Telugu Featured NewsTelugu News

జన’గళమై సాగిన యువగళం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర ముగిసింది. రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 400 రోజులు.. 4 వేల కిలోమీటర్లు.. వంద నియోజకవర్గాలలో పాదయాత్ర అనే లక్ష్యంతో జనవరి 27న లోకేశ్‌ పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ యువగళానకి ఏ ఏ అడ్డంకులు వచ్చాయి? ఈ యాత్ర విజయవంతం అయ్యిందో ఒక లుక్ వేద్దాం పదండి.

అడుగడుగునా అడ్డంకులు

లోకేశ్‌ చేపట్టిన పాదయాత్ర కుప్పంలో ప్రారంభమైనప్పటి నుంచి తంబళ్లపల్లె నియోజకవర్గం చేరేలోపు పోలీసులు 25 కేసులు నమోదు చేశారు. వాటిలో మూడు లోకేశ్‌ పైనే ఉన్నాయి. ప్రచారరథం, సౌండ్‌సిస్టమ్‌, స్టూల్‌ సహా అన్నింటినీ పోలీసులు సీజ్‌ చేశారు. నూజివీడు, గన్నవరం, ఉంగుటూరు, భీమవరం  లాంటి చోట్ల వైసీపీ నాయకులు టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. తిరిగి వారిపైనే పోలీసులు కేసులు పెట్టారు. 40 మంది యువగళం వాలంటీర్లపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టి జైలుకు పంపారు. గన్నవరం నియోజకవర్గంలో విదేశాల్లో ఉన్నవారు సహా 46 మందిపై కేసులు పెట్టారు. యువగళం పాదయాత్రకు సంబంధించిన ఫ్లెక్సీలను చించడం, రాళ్లు రువ్వడం లాంటి దుర్మార్గాలకు వైసీపీ శ్రేణులు పాల్పడ్డారు. వాటికి దీటుగా సమాధానం చెబుతూ యువగళం పాదయాత్రను నారా లోకేశ్‌ కొనసాగించారు.

యువగళం పాదయాత్ర సాఫిగా సాగుతున్న సమయంలో రాష్ట్రంలో సభలు, రోడ్‌షోలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.1 ను తీసుకువచ్చింది. అయితే ఈ జీవోను సీపీఐ నేత రామకృష్ణ సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై హైకోర్టులో విచారించి జీవో నెం.1ను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతూ 100 కిమీ పూర్తిచేసుకున్న సందర్భంగా బంగారుపాళ్యంలో సభను ఏర్పాటు చేశారు. కానీ పోలీసులు ఆ సభకు అనుమతి ఇవ్వకపోగా, వాహనాలు సీజ్‌ చేయడంతో, లోకేశ్ ఓ భవనం బాల్కనీ నుంచి ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారంటూ మండిపడ్డారు. జగన్‌ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయనకు జడ్‌ ప్లస్‌ క్యాటగిరీ సెక్యూరిటీ ఇచ్చామన్నారు. ఖాకీలను అడ్డుపెట్టుకొని యువగళాన్ని ఆపలేరన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

చంద్రబాబు అరెస్ట్‌

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబును పోలీసులు సెప్టెంబర్‌ 9 అర్థ రాత్రి అరెస్టు చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించి చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. తన తండ్రి అరెస్ట్‌ వార్తను విన్న నారా లోకేశ్‌ పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేసారు. టీడీపీ శ్రేణలు సైతం పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. తమ నాయకుడిని అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్‌ దిష్టిబొమ్మలను దహనం చేస్తూ రాష్ట్రమంతటా హోరెత్తించారు. పలుచోట్ల ధర్నాలు చేస్తూ నిరసన తెలిపారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ‘కుంభకోణం’, జ్యుడీషియల్‌ కస్టడీని పదే పదే పొడిగించడం వలన టీడీపీకి మద్దతు పెరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతటా చంద్రబాబు అరెస్టును ఖండించారు.దీంతోపాటు అమెరికాలో పలు ప్రాంతాల్లో చంద్రబాబు అరెస్టును తీవ్రంగా వ్యతిరేకించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలోని ఐటీ ఉద్యోగులు, పార్టీ కార్యకర్తలు చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ ధర్నాలు చేశారు. వైసీపీ ప్రభుత్వం కావాలనే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. యువగళం పాత్రయాత్ర విజయవంతంగా కొనసాగుతుందనే కక్షతోనే చంద్రబాబును అరెస్టు చేశారంటూ మండిపడ్డారు.

