Telugu Special Stories

తెలుగు రాష్ట్రాలలో మొదటిస్థానంలో ఉన్న ఈనాడు దినపత్రిక వ్యవస్థాపన..

తెలుగులో వెలువడ్డ తొలి పత్రిక “కర్నాటిక్ గెజెట్”. మద్రాసు నుండి ప్రచురణ జరిగే “కర్నాటిక్ గెజెట్” అనే పత్రిక తెలుగు, తమిళ, ఇంగ్లీషు భాషల్లో వెలువడేది. దీని ప్రచురణ 19 వ శతాబ్ది తొలి అర్ధ భాగంలో 1832 ప్రాంతంలో మొదలైంది. ఆ తరువాత 1835 ప్రాంతంలో బళ్ళారి నుండి సత్యదూత అనే పత్రిక వచ్చింది. అలాగే 1837 లో “వృత్తాంతి” అనే పత్రిక మొదలైంది. ఆ తరువాత “వర్తమాన తరంగిణి” అనే తెలుగు పత్రిక వెలువడింది. “హితవాది” అనే క్రైస్తవ మత పత్రిక 1862 వ సంవత్సరం మచిలీపట్నం నుండి వెలువడింది. ఆ విధంగా ఒక్కో పత్రిక వెలువడుతూనే 1880 వ సంవత్సరం నాటికి తెలుగు పత్రికలు తామరతంపరగా పుట్టుకొచ్చాయి. కేవలం మద్రాసు నుండే కాకుండా, ఆంధ్రదేశంలోని రాజమహేంద్రవరం, మచిలీపట్నం కేంద్రాలుగా పలు పత్రికలు వచ్చాయి. అలాగే పట్టణాల నుండే కాక, చిన్న చిన్న గ్రామాల నుండి కూడా పత్రికలు వెలువడ్డాయి. ఎంతోమంది ఎన్నో పత్రికలు స్థాపించినప్పటికీ, వాటిలో దీర్ఘకాలం మనగలిగిన పత్రికలు చాలా తక్కువగా ఉంటూ వచ్చాయి. 1875 నుండి 1926 మధ్య 50 సంవత్సరాల కాలంలో సుమారు 516 పత్రికలు వెలువడగా, వీటిలో అనేక పత్రికలు చాలా తక్కువ కాలంలోనే ఆగిపోయాయి.

1940 వ సంవత్సరం నాటికి 184 పత్రికలు ప్రచురణలో ఉన్నాయి. 19 వ శతాబ్ది చివరి దశాబ్దాల్లో పత్రికలను చదివేవారి సంఖ్యను బట్టి సగటు కాపీల సంఖ్య సాధారణంగా 100 నుండి 500 వరకు ఉండేది. అయితే వెయ్యికి పైన ప్రతులు ముద్రించిన తొలి రాజకీయ పత్రిక “కృష్ణాపత్రిక”. 1930 ల నాటికి పత్రికల ముద్రణ ప్రతులు 3 వేల వరకు చేరింది. బ్రిటిషు వారి పాలనలో రాజకీయ వార్తలను ప్రచురించే పత్రికలపై ప్రభుత్వ నిఘా ఉండేది. ఆయా పత్రికలలో ప్రచురించిన వార్తలపై, వాటి ప్రచురణ సంఖ్యపై స్థానికంగా ఉండే ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వానికి రహస్య నివేదికలు పంపించేవారు.

బ్రిటిషు ప్రభుత్వ దమననీతిని విమర్శించినందుకు గాను స్వరాజ్య పత్రిక సంపాదకులు గాడిచర్ల హరిసర్వోత్తమరావుకు, బోడి నారాయణరావుకూ 1908 వ సంవత్సరంలో జైలు శిక్షలు అనుభవించారు, తద్వారా స్వరాజ్య పత్రిక మూతబడిపోయింది. సరిగ్గా ఇదే కారణాన్ని ఎదుర్కొన్న ముట్నూరి కృష్ణారావు తాను స్థాపించిన కృష్ణాపత్రిక మూతబడకుండా కాపాడేందుకు గాను, తన పత్రిక సంపాదకత్వానికి రాజీనామా చెయ్యాల్సి వచ్చింది. దీర్ఘ కాలంగా, నిరంతరాయంగా ప్రచురణలో ఉన్న పత్రిక, జమీన్‌రైతు. ఇది 1930 లో మొదలై ఇప్పటివరకు సుమారు 95 ఏళ్ళుగా ప్రచురణ జరుపుకుంటూనే వుంది. 

