ఆంధ్రలో రాజకీయాలు సెగలు గక్కుతున్నా యి. 100 రోజుల్లోపే జరిగే లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఓటర్లు మౌన ప్రేక్షకుల్లా అన్నీ గమనిస్తున్నారు. సీఎం జగన్ గెలుపు ధీమా ప్రదర్శిస్తున్నారు. అదే సమయంలో క్షేత్రంలో గెలుపు గుర్రాలుగా భావించేవారిని నిలబెట్టేందుకు అంచెలంచెలుగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆరు అంచెల్లో ఓ 60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, ఎంపిలలో 30 మందికి పైగా టిక్కెట్లు నిరాకరించారు. మరో 30మందిని నియోజకవర్గాల బదిలీ చేశారు. ఓటర్లు తనకు, తన పథకాలకు ఓటు చేస్తారని బలంగా నమ్ముతున్న ముఖ్యమంత్రి ప్రజల్లోని ‘ప్రభుత్వ వ్యతిరేకతను గమనించకపోలేదు. సొంత సర్వేలు, ఐప్యాక్ నివేదికల ఆధారంగా అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు. అయితే పార్టీ కత్తిపడిన ఎమ్మెల్యే ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉండటం ఇబ్బందికరంగా తయారైంది.
తెలుగుదేశం, జనసేన ఎన్నికల పొత్తు జగన్ పార్టీకి మొదటి ఎదురుదెబ్బ. అనేక సందిగ్ధాలు తదుపరి ఈ కూటమిలో బీజేపీ చేరటం కూడా ఖరారు కావటం రెండో దెబ్బ మాత్రమే కాదు, పెద్ద దెబ్బ. బీజేపీ రాష్ట్రానికి ఏమి ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్లమెంటులో దానికి విధేయతతో వ్యవహరిస్తూ తన పైనున్న అవినీతి కేసులు విచారణకు రాకుండా చూసుకుంటున్న జగన్‌కి ఇది ఊహించని పరిణామం, చిత్రమేమంటే ఏపార్టీ ఎన్ని లోకసభ సీట్లు గెలుచుకున్నా పార్లమెంటులో అవన్నీ బీజేపీ ఖాతాకు చేరేవే! అందుచేతనే రాష్ట్ర బీజేపీ నాయకుల్లో అత్యధిక మెజారిటీ అభిప్రాయాన్ని అధిష్టానం మన్నించి టీడీపీతో పొత్తుకు సిద్ధపడింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియమించబడిన తర్వాత ఆమె పార్టీని చురుకుపరిచే ప్రయత్నంగా జగన్ పరిపాలనలో అవినీతి అక్రమాలపై గురి పెట్టారు.
మరోవైపు, జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియామకం పొందడమే ఆలస్యం నిర్మొహమాటంగా అన్న దుష్పరిపాలనపై దాడి చేస్తూ, తమ తండ్రి రాజశేఖరరెడ్డి అనుయాయుల్ని కాంగ్రెస్‌లోకి తిరిగి రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు. అంతేగాక, గతఎన్నికలకు ముందు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకై ఉద్యమించిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక బీజేపీకీ బానిసగా మారిందని దుయ్యబట్టారు. అంతేగాక, ఈ సున్నితమైన అంశంపై ఢిల్లీలో ధర్నా కూడా చేపట్టారు. సీపీఐ, సీపీఎం, ఇతర ప్రజాతంత్ర వాదులనేకమంది ప్రత్యేక హోదా, ఇతర హామీల అమలుకు ముందుకు రాని మోడీ ప్రభుత్వంపై పోరాడుతున్నారు.
టీడీపీ జనసేనల పట్ల సానుభూతి ఉన్న వామపక్షాలు, ఇప్పుడు బీజేపీ కూడా ఆ పొత్తులోకి వస్తున్నందున సందిగ్ధావస్థలో ఉన్నాయి. బీజేపీతో కలిసి ప్రయాణించే పార్టీలతో సర్దుబాటు చేసుకోమని, తాము జాతీయ స్థాయిలో ‘ఇండియా’ కూటమిలో భాగస్వాములు కావడంతో అందులోని భాగస్వాములతో (విడదీసి చూస్తే కాంగ్రెస్) కలిసి వెళ్లాలని ఆలోచనలో ఉన్నాయి. కాంగ్రెస్ తమ పునాదులు వెతుక్కునే స్థితిలో ఉన్నందున కాంగ్రెస్, వామపక్షాల పొత్తు సాంకేతికమే అవుతుంది. ముందుగా వామపక్షాలైనా ఒక అవగాహనకు వస్తే ఉమ్మడిగా రాజకీయ పోరాటమైనా చేయవచ్చు.
మూడు పార్టీల ప్రతిపక్ష కూటమి ఢీ అంటుంటే వారిని ఓడించేందుకు నేడు ‘సిద్ధం’ అనే పేరుతో ప్రచారభేరి మోగించిన ముఖ్యమంత్రి జగన్ ధైర్యం, ధీమా ఏమిటి? తన పథకాల లబ్ధిదారులు, వాలంటీర్లే తన స్టార్ క్యాంపెయినర్లు అంటున్నారు. ‘ఈ 5 సంవత్సరాల పదవి కాలంలో 124 సార్లు బటన్ నొక్కి వివిధ పథకాల కింద రూ.2.55 లక్షల కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేశాను. ఈ మీ బిడ్డ కోసం నేరుగా పోలింగ్ బూత్‌లో మీరు రెండు బటన్లు (ఒకటి ఎంఎల్ఎ, ఒకటి ఎంపి) నొక్కండి. ఇది మీ వంతు’అంటున్న ఆయన ధీమా అదే. అయితే జగన్ “సంక్షేమ పథకాలు” రక్షిస్తాయా, లేక అభివృద్ధి ఎజండా ముందు వీగిపోతాయా” వేచి చూడాలి.