Telugu Opinion Specials

రూపాయి విలువ పడిపోతే దేశానికి ఏమవుతుంది?

భారతీయ రూపాయి విలువ రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. ఈ పతనం మన దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశీయ కరెన్సీ విలువ పడిపోవడం వల్ల ద్రవ్యోల్బణం, దిగుమతుల ఖరీదు పెరగడం, విదేశీ పెట్టుబడులు తగ్గడం వంటి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే ప్రస్తుత రూపాయి మారక విలువ 84కి దగ్గర్లో ట్రేడ్ అవుతోంది. రూపాయి విలువ పతనమవుతున్న కారణంగా ఆ ప్రభావం అంతిమంగా వినియోగదారులపై పడుతుండటం చాలా ఆందోళనకరం.

1947లో డాలర్ తో రూపాయి మారకపు విలువ మూడు రూపాయల 30 పైసలుగా ఉంది. 2029 నాటికి ఒక్కో US డాలర్ రూ.94 నుంచి రూ.95 పలుకుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. అదే జరిగితే ఇండియా ఆర్ధిక వ్యవస్థ బలహీనత మరింతగా బహిర్గతమవుతుంది, ఇంధన, నిత్యావసర సరుకుల ధరలు పెరగడం, విదేశీ విద్య మరింత కష్టతరమవడం వంటి ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.

క్షీణిస్తూనే ఉంది..

నరేంద్ర మోదీ నేతృత్వంలోని NDA కూటమి తొలిసారి అధికారంలోకి వచ్చాక 2014 డిసెంబర్ 31న రూపాయి విలువ రూ.63.33గా ఉండగా ప్రస్తుతం అది రూ.84కి చేరింది. అంటే రూపాయి విలువ 32.6% క్షీణించింది. 

* రూపాయి విలువ క్షీణతకు కారణాలు 

* ఫార్మా, స్టీల్, టెక్నాలజీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాలకు అవసరమైన ముడి సరకులు, వంట నూనెలు, లోహాలను భారత్ దిగుమతి చేసుకుంటోంది. 

*  మన రూపాయితో పోలిస్తే అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలరుకు డిమాండ్ చాలా ఎక్కువ. భారత ‘కరెంట్ ఖాతా లోటు(- CAD)’ పెరగడం, ఎగుమతి, దిగుమతుల్లో తీవ్ర అంతరం రూపాయి పతనానికి ప్రధాన కారణాలు. 

* చమురు వినియోగంలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న భారత్.. 85% చమురును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. దీంతో ముడి చమురు ధరలు పెరిగిన ప్రతిసారీ రూపాయి విలువ తగ్గుతోంది. 

* ఆర్థిక వ్యవస్థలో ఇంధన వనరులది కీలకపాత్ర. మనదేశ ఇంధన ఉత్పత్తి, ఉత్పాదకత, ఉత్పత్తి సామర్థ్యం చాలా తక్కువ. 

* అమెరికాతో సహా, కొన్ని ఐరోపా దేశాలు తమ ద్రవ్యోల్బణాన్ని తగ్గించుకోవడానికి సెంట్రల్ బ్యాంకుల వడ్డీరేట్లను పెంచుతున్నాయి. దీంతో విదేశీ పెట్టుబడిదారులు అక్కడికి వెళ్తున్నారు. ఫలితంగా భారత రూపాయి విలువ క్షీణిస్తోంది.

* పెద్ద నోట్ల రద్దు, కరోనా సంక్షోభం, ఉక్రెయిన్పై రష్యా దాడి వంటివి కూడా రూపాయి విలువను కొద్దిగా తగ్గిస్తూ వచ్చాయి.

* ప్రభావాలు

రూపాయి మారకపు విలువ తగ్గితే దాని ప్రభావం.. దాదాపు అన్ని వర్గాల మీద ఉంటుంది. మన అవసరాల్లో సగం దిగుమతుల వల్లే తీరుతున్నాయి. కాబట్టి దిగుమతుల పన్నుల భారాన్ని సామాన్య ప్రజలే మోయాల్సి ఉంటుంది. చమురు ధర పెరిగితే.. ప్రయాణ ఛార్జీలు, కూరగాయల ధరలు పెరుగుతాయి. దీంతో మన వ్యక్తిగత ఖర్చులు కూడా పెరుగుతాయి. బ్యాంకులో దాచుకున్న నగదు విలువ పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని వస్తువుల ధరలు పెరగకపోయినా.. వాటిని కావాలని అధిక ధరకు విక్రయిస్తారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదక ఖర్చు కూడా పెరుగుతుంది. 

* మరేం చేయాలి?

రూపాయి విలువ పెరగాలంటే దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అందుకే అనవసరమైన వస్తువుల దిగుమతులను నివారించాలి. అంతర్జాతీయ వాణిజ్యంలో ఎగుమతులు, దిగుమతుల లావాదేవీలు మన కరెన్సీలో జరిగేలా చూడాలి. చమురుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వాడకం పెంచాలి. అధిక ఆదాయ దేశాల్లోకి మన మార్కెట్ చొచ్చుకుపోయేలా చర్యలు తీసుకోవాలి.

Show More
Back to top button