తాత్కాలిక ప్రధానమంత్రిగా రెండుసార్లు ప్రమాణం.. గుల్జారీ లాల్ నందా!
భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కాగా.. రెండో ప్రధాని గుల్జారీలాల్ నందా అని ఎంతమందికి తెలుసు.. ఆయన 1964, 1966లలో రెండుసార్లు భారతదేశానికి తాత్కాలిక ప్రధానమంత్రిగా కేవలం 13 రోజులపాటు పీఎంగా వ్యవహరించారు. సుదీర్ఘకాలం పాటు మంత్రివర్గంలో వివిధ శాఖల్లో కీలక బాధ్యతలు చేపట్టారు. ఆపై రాష్ట్ర శాసనసభలో కార్మిక వివాదాల బిల్లును ప్రయోగాత్మకంగా అమలు చేయడంలో విజయం సాధించారు.
19వ శతాబ్దంలో భారత రాజకీయాల్లో సుపరిచితులైనవారిలో ఒకరు ఈ నందా.. వృత్తిరీత్యా ఉపాధ్యాయులు, గాంధీ అనుచరుడిగా మారి స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నాడు, అట్నుంచి రాజకీయాల్లో కీలక నిర్ణయాలు తీసుకొని తాత్కాలిక ప్రధానిగా రెండుసార్లు సేవలు అందించారు. మొదట్లో గాంధీజీ ఆదర్శాలతో ఉద్యమంలో పాల్గొని, దేశం కోసం జైలుకి కూడా వెళ్లాడు. ప్రధానమంత్రిగా అతి తక్కువ కాలం బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆయన చేసిన కృషి ఎనలేనిది. ఆయన జీవిత, రాజకీయ విశేషాలను తెలుసుకుందాం.
నేపథ్యం…
1898 జులై 4న బ్రిటిష్ ఇండియన్ పాలనలోని అప్పటి పంజాబ్ ప్రావిన్స్ సియాల్‌కోట్‌లో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు గుల్జారీలాల్ నందా. తండ్రి బులక్కీ రామ్ నందా, తల్లి ఈశ్వరీదేవి నందా. విద్యాభ్యాసం లాహోర్, అమృత్‌సర్, ఆగ్రా, ప్రజ్ఞారాజ్‌లలో పూర్తి చేసుకున్నారు. అనంతరం
అలహాబాద్ విశ్వవిద్యాలయంలో రిసర్చ్ స్కాలర్ గా చేరారు. 1920-21 వరకు కార్మికుల(కార్మికుల) సమస్యలను ప్రధాన సబ్జెక్టుగా ఎంచుకున్నారు. తర్వాత నేషనల్ కాలేజ్ ఆఫ్ బొంబాయిలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.
ఆనాడు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ప్రారంభమైన భారత స్వాతంత్య్ర ఉద్యమంలో గుల్జారీలాల్ కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో తాను అప్పటివరకు చేస్తున్న ఉపాధ్యాయ వృత్తిని సైతం వదిలేశారు. మహాత్మా గాంధీ అనుచరుడిగా ఆయన ఆదర్శాలకు ప్రభావితుడై నందా, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గాంధీ ప్రారంభించిన ఉద్యమ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. 1932లో జైలు శిక్ష అనుభవించినప్పటికీ తిరిగి పోరాటం కొనసాగించారు. ఈ నేపథ్యంలో 1942లో రెండోసారి బ్రిటీష్ ప్రభుత్వం నందాను మళ్లీ అరెస్టు చేసి 1944 వరకు జైలులో పెట్టింది.
కార్మిక సమస్యలను లేవనెత్తి…
1922 నుంచి 1946 వరకు అహ్మదాబాద్ టెక్స్‌టైల్ లేబర్ అసోసియేషన్‌కు కార్యదర్శిగా కూడా పనిచేశారు.
1937లో బొంబాయి అసెంబ్లీలో ముఖ్యమైన పదవీని చేపట్టి, 1937 నుంచి 1939 వరకు కార్మిక, ఎక్సైజ్ శాఖకు పార్లమెంటరీ కార్యదర్శిగా పనిచేశారు.
బొంబాయి శాసనసభసభ్యుడిగా గుల్జారీలాల్ బొంబాయి నగరం పురోగతి, అభివృద్ధిని వేగవంతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. తరువాత 1946 నుంచి 1950 వరకు బొంబాయి ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర అసెంబ్లీలో కార్మిక వివాద బిల్లు ప్రాముఖ్యతను వివరించారు.
కస్తూర్బా మెమోరియల్ ట్రస్ట్, హిందుస్థాన్ మజ్దూర్ సేవక్ సంఘ్ కార్యదర్శి, బొంబాయి హౌసింగ్ బోర్డు ఛైర్మన్, భారత కార్మిక సంక్షేమ సంస్థ కార్యదర్శిగానూ ఇలా వివిధ శాఖల్లో పని చేశారు. ముఖ్యంగా ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏర్పాటులో గుల్జారీలాల్ కీలకంగా నిలిచారు. అలాగే 1959లో జెనీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సదస్సులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఈ సమావేశానికి హాజరైన తర్వాత, గుల్జారీలాల్ నందాకు ‘ది ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ కమిటీ’లో పనిచేసే అవకాశం వచ్చింది. స్వీడన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, బెల్జియం, ఇంగ్లాండ్ వంటి యూరోపియన్ దేశాల కార్మిక గృహ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు అందుకోసం ఈ దేశాలను సందర్శించే అవకాశం నందాకు లభించింది.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1950 మార్చిలో గుల్జారీలాల్ నందా భారత ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.