ఎంతో మంది తెలుగు పత్రికను స్థాపించిన ప్రముఖులు ఉన్నారు. ఒక్కొక్కరు ఒకటి కంటే ఎక్కువ పత్రికలను ప్రచురణ జరిపేవారు. చాలా పత్రికలకు స్వంత ముద్రణాలయాలుండేవి. తొలినాళ్ళలో తెలుగు పత్రికలను స్థాపించిన ప్రముఖులలో కందుకూరి వీరేశలింగం పంతులు, ఎ.సి.పార్థసారథి నాయుడు, శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి, సత్తిరాజు సీతారామయ్య, కొక్కొండ వెంకటరత్నం పంతులు, దేవగుప్తం శేషాచలపతిరావు మొదలైనవారు ఉన్నారు. అనంతర కాలంలో వచ్చిన పత్రికా ప్రముఖుల్లో మరి కొందరు ముట్నూరి కృష్ణారావు, కాశీనాథుని నాగేశ్వరరావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, తాపీ ధర్మారావు, నార్ల వెంకటేశ్వరరావు, ఎ.బి.కె ప్రసాద్ మొదలగువారు. ఆ ప్రముఖుల జాబితాలో చేరిపోయారు ఈనాడు తెలుగు వార్తా పత్రిక వ్యవస్థాపకులు రామోజీరావు. ఆయన ప్రారంభించిన ఈనాడు దినపత్రిక తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ముద్రణ ప్రతులు కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2019 జనవరి – జూన్ గణాంకాల ప్రకారం, సగటున 16,56,933 అమ్మకాలతో దేశంలో ఎనిమిదవ స్థానంలో నిల్చింది. ఈ పత్రికను ఆయన మొదట ఎక్కడ వ్యవస్థాపించారు? దానికోసం ఆయన ఎలాంటి వ్యూహాలు పన్నారు? ముద్రణ పరికరాలు ఎక్కడినుండి కొన్నారు? ఎంతమంది సిబ్బందితో ముద్రణ మొదలుపెట్టారు వివరాలు ఒకసారి చూద్దాం..

ఈనాడు లోగో…

ఈనాడు దినపత్రిక మొదలుపెట్టడానికి ముందు దాని పేరును రూపకల్పన చేయడానికి ఒక చక్కని “లోగో” తయారుచేయడానికి నార్లకంటి స్వామి అనే చిత్రకారునికి “మాస్ట్‌ హెడ్‌” రూపకల్పన బాధ్యతలు అప్పగించారు. ఆయన 1964 నుండి హైదరాబాదులో కిరణ్ యాడ్స్ (ప్రకటనల) లో పనిచేస్తున్నారు. ఆయనకే ఈనాడు కు అనే “మాస్ట్‌ హెడ్‌” రూపొందించే బాధ్యతలు అప్పగించారు. ఆయన కేవలం ఈనాడు కు “మాస్ట్‌ హెడ్‌” రూపొందించడమే కాకుండా తరువాత రోజులలో “అన్నదాత”, “సితార”, “న్యూస్ టుడే”, “న్యూస్ టైమ్స్”, “డాల్ఫిన్ హోటల్స్”, “కిరణ్ యాడ్స్” మొదలు వాటికి రూపకల్పన చేశారు. ఈనాడు పత్రికను ప్రారంభానికి రెండు నెలల ముందే నార్లకంటి స్వామిని పిలిపించి నమూనాగా ఈనాడు అనే పేరును మూడు రకాలుగా తయారుచేసి తీసుకురమ్మని చెప్పారు రామోజీరావు.

