ప్రపంచంలోనే అత్యధికంగా భారత్‌లో 194.6 మిలియన్ల ప్రజలు పోషకాహార లోపాలతో జీవిస్తున్నారని, దీర్ఘకాలం పాటు ఆహార అభద్రత సమస్యలతో సతమతం అవుతున్నారు. 13 శాతం ప్రజలు తీవ్రమైన పోషకాహార లోప సమస్యలతో బాధ పడుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. దీనికి తగ్గట్టుగానే “2023 ప్రపంచ ఆకలి సూచీ” జాబితాలో భారత్ 111వ స్థానానికి దిగజారడం మన దుస్ధితులను వివరిస్తున్నది.
దక్షిణ ఆసియా దేశాల్లో ఇండియాలోనే అత్యధికంగా 18.7 శాతం వెస్టింగ్, అధికంగా 31.7 శాతం స్టంటింగ్ సమస్యలు పిల్లల్లో ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. పోషకాహార లోపం కలిగిన తల్లుల వల్ల 27.4 శాతం శిశువులు తక్కువ బరువుతో పుడుతున్నారని, ఇది ప్రపంచంలో అత్యధికమని పలు నివేదికలు వెల్లడించాయి. అంతేకాకుండా భారతీయ మహిళల్లో 53 శాతం రక్తహీనత, 2.8 శాతం పిల్లల్లో, 7.3 శాతం పెద్దల్లో స్థూలకాయం వంటి సమస్యలు కూడా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
2030 నాటికి ఆకలి కేకలు తగ్గుతాయా..?
కోవిడ్-19 సమయంలో ఆదాయం పడిపోవడం, జీవనోపాధులు తగ్గడం, ఆహార సరఫరా శృంఖలం గాడి తప్పడంతో ఆహార అభద్రత, పోషకాహార లోపం రెచ్చిపోయాయని మనకు తెలుసు. ఎస్ఓఎఫ్ఐ-2024 థీమ్ “ఆకలి, ఆహార అభద్రత, పోషకాహార లోపాలను అంతం చేయడానికి ఆర్థిక పెట్టుబడులు కావాలి” అనబడే అంశాన్ని తీసుకున్నారు.
ఈ లక్ష్యంతో వ్యవసాయ ఆధార పరిశ్రమల ఏర్పాటు లేదా బలోపేతం చేయడం, అసమానతల తొలగింపు, ఆహార భద్రతను గాడిలో పెట్టడం, పోషకాహార లభ్యతకు వనరుల కల్పన లాంటివి ఫలిస్తాయని ఆశిస్తున్నారు. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను 2030 నాటికి చేరడానికి కావలసిన ఆర్థిక వనరులను ఆయా ప్రభుత్వాలు ప్రాధాన్యతా క్రమంలో కేటాయించాలని, 2030 నాటికి ఆకలి కేకలు వినిపించరాదని ఐరాస కోరుకుంటున్నది.