Telugu News

ఓటు వేయని వారికి ప్రశ్నించే హక్కు ఉండదు !

స్వతంత్ర భారతంలో తొలి సాధారణ ఎన్నికలు 1951-52లో నిర్వహించడంతో భారత ప్రజాస్వామ్య ప్రయాణం ప్రారంభం అయ్యింది. భారత రాజ్యాంగంలో అధికరణ 326 ప్రకారం 18 ఏండ్లు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించబడింది. గతంలో 21 ఏండ్ల వయస్సును 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 1988లో చేసిన చట్టం ప్రకారం 18 ఏండ్లకు కుదించబడింది. నియోజక వర్గ పౌరుడిగా రిజస్టర్డ్‌ ఓటరు నమోదును పూర్తి చేసుకొని మానసిక ఆరోగ్యంతో ఉన్న 18 ఏండ్లు దాటిన పౌరులందరికీ ఓటు హక్కు అనివార్యంగా కల్పించబడుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్న భారతదేశంలో ఎన్నికలు సజావుగా జరగడం, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే సదవకాశాన్ని కల్పించడంతో మనదేశం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తూ, మార్గనిర్దేశనం చేస్తుండడం హర్షదాయకం. 

ఓటు వేయడం పౌరుల పరమ పవిత్రం బాధ్యత:

ప్రజాస్వామ్యానికి పునాది ఓటింగ్‌ ప్రక్రియ. పౌరులు తమ ఓటు హక్కును నిర్భయంగా, నిష్పక్షపాతంగా వినియోగించుకోవడం ద్వారా తాము మెచ్చిన నాయకులను ఎన్నుకోవడం, దేశ సమ్మిళిత అభివృద్ధిలో ప్రతి ఒక్కరు తమ పాత్రను నిర్వహించడం జరగాలి. ఓటు హక్కు సద్వినియోగం, యువ ఓటర్ల నమోదు, నిష్పాక్షికంగా విధిగా ఓటు వేయడం, ప్రభుత్వ ఏర్పాటులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావడం లాంటి లక్ష్యాలను అవగాహన పరచడానికి ప్రతి ఏట 25 జనవరి రోజున దేశవ్యాప్తంగా “జాతీయ ఓటర్ల దినోత్సవం” నిర్వహించడం ఆనవాయితీగా మారింది. జాతీయ ఓటర్ల దినోత్సవం-2025 ఇతివృత్తంగా “ఓటింగ్‌ కన్న ముఖ్యమైనది లేదు, నేను తప్పక ఓటు వేస్తాను” అనే అంశాన్ని తీసుకొని విస్తృత ప్రచారం చేయడం జరుగుతున్నది. 25 జనవరి 1950న భారత ప్రభుత్వం “భారత ఎన్నికల కమీషన్‌(ఎలక్షన్‌ కమీషన్‌ ఆఫ్ ఇండియా, ఈసిఐ)”ని ఏర్పాటు చేసిన అంశానికి గుర్తుగా ప్రతి ఏట 25 జనవరిన జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించడం కొనసాగుతున్నది. 

భారత ఎన్నికల కమీషన్ విస్తృత‌ ప్రచారాలు:

భారత దేశంలో నేడు “ఎన్నికలు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్స్(ఈవిఎం)” లేదా బ్యాలెట్‌ పేపర్‌ పద్దతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పట్టణ ఓటర్ల నిరాసక్తతను తట్టి లేపడం, ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడం, ఎన్నికల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడం, ధన ప్రవాహాన్ని అదుపు చేయడం, ఎన్నికల నేరాలను తీవ్రంగా తీసుకోవడం లాంటివి ఈసిఐ కనీస బాధ్యతగా తీసుకోబడుతున్నాయి. ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవడం, ఓటింగ్‌ శాతాన్ని పెంచడం లాంటి కార్యక్రమాల కోసం ఎపిక్‌ కార్డుల జారీ, ఓటరు ఐడీల వితరణ, ఈ-ఎపిక్‌, స్వీప్‌, ఓటరు అవగాహన, ఓటరు అవగాహన క్లబ్బుల ఏర్పాటు లాంటి చొరవను ఈసీఐ నిర్వహిస్తున్నది. ఓటు హక్కు ఒక పౌరసత్వం లాంటిది. ఓటు వేయని వారు దేశ పౌరుగానే భావించరాదు. ఓటు వేయని పౌరులకు ప్రశ్నించే హక్కు ఉండదని ప్రచారం చేయాలి.  

ఓటు హక్కు వినియోగించుకోవడం తప్పనిసరి ప్రతి ఒక్కరు భావించిన నాడు మాత్రమే ప్రజాప్రభుత్వాలు ఏర్పడి, ప్రజలకు ప్రయోజనకర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగడం, ప్రభుత్వ నిధుల సద్వినియోగం, అక్రమాలకు అడ్డుకట్ట లాంటివి సుసాధ్యం అవుతాయని గమనించాలి. 18 ఏండ్లు నిండిన వెంటనే యువత మన ఓటరు నమోదు పూర్తి చేసుకొని, బాధ్యతగల ఓటరుగా ప్రవర్తించాలి. దేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు గొడుగు పట్టిన మహానుభావులను స్మరించుకోవడం, మన ఓటు మన స్వరం అని నినదించడం నిరంతరం జరగాలి. బాధ్యతగల ఓటరుగా గర్వపడుతూ, ఓటు హక్కు వినియోగంతో మనదైన ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని దేశ సమగ్రాభివృద్ధికి గట్టి పునాదులు వేయాలని ఆశిద్దాం. భవ్య భారత సౌధానికి ఇటుకలు ఓటర్లని భావించి ఓటును సద్వినియోగం చేసుకుందాం. 

Show More
Back to top button