దాంతో నార్లకంటి స్వామిని ఐదు రకాల నమూనాలను వ్రాసి తీసుకెళ్లారు. వాటిల్లో చతురస్రాకార రూపంలో ఉన్న అక్షరాల నమూనా రామోజీరావుకి బాగా నచ్చింది. దానికి కొన్ని మార్పులు, చేర్పులు చేసి చెప్పారు రామోజీరావు. అప్పుడు నార్లకంటి స్వామి మనస్సులో ఈ.వీ.ఎం వారి లోగోకు ఛాయలు (షేడ్స్) ఉన్నట్లుగా ఈనాడుకు కూడా ఉంటే బావుండును అనిపించింది. అప్పుడు ఈనాడు అనే పేరుకు కూడా ఛాయలు (షేడ్స్) ఇచ్చి రామోజీరావుకు చూపించారు. అలాగే అక్షరాల అంచులలో పైకి కనపడేలా తెల్లటి అంచును (వైట్ బోర్డర్) ఇవ్వమన్నారు. ప్రతీ అక్షరం మధ్యలో గీతలు వేశారు. లోగోను ఎంత చిన్నగా చేసినా సరే అందులో అన్ని అంశాలు కనపడేలా, ప్రతీ గీత మధ్యలో ఎంత దూరం ఉంటుందో అంచనా వేసుకుని మరీ ఈనాడు లోగోను తయారుచేశారు నార్లకంటి స్వామి. పలకల్లాంటి అక్షరాలతో ఈనాడు లోగో నమూనా తయారుచేయగా, అక్షరాల మధ్య గీతలు పెట్టించి తుది ముద్ర ఖరారు చేశారు రామోజీరావు. ఆ ముద్రే తరువాత రోజులలో తెలుగు పాఠకుడి గుండెల్లో చెరగని ముద్రయ్యింది.

విశాఖపట్నం లోని నక్కవాని పాలెం లో వ్యవస్థాపన…

ఎట్టకేలకు ఈనాడు అనే పేరు నమోదు చేయించారు. నిజానికి ఒకరిని అనుకరించడం అలవాటు లేని రామోజీరావు, అప్పుడు అలాంటి గొప్ప సాహసమే చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే అప్పట్లో పత్రికలన్నీ ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్ర జనత, ఆంధ్రజ్యోతి, విశాలాంధ్ర ఇలా అన్ని పత్రికల పేర్లలో “ఆంధ్ర” అనే పదంతో ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో “ఆంధ్ర” అనే పదం లేకుండా ఓ దినపత్రిక పేరు పెట్టడం సాహసోపేతమే. విశాఖలో పత్రిక పెట్టడం సాహసోపేతమైతే, దానికి ఎంచుకున్న పేరు “ఈనాడు” కూడా ఓ సంచలనం. “నాడు” అంటే “ప్రాంతము”, “రోజు” అని రెండర్థాలు ఉన్నాయి. ఈనాడు అంటే ఈ ప్రాంతం అనైనా అనుకోవచ్చు, ఈ రోజు అనైనా అనుకోవచ్చు. 1975 ప్రాంతంలో విశాఖపట్నంలో దినపత్రికను వ్యవస్థాపించాలంటే మాములు మాటలు కాదు. దానికి ఒక కార్యాలయం కూడా ఉండాలి. అందుకోసం వందలాది ఎకరాలు ఖాళీగా కనిపిస్తుండే నక్కవాని పాలెం గ్రామాన్ని ఎన్నుకున్నారు. 

నక్కవాని పాలెం గ్రామం విశాఖపట్నం లోని సీతమ్మధార ప్రాంతంలో ఉండే ఒక చిన్న గ్రామం. అప్పట్లో అక్కడ 130 ఇళ్లు ఉండేవి. అంటే ఆ గ్రామ జనాభా సుమారు 800 వరకు ఉండేది. నక్కవాని పాలెం చుట్టూ ఎనిమిది గ్రామాలు ఉండేవి. ఈ తొమ్మిది గ్రామాల జనాభా అంతా కలిసి ఇరవై వేల పైచిలుకు ఉండేది. వందల ఎకరాలు ఖాళీగా కనిపించే నక్కవానిపాలెంలో 1940 ప్రాంతంలో కట్టిన ఒక స్టూడియో ఉండేది. ఆ స్టూడియోలో “భక్త జయదేవ” (1961) లాంటి సినిమా చిత్రీకరణ జరిగాయి. ఆ స్టూడియోను తరువాత రోజులలో భారత ఆహార గిడ్డంగుల సంస్థ (ఎఫ్.సి.ఐ) వారు అద్దెకు తీసుకుని వాటిలో భాండాగారము లను (గోడౌన్స్) నిర్వహించారు. 1975 నాటికి ఎఫ్.సి.ఐ వారు కూడా వాటిని ఖాళీ చేశారు. అందులోనే రామోజీరావు “ఈనాడు” పత్రికను నిర్వహించారు. ఆ విధంగా ఈనాడు దినపత్రిక నక్కవానిపాలెం లో ప్రారంభమైంది.

