ఎన్నికల వేళ ఉచితాల పర్వం కొనసాగుతోంది. అయితే, ఈ ఉచితాలు అనేవి దేశ ప్రజలపై, ఆర్థిక వ్యవస్థపై ఎంత ప్రభావం చూపుతాయనేది రాజకీయ విశ్లేషకులు కొన్ని వివరణలు ఇస్తున్నారు. అవేంటో ఓ లుక్ వేద్దాం పదండి.
ఆహారం సంపాదించుకునే మార్గం చూపితే బెటర్
దేశంలో ఆర్థిక సమతుల్యత చాలా ముఖ్యం. అందరి దగ్గర సమానంగా డబ్బు ఉండకపోవచ్చు. కనీస అవసరాలైనా అందరికీ తీరేలా ఉండాలన్నది రాజ్యాంగ మౌలిక సూత్రం. ఈ ఉద్దేశంతోనే కొన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలౌతున్నాయి. అయితే కాలం గడుస్తున్న కొద్దీ.. సంక్షేమం అనేది శృతి మించి.. ఉచితాలు తెరపైకి వచ్చాయనే అభిప్రాయాలున్నాయి. అన్నం పెడితే ఒక పూట ఆకలి తీరుతుంది. కానీ అన్నం సంపాదించుకునే మార్గం చూపితే జీవితాంతం ఆకలి తీరుతుంది. జీవితాంతం ఆకలి తీర్చే మార్గం చూపడమే నిజమైన అభివృద్ధి. కానీ ప్రభుత్వాలు మాత్రం శాశ్వత పరిష్కారం వైపు కాకుండా తాయిలాలు పేరిట ఉపశమనాలు కల్పిస్తూ సంక్షేమం అని గొప్పగా చెప్పుకుంటున్నాయి.
ఉచితాలు ఓ వేలంపాటలా తయారయ్యాయి..!
ఉచిత పథకాలు రాజ్యాంగ బద్దమా? అనే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో దీనిపై అనేక చర్చలు జరిగాయి. అత్యున్నత న్యాయస్థానం వరకూ వెళ్ళింది. ఎన్నికల సంఘం దీనిని పరిశీలన చేయాలనే సూచనలు వచ్చాయి. సాక్షాత్తు ప్రధాన మంత్రి మోదీ… అధికారమే పరమావిధిగా సంక్షేమాన్ని ఏ మాత్రం పెంచని ఉచితాలు ఆర్థికాభివృద్ధికి ఆటంకం అంటూ ప్రకటన కూడా చేశారు. తాజాగా మళ్లీ సుప్రీం కోర్టులో ఈ ఉచితాలు అనుచితం అంటూ ఓ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలయ్యింది. సుప్రీంకోర్టు కూడా ఈ పిల్ స్వీకరించి దీనిని అత్యంత ప్రాముఖ్యత గల అంశంగా ప్రకటించింది. దేశం మొత్తం మీద అన్ని ప్రభుత్వాలు పోటా పోటీగా ఈ రకమైన ఉచిత పథకాల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నాయి. అధికారాన్ని దక్కించుకోవడమే పరమావిధిగా ఎన్నికల ముందు అమలు సాధ్యంకాని ఉచిత హామీలను ఇస్తూ రాజకీయ పార్టీలు పని చేస్తున్నాయి.
దీనికి ఏ రాజకీయ పక్షం కూడా మినహాయింపు కాదు. ఎందుకంటే రాజకీయ పార్టీలన్నీ ఒక తానులో ముక్కలే. పదవులే పరమావిధిగా అధికారమే అంతిమ లక్ష్యంగా ప్రజలకు ఉచిత వరాల జల్లులు కురిపిస్తున్నాయి. అంతేకాదు ఉచిత వరాల ప్రక్రియ అనేది ఒక వేలంపాటలా తయారైంది. ఒక రాజకీయ పక్షం ఒక ఉచితం ప్రకటిస్తే దానిని మించి మరో రాజకీయ పక్షం పోటీగా ప్రకటనలు చేస్తుంది. శ్రేయోరాజ్య స్థాపనే లక్ష్యంగా గల ప్రభుత్వాలు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయడంలో తప్పు లేదు. అది ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత కూడా, దేశంలో దారిద్ర్యంతో ఇబ్బంది పడుతున్న ఆకలి కోరల్లో చిక్కుకున్న ప్రజానీకాన్ని అదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అయితే ఈ బాధ్యత నిర్వహించే సందర్భంలో సంక్షేమం, అభివృద్ది ఈ రెండూ కూడా జోడెద్దుల బండి లాగ కలిసి మెలిసి ప్రయాణం చేసే రీతిలో ప్రభుత్వాలు నడుచుకోవాలి. దీనిలో ఏ ఒక్కటి విస్మరించినా ఆర్ధిక వ్యవస్థ చిన్నా భిన్నం కావడం ఖాయం.
