Telugu Featured NewsTelugu NewsTelugu Politics
Trending

‘ఇండియా’ కూటమికి వరుస ఎదురు దెబ్బలు

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 స్థానాల్లో విజయం సాధిస్తుంది. బీజేపీ సొంతంగా 370 స్థానాల్లో జెండా ఎగరేస్తుంది. మూడో విడత ఎన్డీయే ప్రభుత్వంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటాం. భారతదేశ వెయ్యేళ్ల చరిత్రకు పునాదులువేస్తాం. విపక్షాలు… అన్నీ అప్పుడే కాడి కిందపడేశాయి” అని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ రానున్న ఎన్నికల ఫలితాలపై వ్యక్తం చేసిన ధీమా వ్యక్తం చేశారు.

మోదీ విశ్వాసానికి కారణం?

మోదీ నమ్మకానికి అంత ధైర్యం ఎక్కడిది? దేశంలో నెలకొన్న ఏ రాజకీయ పరిస్థితులు ఆయనలో ఇంత విశ్వాసాన్ని పెంచాయి. కాస్త లోతుగా ఆలోచిస్తే… ఇండియా కూటమి బలం రోజురోజుకూ బలహీన పడుతుండటమే మోదీ విశ్వాసానికి కారణమా! అదీ ఒక కారణం కావొచ్చు. అధికార బీజేపీని ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో దేశంలోని వివిధ లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీలతో ఏర్పాటైన విపక్ష “ఇండియా” కూటమిలో చోటుచేసుకుంటున్న పరిణామాలు సైతం అందుకు ఊతమిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ), ఆప్, డీఎంకే, శివసేన, ఎన్సీపీ, ఎస్పీ, కమ్యూనిస్టులు సహా ఇతర ప్రాంతీయ పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి ఎన్నికలకు ముందే బీటలు వారుతున్నట్టు కనిపిస్తోంది.

కూటమి నుంచి ఒక్కొక్కరూ వేర్వేరు దారుల్లో పయనించడం కాంగ్రెస్ అంచనాలను బలహీనపరుస్తున్నాయి. కూటమి విజయం అందులోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, వివిధ అంశాలపై ఏకాభిప్రాయ సాధన రావడంపైనే ఆధారపడి ఉంటుంది. ఉమ్మడిగా లక్ష్యాలను చేరుకొనే క్రమంలో కూటమిలో అంతర్గత సమస్యలను పరిష్కరించుకునే క్రైసిస్ మేనేజ్ మెంట్ కమిటీల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి. కానీ, ఆయా రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయానికి రాలేకపోవడంలోని కారణాలను కూటమిలోని పార్టీలన్నీ కాంగ్రెస్‌పైనే వేలెత్తిచూపుతున్నాయి. ఇప్పటికే కొన్ని పార్టీలు కూటమి నుంచి జారుకోగా, ఇప్పటికీ కూటమిలోనే కొనసాగుతున్నప్పటికీ కొన్ని పార్టీలు బహిరంగంగానే కాంగ్రెస్‌ను నిందిస్తున్న తీరు కూటమి మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.

వారుంటే వీరికి కోపం

పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్‌పై కమ్యూనిస్టుల ప్రభావం ఉందన్న ఆలోచనతో టీఎంసీ మొదటి నుంచీ అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తోంది. 42 స్థానాలున్న ఆ రాష్ట్రలో 2 స్థానాలు ఇస్తామంటూ టీఎంసీ ప్రతిపాదనను కాంగ్రెస్ అంగీకరించలేదు. దాంతో ఇరు పార్టీల మధ్య విబేధాలు ముదిరాయి. “అన్యాయాన్ని ఎదిరించడం, ఐక్యతను చిగురింపజేయడం, విద్వేష వ్యాప్తిని అరికట్టడం బెంగాల్, బెంగాలీల కర్తవ్యం. మీరు సందర్భానికి తగినట్లుగా స్పందించకుంటే ప్రజలు మిమ్మల్ని క్షమించరు” అని భారత్ జోడో న్యాయ యాత్ర పశ్చిమ బెంగాల్లో ప్రవేశించినప్పుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. పరిస్థితి చేయిదాటాక టీఎంసీతో సయోధ్యకు చేసిన ఈ ప్రయత్నాలు ఫలించలేదు. కూటమి కూర్పునకు పునాదులు వేయడానికి కారణమైన పార్టీయే ముందుగా దానినుంచి వైదొలగడం ఆదిలోనే కూటమికి పెద్ద దెబ్బ. కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే పేరును తెరమీదకు వచ్చిన నేపథ్యంలో బీహార్ జేడీ (యూ) నేత నితీష్కుమార్ మహా ఘట్ బంధన్ నుంచి వైదొలగడమే కాకుండా ప్రత్యర్థి ఎన్డీఏ కూటమిలో చేరారు. ఇప్పుడు కూటమి ఆశలన్నీ ఆర్జేడీపై పెట్టుకుంది.