నవహింద్ టైమ్స్ నుండి ముద్రణ యంత్రం కొనుగోలు…

ఈనాడు అనే పేరుతో లోగో తయారయ్యింది, నక్కవాని పాలెం లో కార్యాలయం తయారయ్యింది. ఇక మిగిలింది పత్రిక ముద్రణ కోసం ముద్రణ యంత్రం కావాలి. ఈనాడు పత్రిక ప్రారంభం అవ్వడానికి 5 నెలల ముందే, పత్రిక అచ్చువేయడానికి ముంబయిలోని నవ్‌హింద్ టైమ్స్‌ నుంచి సెకండ్‌ హ్యాండ్ డూప్లెక్స్ ఫ్లాట్ బెడ్ రోటరీ ప్రింటింగ్‌ ప్రెస్‌ కొన్నారు. నవ్‌హింద్ టైమ్స్‌ వారు సెకండ్‌ హ్యాండ్ డూప్లెక్స్ ఫ్లాట్ బెడ్ రోటరీ ప్రింటింగ్‌ ప్రెస్‌ ను “మరాఠ డైలీ” నుండి 1962 వ సంవత్సరంలో 95,000 రూపాయలకు కొనుగోలు చేశారు. వారు కొన్ని సంవత్సరాలు వాడిన తరువాత, రామోజీరావుకు 1,05,000 రూపాయలకు అమ్మేశారు. చూడడానికి సెకండ్ హ్యాండ్ దే అయినా, చేతులు మారుతున్నా గానీ దాని సామర్థ్యం బాగానే ఉండేది. దశాబ్దాల పాటు మాత్రమే కాకుండా శతాబ్దాల పాటు నమ్మకం గాను, సమర్థవంతంగానూ, సామర్థ్యం తగ్గకుండాను పనిచేసేవి. ఆ ముద్రణ యంత్రాన్ని అద్దెకు తీసుకున్న భవనంలో బిగించేశారు. దాంతో ముద్రణ కార్యాలయం కూడా తయారైంది.

సంపాదక వర్గం…

ముద్రణ యంత్రాంగానికి కార్మికులు అలాగే వార్తలకు సంబంధించిన అత్యంత కీలకమైన సంపాదక వర్గం కావాలి. కార్మికులను కూడా సమాకుర్చుకున్నారు. మాములుగా అయితే సంపాదక వర్గం కోసం ఆయా రంగాల్లో తలపండిన వారిని తీసుకుంటారు. కానీ రామోజీరావు భిన్నంగా ఓ మోస్తరు అనుభవం, చురుకుగా ఉంటూ కొత్తదనం కోసం పరితపించే వాళ్లయితే బావుండునని భావించారు. అందుకే ఆయన విశాఖపట్నంలోని నక్కవాని పాలెంలో ఈనాడు పత్రిక కార్యాలయాన్ని స్థాపించేటప్పుడు మహామహులైన సంపాదకులను కాకుండా ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న ఏ.పీ.కే ప్రసాద్ ను సంపాదకత్వ శాఖలో నియమించుకున్నారు. ఆయన క్రింద 13 మంది మెరికల్లాంటి ఉప సంపాదకులను తీసుకున్నారు. మరో రెండు నెలలలో ఈనాడు పత్రిక ప్రారంభం కాబోతుందనగా 1974 వ సంవత్సరం జూన్ మొదటి వారంలో సంపాదక వర్గంతో మొట్టమొదటిసారిగా ఆ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న పెద్ద రావి చెట్టు క్రింద రామోజీరావు సమావేశం అయ్యారు. ఈనాడు పత్రికా చైర్మన్ స్థానంలో అందరినీ పరిచయం చేసుకున్నారు.

తొంభై లక్షల మందిని లక్ష్యంగా చేసుకుని ప్రచురణ.. 

