తెలుగు సినిమా చరిత్రకు నూరు వసంతాల సజీవ సాక్షి… సి.కృష్ణవేణి…

తెలుగు సినిమా తొలి అడుగుల నాటి నుంచి నేడు డిజిటల్ యుగం వరకు పలు తరాల్ని, పలు తారల్ని దగ్గరనుంచి చూసి మార్గ నిర్దేశం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి చిత్తజల్లు కృష్ణవేణి (సి.కృష్ణవేణి). కళ కళ కోసమే అని నిరూపించే అతి కొద్దిమందిలో ఆమె ఒకరు. ఆమె తెలుగు సినిమా తొలితరం నాయిక, తొలి మహిళా నిర్మాత. ఆమె చాల నిరాడంబరంగా ఉండేవారు. ఎప్పుడూ లేత గులాబీ రంగు చీరలు ఎక్కువగా ధరించేవారు. మనిషి సౌమ్యంగా చిరునవ్వుతో ఎదుటివారిని ప్రేమగా పలకరించే తీరు ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. కృష్ణవేణికి చిన్నతనం నుంచి కళలంటే ఆసక్తి.
అందువలననే ఆమె రంగస్థల నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. స్వాతంత్య్రానికి పూర్వం ఓ స్త్రీ రంగస్థల నటిగా రాణించడం అంటే ఆరోజుల్లో పెద్ద సాహసం. ఆ తెగువ, పట్టుదల, ఆత్మవిశ్వాసం కృష్ణవేణిలో చిన్నతనం నుండే అలవాటయ్యాయి. తన దారితో తాను సాగిపోతూ “సతీ అనసూయ” (1936) సినిమాతో బాలనటిగా చిత్రరంగ ప్రవేశం చేశారు, కచదేవయాని (1938) సినిమాతో కథానాయికగా మారారు. ఆ తరువాత మీర్జాపురం రాజవారిని వివాహం చేసుకుని శోభనాచల స్టూడియోకు అధినేత అయ్యారు. నిర్మాతగా మారి సినిమాలు నిర్మించారు. తన ప్రతిభతో ఆ నటీమణి బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్నారు.
తెలుగు సినిమా నడక నేర్చుకుంటున్న కాలంలో వెండితెరని దేదీప్యమానం చేసిన నటీమణుల్లో సి.కృష్ణవేణి ఒకరు. తెలుగు సినిమా చరిత్రలో ఆమెది ప్రత్యేక అధ్యాయం. తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య నటుడైన ఎన్టీఆర్ తో సహా పలువురికి సినిమా రంగంలో అవకాశం ఇచ్చిన నిర్మాత, తొలి తరం తెలుగు కథానాయిక సి.కృష్ణవేణి. దేశం గర్వించదగ్గ ఆ మహానటుడు ఎన్టీఆర్ ని మనదేశం (1949) సినిమాతో వెండితెరకు పరిచయం చేసి, చరిత్రలో చెరగని స్థానాన్ని దక్కించుకున్నారు సి.కృష్ణవేణి. ఈ సినిమా ద్వారానే గానగంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావును సంగీత దర్శకునిగా పరిచయం చేశారు.
ఈ సినిమాతోనే పి.లీలను నేపథ్య గాయనిగా పరిచయం చేశారు సి.కృష్ణవేణి. 1936లో “సతీ అనసూయ” మరియు “ధ్రువ” అనే జంట కథల సినిమా వచ్చినప్పుడు అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను చంటిపాపలుగా చేసి ఉయ్యాలలో వేసి ఊపి ఒళ్ళోనే లాలించిన పాత్రలో పన్నెండేళ్ల చిన్నది సి.కృష్ణవేణి అందరినీ ఆకట్టుకున్నారు. భర్త కోరిక మేరకు పెళ్లి తరువాత బయటి సినిమాలలో నటించకుండా కేవలం సొంత సంస్థలో సినిమాలు మాత్రమే చేశారు. “జీవనజ్యోతి”, “గొల్లభామ”, “లక్ష్మమ్మ”, “దక్షయజ్ఞం”, “భీష్మ”, “ఆహుతి” తదితర చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.