అయినా ప్రస్తుత ప్రభుత్వాలు ఈ లక్ష్యాలను పక్కన పెట్టి అధికారమే పరమావిధిగా ఓటు బ్యాంక్ రాజకీయాలతో జనాకర్షక ఉచిత పథకాలను ప్రకటిస్తూ ముందుకు పోతున్నాయి. దీనివల్ల ప్రభుత్వ ఆదాయంలో సగ భాగం ఉచిత తాయిలాలకు మిగిలిన సగభాగం ఉద్యోగుల జీతాలకు పోతుంది. అటువంటప్పుడు అభివృద్ది జరిగే అవకాశం ఎక్కడ ఉంటుంది? అభివృద్ధి, సంక్షేమానికి తారతమ్యం లేకుండా పోతూ ఉంది. ప్రజలు గతంలో సమిష్టి ప్రయోజనాల కోసం నాయకులను డిమాండ్ చేసేవారు.
అది కాలక్రమేణా వ్యక్తిగత ప్రయోజనాల వైపు మరలి పోయింది. దీనిని గ్రహించిన నాయకులు అదే దిశగా ప్రయాణం చేసి ప్రజలను వ్యక్తిగతంగా సంతృప్తి పరచడంలో తలమునకలవుతున్నారు. అయితే ఇవన్నీ ఉపశమనాలు తప్ప శాశ్వత పరిష్కారం కాదని నాయకులకూ తెలుసు. శాశ్వత పరిష్కారానికి దీర్ఘకాలిక లక్ష్యాలు ఉండాలి. అవి లేకపోతే ఎప్పటికీ పేదరికం అంతం కాదు. సంక్షేమ పథకాల ముసుగులో యోగ్యతలు, అర్హతలతో నిమిత్తం లేకుండా అమలు చేసే పథకాలు ఎప్పటికీ సమర్ధనీయంకాదు.
అయితే సమిష్టి ప్రయోజనాల కోసం చేపట్టే ఉచిత పథకాలు అన్నీ ఉత్పాదకమైనవిగానే భావించాలి. ఎందుకంటే ఉచిత వైద్యం, ఉచిత విద్య ఇలాంటివి ఉత్పాదకతను మెరుగుపరుస్తాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర వస్తువులను అందించడం, మధ్యాహ్న భోజన పథకం, అంగన్ వాడీల ద్వారా పిల్లలకు, మహిళలకు పోషకాహారాన్ని అందించడం, ఏ ఆధారం లేని వృద్ధులకు వితంతువులు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్, రైతు బంధు, రైతు భరోసా వంటి పథకాల వలన ఎన్నో సత్ఫలితాలు వస్తున్నాయి. ఇటువంటి వాటిని లక్ష్యం నెరవేరే వరకూ కొనసాగించాలి. దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. అలాగే సామాజిక ప్రయోజనం మెరుగుపరిచే విధంగా ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన సౌకర్యాలను కల్పించే పథకాలు సైతం ఆమోదయోగ్యమే. ఇటువంటి వ్యయాన్ని సమర్ధించాలి. అదే మీరు ఒక కులానికి చెందినవారు అయి ఉండి… మీ వయసు ఇంత దాటితే నగదు బదిలీ చేస్తాం… అనే పథకాలు మాత్రం వ్యక్తిగత ప్రయోజనాలను తప్ప సామాజిక సంక్షేమాన్ని పెంచవు.
ఉచితాలు పొందుతున్న వారిలో 30% శ్రీమంతులే
కొన్ని ప్రభుత్వాలు, పార్టీలు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే కలర్ టీవీ ఇస్తాం, మిక్సీ ఇస్తాం, మొబైల్ ఫోన్ ఇస్తాం, గ్రైండర్ ఇస్తాం, స్కూటీ ఇస్తాం బంగారం ఇస్తాం… అంటూ ప్రకటిస్తున్నాయి. వినోదం, విలాసాలను ఉచితంగా ఇవ్వడం సంక్షేమం అవుతుందా? ఇలాంటివి పోటాపోటీగా రాజకీయ పక్షాలు ప్రకటించుకుంటూ పోతే నిధులు ఎక్కడ నుంచి వస్తాయి… అనే ఆలోచనే ప్రభుత్వాలకు స్ఫురించడం లేదు. దీంతో పాటు ఎవరికోసం సంక్షేమ కార్యక్రమాలను రూపకల్పన చేసి నిధులు ఖర్చు చేస్తే ఆ వర్గ ప్రయోజనాలు మెరుగవ్వాలనే ఆదర్శాన్ని అమలు చేయటంలో కూడా లోపాలున్నాయి.
