ఓ వ్యక్తి వద్ద తీసుకున్న డబ్బును తిరిగి ఇస్తున్నారా? లేదా? అనే విషయాన్ని సిబిల్ స్కోర్ నిర్ధారిస్తుంది. ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని మీ సిబిల్ స్కోర్ నిర్ధారిస్తారో తెలుసుకోవడం వల్ల మీరు మీ సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అవి ఏంటో తెలుసుకుందామా మరి.
ఇందులో ముఖ్యంగా పాస్ట్ పర్ఫార్మెన్స్, క్రెడిట్ మిక్స్, లివరేజ్ అనే నాలుగు అంశాలు ఉంటాయి. పాస్ట్ పర్ఫార్మెన్స్ అంటే మీరు ఇప్పటి వరకు తీసుకున్న లోన్స్ EMI ఎలా కడుతున్నారో తెలుపుతుంది. ఇది 30% వరకు సిబిల్ స్కోర్‌ను నిర్ధారిస్తుంది. క్రెడిట్ మిక్స్ 25% వరకు సిబిల్ స్కోర్‌ను నిర్ధారిస్తుంది. ఇందులో మీరు ఎలాంటి లోన్ తీసుకున్నారనే విషయం చెబుతుంది. అంటే సెక్యూర్ లోన్, అన్‌సెక్యూర్ లోన్ తీసుకుంటున్నారో, ఎంత సమయంలో మీరు ఎన్ని లోన్స్ తీసుకుంటున్నారో తెలుపుతుంది.
ఇక లెవరేజ్ 25% వరకు సిబిల్ స్కోర్‌ను నిర్ధారిస్తుంది. మీరు లోన్ తీసుకుని ఎన్ని రోజులు అవుతుంది, ఎంత వరకు క్రెడిట్ లిమిట్ వాడుతున్నారు అనే విషయం ఇది తెలుపుతుంది. మీరు రూ.50,000 క్రెడిట్ కార్డు వాడుతుంటే.. అందులో కేవలం 30%-40% ( రూ.15-20 వేల) వరకు లిమిట్ వాడవచ్చు.
ఒకవేళ మీరు ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడుతున్నటైతే అన్ని కలిపి ఎంత లిమిట్ వస్తుందో అందులో 30%-40% వరకు వాడుకోవాలి. ఉదాహరణకు మీ దగ్గర రూ.30,000, రూ.20,000, రూ.50,000 లిమిట్ ఉన్న మూడు కార్డులు ఉంటే.. అవి అన్ని కలిపితే రూ.1,00,000 లిమిట్ అవుతుంది. ఇందులో మీరు 30%-40% అంటే రూ.30,000-40,000 వరకు మాత్రమే వాడుకోవాలి. ఇంతకంటే ఎక్కువైతే మీ సిబిల్ స్కోర్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
క్రెడిట్ కార్డు లిమిట్‌తో పాటు లోన్ లిమిట్ కూడా చూసుకోవాలి. మీకు లోన్ రూ.20 లక్షల వరకు వస్తుందంటే మొత్తం తీసుకోకూడదు. అందులో కూడా 30%-40% వరకు తీసుకోవాలి. చివరిది ఇతర కారణాలు. ఇందులో ముఖ్యంగా వచ్చే అంశం ఏమిటంటే.. మీ సిబిల్ స్కోర్‌ను చాలాసార్లు చెక్ చేయడం.
ఇలా మీరు ఎన్నిసార్లు లోన్ పెడితే అన్ని సార్లు చెక్ చేయడం వల్ల, మీకు ఎక్కువ డబ్బు ఖర్చు చేసే ఉద్దేశం ఉందని సిబిల్ వారు అనుకుంటారు. ఇది మీ సిబిల్ స్కోర్ పై ప్రభావం పడే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా ఇది మీ సిబిల్‌ను 20% వరకు నిర్ధారిస్తుంది.