అత్యధిక పారితోషికం తీసుకున్న తొలి తరం కథానాయికల్లో సి.కృష్ణవేణి ఒకరు. ధర్మాంగద (1949) చిత్రానికి గాను ఆమె అప్పట్లోనే 45000 రూపాయలు పారితోషికం అందుకున్నారు. భిన్నమైన పాత్రలు చేయాలనే అభిలాష ఉన్న ఆమె “తిరుగుబాటు” సినిమాలో వేశ్య పాత్ర పోషించారు. తన భర్త కోరికమేరకు బయటి చిత్రాలలో నటించొద్దనే ఆంక్షల వలన నటిగా, నిర్మాతగా, స్టూడియో నిర్వహణాధికారిగా, నేపథ్య గాయనిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఆమె 17 సినిమాలు మాత్రమే నటించారు. ఆమె కుమార్తె “ఎన్.ఆర్. అనురాధ దేవి” కూడా తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు.
లక్ష్మీ ఫిలిమ్స్ కంబైన్స్ పథకం పై తెలుగు, కన్నడ భాషలో సుమారు 17 చిత్రాలను నిర్మించారు. కన్నడ కంఠీరవ రాజకుమార్ తో “భక్త కుంబర”, తెలుగులో “చక్రధారి”, “రావణుడే రాముడైతే”, “శ్రీవారి ముచ్చట్లు”, “రాముడు కాదు కృష్ణుడు”, “అనుబంధం”, “ఆలయ దీపం”, “ఇల్లాలే దేవత”, “ప్రియా ఓ ప్రియా”, “ప్రేమించే మనసు”, “మా పెళ్ళికి రండి” ఇలా మూడు తరాల కథనాయకులతో చలనచిత్రాలు నిర్మించిన ఘనమైన వారసత్వాన్ని చాటారు అనురాధాదేవి. వందేళ్ల సంపూర్ణ జీవితం తరువాత సి.కృష్ణవేణి తన 102 యేట వృద్ధాప్యం కారణంగా 16 ఫిబ్రవరి 2025 ఆదివారం నాడు ఆకస్మికంగా కన్నుమూసిన వారి ఆత్మకు నివాళిగా ఆమె సుదీర్ఘ ప్రస్థానం మీ ముందుంచుతూ…
జీవిత విశేషాలు…
జన్మనామం : చిత్తజల్లు కృష్ణవేణి
ఇతర పేర్లు : సి.కృష్ణవేణి, మీర్జాపురం రాణి
జననం : 24 డిసెంబరు 1924
స్వస్థలం : పంగిడి గూడెం, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
వృత్తి : తెలుగు చలనచిత్ర నటి, గాయని, నిర్మాత
జీవిత భాగస్వామి : మీర్జాపురం రాజు మేకా వెంకట్రామయ్య అప్పారావు
పిల్లలు : మేకా రాజ్యలక్ష్మి అనూరాధ
తండ్రి : డాక్టర్ యర్రంశెట్టి లక్ష్మణరావు
తల్లి : నాగమణి
నేపథ్యం…
చిత్తజల్లు కృష్ణవేణి ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా పంగిడి గూడెం గ్రామంలో 24 డిసెంబరు 1924 నాడు డాక్టర్ యర్రంశెట్టి లక్ష్మణరావు, నాగమణి దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి వృత్తి రీత్యా వైద్యులు. చిన్నతనం నుంచి కృష్ణవేణికి కళలంటే ఆసక్తి. అందుకే రంగస్థల నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. స్వాతంత్య్రానికి పూర్వం ఓ స్త్రీ రంగస్థల నటిగా రాణించడం అంటే పెద్ద సాహసం. చిన్నతనం నుంచి సి.కృష్ణవేణిలో ఆ తెగువ, పట్టుదల, ఆత్మవిశ్వాసం మెండు. అందుకే అవేమీ పట్టించుకోలేదామె. తన దారితో తాను సాగిపోయారు. రాజమండ్రిలోనే చదువుకుంటూ పాఠశాలలో నాటకాలు వేస్తూ, మంచి పాత్రలు ధరిస్తూ, మంచి మంచి బహుమతులు సంపాదిస్తూ తన నటనా జీవితానికి బలమైన పునాదులు వేస్తూవచ్చారు. ఒకసారి కృష్ణవేణి “శ్రీకృష్ణ తులాభారం” నాటకం వేస్తున్న కృష్ణవేణి నటనను చూసిన చిత్తజల్లు పుల్లయ్య, ఆమెను తాను తీయబోయే “అనసూయ” సినిమాలో ఒక పాత్రకోసం ఎంచుకున్నారు.
