Telugu Opinion Specials

అమావాస్య మంచిరోజు కాదా.. ఆనాడు ఆడపిల్ల జన్మిస్తే ఏం జరుగుతుంది.. ?

హిందూ సాంప్రదాయాల ప్రకారం హిందువులు ఎన్నో నమ్మకాలను విశ్వసిస్తారు. ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి రోజుల విషయంలో ఎన్నో జాగ్రత్తలను పాటిస్తారు. ఏదైనా పనులు చేపట్టబోయే ముందు ఈ రెండు తిధులను బేరీజు వేసుకొని పనులను ప్రారంభిస్తారు. అమావాస్య పౌర్ణమి లని ఎంతో ప్రత్యేకమైన రోజులుగా పరిగణిస్తారు. చంద్రుడు లేని రోజు అమావాస్య. అమావాస్యనాడు గ్రహాలన్నీ చీకట్లోకి వెళ్లిపోతాయి. చీకటి అలుముకుంటోంది. అయితే ఇంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి అమావాస్య రోజు ఆడపిల్లలు జన్మిస్తే కొందరు అదృష్టమని మరికొందరు అరిష్టం అని అంటారు.

అమావాస్యనాడు ఆడపిల్ల జననం…

అమావాస్య రోజున ఆడపిల్ల జన్మిస్తే అరిష్టమా లాభమా అనేది అందరిలో మెదిలే ప్రశ్న. అమావాస్య అనేది సామాన్యంగా అందరూ చెడ్డ రోజుగా భావిస్తారు. శుభకార్యాలనేవి ఎప్పుడూ కూడా ఈ అమావాస్య రోజున తలపెట్టరు. అయితే జనన మరణాలు అనేవి మన చేతుల్లో ఉండవు. అవి సాధారణంగా జరిగే ప్రక్రియ. చెడుగా భావించే అమావాస్య తిథి నాడు ఎవరైనా జన్మిస్తే అది ఒక అరిష్టంగా భావిస్తారు. ముఖ్యంగా ఆడపిల్ల అమావాస్యనాడు జన్మిస్తే కీడు జరుగుతుందా, మంచి జరుగుతుందా అనేది ఒక ప్రశ్న. అయితే ఈ విషయంపై జ్యోతిష్య శాస్త్రజ్ఞులు ఏమంటున్నారంటే అమావాస్య రోజు ఆడపిల్ల జన్మిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి జన్మించినట్టుగా భావించాలట.

అమావాస్య రోజు ఆడపిల్ల పుట్టడం ఎంత శుభప్రదమో.. అదే అమావాస్య నాడు అబ్బాయి పుడితే చెడు ఫలితాలు జరుగుతాయని  జ్యోతిష్కులు చెబుతున్నారు. అమావాస్యనాడు చంద్రబలం అనేది తక్కువవుతుంది. చంద్రబలం తక్కువైన చోటే లక్ష్మీ బలం సిద్ధిస్తుంది. అందువల్లనే అమావాస్యనాడు లక్ష్మీదేవికి పూజ చేసే సాంప్రదాయం ఉంది. ముఖ్యంగా దీపావళి అమావాస్యనాడు లక్ష్మీదేవిని కొలుస్తారు. లక్ష్మీదేవి ఆవిర్భావం కూడా అమావాస్య నాడే జరిగింది.

 “ఓం లక్ష్మి క్షీర సముద్ర రాజతనయాం. శ్రీరంగధామేశ్వరీం.. ధాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం. శ్రీ మన్మంధ కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం.. త్వాం త్రైలోక్య కుటుంబీనీం.. సరసిజాం వందే ముకుంద ప్రియాం”

అంటే లక్ష్మీదేవి క్షీరసాగరంలో జన్మించింది. ఈమెను ఇందిరా అని కూడా అంటారు. లక్ష్మీదేవి అమావాస్యనాడు జన్మిస్తే ఆమె సహోదరుడైన చంద్రుడు పౌర్ణమి నాడు జన్మించాడు. అందుకే అమావాస్యకు అక్క పుడితే.. పౌర్ణమికి తమ్ముడు పుట్టాడు అనేది ఓ నానుడి.

