
కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడోసారి ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ 2024-25 జూలై 23న లోక్ సభలో సమర్పించేందుకు పూర్తి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే, ఈ బడ్జెట్‌పై సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు సహా వ్యాపారులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా పన్ను మినహాయింపులో రిలీఫ్ ఇవ్వడం సహా పలు అంశాలపై చర్చ జరుగుతోంది.
అంతేకాకుండా ఒకప్పుడు సీనియర్ సిటిజెన్లకు లభించే ట్రైన్ టికెట్ రాయితీ.. మళ్లీ కల్పిస్తారని చర్చ జరుగుతోంది. అలాగే నిరుద్యోగిత సమస్యను తగ్గించేదుకు, నింగినంటిన ధరలను భూమి మీదకు తీసుకొచ్చేందుకు ఈ బడ్జెట్‌లో చర్యలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఉజ్వల్, పోస్టాఫీసు స్కీంలకు సంబంధించి కొన్ని మార్పులు చేయబోతున్నారనే వాతావరణం కనిపిస్తోంది. ఈ స్కీమ్‌ల కోసం బడ్జెట్‌లో రూ. 9,000 కోట్ల ఎల్‌పీజీ(LPG) సబ్సిడీని కేటాయించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు 2026 ఏడాది వరకు ఉచిత LPG కనెక్షన్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని కొనసాగించవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ స్కీం ద్వారా మరో 70 వేలకు పైగా కొత్త కనెక్షన్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
ఇక ఆదాయపు పన్ను విషయానికి వస్తే.. సెక్షన్ 80C కింద సాధారణ ప్రజలకు పన్ను మినహాయింపు పరిమితిని ప్రభుత్వం రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే వ్యక్తిగత ఆదాయపు పన్ను విషయంలో రూ.15 లక్షలకు పైగా ఆర్జిస్తున్న వారికి ఊరట ఉండొచ్చని చెబుతున్నారు.
ప్రస్తుతం రూ.15 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి 5 నుంచి 20 శాతం మధ్య పన్ను పడుతుండగా.. రూ.15 లక్షలు పైబడిన వారికి గరిష్ఠంగా 30 శాతం ట్యాక్స్ పడుతోంది. అలాగే, రూ.10 లక్షల వార్షికాదాయంపైనా పన్ను రేట్లు తగ్గించే యోచన చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొత్త ఆదాయపు పన్ను శ్లాబుల గురించీ చర్చ జరుగుతోందని తెలిపాయి. ఒకవేళ అలానే జరిగే మధ్యతరగతి వర్గం వారి వినియోగం పెరిగి దేశ జీడీపీని పెంచడంలో కీలక పాత్ర వహిస్తారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.