Telugu Opinion Specials

ఏఐ-ఆటొమేషన్‌ విప్లవంతో మానవ గుర్తింపు మసకబారుతున్నదా !

వ్యక్తులు, పౌర సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి నమోదు చేసుకోవడానికి విద్య అనే పదునైన సాధనం దోహదపడుతున్నది. విద్య మనందరి ప్రాథమిక హక్కు. “విద్య లేని వాడు వింత పశువు” అన్నారు పెద్దలు. నేడు అత్యాధునిక శాస్త్ర సాంకేతికత అద్భుతాలను సృష్టిస్తూ భూగోళాన్ని కుగ్రామంగా మార్చి వేసింది. ప్రపంచ 820 కోట్ల మానవాళి క్షణాల్లో స్మార్ట్‌ఫోన్‌ లేదా అంతర్జాల వేదికల్లో కలుసుకోగలుగుతున్నారు.

“కృత్రిమ మేధ లేదా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)”తో పాటు “ఆటొమేషన్‌” వలయంలో చిక్కి నేటి ఆధునిక మానవుడు తనను తాను మైమరచి పోతున్నాడు. ఆధునిక విద్య కొరవడిన వ్యక్తి మూగ, చెవిటి వాడిగా మిగిలిపోయే దుస్థితులు వచ్చాయి. ప్రజా సంక్షేమ వారది విద్య మాత్రమే అని తేలిపోయింది. డబ్బుతో సాధించలేనివి విద్యతో సుసాధ్యం అవుతున్నాయి. విద్యావంతుల జనాభా కలిగిన దేశం అభివృద్ధి పథంలో వడి వడిగా పయనిస్తున్నది. నాణ్యమైన విద్య కల్పించాల్సిన బాధ్యత ప్రధానంగా ప్రభుత్వాల పైన, తర్వాత ప్రైవేట్‌ సంస్థల పైన ఆధారపడుతున్నది. 

విద్య ప్రాముఖ్యత – అంతర్జాతీయ విద్యా దినోత్సవం-2025 ఇతివృత్తం:

విద్య ద్వారా విషయపరిజ్ఞానం, వివేకం, నైపుణ్యాలు, జీవన విలువలు, సాధారణ జ్ఞానం అందుతాయి. ప్రజా సమస్యలకు చక్కటి పరిష్కారాలు, సరళ జీవన విధాన రీతులకు విద్య దోహదపడుతుంది. పేదరిక నిర్మూలన, లింగ సమానత్వం, అసమానతల తొలగింపు, సామాజిక సమ్మిళిత అభివృద్ధి, శాస్త్ర సాంకేతిక ప్రగతి పరుగులు, కుటుంబ సంక్షేమం లాంటి ప్రధాన ప్రయోజనాలు విద్య వల్ల ఒనగూడుతాయి. విద్య ప్రాముఖ్యతను సాధారణ ప్రజలకు వివరించడానికి, సమాజ చైతన్యానికి ప్రతి ఏట 24 జనవరి రోజున ఐరాస నేతృత్వంలో 2019 నుంచి ప్రపంచ దేశాలు “అంతర్జాతీయ విద్యా దినోత్సవం” జరుపుకుంటున్నాయి.

అంతర్జాత విద్యా దినోత్సవం-2025 ఇతివృత్తంగా “ఏఐ – విద్య : ఆటోమేషన్‌ ప్రపంచంలో మానవ గుర్తింపును సంరక్షించడం” అనే అంశాన్ని తీసుకున్నారు. అత్యాధునిక ఏఐతో పాటు ఆటోమేషన్‌ రంగం కలిసి మానవుడి జీవన సరళిని సమూలంగా మార్చు వేసే స్థాయి వచ్చింది. మనిషి కనుగొన్న ఏఐ-ఆటోమేషన్‌ పరిజ్ఞానాలు మానవ గుర్తింపు లేదా హుమన్‌ ఐడెంటిటీని ప్రశ్నార్థకం చేస్తున్నట్లు తోస్తున్నది. మానవ హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారాలతో ఐరాస సూచించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన సుసాధ్యం అవుతున్నది. ఇలా అత్యాధునిక విద్యతో మానవ ప్రగతి వాయు వేగంతో పరుగులు పెడుతున్నది. 

ఏఐ-ఆటొమేషన్ ఆయుధం‌ మానవ గుర్తింపును మసకబార్చగలదా !

విద్య ప్రాధాన్యాలను అవగాహన పరచడం, యువత/బాలలకు నాణ్యమైన విద్యను అందించడం, సృజనకు పదును పెట్టడం, వినూత్న అవిష్కరణలకు పట్టం కట్టడం, సమాజ స్థితిగతులు/సవాళ్లను అధ్యయనం చేయడం, జీవనశైలిని మార్చడం, సామాజిక సంబంధాలను ప్రభావితం చేయడం, మన వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయడం, మనిషి ఆలోచనలను కట్టడి చేయడం, జ్ఞాపకశక్తిని పలుచబరచడం, సంక్లిష్ట సమస్యలకు సత్వర పరిష్కారాలు చూపడం, ఆలోచనా సామర్థ్యాలను తగ్గించడం లాంటి చర్చలను అంతర్జాతీయ విద్యా దినోత్సవ వేదికగా నిర్వహించాలి. మానవుడు అందించిన ఏఐ, కల్పన (ఆల్‌గారిథమ్స్‌) గణిత సాంకేతిక సూచనలతో పని చేస్తున్న టెక్నాలజీ, మానవ ఆలోచనలు, భావోద్వేగాలు, సృజన, వినూత్న ఆవిష్కరణలు, అవగాహనలను ఏ నాడు అధిగమించలేదని, మానవ గుర్తింపును లేదా మానవ చాతుర్యాలను మసకబార్చడం అసాధ్యమని తెలుసుకోవాలి. శాస్త్ర సాంకేతిక సృష్టి మనిషి ఇచ్చే ఆదేశాల మీద మాత్రమే ఆధారపడి ఉంటుందని తెలుసుకోవాలి. 

విద్యా వృక్షపు వేర్లు చేదుగా ఉన్నప్పటికీ అది అందించే పండ్లు మాత్రం తియ్యగా ఉంటాయి. ప్రపంచ సానుకూల మార్పులకు సరైన విద్య అనే పదునైన ఉపకరణం మాత్రమే. విద్యలో పెట్టుబడికి అత్యధిక వడ్డీ చెల్లించబడుతుంది. అజ్ఞాన చీకట్లను చిదిమే ప్రకాశవంతమైన దివ్వె విద్య మాత్రమే. ఒక వ్యక్తి విద్యావంతుడు అయితే అనేక అపూర్వ అవకాశాలు ఆయన వెంట పడతాయి. ఇలాంటి అత్యంత శక్తివంతమైన విద్యను అందరూ సొంతం చేసుకొని, కుటుంబాలు, పౌర సమాజం, ప్రపంచ అభివృద్ధికి కృషి చేయాలని సవినయంగా కోరుకుందాం. విద్యను అందరికీ అందుబాటులో ఉంచుదాం. 

Show More
Back to top button