అందుకే అమావాస్యనాడు అమ్మాయి పుడితే లక్ష్మీదేవితో సన్నిధానంగా భావిస్తారట. అయితే అమావాస్యనాడు అమ్మాయి పుడితే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. అమావాస్యనాడు జన్మించిన అమ్మాయితో ఎప్పుడు కూడా దానం ఇప్పించరాదు. అమావాస్యనాడు జన్మించిన అమ్మాయితో దానం ఇచ్చేస్తే ఆ అమ్మాయి చేతిలో ఉండే లక్ష్మీ యోగం ఇతరులకు వెళ్లిపోయినట్టే. ఒకవేళ దానం ఇప్పించాలి అనిపిస్తే చేతిలో ఏదైనా ఒక వస్త్రాన్ని పెట్టి ఆ వస్త్రం ద్వారా దానం ఇప్పించాలి. లేదా.. ఒక ప్రదేశంలో పెట్టి తీసుకోండి అని ఇప్పించాలి. కానీ ఆమె చేతుల మీదుగా ఎవరికి దానం ఇవ్వరాదు. అదేవిధంగా శాస్త్ర ప్రకారం.. అమావాస్య రోజు పుట్టినటువంటి అమ్మాయిని ఇంకో ఇంటికి కన్యధానంగా ఇవ్వకూడదు. అల్లుడిని ఇల్లరికం తెచ్చుకోవాలని చెబుతున్నారు. 

అమావాస్యనాడు జన్మించిన అమ్మాయిలకు మొండితనం అధికంగా ఉంటుంది. మొండితనం పెంకితనం అధికంగా ఉండడం వల్ల మరొకరికి తలవంచరు. మరొకరి మాట వినరు. శుభ లక్షణాలు వచ్చినప్పుడు ఇటువంటి లక్షణాలు కూడా ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు

 వీరికి మొండితనంతో పాటు మొండి ధైర్యం కూడా ఉంటుంది.

అయితే ఆ మొండితనాన్ని  డైవర్షన్ చేసేందుకు వారికి సర్ది చెప్పాలి. పలు సూచనలు చేయాలని జ్యోతిస్యులు చెబుతున్నారు.

అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే ఈ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి…

ఆడపిల్ల అమావాస్య రోజు పుడితే తనని ఎంతో అదృష్టవంతురాలుగా భావిస్తారు. అమావాస్య రోజు పుట్టిన ఆడపిల్ల మొహం ఎంతో అందంగా, కళగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. అమావాస్య రోజు పుట్టిన అమ్మాయి ఎప్పుడు శుభమే పలకాలట. ఆమె నోటి నుంచి అశుభం మాటలు రాకూడదని, తను పలికే మాటలు ఎంతో నిజమవుతాయని పండితులు చెబుతున్నారు. కాబట్టి వీలైనంతవరకు అమావాస్య రోజు పుట్టిన ఆడపిల్లలు మంచిని కోరుకోవడంతో మంచి జరుగుతుందట. అమావాస్య రోజు పుట్టిన అమ్మాయికి వివాహం తర్వాత భర్తతో చిన్నపాటి మనస్పర్ధలు వస్తాయట. అయితే వాటిని పాజిటివ్ గా ఆలోచిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని జ్యోతిష్యులు అంటున్నారు.

ముఖ్యంగా వీరు ఏ పని చేయాలన్నా ఏదైనా నూతన వస్తువులను కొనుగోలు చేయాలన్న పౌర్ణమి తర్వాత కొనుగోలు చేయడం ఎంతో ఉత్తమమని, అప్పుడే అద్భుతంగా ముందుకు రాగలరని పండితులు చెబుతున్నారు. అమావాస్య రోజు పుట్టిన ఆడపిల్లకి దేనికి లోటు ఉండదని ఈ అమ్మాయి పుట్టింట్లో ఉన్నా, అత్తవారింట్లో ఉన్న ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. జరగబోయే చెడు సూచనలు వీరికి ముందుగానే తెలుస్తాయి. ఏదైనా ప్రమాదం జరగబోతుంది అంటే వీరికి ముందుగానే తెలుస్తుంది అయితే వీరు చెప్పే విధానం ఎదుటివారికి నెగిటివిటీగా కనిపిస్తోంది.