తరువాత 1951లో భారతదేశ ప్రణాళికా మంత్రిగా ఎన్నికయ్యారు. భారత ప్రభుత్వంలో నీటిపారుదల, ఇంధనమంత్రిత్వ శాఖల్లో బాధ్యతలు స్వీకరించారు.
1952 సార్వత్రిక ఎన్నికల్లో బొంబాయి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన తర్వాత గుల్జారీలాల్ నీటిపారుదల, ఇంధనశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యంగా 1955లో సింగపూర్‌లో జరిగిన ప్లానింగ్ అడ్వైజరీ కమిటీలో పాల్గొనేందుకు భారత బృందానికి నాయకత్వం వహించారు. నందా 1957 సార్వత్రిక ఎన్నికల్లో రెండవసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేంద్ర కార్మిక ఉపాధి ప్రణాళికా మంత్రిగా ఉన్నారు. తరువాత ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు. 1959లో ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మన్, యుగోస్లేవియా, ఆస్ట్రియాలను సందర్శించారు.
గుల్జారీలాల్ 1962 సాధారణ ఎన్నికల్లో గుజరాత్‌లోని సబర్‌కాంత నియోజకవర్గం నుంచి లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు. 1962 నుంచి 1963 వరకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిగా, 1963 నుంచి 1966 వరకు హోంమంత్రిగా పనిచేశారు. 1962లో సోషలిస్ట్ యాక్షన్ కోసం కాంగ్రెస్ ఫోరమ్‌ను ప్రారంభించడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు.
నెహ్రూ తర్వాత.. శాస్త్రి తర్వాత.. రెండుసార్లు..
1964లో అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మరణించిన తరువాత నందా 1964 మే 27న తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. నాడు అతని పదవీకాలం 13రోజులు మాత్రమే. దీని తరువాత తాష్కెంట్లో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణించిన తరువాత నందా 1966, జనవరి 11న మరోమారు తాత్కాలిక ప్రధానిగా ప్రమాణం చేశారు. గుల్జారీ లాల్ నందా 1962, 1963లలో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిగా, 1963 నుంచి 1966 వరకు హోం వ్యవహారాల మంత్రిగా కూడా వ్యవహరించారు.
దేశానికి రెండుసార్లు ప్రధానిగా, దీర్ఘకాలం కేంద్రమంత్రిగా పనిచేసిన గుల్జారీ లాల్ నందాకు భారతదేశానికి నాయకత్వం అవసరమైన నేపథ్యంలో 1964 మే 27 నుంచి జూన్ 9వరకు కేవలం 13 రోజులు మాత్రమే భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
భారతదేశ రెండో ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గుల్జారీలాల్ నందా తాత్కాలిక పదవికి రాజీనామా చేశారు. కానీ 1966లో లాల్ బహదూర్ శాస్త్రి మరణించిన తర్వాత నందా తిరిగి మళ్లీ తాత్కాలిక ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. ఆ సమయంలో ఆయన కేవలం 13 రోజులు మాత్రమే ప్రధానమంత్రిగా పనిచేశారు. అప్పుడు గుల్జారీలాల్ నందా పదవీకాలం 1966 జనవరి 11 నుంచి జనవరి 24వరకు కొనసాగారు.
ఆయన కేంద్రంలో ఉన్న సమయంలో గోవధను నేరంగా పరిగణించాలని చట్టసభ సభ్యులను కోరుతూ 1966 నవంబర్ 7న వేలాది మంది ప్రజలు పార్లమెంటులోకి చొరబడేందుకు ప్రయత్నించారు. దాదాపు ఎనిమిది మంది మృతి చెందగా, వందల మంది గాయపడ్డారు. ఫలితంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గుల్జారీలాల్ నందాను హోంమంత్రి పదవి నుంచి తప్పించారు.
1997లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్నను అందుకున్నారు.
గుల్జారీలాల్ నందా భారత రాజకీయాల్లో ముఖ్యమైన పాత్ర పోషించిన ప్రముఖ రాజకీయ నాయకులలో ఒకరు. ముఖ్యంగా తాత్కాలిక ప్రధానిగా ఆయన చేసిన సేవలకు విశేష గుర్తింపు వచ్చింది. ప్రధానమంత్రిగా అతి తక్కువ కాలం బాధ్యతలు చేపట్టినప్పటికీ భారతదేశ సామాజిక జీవితానికి నందా చేసిన కృషి చెప్పనలవి.
భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని కూడా వ్యతిరేకించారు. 19వ శతాబ్దంలో భారత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన గుల్జారీలాల్ నందా తన 99వ ఏటా 1998 జనవరి 15న న్యూఢిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.