Telugu Featured News

దివ్యాంగులకు రూ.6వేల పెన్షన్ ఇస్తాం: చంద్రబాబు

పామర్రులో టీడీపీ ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ… తాము అధికారంలోకి వస్తే దివ్యాంగులకు రూ.6వేల పెన్షన్ ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. పలువురు దివ్యాంగులు తమను కలిసిన సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘వైసీపీ పాలనలో దివ్యాంగులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మేం అధికారంలోకి రాగానే దివ్యాంగులకు అండగా ఉంటాం. సాధారణ పెన్షన్లు కూడా నెలకు రూ.4వేలకు పెంచుతాం. మహిళలకు నెలకు రూ.1500 అందిస్తాం. ఇంట్లో ఎంతమంది ఉన్నా.. అందరికీ ఇస్తాం’ అని చెప్పారు.

దీంతోపాటు రాష్ట్రంలో పార్టీల గొడవల్లో మీకు మీరే కొట్టుకోవడం కాదని జగన్మోహన్ రెడ్డిని ఈ ఎన్నికల్లో తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. కౌలు రైతులు, రైతు కూలీలను ఆదుకునేలా కార్పొరేషన్ పెట్టి బాధ్యత తీసుకుంటామని అన్నారు. యువతలో ఉన్న ప్రతిభను గుర్తిస్తూ తగిన ఉపాధి చూపుతామని హామీ ఇచ్చారు. అయితే, సీఎం జగన్ ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారనని చంద్రబాబు అన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో నిరుద్యోగులను సీఎం జగన్ మోసం చేశారని, కనీసం జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదని, మోగా డీఎస్సీ ఇవ్వలేదని చంద్రబాబు మండిపడ్డారు. యువతలో ఉన్న ఆవేశం అవినీతి పాలనను సాగనంపాలని ఆయన అన్నారు.

అలాగే రాష్ట్రంలో రోడ్లు వేయ్యలేని వారు మూడు రాజధానులు కడతారా అని చంద్రబాబు విమర్శించారు. ఈ జిల్లాలో ఎంతో మంది గొప్ప మహనీయులు పుట్టారని.. అయితే, ప్రస్తుతం ఇక్కడ తులసి వనంలో గంజాయి మొక్కల్లా కొందరు నేతలు తయారయ్యారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ బూతులు మాట్లాడే వారికే మంత్రి పదవులు ఇచ్చారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ధ్వజమెత్తారు. రైతును రాజు చేయడమే తన ఉద్దేశమని.. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు కూలీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Show More
Back to top button