ప్రస్తుతం మనదేశంలో చూసుకుంటే ఎన్నడూ లేని విధంగా ఆర్థిక అసమానతలు, అంతరాలు పెరిగిపోతున్నాయి. కార్పొరేట్ యజమానులు కొన్ని వేల కోట్ల రూపాయల ఖర్చుతో వివాహా శుభకార్యాలు, సంబరాలు విదేశాల్లో జరుపుకుంటున్నారు. దీనికి తగ్గట్టుగానే దేశంలో ప్రతి ఏడాది బిలియనీర్ల, కుబేరుల సంఖ్య శరవేగంగా పెరిగిపోతోంది.
ఉపాధి లేని అభివృద్ధి జరుగుతోందా?
ఆర్థిక అసమానతలకు ప్రధాన కారణం.. కేంద్ర ప్రభుత్వం కార్మికుల వేతనాల నియంత్రణ, కుదింపు, పని గంటల పెంపునకు సహకరిస్తూ, కార్పొరేట్ సంస్థల లాభాలపై పన్ను శాతం తగ్గిస్తూ వారికి మాత్రమే లాభాలు పెంచుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీంతో లాభాల వెల్లువను, పెట్టుబడులను, ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను సంపూర్ణంగా కార్పొరేటీకరించడం జరుగుతోందని అంటున్నారు. మరోపక్క ఈ ఆర్థిక అసమానతలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలలో 30 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ కాకుండా ఉండడమే అని నిపుణులు అంటున్నారు.
దేశంలో ఒకపక్క పెరుగుతున్న నిరుద్యోగ సమస్య, మరో పక్క నిరంతరం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను గమనిస్తే ఆర్థిక వ్యవస్థలో పరస్పర వైరుధ్యాలు కలిగిన పరిస్థితులు ఎంతగా ఉన్నాయో అర్థమవుతుంది. ఆర్థిక వృద్ధిరేటు 6శాతం, ఉపాధి–ఉద్యోగిత రేటు కేవలం 2శాతం మాత్రమే నమోదు అవుతున్న ఆర్థిక విధానంలో, దాదాపు ఉపాధి లేని అభివృద్ధి జరుగుతున్నదని ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
మధ్య, దిగువ తరగతిపై అధిక భారం..!
మధ్య, దిగువ తరగతి ప్రజలపై పెట్రోల్, డీజిల్ పన్నులు, జీఎస్టీ పన్నుల భారం అధికంగా ఉండడం వల్ల సగటు వినియోగదారుని నికర ఆదాయం కుదించుకుపోతోంది. నిత్యం పెరుగుతున్న ధరలతో అసంఘటిత, అనియత (గుర్తించబడని) రంగాల్లోని ఉద్యోగుల, కార్మికుల వాస్తవ వేతనాలు రోజురోజుకూ కరిగిపోతున్నాయి అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీనికి తగ్గట్టుగానే ఇటీవల ప్రపంచ బ్యాంకు అధికారి గోపీనాథ్ ఎదుగుతున్న కోట్లాది విద్యావంతులైన యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించే ప్రయత్నంలో జి–20 దేశాలలో భారత్ వెనుకబడి ఉందని అన్నారు. పేదలకు, ధనవంతులకు మధ్య సాపేక్ష పేదరికం మరింత పెరిగిందన్నారు. డబ్భై ఏడు సంవత్సరాల స్వాతంత్ర్యం తర్వాత కూడా 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత బియ్యం పంపిణీ జరుగుతుందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
అసమానతలు తగ్గుముఖం ఇలా..
ప్రస్తుతం దేశం ముందున్న అతిపెద్ద సమస్యైన ఆర్థిక అసమానతలను తగ్గించాలంటే.. సరైన ఆర్థిక విధానాలను అమలు చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ప్రజలకు ఉపాధి కల్పించి.. ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత నుండి రక్షించాలంటున్నారు. 52 కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ రూ.100 నుండి రూ.150 దినసరి ఆదాయంతో జీవిస్తున్నారు. నివాసయోగ్యమైన గృహ సదుపాయం లేక ఆదివాసులు, గిరిజనులు, ఇతర పేదలు కోట్లాదిగా నిరాశ, నిస్పృహలకు గురి అవుతున్నారు. విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ రంగాల ద్వారా ప్రజల సమగ్ర అభివృద్ధికి కావలసిన ఆర్థిక విధానాలు అమలు చేసి.. దేశ సంపదలో ప్రజలందరికీ భాగస్వామ్యం లభించాలని వాదిస్తున్నారు.