GREAT PERSONALITIESTelugu Special Stories

దేశ ఐక్యత, సమగ్రతలను కాపాడిన మహాయోధుడు సర్దార్‌ !

భారత రత్న, ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జన్మదినం సందర్భంగా 2014 నుంచి ప్రతి ఏట 31 అక్టోబర్‌న దేశవ్యాప్తంగా “జాతీయ ఐక్యత దినోత్సవం లేదా రాష్ట్రీయ ఏక్తా దివస్‌” ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. భారతదేశ ఐక్యత, సమగ్రతలను కాపాడిన మహోన్నత వ్యక్తుల్లో సర్దార్ వల్లభాయ్‌ పటేల్‌ పేరు ముందు వరుసలో ఉంటుంది.

స్వాతంత్ర్యానంతరం చెల్లాచెదరైన 570కి పైగా ‘ప్రిన్స్‌లీ స్టేట్స్‌ లేదా రాచరిక రాజ్యాల’ను భారత్‌లో విలీనం లేదా ఏకీకరణ చేయడానికి పటేల్‌ చూపిన చొరవ అనన్యసామాన్యం, అనితరసాధ్యం. ఇందిరా గాంధీ హత్యకు లోనైన అక్టోబర్‌ 31ని ‘రాష్ట్రీయ సంకల్ప్‌ దివస్‌’గా కూడా పాటించడం చూస్తున్నాం. 

భారత స్వాతంత్ర్యోద్యమంలో సర్దార్‌ పటేల్‌ కీలక పాత్ర:

 భరతజాతి స్వేచ్ఛ కోసం పోరాడిన సర్దార్‌ పటేల్‌ గౌరవార్ధం ఏక్తా దివస్‌ నిర్వహించడం సముచితంగా ఉన్నది. స్వతంత్ర భారత తొలి హోం మంత్రి, ఉప ప్రధాని సర్దార్‌ పటేల్‌ను ‘ఇండియన్‌ బిస్మార్క్‌’గా కూడా పిలుస్తారు. 31 అక్టోబర్‌ 1875న గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించిన వల్లభాయ్‌ పటేల్ ఇంగ్లాండ్‌లో బారిష్టర్‌ పూర్తి చేసి స్వదేశానికి వచ్చారు.

సహాయ నిరాకరణ, విదేశీ వస్తు బహిష్కరణ, ఖాదీ వస్త్ర ధారణ, మద్యపాన నిషేధం, అస్పృశ్యత, కుల వివక్ష, కిసాన్‌ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమాలతో పాటు పలు‌ జాతీయోద్యమంల్లో చురుకైన పాత్ర పోషించి సర్దార్‌ అనే బిరుదు పొందారు.

భారత రాజ్యాంగ రూపకల్పనకు ఏర్పాటు చేసిన సభలో సీనియర్‌ సభ్యుడిగా సేవలందించారు. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీలో ముఖ్య నాయకుడిగా అంబేడ్కర్‌కు వెన్నుదన్నుగా నిలిచారు. భారత రాజ్యాంగ సభలో ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్‌గా కీలక భూమిక నిర్వహించారు. 

 దేశ సార్వభౌమత్వం, ఐక్యతలను పెంపొందించే అంశాల్లో పాఠశాల, కళాశాలల్లో ఐక్యత ప్రతిజ్ఞలు, ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఐకమత్యం, సమగ్రత, దేశ భద్రత కాపాడటానికి అంకితభావంతో పని చేయడం మన తక్షణ కర్తవ్యమని గుర్తించి కోవాలి. పటేల్‌ యెక్క దార్శనికత, ఏకీకరణ స్ఫూర్తి రాబోయే తరాలకు దారి దీపం కావాలని కోరుకుందాం, పటేల్‌ దేశభక్తిని ఆదర్శంగా తీసుకుందాం. 

Show More
Back to top button