Telugu Opinion Specials

జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో గెలుపు పగ్గాలు ఎవరివి..?

జమ్మూ కశ్మీర్‌లో పది సంవత్సరాల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు పలు అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ఎన్నికలను కశ్మీరీలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని ఓటింగ్ శాతం చూసి చెప్పవచ్చు. పచ్చిగా చెప్పాలంటే ఈ ఎన్నికలు ఆర్టికల్‌ 370 రద్దు ద్వారా కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడంపై ఈ ఎన్నికలను ప్రజాభిప్రాయ సేకరణగా మనం భావించవచ్చు. జరిగిన పోలింగ్‌లో 63.45 శాతంగా ఓటింగ్‌ నమోదైంది. ఇది ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల సగటు 57.89 కంటే ఎక్కువ. అంతేకాదు, 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 61.01 కంటే ఎక్కువే. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా, సోఫియాన్‌, కుల్గాం, ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాల్లో ఓటింగ్‌ భారీగా పెరిగింది.

370 ఆర్టికల్ రద్దుతో ఓటుహక్కు పొందిన వాల్మీకి తెగ ప్రజలు, పాక్‌ కాందిశీకులు, గూర్ఖాలు ఈ ఎన్నికల్లో తొలిసారిగా తమ హక్కును వినియోగించుకున్నారు. అయితే, వారి ఓట్లే నిర్ణయాత్మకం కావచ్చనే అంచనాలూ కూడా వ్యక్తం అవుతున్నాయి. జమ్మూ కశ్మీర్‌ అస్తిత్వాన్ని పూర్తిగా మార్చివేసిన బీజేపీ విధానాలకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్ష అనే రాజకీయ నిపుణులు చెబుతున్నారు. పది సంవత్సరాల క్రితం పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన బీజేపీ, పీడీపీలు ఈసారి జరిగిన ఎన్నికల్లో విడివిడిగా బరిలోకి దిగాయి. బీజేపీ చేతుల్లోకి కశ్మీర్‌ వెళ్లకుండా అడ్డుకోవాలనే లక్ష్యంతో  కాంగ్రెస్‌, ఎన్సీ జట్టు కలిసి బరిలోకి దిగాయి. స్థానిక సమస్యలు, కనీస అవరాల అంశాలపై కాకుండా ప్రత్యేక హోదా పునరుద్ధరణ, రాష్ట్ర హోదాను తిరిగి కల్పించడం లాంటి అంశాల మీదే ఎన్నికల ప్రచారం జరిగింది.

రాష్ట్ర విభజన తర్వాత కూడా  లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ద్వారా కేంద్రమే పరిపాలన చేసింది. ఇది కొంతమంది కశ్మీరీలకి ఏ మాత్రం నచ్చని అంశమని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఒకవేళ ఈ ఎన్నికల్లో బీజేపీ గనుక గెలిస్తే ఆర్టికల్‌ 370 రద్దుకు ప్రజల మద్దతు ఉందని ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా హంగ్‌ ఏర్పడి అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిస్తే మాత్రం ఏదోరకంగా అయినా.. అధికారం పొందడానికి చిన్నాచితకా పార్టీలను, స్వతంత్ర అభ్యర్థులను తనవైపు తిప్పుకోవాల్సి ఉంటుంది. అదే ఒకవేళ కాంగ్రెస్‌, ఎన్సీ కూటమి గెలిస్తే రాష్ట్ర హోదా పునరుద్ధరించకుండా కేంద్రం ఆలస్యం చేసే అవకాశం ఉంటుంది.

అదే జరిగితే రాష్ట్ర హోదాతో పాటు ఆర్టికల్‌ 370 కోసం డిమాండ్లు ఊపందుకోవచ్చు. ఆర్టికల్‌ 370 పునరుద్ధరణ చేయాలంటూ కూటమిలోని ఎన్సీ డిమాండ్‌ చేస్తుండగా.. కాంగ్రెస్‌ కేవలం రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తుంది. ఈ కారణంగా కూటమి గెలిచినా ఎన్నాళ్లు అధికారంలో ఉంటుందో చెప్పలేని పరిస్థితి నెలకుంటుందని రాజకీయ విశ్లేషుకులు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ.. కశ్మీరీలు అధిక సంఖ్యలో వచ్చి ఓటింగ్‌లో పాల్గొనడం అభినందించాల్సిన విషయం. కాబట్టి, ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా.. ప్రజలకు మేలు చేసేడట్టే ఉండాలే తప్ప.. మరే ఏ విధంగా రాజకీయలు చేసేడట్టు ఉండకూడదని కోరకుందాం.

Show More
Back to top button