
ప్రస్తుత సమాజంలో, సమకాలీన రాజకీయాల్లో, రాజకీయేతర విషయాల్లో కూడా యువత యొక్క పాత్ర, ప్రాధాన్యత, ప్రాముఖ్యం స్పష్టంగా వినిపిస్తూ ఉంది. అంతేకాకుండా రాజకీయ నాయకులు, పలువురు మేధావులు, ఉన్నత విద్యావంతులు, సామాజిక చైతన్యం కలిగిన ప్రముఖులు కూడా చాలా సందర్భాల్లో తెలియజేసే పదం యువత రాజకీయాల్లోకి రావాలి. నిజమే యువత రాజకీయాల్లోకి రావాలి కానీ, ఎందుకు రావాలి? ఎవరికోసం రావాలి? ఎప్పుడు రావాలి? ఎలా రావాలి? అసలు ఆ అవసరం ఉందా అంటే… ఉంది అనే వారితో పాటు, లేదు అనేవారు కొంత మంది లేకపోలేదు. నాకెందుకులే ఎవరు ఎటుపోతే అనే ధోరణి.. రాబోయే రోజుల్లో మరల ఉద్యమాలు, నిరసనలకి దారి తీసే ప్రమాదం ఎంతైనా ఉంది.
ఏ దేశానికి కూడా ఇంత యువశక్తి లేదు..
యువత రాజకీయాల్లోకి రావాలి అనే ఆలోచన వారిలో ఉంది. ఇది మనం గమనించాల్సిన విషయం. ఎందుకంటే 2026వ సంవత్సరానికి భారతదేశం మొత్తం 40% యువతతో నిండి ఉంటుంది. ఇది ఒక రకంగా గర్వకారణం ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశానికి కూడా ఇంత యువశక్తి లేదు. కేవలం మన భారతదేశంకి మాత్రమే కలిగిన అరుదైన ఘనత. ఈ యువ శక్తితో, మేధాశక్తితో మనము ప్రపంచాన్నే శాసించవచ్చు. ఎన్నో విలువైన అద్భుతాలను, ఆవిష్కరణలను సృష్టించవచ్చు. రాజకీయాల్లో కూడా బలమైన ప్రత్యామ్నాయం చూపించవచ్చు. ఇది నాణానికి ఒకవైపు మరోవైపు ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితుల, భౌగోళిక ప్రభావం, వింత పోకడలు, ఆర్థిక పరిపుష్టి దృష్ట్యా కొంతమేర యువత విదేశాల వైపు మొగ్గు చూపుతుంటే.. మరికొంత యువత వ్యసనాలకు బానిసై వాళ్ళ యొక్క జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత క్రికెట్ బెట్టింగులు, జూదం, మద్యంకి అలవాటుపడి వారి యొక్క కెరీర్‌ని నాశనం చేసుకుంటున్నారు.
దేశంలో అధికంగా వారసత్వ రాజకీయాలు..!
దేశాన్ని ప్రభావితం చేసే రాజకీయ పార్టీల విషయానికి వస్తే బహిరంగంగా చాలా సందర్భాల్లో రాజకీయ నాయకులు, విశ్లేషకులు, మేధావులు అందరూ కూడా యువత రాజకీయాల్లోకి రావాలి, మార్పుని తీసుకురావాలని చెప్తారు. కానీ అది అమలుపరిచే నాయకులు ఎంత మంది ఉన్నారనేది మనందరికీ తెలిసిన విషయమే. ఒకప్పుడు 70వ, 80వ, 90వ దశకాలలో చాలా రాజకీయపార్టీలు ప్రాంతీయ, జాతీయస్థాయిలో పుట్టుకొచ్చి సమాజంలోనూ, దేశంలోనూ పలు పెను మార్పులు సృష్టించాయి. ఆ దిశగా వారు సఫలీకృతులయ్యారు. కానీ, నేడు అటువంటి పోరాటపటిమ, స్ఫూర్తి తగ్గి కేవలం రాజకీయాలు అంటే వారసత్వ రాజకీయాలు అదేవిధంగా తాత, తండ్రి ,కొడుకు, మనవడు, కూతురు, మనవరాలు, మేనల్లుడు, తమ్ముడు ఇలా కేవలం ఒక బంధు వర్గం మీదే ఆధారపడి రాజకీయాలను శాసిస్తున్నారు.
ఒకప్పుడు రాజకీయ పార్టీల్లో ప్రతి వ్యక్తికి ఒక విదురుడు లాంటి తరువాతి స్థానం (సెకండ్ జనరేషన్ ) అనే విధంగా ఒకరు ఉండేవారు. ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఒకతను పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం పనిచేస్తే మరొకరు ప్రజలలో నిత్యం ఉంటూ వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ బలమైన నాయకత్వం కలిగిన నాయకుడిగా ఎదిగే క్రమంలో ముందుకు వెళ్లేవాడు. ఉదాహరణకి వాజపేయి.. అద్వానీ, వైయస్ రాజశేఖర్ రెడ్డి… కేవీపీ రామచంద్రరావు, నేటి మోదీ, అమిత్‌షాల వరకు రెండవ స్థానంలో ఒక కీలక వ్యక్తి ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. తండ్రి తర్వాత కొడుకు లేకపోతే కూతురు లేకపోతే మనువడు/మనవరాలు అనే విధంగానే ఉంది.