పెద్దన్న పాత్ర ఏది?

కూటమిలోని పార్టీలతో సమన్వయం చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషించలేకపోతోందన్న విమర్శలూ ఉన్నాయి. బలం లేని రాష్ట్రాల్లో కూడా పట్టుదలకు పోతోందన్న అభిప్రాయం కూటమి పార్టీల్లో  నెలకొంది. దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలున్న యూపీలో సమాజ్వాదీ పార్టీతోనూ సంబంధాలు సాఫీగా సాగడం లేదు. కాంగ్రెస్ 11 స్థానాలతో సరిపెట్టుకోవాలన్న ఎస్పీ ప్రతిపాదనను తోసిపుచ్చింది. 13 సీట్లు కావాలంటూ కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని అఖిలేష్ తెగేసి చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ నడుచుకోవాలన్నది ఎస్పీ అభిప్రాయం. పంజాబ్ రాష్ట్రంలో కూడా సీట్ల పంచాయతీతో ఆమ్ ఆద్మీ పార్టీతో విబేధాలు పొడచూపాయి. ఒంటరిగా పోటీ చేస్తామంటూ ఆప్ ప్రకటించడం వారి మధ్య విబేధాలు ఏస్థాయిలోకి వెళ్లిందో అర్థమవుతోంది.

ఉత్తరంలో చిక్కులు

మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేన పార్టీల్లో తలెత్తిన చీలిక వ్యవహారాలు కూటమికి తలనొప్పిగా మారింది. మరోవైపు చీలికవర్గం పార్టీలతో కూడా సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడం లేదు. 48 స్థానాల్లో శివసేన ఠాక్రే వర్గం 23 స్థానాలు కోరుతుంటే, శరద్ పవార్ ఎన్సీపీ కూడా సీట్ల విషయంలో పట్టువీడడం లేదు. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హరియాణ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా లేకపోవడంతో ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రతికూలంగా మారింది.గత ఎన్నికల్లో గుజరాత్ (26), మధ్యప్రదేశ్ (29- 1 మినహా), రాజస్థాన్ (25) హరియాణ (10) బీజేపీ క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఈ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ప్రాంతీయ పార్టీలు బలంగా లేకపోవడంతో కాంగ్రెస్కు ఒంటరి పోరు తప్పలేదు. పైగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఓడిపోవడం ప్రతికూల అంశంగా మారింది.

ఉత్తరాదిన అయోధ్య మందిర నిర్మాణం వంటి అంశాల ప్రభావ నేపథ్యంలో ముఖ్యంగా యూపీలో ఎస్పీ, రాష్ట్రీయ లోక్‌దళ్‌తో సీట్ల పంపకాల్లో తలెత్తిన విబేధాలు కూటమిని సతమతపరుస్తుండగా, 21 స్థానాలున్న ఒడిషాలో బిజు జనతాదళ్ దోస్తీకి అవకాశం లేకపోగా, మిగిలిన పార్టీలేవీ పెద్దగా ప్రభావం చూపించే పరిస్థితులు లేక కాంగ్రెస్ ఒంటరి పోరాటానికి సిద్ధమైంది. ఇకపోతే, భారత్ జోడో న్యాయ యాత్రను ఈశాన్యం నుంచి ప్రారంభించినప్పటికీ ఆయా రాష్ట్రాల్లోని మొత్తం 25 సీట్లలో కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో అనుకూల వాతావరణం ఏర్పడలేదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.

ప్రత్యర్థి వైఫల్యాలు

గత ఎన్నికల ఫలితాలు, ఇటీవలి రాజకీయ పరిణమాలు కాంగ్రెస్ పార్టీకి పెనుసవాళ్లను విసురుతున్నాయి. ఎన్డీఏ కూటమిని ఎదుర్కొనేందుకు ఏర్పాటైన ఇండియా కూటమిలో పెద్ద పార్టీగా మిత్రపక్షాలతో సీట్ల పంపకం, పొత్తుల ఖారారు కాంగ్రెస్ పార్టీకి తలకుమించిన భారంగా మారాయి. కూటమిలోని కీలక పార్టీలు ఒకదాని తరువాత మరొకటి చేజారుతున్న పరిణామాలు ఆయా రాష్ట్రాల్లో బహుముఖ పోటీ తప్పదన్న సంకేతాలనిస్తోంది. ఈ పరిస్థితులు ఎన్డీఏ భాగస్వామ్య పక్షానికి అనుకూలంగా మారొచ్చు. అందుకే బీజేపీ ధీమాకు ప్రత్యర్థి వైఫల్యాలూ ఒక కారణం కావొచ్చు.

Show More
Back to top button