
దేశ రక్షణలో భాగంగా గడ్డకట్టే మంచు సరిహద్దుల్లో.. శత్రుమూకలు ఎక్కువగా ఉండే బార్డర్ ప్రాంతాల్లో.. పహారా కాస్తూ.. బాధ్యతగా విధి నిర్వహించే సోల్జర్స్.. దేశానికి వెన్నెముకలా నిలుస్తారు.
సొంత కుటుంబాన్ని, సంతోషకరమైన.. ప్రశాంతమైన జీవితాన్ని వదులుకొని.. ప్రాణాల్ని పణంగా పెట్టి చివరికి దేశం కోసం.. తెగించి ప్రాణాలు పోగొట్టుకున్నారు.. వారి త్యాగం వెనుక తమ కుటుంబసభ్యుల ఎన్నో గాథలు.. ఎన్నో వ్యథలు ఉన్నాయి.. అలాంటి కోవకు చెందినవారే మన భారత్ కి చెందిన కెప్టెన్ అంశుమన్ సింగ్…
ఆర్మీ మెడికల్ కార్ప్స్ డాక్టర్, 26వ బెటాలియన్, పంజాబ్ రెజిమెంట్ కు చెందిన అంశుమన్ సింగ్ విధుల్లో చేరిన కొద్దిరోజుల్లోనే.. ప్రమాదవశాత్తు చోటు చేసుకున్న ఓ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన త్యాగానికి గుర్తింపుగా భారత రెండో అత్యున్నత పీస్‌టైమ్ గ్యాలంటరీ పురస్కారం కీర్తిచక్ర లభించింది. దేశం కోసం భర్త చేసిన త్యాగాన్ని తలుచుకుని అతడి భార్య గర్వించింది. ఉబికివస్తున్న కన్నీళ్లను దాచుకుని ఆ అమరుడికి అందిన పురస్కారాన్ని సగర్వంగా స్వీకరించింది. రాష్ట్రపతి భవన్‌లో కన్పించిన ఈ దృశ్యం ప్రతి ఒక్కరి మనసుల్ని మెలిపెట్టింది. అటువంటి స్ఫూర్తిదాయకమైన సోల్జర్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం…
ఉత్తర ప్రదేశ్ లోని డిఒరియా జిల్లాకు చెందిన అంశు మన్.. 2015లో ఇంటర్ అయ్యాక డిగ్రీ చదివేందుకు ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీకి మొదట దరఖాస్తు చేసుకున్నాడు. ఈలోపు అక్కడే స్థానికంగా ఇంజనీరింగ్ కాలేజీలో స్మృతిని కలిశాడు.
తొలిచూపులోనే నచ్చడంతో ఇరువురు ప్రేమలో పడ్డారు. ఇంతలోనే తాను దరఖాస్తు చేసుకున్న ఏఎఫ్ ఎంసీ కాలేజీలో సీటు రావడం.. అందులోనూ ఆ కాలేజీలో చదివేందుకు దేశవ్యాప్తంగా పోటీ ఎక్కువగా ఉండటం.. అయినా ఆ కాంపిటీషన్ ను తట్టుకొని అంశుమన్ సెలెక్ట్ అవ్వడం విశేషం. దీంతో ఇరువురు చదువుపరంగా కొన్నాళ్లు దూరమయ్యారు.. వీరి ప్రేమ దాదాపు ఎనిమిది సంవత్సరాలు పాటు సాగింది. ఇకపోతే స్మృతి ఉత్తర ప్రదేశ్ లో ఇంజనీరింగ్ చదువుతుంటే.. అంశుమన్ పుణెలో మెడిసిన్ లో అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువు పూర్తి చేసి ఇండియన్ ఆర్మీ మెడికల్ కార్ప్స్ లో 26వ ది పంజాబ్ బెటాలియన్ లో కెప్టెన్ గా చేరాడు. 2023 మార్చిలో వీరిద్దరి పెళ్లి ఘనంగా జరిగింది.
