GREAT PERSONALITIESTelugu Special Stories

రతన్‌ టాటాకు భారత రత్న ఇవ్వాలి

 అంతర్జాతీయ స్థాయి వ్యాపార దిగ్గజం, అత్యుత్తమ పారిశ్రామికవేత్త, పరమ దేశభక్తి పరుడు, మానవత్వం మూర్తీభవించిన మహనీయుడు, దాతృత్వంలో అపర కర్ణుడు, నిరాడంబర జీవితం గడిపిన భారత మేధావి, పద్మ విభూషణుడు, సర్వోత్తమ పరోపకాలి రతన్‌ నవల్‌ టాటా తన 86వ ఏట వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో ముంబాయిలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో కన్ను మూయడంతో దేశవాసులు బాధాతప్త హృదయాలతో ఘన నివాళులు అర్పిస్తున్నారు. భారతదేశానికి ఏ విపత్తు వచ్చినా మొదటగా వందల కోట్ల విరాళాలను ఉదారంగా ప్రకటించడం ఆయన రకితంలోనే ఉన్నది. రతన్‌ టాటా జీవిత చరిత్ర విశేషాలను శాంతను నాయుడు “ఐ కేమ్‌ ఆప్‌ఆన్‌ ఏ లైట్‌హౌజ్‌ : ఏ షార్ట్‌ మెమొరీ ఆఫ్‌ లైఫ్‌ విత్‌ రతన్‌ టాటా” అనే పేరుతో పుస్తకాన్ని అక్షరీకరించారు. 

విద్యాభ్యాసం:         

  28 డిసెంబర్‌ 1937న బొంబాయిలో పార్సీ జొరాస్ట్రియన్‌ మతస్తుడు టాటా గ్రూపు వ్యవస్థాపకుడు జమ్‌షెడ్జీ టాటా మునివునుమడుగా సూరత్‌లో రతన్‌ నవల్ ‌టాటా-సోనీ టాటా దంపతులకు జన్మించాడు. తన 10వ ఏట తల్లితండ్రులు విడిపోవడంతో నవజ్‌బాయి టాటా పెంపకంలో ఎదిగారు. ఛాంపియన్‌ స్కూల్‌, ముంబాయిలో 8వ తరగతి వరకు చదివి, కెథడ్రల్‌ అండ్‌ జాన్‌ కానన్‌ స్కూల్‌, ముంబాయి, బిషప్‌ సాల్మన్‌ స్కూల్‌, సిమ్లా, రివర్‌డేల్‌ కంట్రీ స్కూల్‌, న్యూయార్క్‌లో 1955లో గ్రాడ్యుయేషన్‌ పట్టా పొందారు. 1959లో కార్నెల్‌ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్‌ డిగ్రీతో పాటు హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువులు చదివారు. 

టాటా గ్రూపులో ప్రస్థానం:

 1961లో టాటా స్టీల్ కంపెనీలో చేరి, 1991లో జె ఆర్‌ డి టాటా నుంచి అతని వారసుడిగా 1991లో బాధ్యతలు చేపట్టి 10,000 కోట్ల టర్నోవర్‌ నుంచి 2012 వరకు లక్షల కోట్ల రూపాయల కంపెనీగా నిలుపగలిగారు. ఆయన కృషి, అకుంటిత దీక్ష, దేశభక్తి నేటి యువతకు ఆదర్శం. తన తర్వాత టాటా కంపెనీ పూర్తి బాధ్యతలను సైరస్‌ మిశ్రా, నచరాజన్‌లు నిర్వహించగా 2017 నుంచి చంద్రశేఖర్‌ నిర్వహిస్తున్నారు. 21 ఏండ్ల పాటు టాటా గ్రూపుకు మార్గనిర్దేశనం చేస్తూ టాటా టీ ద్వారా టెట్లీ టీ, టాటా మోటార్స్‌ ద్వారా జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌, టాటా స్టీల్‌ ద్వారా కోరస్‌ లాంటి అంతర్జాతీయ కంపెనీలను స్వంతం చేసుకొని టాటా గ్రూపును అంతర్జాతీయ స్థాయి సంస్థగా రూపొందించి, నాణ్యతకు పర్యాయపదంగా టటా బ్రాండ్‌ను నిలిపారు. సామాన్య భారతీయుడికి చేరువ కావడానికి టాటా నానో కార్లను మార్కెట్లోకి విడుచారు.  నేడు విద్యుత్తుతో నడిచే కార్లను విడుదల చేసి పర్యావరణ ప్రేమికుడిగా రుజువు చేసుకున్నారు. 2012లో టాటా గ్రూపు బాధ్యతల నుంచి తప్పుకొని విశ్రాంత జీవితం గడుపుతున్నారు. 2017లో నాటి చైర్మన్‌ సైప్రస్‌ మిశ్రాను పదవి నుంచి తొలగించడంతో తాత్కాలికంగా నాలుగు మాసాలు చైర్మన్‌గా సేవలందించి నటరాజన్‌కు అప్పగించారు. 