1936 వ సంవత్సరంలో “ఈస్ట్ ఇండియా ఫిలిం కంపెనీ పతాకంపై” దర్శకులు చిత్తజల్లు పుల్లయ్య తెలుగులో రెండు సినిమాలు కలిపి రూపొందించి, జతగా విడుదల చేశారు. అవి “ధ్రువ విజయము” మరియు “సతీ అనసూయ”. పెద్ద నటీనట వర్గంతో “ధ్రువ విజయము” రూపొందిస్తే, పిల్లలతో “సతీ అనసూయ” తెరకెక్కించారు. అప్పట్లో ఒకే టిక్కెట్‌పై రెండు సినిమాలు కలిసి చూపించే పద్ధతికి చిత్తజల్లు పుల్లయ్య శ్రీకారం చుట్టారు. టిక్కెట్టు వెల రెండు అణాలు (“బేడ”). ఆ రోజులలో చిత్తజల్లు పుల్లయ్య చిన్న పిల్లలతో పౌరాణికం తీయడం ఒక సాహసం, ఒక ప్రయోగమైతే, ఇందులో విజయం సాధించడం ఒక అద్భుతమైన అనుభూతి. చదువుకునే 60 మంది పిల్లలతో నటింపచేస్తూ “సతీ అనసూయ” (1936) చిత్రం నిర్మించారు. సి.కృష్ణవేణి ఈ చిత్రం ద్వారా బాలనటిగా పరిచయమైంది. ఈ చిత్రంలో సి.కృష్ణవేణి అనసూయగా నటించగా, అత్రిగా ప్రకాశరావు, నారదుడుగా సూర్యనారాయణ, గంగగా రావు బాల సరస్వతి దేవి, ఇంద్రుడుగా చిత్తజల్లు శ్రీనివాసరావు, సుమతిగా సుందరమ్మ, కౌశికుడుగా నారాయణరావు నటించారు.
చలనచిత్ర రంగంలో కథానాయికగా…
సతీ అనసూయ (1936) చిత్రంలో నటించే నాటికి సి.కృష్ణవేణి వయస్సు 12 సంవత్సరాలు మాత్రమే. కానీ ఆ సినిమాలో ఆమె శృంగారం ఒలకబోసి నటించాలి. చిన్న వయస్సు అయినా కూడా దర్శకులు చిత్తజల్లు పుల్లయ్య చెప్పినట్టుగా నటించేసి సన్నివేశాలను ఆమె రక్తి కట్టించారు. 08 మే 1936 నాడు సతీ అనసూయ విడుదలయ్యి ఘనవిజయం సాధించింది. సతీ అనసూయ చిత్రం తరువాత సి.కృష్ణవేణి రాజమండ్రి వచ్చేసారు. అక్కడ ఆమె నాటకాలలో నటిస్తూ కాలం గడుపసాగారు. ఇదిలా ఉండగా ఉన్నట్టుండి ఆమె తండ్రి మరణించడం ఆమెకు ఒక కోలుకోలేని దెబ్బ అయ్యింది. అక్కడనుండి ఆమె తన అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోయారు. ఆమె అక్కడే బాబాయి వద్ద చదువుకుంటూ ఉండగా ఆమెకు “తుకారం” (1937) చిత్రంలో నటించే అవకాశం వచ్చింది.
ఆ తరువాత చిత్రపు నరసింహారావు దర్శకత్వం వహించిన “మోహినీ రుక్మాంగద” (1937) చిత్రంలో నటించారు. వేమూరి గగ్గయ్య, సూర్యనారాయణ, రామతిలకం, పులిపాటి వెంకటేశ్వర్లు మొదలగు వారు నటించిన ఈ చిత్రంలో సి.కృష్ణవేణి “భక్తపాలన హే పావనాభిరామా” అనే గేయాన్ని ఆలపించారు. ఇదిలా ఉండగా ఆమెకు ఉన్నట్టుండి “కచ దేవయాని” (1938) సినిమా ద్వారా కథానాయికగా అవకాశం వచ్చింది. ద్రోణంరాజు చినకామేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయకుడిగా తెలుగు రంగస్థల మరియు సినీ నటుడు ఎస్.పి.లక్ష్మణస్వామి నటించిన ఈ సినిమాలో సి.కృష్ణవేణి కథానాయికగా నటించారు. ఇందులో ఆమె మూడు పద్యాలు మరియు మూడు పాటలు కూడా పాడారు. వై.వి. రావు దర్శకత్వం వహించి, నిర్మించిన మళ్ళీపెళ్లి సినిమాలో అన్నపూర్ణ పాత్రలో సి.కృష్ణవేణి నటించారు.