కట్ చేస్తే…
2023 జులై 18న అంశుమన్ సింగ్ తన భార్యతో పంచుకున్న భవిష్యత్తు ప్రణాళికలు.. మాటలు.. పెళ్లి నాటి ప్రమాణం.. అన్ని ఆఖరివి అవుతాయని ఊహించలేకపోయింది.. అప్పటికి వారికి పెళ్లి జరిగి 5 నెలలు మాత్రమే అవుతుంది. రెండు నెలలకే సియాచిన్ గ్లేషియర్ లో అంశుమన్ కు పోస్టింగ్ వచ్చింది. గ్లేషీయర్ అనేది వాస్తవానికి భారత్ ఆధీనంలో ఉన్న అత్యంత కఠినమైన మంచు ప్రాంతం.. సియాచిన్ లో భారత్ 1984ల కాలంలో బేస్ క్యాంపును ఏర్పాటు చేసి… సరిహద్దుల్లో మనకోసం భారత సైన్యం 24 గంటలు పహారా కాస్తుంది. ఆ చోటులో ఒక్క టీ కాచుకొని తాగేందుకు సుమారు 3 గంటల సమయం పడుతుందట. ఇక్కడ శత్రువులతోకన్నా నిత్యం అక్కడి వాతావరణంతో ఎక్కువ పోరాటం చేయాల్సి ఉంటుంది
మరీ. సియాచిన్ లో పనిచేసేందుకు సైనికులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఎందుకంటే మంచులో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఎక్కువ. కాబట్టి మెడికల్ ఎక్విప్ మెంట్ అవసరం పడుతుంటుంది. అక్కడికి వెళ్లేందుకు సరైన రోడ్డు లేదు. ఏదైన అత్యవసరమైతే ఆర్మీ హెలికాప్టర్ లు వస్తాయి. అలాగని వెంటనే రావు.. వచ్చేవరకు వేచి చూడాల్సిన పరిస్థితి.. వీరు ఉండేందుకు మంచులో ఫైబర్ గ్లాస్ తో ప్రత్యేక గుడారాలు వేసి సైనిక స్థావరాల్ని ఇండియన్ ఆర్మీ ఏర్పాటు చేసింది. ఇవి తాము ఉండేందుకు.. ఆయుధాల్ని దాచుకునేందుకు అనువుగా ఉంటుంది. అటువంటి చోట డ్యూటీ చేసేందుకు అంశుమన్ సాహసించి.. వెళ్ళడం.. వెళ్లిన రెండు నెలల్లోనే అగ్ని ప్రమాదంలో మరణించడం.. దురదృష్టకరం!
విధి నిర్వహణలో ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించి రక్షణదళ, పారామిలిటరీ సిబ్బందికి భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇటీవల కీర్తిచక్ర, శౌర్యచక్ర పురస్కారాలను ప్రదానం చేశారు. అందులో భాగంగా గతేడాది సియాచిన్ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కెప్టెన్ అంశుమన్ సింగ్‌కు భారత రెండో అత్యున్నత పీస్‌టైమ్ గ్యాలంటరీ పురస్కారం కీర్తిచక్ర లభించింది. దేశం కోసం భర్త చేసిన త్యాగాన్ని తలుచుకుని గర్వించింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…
‘మేమిద్దరం ఫోన్ లో మాట్లాడుకున్న మరుసటి రోజే అతను లేడన్న వార్త వచ్చింది. అది నమ్మడానికి నా మనసు ఏమాత్రం అంగీకరించలేదు. ఇప్పుడు అతడికి గుర్తుగా ఇచ్చిన ‘కీర్తిచక్ర’ నా చేతిలో ఉంది. కాబట్టి ఎప్పటికీ అతను తిరిగి రాడన్నది నమ్మి తీరాలి. కానీ ఆయన ఎప్పటికీ నాతోనే ఉంటారు. నా భర్త ఓ హీరో. మమ్మల్ని వదిలి వెళ్లిపోయినా ఎన్నో కుటుంబాలను రక్షించాడు…’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు స్మృతి…
సియాచిన్‌లో వాళ్లు ఉన్న బేస్ క్యాంప్‌లో తెల్లవారుజామున మూడు గంటలకు అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ అన్షుమన్ తో మరికొందరు సైనికులు ఆ ప్రమాదాన్ని నివారించేందుకు ప్రయత్నించారు. మంటల్లో చిక్కుకున్న జవాన్లను ధైర్యంగా కాపాడి బయటకు తీసుకొచ్చారు. అగ్నికీలలు పక్కనే ఉన్న మెడికల్ ఇన్వెస్టిగేషన్ రూమ్‌కు వ్యాపిస్తుండగా వాటిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తూ తీవ్ర గాయాలపాలై అంశుమన్ మరణించారు.