సంక్షేమ ఉచితాలను పొందే వారిలో దాదాపు 30శాతం శ్రీమంతులు ఉన్నారు. ఇది కూడా ప్రభుత్వాలకు తెలియంది కాదు. పేద ప్రజలకు చెందాల్సిన సంక్షేమ నిధులు శ్రీమంతులకు కట్ట బెట్టి సమాజంలో మరింత ఆదాయ అసమానతల పెంపుకు ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. ఏది సంక్షేమ కార్యక్రమం, ఏది కాదు అనే తేడా కూడా గుర్తించ లేనంత స్థితిలో నేడు ప్రభుత్వాలు నడుస్తున్నాయి. పేదలకు అందించే ఉచిత పథకాలను విమర్శించే వారు పెద్దలకు అందించే ప్రయోజనాలను గురించి మాట్లాడటం లేదు.
ఒక వ్యవస్థ ద్వారా పేదలకు ఇచ్చే కొద్దిపాటి మొత్తాలను ఉచితాలు అంటున్నారు. కానీ తక్కువ పన్ను రేట్లు, మినహాయింపుల పేరుతో నిత్యం ధనవంతులు పొందుతున్న ఉచితాలను మాత్రం ప్రోత్సాహకాలు అంటున్నారు. దీంతో ఇదెక్కడి న్యాయం అంటూ సామాజిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల జీవన ప్రమాణాల పెంపుదల, సామాజిక అభివృద్ధి సాధన కోసం ప్రభుత్వాలు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పథకాలు ఎప్పటికీ కొనసాగించాలి. అయితే ప్రజాకర్షణ కోసం సర్కారు ఖజానాను దివాళా తీయించే ఉచిత తాయిలాల ప్రకటన ఏ మాత్రం సమర్ధనీయం కాదు. అధికారమే పరమావధిగా ఓటు బ్యాంకు రాజకీయాలతో ఉచిత పథకాలు, నగదు బదిలీ వంటివి చేస్తూ ఇది కూడా సంక్షేమమే అంటూ ఆర్థిక క్రమశిక్షణను గతి తప్పించటాన్ని ఎవరూ క్షమించకూడదు. సంక్షేమ పథకాల ముసుగులో రాయితీలు, ఉచితాలు, ఇతర తాయిలాలతో ప్రలోభ పెట్టి రాజకీయ పబ్బంగడుపుకునే రాజకీయ పక్షాలకు ఓటర్లు చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
చాలా సందర్భాలలో ప్రభుత్వాలు ప్రకటించిన ఉచిత పథకాలను చూసి లబ్దిదారులు సైతం ముక్కున వేలేసుకుని ఆశ్చర్యపోతున్నారు. ఈ డబ్బు అంతా ఎక్కడ నుంచి తీసుకువస్తారో చాలా మందికి తెలియదు. రాజకీయ పార్టీలకు ఏది ఏమైతేనేం అధికారం కావాలి. ఉచిత పథకాలకు నిధుల కొరత ఏర్పడితే కొత్త పన్నులు విధిస్తారు. అది సాధ్యం కాకపోతే అప్పులు చేసేస్తారు. ఏది ఏమైనా చిట్ట చివరకు ప్రజల తాట వలిచి పరోక్ష పన్నుల రూపంలో వసూలు చేస్తారనే సత్యాన్ని సాధారణ పౌరుడు గుర్తించలేక పోతున్నాడు.
దురదృష్టం ఏమిటంటే నేడు దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం మొత్తం… జీతాలు, పెన్షన్లు, వడ్డీలు చెల్లించడానికి సరిపోవడం లేదు. కేంద్రం నుంచి ఆదాయం, కొత్త అప్పుల ద్వారా ఉచితాల సంతర్పణ చేసుకుంటూ పోతూ భావితరాల ప్రయోజనాలను తాకట్టు పెట్టే అధికారం రాజకీయ పార్టీలకు ఎక్కడిది? ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలు, రాజ్యాంగ చట్ట బద్ద సంస్థలు మాత్రమే కాదు… ప్రజలలో కూడా చైతన్యం రావాలి. అప్పుడే సంస్కరణలు విజయవంతం అవుతాయి. పనిచేయని వాడికి, పని చేసేవాడికి కూడా ప్రభుత్వమే అన్నీ సమకూరిస్తే చివరికి పనిచేసేవాడు కూడా పని చేయడం మానేస్తాడు. వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది అనే ప్రమాదాన్ని ఓటర్లు గుర్తించి.. అనుచిత ఉచితాలతో పార్టీలు లబ్దిపొందకుండా చేసేలా తమ ఓటు అస్త్రాన్ని ప్రయోగించాలి. ఆనాడే మన ఆర్థిక వ్యవస్థలకు రక్ష.