శోభనాచల పిక్చర్స్ కు మాత్రమే నటించి…
1938 వ సంవత్సరంలో కచ దేవయానిలో నటించినప్పుడు తన వయస్సు 14 సంవత్సరాలు మాత్రమే. అంత చిన్న వయస్సులోనే నటనలో మెలకువలు గ్రహించుకొని “దేవయాని” గా చక్కగా నటించి అందరిని మెప్పించారు సి.కృష్ణవేణి. ఆమె అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ సమాంతరంగా నటిస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. మీర్జాపురం రాజా వారితో వివాహం అయిన తరువాత ఆయనకున్న శోభనాచల స్టూడియోకు మాత్రమే అంకితం అయిపోయారు సి.కృష్ణవేణి. అప్పట్లో ఆవిడకి ఎన్నో అవకాశాలు వచ్చాయి. దర్శకులకి ఏ మంచి కథ దొరికినా వెంటనే ముందుగా సి.కృష్ణవేణిని సంప్రదించేవారు.
బి.ఎన్. రెడ్డి, కె.వి.రెడ్డి లకు మంచి స్క్రిప్ట్ దొరికితే వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి నీవు ఈ సినిమా చేస్తే బావుంటుందమ్మా అని ఆమెతో అనేవారు. కానీ బయట నిర్మాణ సంస్థలతో సినిమాలు చేయాలంటే రాజా వారి అనుమతి ఉండేది కాదు. అందుకే ఆమె ఎప్పుడూ శోభనాచల పిక్చర్స్ బ్యానరులోనే సినిమాలు చేసేవారు, తప్ప వేరే నిర్మాణ సంస్థలో సినిమాలు చేయలేదు. శోభనచల స్టూడియో దాటి ఆమె ఎప్పుడూ బయట అడుగు పెట్టలేదు. శోభనాచల స్టూడియో నుండి ఇంటికి, ఇంటి నుండి శోభనాచల స్టూడియోకి మధ్య తిరుగుతుండేవారు. ఒకరకంగా ఆ ఆంక్షల వలన చాలా మానసిక బాధలకు లోనయ్యారు.
కీలుగుఱ్ఱం లో సి.కృష్ణవేణి స్థానంలో అంజలీదేవి…
కీలుగుఱ్ఱం సినిమాలో అంజలీదేవి పాత్రకు ముందుగా సి.కృష్ణవేణినే అనుకున్నారు. కానీ ఆమె అంగీకారం తెలుపకపోవడంతో అప్పుడు ఆ పాత్ర అంజలీదేవికి బదిలీ అయ్యింది. అందులోని దుష్టపాత్ర వేస్తే తనకున్న కథానాయిక ప్రాధాన్యత తగ్గుతుందని అంజలీదేవి భావించారు. “నటనా శక్తిని నిరూపించుకోగల పాత్ర ఏదైనా సరే అందులో లీనమై ఆ పాత్ర నీవుగా మారిపోవాలి. అప్పుడు ఆ పాత్ర జీవిస్తుంది. ప్రేక్షకులు అలాంటి పాత్రను, నటనను గుర్తిస్తారు. ఈ పాత్ర ఒప్పుకుని నటించు, నటిగా నీకు మంచి పేరు వస్తుంది” అని అంజలీదేవితో చెప్పారు సి.కృష్ణవేణి. అప్పుడు తనకి “కీలుగుఱ్ఱం” సినిమాలో నేపథ్య గానం పాడమని అడిగారు అంజలీదేవి. దాంతో ఆమెకు రెండు పాటలు పాడారు సి.కృష్ణవేణి. కీలుగుఱ్ఱం సినిమా అంజలీదేవికి ఎంతో పేరును తీసుకొచ్చింది. “లక్ష్మమ్మ” సినిమాలో పరమసాద్విగా, భర్త నిరాదరణకు గురై అత్త, ఆడబిడ్డల ఆరడులను భరించే అమాయకురాలిగా అష్టకష్టాలు పడే పాత్రను ఎంతో గొప్పగా పోషించి కంటనీరు పెట్టించిన సి.కృష్ణవేణి, “తిరుగుబాటు” చిత్రంలో వేశ్య పాత్రలో దర్శనమిచ్చారు.