ఈ ప్రశ్నలకు బదులేవి?
ఇటీవల రాజకీయాలలో అడపాదడప కొత్త వాళ్లకి, కొత్త యువతీ, యువకులకు అవకాశం కల్పిస్తున్నా అది ఎక్కువ మేర ప్రభావం చూపెట్టడం లేదు. ఉదాహరణకి ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో కొత్త పార్టీ తరఫున కొంతమంది వెలుగులోకి వచ్చారు. అలాగే గత కొద్ది కాలంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ కొంతమంది యువకులు ఇటు పార్టీల ద్వారా, ఇండిపెండెంట్‌గా నిలబడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇండిపెండెంట్‌లు గెలిచిన దాఖలాలు ఉన్నాయి. అయితే నేడు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కొంతమేర పంచాయతీ ఎలక్షన్స్‌లో యువకులు ముందుకు వస్తున్నప్పటికీ ఆ ఎన్నికల్లో కూడా పార్టీల అభ్యర్థులే ప్రధాన భూమిక పోషించి కొత్తవారికి అవకాశం లేకుండా చేస్తున్నారు. మరి ఇంతలాగ వారసత్వ రాజకీయాలు, గ్రూపు రాజకీయాలు రాజ్యమేలుతున్న రోజుల్లో యువతని రాజకీయాల్లోకి రావాలని పిలిచే మేధావులు దీనికి ఏం సమాధానం చెబుతారు? వారికి అండగా ఎవరు నిలబడతారు? ఎవరు వారిని చైతన్యవంతం చేస్తారు? ఆర్థికంగా సపోర్ట్ చేసేవారు ఎవరు? మరి ఈ ప్రశ్నలకు బదులేవి?.
ఇలా చేస్తే అభివృద్ధి చేయడానికి ఎంతో సమయం పట్టదు
గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్న బాపూజీ నినాదాన్ని గట్టిగా నమ్మి, గ్రామాల నుంచి ఈ నూతన వరవడికి శ్రీకారం చుట్టాలి. అంటే గ్రామాల్లో ఉన్నత విద్యావంతులైన యువకులకు గ్రామంలో పెద్దవాళ్లు, ఇతర రాజకీయ పార్టీ నాయకులు భూస్వాములు, ధనవంతులు అందరూ కలిసి వారి గ్రామంలో ఒక ఉన్నత విద్యావంతున్ని పంచాయతీ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి. అతనికి పాలనా పగ్గాలు అందించి సూచనలు, సలహాలు అందజేసి గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా నిర్ణయం తీసుకోవాలి. గ్రామంలో చదువుకొని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన ఎంతోమంది విద్యావంతులను ఒక చోటికి చేర్చి గ్రామంలో ముఖ్య అవసరాలైన విద్య, తాగునీరు, వైద్యము, ఉపాధి తదితర అంశాలపై దృష్టి సారించి గ్రామం అభివృద్ధికి తోడ్పడితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అతి కొద్ది కాలంలోనే ఎన్నో ఆదర్శవంతమైన గ్రామాలు రూపుదిద్దుకుంటాయి. గ్రామాల నుండి మండలాలు, మండలాల నుంచి జిల్లాలు, జిల్లాల నుంచి రాష్ట్రాలు అభివృద్ధి చెందటానికి ఎంతో సమయం పట్టదు.
యువతకి సామాజిక స్పృహ ఉండాలి
ఒక అభ్యర్థి యొక్క సామర్థ్యాలు వెలికి తీయాలంటే అతనికి అధికారము/ అవకాశం ఇచ్చి చూడాలని అమెరికా మాజీ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ చెప్పిన సూత్రాన్ని అనునయం చేసుకుంటూ.. అభివృద్ధి చేసే దమ్మున్న యువకులను ఎన్నుకునే విధానంలో కూడా ప్రస్తుతం ఉన్న యువకులకి సామాజిక స్పృహ ఎంతవరకు ఉందనేది తెలుసుకోవాలి. చివరిగా “ఓట్ ఫర్ బెటర్ సొసైటీ”, “ఓట్ ఫర్ బెటర్ ఇండియా” ఎంత అవసరమో.. “వోట్ ఫర్ బెటర్ యూత్”, “ఓట్ ఫర్ రియల్ యూత్”, “ఓట్ ఫర్ రియల్ డెవలప్మెంట్”… “ఓట్ ఫర్ యూత్ ఇండియా” అనే నానుడిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కృషి చేద్దాం. అప్పుడే మనము కలలు కన్న. నిజమైన యువ భారత్.. వికసిత్ భారత్ మన కళ్ళ ముందు ఆవిష్కృతం అవుతుంది.
writer
కె.మురళీమోహన్ కుమార్.