రావి చెట్టు క్రింద సమావేశమైన వారితో రామోజీరావు ఏదో చెబుతారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆయన ఏమీ చెప్పకుండా “మనం ప్రారంభించిన ఈనాడు గురించి మీరు ఏమనుకుంటున్నారు” అని వారిని ప్రశ్నించారు? ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. ఈ దేశంలో తెలుగు మాట్లాడే వారు ఎంతమంది ఉన్నారు? ఆయన అలాగే వారిని ప్రశ్నిస్తున్నారు. సుమారుగా 6 కోట్ల మంది (1974 నాటికి) అని వారిలో ఒకరు సమాధానం చెప్పారు. అందులో అక్షర జ్ఞానం ఉన్నవారు రెండున్నర కోట్ల మంది, వారిలో దిన పత్రికలను చదివి అర్థం చేసుకునేవారు దాదాపు కోటిమంది వుంటారు అని అంచనా వేస్తున్నారు రామోజీరావు. అయితే అప్పటికి ప్రచురణ జరుపుకుంటున్న తెలుగు దినపత్రికల ప్రతులు సుమారు రెండు లక్షలు మాత్రమే. ఒక్కొక్క పత్రికను కనీసం ఐదుగురు చదివినా, మొత్తం పత్రికలు చదివే వారి సంఖ్య పది లక్షలు మాత్రమే ఉండొచ్చు.

అంటే ఇంకా తొంభై లక్షల మంది పైచిలుకు అక్షరజ్ఞానం కలిగిన వారు పత్రికలను చదవడం లేదు. కనుక మన లక్ష్యం ఆ తొంభై లక్షల మందే. ఇతర పత్రికలు చదివే 10 లక్షల మంది మనకు అవసరం లేదు, మిగిలిన తొంభై లక్షల మంది మనకు లక్షం కావాలని రామోజీరావుతో సమావేశమైన వారితో చెప్పారు. ఆయన ఎంత ముందు చూపుతో ఆలోచించారో! నిజానికి విజేతలు లక్ష్యాలను ఎలా విశ్లేషిస్తారు అనేదానికి ఇది ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఈనాడు దిన పత్రికను ప్రాంతీయ పత్రికగా ప్రారంభించినా, దానిని ముందుగా రాష్ట్రస్థాయి పత్రికగా తీర్చిదిద్ది, ఆ తరువాత జాతీయ పత్రిక స్థాయికి తీసుకెళ్లాల్సిన ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుని ఉన్నారు రామోజీరావు. కేవలం విశాఖపట్నమే కాకుండా, విజయవాడ, హైదరాబాద్, తిరుపతి పట్టణాలలో కూడా ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ఈనాడు దిన పత్రిక తెల్లవారుఝామున ఉదయం ఐదు గంటల వరకు అన్ని ఇళ్లకు చేరిపోయేలా ప్రణాళికలు తయారుచేసుకున్నారు.

రాజకీయ కార్టున్ తప్పనిసరిగా ఉండేలా చూసుకుని…

రామోజీరావుకు మొదటినుండి కూడా కార్టూన్ బొమ్మలంటే మంచి అభిప్రాయం ఉండేది. తన ఈనాడు దినపత్రికలో తప్పనిసరిగా కార్టూన్స్ ఉండాలనేది రామోజీరావు ఉద్దేశం. పత్రికలు మొదలైన తరువాత 1955 వ సంవత్సరంలో విశాలాంధ్ర దినపత్రిక తొలిసారి కార్టూన్ ను ప్రచురించింది. ఆ తర్వాత మిగతా దినపత్రికలు కార్టూన్లను ప్రచురించడం ప్రారంభించారు. కానీ 1974 ప్రాంతంలో మిగతా పత్రికలతో పోల్చుకుంటే ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి లలో కార్టూన్లు వచ్చేవి. కానీ ఎప్పుడో ఒక్కసారి ప్రచురించేవారు. అంతే తప్ప వాటిని క్రమం తప్పకుండా ప్రతీరోజు ప్రచురించేవారు కాదు. ఏదైనా సందర్భంలో మాత్రం కార్టూన్ వేసేవారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈ.వి.ఆర్ అనే కార్టున్ చిత్రకారుడు, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభలో ఇతర రాష్ట్రముల నుండి వచ్చిన కార్టున్ చిత్రకారులు వేసిన కార్టూన్లు ప్రచురించేవారు. 