సరైన విధానంతో చెప్పకపోవడం వల్ల వీరిని చాలామంది త్వరగా అపార్థం చేసుకుంటారు. వీరికి జరగబోయే చెడు, జరగబోయే ప్రమాదం ముందే తెలిసినప్పటికీ ఎదుటివారితో ఒకేసారి కుండ బద్దలు కొట్టినట్టుగా కాకుండా నిదానంగా వారికి అర్థమయ్యేలా చెప్పాలి. అంతేకాకుండా అమావాస్యనాడు జన్మించిన అమ్మాయిలు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. మీరు ఎంత పాజిటివ్ గా ఆలోచిస్తే అంత శుభం జరుగుతుంది. వీరి నోటి నుండి ఎప్పుడు అశుభ మాటలు రాకూడదని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా అమావాస్య నాడు జన్మించిన అమ్మాయిలు ఎప్పుడూ కన్నీరు పెట్టరాదు. వీళ్ళని బాధ పెట్టకుండా చూసుకోవాలని జ్యోతిస్యులు చెబుతున్నారు. వీరు ఎక్కడ నవ్వుతో ఉంటారో అక్కడ లక్ష్మీదేవి కొలువుదీరుతుంది. 

పితృదేవతలను పూజించడానికి అనుకూల సమయం అమావాస్య…

అచార సంప్రదాయాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే హిందు మతంలో అమావాస్య, పౌర్ణమి తిథులను  ఎక్కువపరిగణలోకి తీసుకుంటారు. పౌర్ణమిని శుభ సూచకంగా, అమావాస్యను అశుభ సూచకంగా చెప్తుంటారు. మరికొందరు మాత్రం అమావాస్య రోజునే మంచి రోజుగా భావిస్తుంటారు. కుటుంబానికి చెందిన పూర్వీకులు ఎవరైతే మరణిస్తే  వారిఆత్మలను స్మరించుకోవడానికి, వారిని పూజించడానికి అమావాస్య సరైన సమయంగా చెబుతారు. చంద్రకాంతి లేని రోజు సూర్యరశ్మి వారికి చేరుతుందని నమ్ముతారు. ఈ రోజున, మరణించిన పూర్వీకులు భూమిపైకి వచ్చి తమ పిల్లలు, వారసులను సందర్శిస్తారనే నమ్మకం ఉంది.

ఈరోజు దుష్టశక్తుల ప్రభావం ఎక్కువ…

అమావాస్య రోజున దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అందుకే ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని చెబుతారు. కాబట్టి ఈ రోజున కొత్త బట్టలు ధరించడం, ఏదైనా శుభకార్యాలు చేయడం, గోళ్లు కత్తిరించుకోవడం మంచిది కాదని పండితులు చెబుతారు. అదేవిధంగా అమావాస్యనాడు శృంగార జీవితానికి దూరంగా ఉండాలట. ఆనాడు భార్యాభర్తలు కలిస్తే వారి ద్వారా వచ్చే సంతానం వినాశనానికి దారితీస్తుందని జ్యోతిష్యులు మాట. అమావాస్యనాడు దుష్టశక్తులకు అధికంగా బలం చేకూరుతుంది. కొత్తగా మంత్ర, యంత్ర, తంత్ర విద్యలు నేర్చుకునేవారు అమావాస్య నాడే ప్రారంభిస్తారట. అందుకే సాధ్యమైనంత వరకు అమావాస్యనాడు ప్రయాణాలకు దూరంగా ఉండాలని పెద్దలు చెబుతారు.

అమావాస్య అంటే అక్కడ పండుగే…

హిందూ సంప్రదాయాల ప్రకారం చెడు రోజుగా భావించే అమావాస్యను కొన్ని ప్రాంతాలలో పండుగ దినంగా పరిగణిస్తారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి జన్మించిన రోజుగా అమావాస్యను కీర్తిస్తారు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో అమావాస్య వారికి ఎంతో పవిత్రమైన రోజు. ఆనాడు వారంతా లక్ష్మీదేవిని కొలుస్తూ పూజలు చేస్తారు. గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాలలో సైతం అమావాస్యను పర్వదినంగా భావిస్తారు. మార్వాడీలు అయితే ప్రతి అమావాస్యనాడు ఓ పండుగలా జరుపుతారు. లక్ష్మీదేవిని పూజిస్తారు. తల స్నానాలు ఆచరించి కొత్త బట్టలను ధరించి అమావాస్యను శుభదినంగా జరుపుకుంటారు. ఇక అక్కడ ఆడపిల్లలు అమావాస్య నాడు పుడితే వారిని కంటికి రెప్పలా  కాపాడుతారట.

Show More
Back to top button