చంద్రబాబు అరెస్టును ఖండించిన పవన్‌ కళ్యాణ్‌

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసు తెలుగు రాష్ట్రాలతో పాటు.. జాతీయ రాజకీయాల్లోనూ కలకలం రేపింది. ఈ కేసులో చంద్రబాబు అరెస్టు తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలన్నీ పూర్తిగా మారిపోయాయి. వైసీపీ వర్సెస్‌ విపక్ష పార్టీల మధ్య రాజకీయం తారాస్థాయికి చేరింది. ప్రధానంగా టీడీపీ, జనసేన పొత్తు రాష్ట్ర రాజకీయాలను మరో ఎత్తుకు తీసుకెళ్లాయి.

చంద్రబాబుని రిమాండ్‌కి తరలించిన తర్వాత నారా లోకేశ్‌కి ఫోన్‌ చేసి పవన్ కల్యాణ్‌ ధైర్యం చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలని సూచించారు. జగన్ నియంత పాలనపై కలసి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. టీడీపీతో కలసి పోరాటం చేసేందుకే సిద్ధమని పవన్‌ కళ్యాణ్‌ మీడియా ముందు ప్రకటించారు. ఇరు పార్టీల పెద్దలతో చర్చలు జరిపి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తామని పవన్‌ వెల్లడించారు.


ప్రజల్లోకి నారా భువనేశ్వరి

ప్రత్యేక్షంగా రాజకీయాల్లో ఎప్పుడూ కనిపించని నారా భువనేశ్వరి తన భర్త చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తిరుపతి జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని నారావారిపల్లె నుంచి ‘నిజం గెలవాలంటూ’ యాత్రను చేపట్టారు. నారావారి పల్లె నుంచి మొదలైన భువనేశ్వరి బస్సు యాత్ర.. ఐతేపల్లి, నేండ్రగుంట, అగరాల మీదుగా సాగింది. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక నేండ్రగుంటలో మృతిచెందిన వారి ఇంటికి వెళ్లి నారా భువనేశ్వరి పరామర్శించారు. అనంతరం చంద్రగిరి శివారులోని అగరాలలో తొలి బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు నాయుడుపై పెట్టిన ఏ కేసులోనూ ఆధారాలు లేవని.. కేవలం ఆయనను కట్టడి చేయడానికి మాత్రమే జైలులో పెట్టారని భువనేశ్వరి ఆరోపించారు. ఈ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడుకు జరిగిన అన్యాయాన్ని భువనేశ్వరి ప్రస్తావించారు. రాజకీయాలు మాట్లాడానికి తాను రాలేదన్నారు.

రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు రాష్ట్రం కోసం ఎంతో కష్టపడ్డారని చెప్పారు. రాష్ట్రాన్ని ఓ స్థాయికి తీసుకురావడానికి, ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి, పరిశ్రమల్ని తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారో తాను కళ్లారా చూశానన్నారు. ప్రజల కోసమే ఆయన నిరంతరం ఆలోచిస్తారని స్పష్టం చేశారు. నిజం ఎప్పటికైన గెలుస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. లోకేష్  పాదయాత్రలో మైక్, స్టూల్, వ్యాన్ కూడా తీసుకున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీ వాళ్లు కనిపిస్తే కేసులు పెడుతున్నారని.. ప్రతి ఒక్కరిపై 30కి పైగా కేసులు పెట్టారని మండిపడ్డారు. అందరినీ తీసుకెళ్లి జైలులో పెట్టారన్నారు. పరిపాలన అంటే ఇదేనా అని ప్రశ్నించుకోవాలన్నారు. ప్రజల జీవితాల్లో ఆశ, జ్యోతి నింపిన నేత చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. తాను ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమాల్లో ఉన్నానని.. మూడు వేల మంది పేదలకు చదువులు చెప్పిస్తున్నారని అన్నారు. తన బాధను మహిళలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని గద్గద స్వరంతో  ప్రసంగించారు.  