దాతృత్వంలో అపర దానకర్ణుడు:

కరోనా విపత్తు సమయంలో తన విశాల హృదయంతో 1500 కోట్ల సహాయాన్ని ఉదారంగా విరాళంగా అందించి ఇతర పారిశ్రామికవేత్తలకు దారి దీపంగా నిలిచారు.  గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం లాంటి కనీస అవసరాల కల్పనలో రతన్‌ టాటా దానగుణం ప్రదర్శించారు. న్యూ సౌథ్‌ వేల్స్‌ యూనివర్సిటీ, కాలిఫోర్నియా యూనివర్సిటీ, తాను చదువుకున్న కార్నెల్‌ యూనివర్సిటీ, హార్వర్డ్‌ యూనివర్సిటీ, కార్నేజి మెలోన్‌ యూనివర్సిటీ, ఐఐటీ ముంబాయి, ఐఐఎస్‌సి బెంగుళూరు, ఎంఐటీ లాంచి దిగ్గజ విద్యా సంస్థలకు ఉదారంగా వందల కోట్ల రూపాయలను దానం చేసి తన పరోపకారాన్ని ప్రదర్శించారు. చైర్మన్‌ ఆఫ్‌ టాటా సన్స్‌గా సేవలందిస్తూనే సర్‌ దొరాబ్జీ టాటా అండ్‌ అల్లీడ్‌ ట్రస్ట్‌, సర్‌ రతన్‌ టాటా ట్రస్ట్‌ లాంటి సంస్థలకు  నాయకత్వ. వహిస్తూ దాదాపు 60 – 66 శాతం ఆదాయాన్ని సమాజ సేవలకు ఉచితంగా వినియోగించారు. అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థల్లో సభ్యుడుగా, సలహాదారుగా విలువైన అనుభవాలను ఆయా సంఘాలు లేదా సంస్థలతో పంచుకున్నారు. 

జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు:

 రతన్‌ నవల్ టాటా దేశాభివృద్ధికి చేసిన సేవలకు ఎన్ని పురస్కారాలు ప్రకటించిన తక్కువే. భారత రత్న పురస్కారానికి సరైన అర్హుడు మన రతన్‌ టాటా. ఇప్పటికీ ఆర్డర్‌ ఆఫ్‌ రైజింగ్‌ సన్‌ – జపాన్(2012‌) ఆర్డర్‌ ఆఫ్‌ ఇటాలియన్‌ రిపబ్లిక్‌(2009), ఆర్డర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా(2023), అస్సాం వైభవ్(2021)‌, బ్రిటీష్‌ ఎంపైర్‌ ఆర్డర్‌(2009), ఉరూగ్వే ప్రభుత్వ అవార్డు(2004), ( పద్మ విభూషన్(2008)‌, పద్మ భూషన్(2000)‌, మహారాష్ట్ర భూషన్(2006)‌ లాంటి పలు పురస్కారాలు ఆయన ఒడిలో చేరి మురిసి పోయాయి. అనేక అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు/డి లిట్‌లు, ప్రతిష్టాత్మక పురస్కారాలు అనేకం స్వంతం చేసుకున్నారు. 

 బిజినెస్‌ టైకూన్‌గా పేరు తెచ్చుకున్న రతన్‌ టాటా రెండు దశాబ్దాల పాటు టాటా సంస్థను ప్రగతి పరుగులు పెట్టించి, అనేక అంకుర సంస్థలను ప్రోత్సహించి, దేశమే ప్రధానం అంటూ ఆదర్శప్రాయ జీవితాన్ని గడిపారు. నాణ్యతకు మారు పేరుగా టాటాను నిలిపిన దేశ ప్రేమికుడు రతన్‌ టాటా. స్వదేశీ పరిజ్ఞానంతో ఇండికా కారును తీసుకువచ్చి మార్కెట్‌ మనసును దేచుకున్నారు. పారిశ్రామికవేత్తగా తనదైన ముద్రను వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి రతన్‌ టాటా జీవితం నేటి వాణిజ్య వ్యాపార వేత్తలకు పాఠంగా నిలుస్తున్నది. అసాధారణ మానవతావాది భరతమాత ముద్దు బిడ్డకు భారత రత్న ఇవ్వాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. అమర్‌ రహే రతన్‌ టాటా.

Show More
Back to top button