరకు అందరం గీతాంజలి సినిమా చర్చలకు కూర్చున్నామని విశ్వనాథ సత్యనారాయణ గారు తన దినచర్యలో వ్రాసుకున్నారు. ఆ తరువాత మళ్లీ 8 వ తారీఖు, 9 వ తారీఖు సాయంత్రం 8:00 నుండి రాత్రి 11:00 గంటల వరకు మద్రాసులో గీతాంజలి రచన అయిపోయింది. జంధ్యాల గౌరీనాథ శాస్త్రి అడిగిన మార్పులు చేర్పులను విశ్వనాథ సత్యనారాయణ విజయవంతంగా వ్రాశారు. ఇలా గౌరీనాథ శాస్త్రి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా గీతాంజలి చిత్రం పునః విడుదల జరగలేదు. దాంతో రెండు సినిమాల గీతాంజలి (1948), ఆకాశరాజు (1951) సినిమాలు మిగిల్చిన నష్టాలను పూడ్చుకునే అవకాశం గౌరీనాథశాస్త్రి కి రాలేదనే చెప్పాలి.
ఇతర కథనాలు:
ఆధునిక మల్లయోధులు, కలియుగ భీమ.. కోడి రామ్మూర్తి నాయుడు.
అలనాటి చలనచిత్ర శబ్దగ్రాహక శాఖ అధిపతి.. “వల్లభజోష్యుల శివరామ్”
ఆరోజు యం.జి.ఆర్ సహాయం చేయకపోతే ఏమైపోయేదాన్నో.. జయలలిత..