యువగళం పునఃప్రారంభం

సెప్టెంబరు 9న చంద్రబాబును అరెస్టు చేయడంతో… పాదయాత్రకు సుదీర్ఘ విరామం ఏర్పడింది. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ వద్ద విరామం ఇచ్చారు. 79 రోజుల తర్వాత నవంబర్‌ 27న మళ్లీ అక్కడినుంచే యువగళం పాదయాత్రను నారా లోకేశ్‌ పునఃప్రారంభించారు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాలలో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు/ మున్సిపాలిటీలు, 2,028 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు యువగళం పాదయాత్ర సాగింది. డిసెంబర్‌ 18 సోమవారం ముగించే సమయానికి నారా లోకేశ్‌ 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు చేపట్టిన ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్రను అగనంపూడి వద్దే ముగించారు. ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో ఇప్పుడు నారా లోకేశ్‌ కూడా అక్కడే తన పాదయాత్రను పూర్తి చేశారు.

విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించి లోకేశ్‌ తన పాదయాత్ర ముగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన టీడీపీ, జనసేన శ్రేణులతో ఆ ప్రాంతం పసుపు సంద్రాన్ని తలపించింది. పైలాన్‌ ఆవిష్కరణ అనంతరం లోకేశ్‌ మాట్లాడారు. యువగళం పాదయాత్రలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అసమర్థుడు గద్దెనెక్కి ప్రజాస్వామ్యంపై దాడి చేశారని విమర్శించారు. ‘‘ ప్రజాస్వామ్యం, వ్యవస్థలపై చేసిన దాడిని కళ్లారా చూశాను. భవిష్యత్‌పై ఆశలు కోల్పోయిన యువతకు భరోసా ఇచ్చాను. పాదయాత్రలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటాను. నియంతృత్వంపై ప్రజా యుద్ధమే యువగళం. యువగళం అణచివేతకు గురైన వర్గాల గొంతుకైంది. యువగళం.. ప్రజాగళమై నిర్విరామంగా సాగింది ’’ అని నారా లోకేశ్‌ పేర్కొన్నారు.

యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌ జనగళమై నినదించారు. ప్రజలకు తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అడుగడుగునా ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తల నీరాజనాలతో ముందుకు సాగారు. వైసీపీ పాలనలోని ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. సమస్యలు తీర్చాలంటూ వచ్చిన ప్రతి ఒక్కరికీ భరోసా ఇచ్చారు. ఆటుపోట్లన్నింటినీ దాటుకుంటూ ముందుకు సాగారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర, డిసెంబర్ 18తో విశాఖ జిల్లాలోని అగనంపూడి వద్ద ముగిసింది.

నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగిసిన సందర్భంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లిలో బుధవారం యువగళం విజయోత్సవ సభ నిర్వహించారు. ‘యువగళం నవశకం’ పేరిట ఏర్పాటు చేసిన ఈ భారీ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ- జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చాయి. దీంతో సభా ప్రాంగణం అంతా జనసంద్రాన్ని తలపించింది. టీడీపీ తరఫున ఈ సభకు టీడీపీ అదినేత చంద్రబాబు, నారా లోకేశ్‌, అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, అశోక్ గజపతిరాజు తదితర నేతలు హాజరయ్యారు. జనసేన నుంచి పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఒకే వేదికపై కనిపించారు.

పాదయాత్ర లోకేశ్‌కు వర్కౌట్‌ అవుతుందా..?

ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర చేసి పలువురు అధికారంలోకి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2003లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి యాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన కాలంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 2013లో పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు. 2017లో పాదయాత్ర చేసిన వైఎస్‌ జగన్‌ 2019లో ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు యువగళం పేరుతో నారా లోకేశ్‌ పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. మరి లోకేశ్‌కు పాదయాత్ర అధికారం సంపాదించి పెడుతుందో లేదో చూడాలి. ‎

Show More
Back to top button