కానీ రామోజీరావు ప్రారంభించిన ఈనాడులో ప్రతీరోజు క్రమం తప్పకుండా రాజకీయ కార్టూన్ ఉండి తీరాలని నిర్ణయించుకున్నారు. స్థానికంగా ఉన్న కార్టునిస్ట్ ఉంటే బావుంటుంది అని భావించి ఏ.పీ.కే ప్రసాద్ సూచించిన బాలు అనే కుర్రాడికి ఉత్తరం వ్రాసి పంపించారు. ఆయన అప్పటికే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. ఆయనను రామోజీరావు పిలువడంతో ఉద్యోగం మానేసి వచ్చి ఈనాడు దినపత్రికలో చేరిపోయాడు. ఆయనకు పొలిటికల్ కార్టున్లు రాకపోయినా శిక్షణ తీసుకుని మరీ ఈనాడుకు దినపత్రికకు గీయడం మొదలుపెట్టారు. ఈనాడు దినపత్రిక ప్రారంభం కావడానికి కొన్ని నెలల ముందే ఇంత పెద్ద ప్రణాళికను, ఆచరణలో పెట్టడానికి తగు ఏర్పాట్లు చేసుకుని, ఈనాడు దినపత్రిక విడుదల చేయడానికి వారం రోజుల ముందే నకిలీ ముద్రణ (డమ్మీ) వేసి చూసుకున్నారు.

తొలిసారి తెల్లవారకముందే దినపత్రిక..

ముందే నిర్ణయించిన ప్రకారం ఈనాడు దినపత్రిక విడుదల తేదీ 10 ఆగస్టు 1974 కన్నా ముందు రోజు సాయంత్రం 09 ఆగస్టు 1974 నాడు పత్రికను ఎలా ప్రచురించాలో సిద్ధం చేశారు. ఏ మాత్రం హంగులు, ఆర్భాటాలు లేవు, పూజారులు లేరు, పూజలు లేవు, రాజకీయ నాయకుల ప్రసంగాలు అంతకన్నా లేవు. ముద్రణ మొదలుపెడితే పత్రిక ఆవిష్కరణ జరుగుతుంది. చాలా సాదాసీదాగా, ఈనాడు పత్రికలో ముద్రణ విభాగంలో పనిచేసే ఒక సాధారణ కార్మికుడితో 09 ఆగస్టు 1974 నాడు సాయంత్రం సమయంలో స్విచ్ ఆన్ చేయించి ఈనాడు దినపత్రిక యొక్క ముద్రణను ప్రారంభించారు రామోజీరావు. ఈనాడు దినపత్రిక ప్రారంభమైన సమయంలో ఇద్దరు కథా రచయితలు, 30 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. సాయంకాలం ఆరు నుండి ఏడు గంటల మధ్య ప్రాంతంలో ముద్రణ అయిపోయింది. ఈనాడు దినపత్రిక పత్రికను మొదటిసారిగా రామోజీరావు చేతిలోకి తీసుకొని చూశారు. అందులో పనిచేస్తున్న కార్మికులందరినీ అభినందించారు. 

అందులో ఫోర్ మెన్ గా ఉన్న వాకాడ రామారావుకు చొక్కా, ప్యాంటును బహుమతిగా ఇచ్చారు. మిగిలిన ఉద్యోగులు, కార్మికులకు అందరికీ కూడా టిఫిన్ బాక్స్ లను మరియు తినుబండరాలను అందించారు. మరునాడు 10 ఆగస్టు 1974 నాడు ఇంకా తెల్లవారలేదు. 5 గంటలకు “నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక అన్న తన నినాదాన్ని నిజం చేసుకుంటూ ఉషోదయానికి ముందే ఈనాడు దినపత్రిక విశాఖపట్నం వాసులను పలకరించింది. ఆరోజు విశాఖపట్నం నగరమంతటా సార్వత్రా హర్షాతిరేకం, కోలాహలం,పండుగ వాతావరణం. 09 ఆగస్టు 1974 వరకు దినపత్రిక మధ్యాహ్నం వరకు వచ్చేది. కానీ మొట్టమొదటిసారిగా 10 ఆగస్టు 1974 నాడు ఉదయమే దినపత్రిక వచ్చింది. విశాఖపట్నంలో ఆరోజు తెల్లవారుజామున వార్తాపత్రిక రావడమనేది నిజంగా చారిత్రాత్మక ఘట్టం అని చెప్పవచ్చు. ఆవిధంగా ఈనాడు దినపత్రిక మొట్టమొదట ముద్రణను విశాఖపట్టణం వాసులు ఆహ్వానించారు.

Show More
Back to top button