
ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు కొద్ది కొద్దిగా రాజకీయ వేడిని అలవరించుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత హత్యలు, అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. దీనిపై దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మాజీ సీఎం జగన్ దీక్ష చేశారు. దీంతో ఇండియా కూటమికి దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే జగన్‌తో స్నేహం ఇటు ఇండియా కూటమికి.. అటు వైసీపీకి ఉభయ కుశలోపరిగా రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.
జగన్‌కు జాతీయ పార్టీల అండ అవసరమవగా.. ఇండియా కూటమికి ఏపీలో బలమైన పార్టీ ఆసరా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా పోటీ చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలలేదు. దీనివల్ల వైసీపీ నష్టపోయింది. అదే వైసీపీ ఇండియా కూటమిలోని కాంగ్రెస్, వామపక్షాలను చేరదీస్తే… కొంతవరకైనా మేలు జరిగే అవకాశం ఉండేదని విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.
జగన్‌కు ఢిల్లీ స్థాయిలో ఆశ్రయం కావాలి. ఇండియా కూటమికి కూడా పార్టీలు కావాలి. జగన్ ధర్నాకు ఇండియా కూటమి పార్టీలు రావడమే దీనికి సంకేతం. చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ నిర్వహించిన ఆందోళనలకు జాతీయ స్థాయి ప్రతిపక్షాల నుంచి మంచి స్పందన లభించింది. వివిధ జాతీయ పార్టీల నాయకులు, అధికార ప్రతినిధులు, లోక్‌సభ సభ్యులు దీనికి హాజరయ్యారు. సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, శివసేన నాయకుడు సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది, తృణమూల్ కాంగ్రెస్ నేత నదీముల్‌హక్ మొదలైన నాయకులు ఇందులో పాల్గొన్నారు. వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఇండియా భాగస్వామ్య పక్షాలు ఈ ఆందోళనకు హాజరైనప్పటికీ..
ఈ కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న కాంగ్రెస్ మాత్రం దూరంగా ఉంది. తమకు మద్దతుగా నిలిచిన పార్టీలకు తాము అండగా నిలుస్తామని జగన్ స్పష్టం చేయడంతో కాంగ్రెస్‌కు పరోక్షంగా సంకేతాలు పంపినట్లు కనిపిస్తోంది. ఇకపోతే రాజ్యసభలో వైసీపీ కీలకంగా ఉంది. అటు ఎన్డీఏకు దూరమై ఇక ఇండియా కూటమితో కలుస్తారా.. తటస్థంగానే అంశాల వారీగా వ్యవహరిస్తారా అనేది తేలాల్సి ఉంది. దీనికి జులై 30న ఢిల్లీలో ఇండియా కూటమి ఆందోళనకు వైసీపీ హాజరవుతుందా లేదా అనే నిర్ణయం ఆధారంగా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
అధికార పక్షం ఆధిపత్యాన్ని ఎదుర్కోవటానికి.. ప్రతిపక్ష పార్టీలు భారత కూటమిలో చేరడానికి ఇది సరైన సమయం. YSRCPకి ప్రస్తుతం 11 మంది రాజ్యసభ సభ్యులు, నలుగురు లోక్‌సభ సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం రాజ్యసభలో అధికార ఎన్‌డీఏకు మెజారిటీ తక్కువగా ఉన్నందున, భాగస్వామ్య పక్షాల నుంచి అదనపు సంఖ్య కోసం ప్రయత్నించడం, సభలో బిల్లులు, తీర్మానాలను ఆమోదించడం బీజేపీకి అనివార్యమైంది. తటస్థంగా ఉన్నానని చెబుతూ.. పరోక్షంగా ఎన్డీఏ కూటమికి ఇన్నాళ్లు సహకరించిన జగన్‌ను..
తమ వైపు తిప్పుకోవాలని ఇండియా కూటమి భావిస్తోందా? జగన్ ఇండియా కూటమితో జతకడితే రాష్ట్రంలో రాజకీయం ఎలా? షర్మిలతో రాజీపడతారా? ఢిల్లీ బీజేపీ పెద్దలను ఎదిరించి రాజకీయం చేయగలరా..? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి..! రాజకీయంగా ఇప్పుడు అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మరి జగన్ ఏం చేయనున్నారు..? అటు ఎన్డీఏ.. ఇటు ఇండియా కూటమి జంక్షన్‌లో నిలిచిన జగన్ దారెటు..?
అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన జగన్.. కేవలం నలుగురు లోక్‌సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యుల అండతోనే రాజకీయం నెట్టుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవలి కాలంలో ప్రతిపక్షాల నుంచి అధికార పక్షాలకు ఎంపీలు జంప్ చేసే ధోరణితో, వైసీపీ కూడా ప్రస్తుతమున్న తన బలాన్ని కలిపి ఉంచడంలో అప్రమత్తంగా ఉంది. అసెంబ్లీని బాయ్‌కాట్ చేసిన జగన్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీ వెళ్లారు. వీరిలో ఇద్దరు ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, వంకా రవీంద్ర మాత్రం జగన్‌తో ఢిల్లీ వెళ్లకుండా శాసనమండలికి హాజరయ్యారు. ఈ పరిణామాలను పరిశీలిస్తే మాజీలతో పాటు ప్రస్తుతం ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు పార్టీ మారే అవకాశం ఉంది. అది స్వప్రయోజనమా లేదా ప్రజాభిష్టం పైనా అన్నది తేలాల్సివుంది.
