సహజంగా 60 సంవత్సరాలు నిండిన తర్వాత రిటైర్ అవుతాం. అయితే, ఆ తర్వాత సరైన ఆర్థిక ప్రణాళికలు లేకపోతే కష్టపడాల్సి వస్తుంది. పదవీ విరమణ తర్వాత కూడా ఫైనాన్షియల్ ఫ్రీడం పొందాలంటే.. తప్పకుండా పెన్షన్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీది ప్రభుత్వ ఉద్యోగం అయితే ఎక్కువ చింతించాల్సిన అవసరం లేదు. కానీ, ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నట్లైతే తప్పనిసరిగా పెన్షన్ కోసం పెట్టుబడి ప్రణాళికలు వేసుకోవాల్సి ఉంటుంది. పెన్షన్ వచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలి. మార్కెట్లో ఎన్నో పథకాలు ఉన్నాయి. వాటిలో అటల్ పెన్షన్ యోజన పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఎందుకంటే ఇది ఒక ప్రభుత్వ పథకం. వృద్ధులకు ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని జూన్, 2015వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో అసంఘటిత రంగంలోని కార్మికులకు పెన్షన్ లభిస్తుంది. ఈ పథకానికి ఎవరు అర్హులు..? ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే.. దరఖాస్తుదారుడు కచ్చితంగా భారతదేశ పౌరుడై ఉండాలి. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి.. బ్యాంకు ఖాతా లేదా పోస్ట్ ఆఫీస్‌లో ఖాతా కలిగి ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారు ఈ పథకంలో చేరవచ్చు. ఇందులో చేరడానికి బ్యాంకు ఖాతా లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా ఉన్న బ్రాంచుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. పథకంలో చేరిన తర్వాత వయసుని బట్టి ప్రతి నెల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రీమియం రూ.42 నుంచి రూ.1454 వరకు ఉంటుంది. ఈ పథకంలో చేరిన వారికి 60 సంవత్సరాల వయస్సు నిండిన తర్వాత.. వారు ఎంచుకున్న ప్లాన్ ప్రకారం నెలకు రూ.1000 నుంచి రూ.5000 వరకు పెన్షన్ అందుతుంది. ఎంత పెన్షన్ కావాలో దాని ప్రకారం ప్రీమియాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ పెన్షన్ సరిపోదు అనుకునే వారు ఇతర పెన్షన్ పథకాల్లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. దీనికోసం మార్కెట్లో ఎన్నో కంపెనీలు ఉన్నాయి.
కానీ, మంచి కంపెనీని ఎంచుకోవడం చాలా అవసరం. దీనికోసం కంపెనీ గురించి మొత్తం వివరాలు తెలుసుకోవాలి. ఆ తర్వాత పథకం గురించి విరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత స్కీమ్‌లో చేరండి. ఎంత చన్న వయసులో స్కీమ్‌లో చేరితే అంత తక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు, అవసరం అనుకుంటే అటల్ పెన్షన్ యోజనతో పాటు ఇన్సూరెన్స్ కంపెనీలలో కూడా పెన్షన్ పథకంలో చేరితే ఎక్కువ పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎక్కువ ఆర్థిక స్వేచ్ఛను పొందగలుగుతారు. మరింకెందుకు ఆలస్యం మీ రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రారంభించండి.