రాజ్యసభలో 245 మంది సభ్యులకు గానూ ప్రస్తుతం 225 మంది ఉన్నారు. మెజారిటీ మార్కు 113. అయితే బీజేపీ సభ్యుల సంఖ్య 86. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ బలం కూడా 101కు పడిపోయింది. రాజ్యసభలో ఎన్డీఏ బలం (101), మెజార్టీ మార్కు కంటే 12 స్థానాలు తక్కువ. ఇండియా కూటమి బలం 87గా ఉంది. కాంగ్రెస్‌కు 26, టీఎంసీకి 13, ఆప్, డిఎంకెలకు పది మంది చొప్పున సభ్యులున్నారు. ఆర్‌జెడి-5, సిపిఎం-4, ఎస్‌పి-4, జెఎంఎం-3, ఎన్‌సిపి (శరద్ పవర్)-2, శివసేన (ఉద్దవ్ ఠాక్రే)-2, సిపిఐ-2, ఐయుఎంఎల్-2, ఎండిఎంకె, ఎజిఎం, కెసిఎంలకు ఒక్కొక్కరు, ఒక ఇండిపెండెంట్ ఉన్నారు. రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందడానికి ఎన్డీఏ పార్టీలపై ప్రభుత్వం ఆధార పడాల్సి ఉంటుంది. ఒడిశాకు చెందిన బీజేడీకి 9 మంది సభ్యులున్నారు.
గతంలో పూర్తి స్థాయిలో అన్ని సందర్భాల్లోనూ మద్దతిచ్చిన బీజేడీ ఇటీవల బీజేపీ చేతిలోనే ఒడిశాలో ఓడిపోవడంతో, ప్రస్తుతం వ్యతిరేకిస్తోంది. నలుగురు సభ్యులున్న తమిళనాడుకు చెందిన అన్నాడిఎంకె కూడా మద్దతు నిరాకరించే పరిస్థితిలో ఉంది. 11 మంది సభ్యులున్న ఎపీలోని వైసీపీ, నలుగురు సభ్యులున్న తెలంగాణలోని బీఆర్‌ఎస్, ఒక సభ్యుడున్న బీఎస్‌పీ, ఎంఎన్‌ఎఫ్ ప్రస్తుతం తటస్థంగా ఉన్నాయి. బిల్లుల అంశంలో ఈ పార్టీలు, స్వతంత్ర ఎంపీలు ప్రభుత్వానికి మద్దతిచ్చే అవకాశముంది. బీజేపి నామినేట్ చేసిన 12 మంది సభ్యులు కూడా ప్రభుత్వానికి మద్దతిస్తారు. ఈ నేపథ్యంలో వీరి సహాయంతో బిల్లులను ప్రభుత్వం ఆమోదించుకునే వీలుంది.
ఇదే సమయంలో కాంగ్రెస్‌ను వ్యతిరేకించి.. సొంత పార్టీ పెట్టుకున్న జగన్ మళ్లీ ఆ పార్టీతో స్నేహంగా మెలగడం కుదురుతుందా? అన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే జగన్‌ను ఇండియా కూటమిలోకి ఆహ్వానించడానికి ఆ పార్టీలు సిద్ధంగా ఉన్నప్పటికీ.. స్థానికంగా జగన్ టార్గెట్‌గా రాజకీయం చేస్తున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వైఖరి కూడా ఇక్కడ చర్చనీయాంశమవుతోంది. జగన్ ఇండియా కూటమికి దగ్గరైతే షర్మిల ఎంత వరకు సహకరిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్రంలో బలమైన పార్టీలు అన్ని కూటమిగా ఏర్పడి వైసీపీని ఒంటరి చేశాయి. ఈ పరిస్థితుల్లో వైసీపీ నిలదొక్కుకోవాలంటే జాతీయస్థాయిలో బలమైన అండ లభించాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో ఏపీలో పెద్దగా ప్రభావం చూపలేని ఇండియా కూటమికి..
వైసీపీ వంటి పెద్ద పార్టీ సహకారం ముఖ్యమనే వాదన వినిపిస్తోంది. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు పరిశీలకులు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేత పత్రాలు, గత ప్రభుత్వ విధానాలపైన ఆదాయ వ్యయాలపైన దృష్టి సారించిన ఈ సమయంలో జగన్ ఆచితూచి నిర్ణయం తీసుకోనున్నారు. కొంత కాలం తటస్థంగా ఉండి ప్రాధాన్యతను బట్టి, అవసరాన్ని బట్టి బేషరతుగా తన మద్దతు ఇస్తారనేదే పార్టీ వర్గాల మాట. ఈ పరిస్థితుల్లో హస్తినలో హస్తం హస్తమిస్తుందో లేదా పార్టీని హస్తగతం చేసుకుంటుందో చూడాలి.