మీర్జాపురం రాజా వారితో ప్రేమ వివాహం…
టి. మార్కోని దర్శకత్వంలో మీర్జాపురం రాజా నిర్మించిన “మహానంద” సినిమా తయారవుతున్న రోజులలో (1938 – 1939) సి.కృష్ణవేణికి మీర్జాపురం రాజావారు మేకా వెంకట్రామయ్య అప్పారావుతో పరిచయం అయ్యింది. ఆయన మేకా రంగయ్య అప్పారావుకి సోదరుడు. అప్పారావు అనేది రాజా వారివంశానికి వారసత్వంగా వస్తుంది. మీర్జాపురం రాజావారు మేకా వెంకట్రామయ్య అప్పారావుకు అంతకుముందే పెళ్లి అయ్యింది. మొదటి భార్య పేరు భూదేవి. ఆవిడ సన్యాసం తీసుకోవడం వలన రాజావారు సి.కృష్ణవేణిని ఇష్టపడ్డారు. పెళ్లి ప్రతిపాదన కూడా ఆయనే తీసుకొచ్చారు. సి.కృష్ణవేణి వాళ్ళ బాబాయితో మాట్లాడి ఆమెను రాజావారు పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్య నుండి ముందు అభ్యంతరాలు వచ్చాయి. దాంతో వారు విజయవాడలోని సత్యనారాయణపురంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత అందరితో కలిసిపోయారు. మొదటి భార్య భూదేవికి నలుగురు పిల్లలు, సి.కృష్ణవేణి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక్క కూతురుతోనే సరిపెట్టుకున్నారు. రాజా వారికి, సి.కృష్ణవేణి కి మధ్య 20 యేండ్ల వయస్సు వ్యత్యాసం ఉంది.
ఎన్టీఆర్ కి తొలి అవకాశం ఇచ్చిన సి.కృష్ణవేణి…
పుస్తకాలు ఎక్కువగా చదివే సి.కృష్ణవేణి బెంగాలీ రచయిత శరత్ చంద్ర చటోపాధ్యాయ రచనలంటే బాగా ఇష్టపడేవారు. ఆయన రచించిన “విప్రదాస్” నవలను తెలుగులో సినిమాగా తీయాలనుకున్నారు. ఆమె దేశభక్తి బీజాలున్న కాంగ్రెస్ పార్టీకి అభిమానురాలు. అందుకే ఆమె దేశభక్తి బీజాలున్న సినిమాను తీయాలనుకున్నారు. అనుకున్నట్టుగానే ఆమె “విప్రదాస్” నవలను సినిమాగా మొదలుపెట్టారు. తెలుగులో సినిమాగా వచ్చిన మొదటి బెంగాలీ నవలా “విప్రదాస్”. అసలు దేవదాస్ సినిమా కూడా ఆమెనే చేయాలనుకున్నారు. కానీ ఈ లోగా అది సినిమాగా వచ్చేసింది. సి.కృష్ణవేణి భర్త మీర్జాపురం రాజావారు జస్టిస్ పార్టీకి చెందినవారు. జస్టిస్ పార్టీ బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉంటుంది. సి.కృష్ణవేణి దేశభక్తి సినిమా తీయడం భర్త రాజావారికి ఇష్టం లేదు. కానీ ఆమె పట్టువదలలేదు. భర్తను వ్యతిరేకించి ఆమె సినిమా తీశారు.
“ఇంతవాణ్ణి అంతవాణ్ణి అయ్యాను” అనే సంభాషణ “మన దేశం” (1949) సినిమాలో ఎన్టీఆర్ తొలిసారి పలికిన సంభాషణ. ఇది ఎంతగా ప్రసిద్ధి అయ్యిందంటే తరువాత రోజులలో ఎన్టీఆర్ కు ఆ ప్రకారమే జరిగింది. సి.కృష్ణవేణి మనదేశం (1949) సినిమాతో చలనచిత్ర రంగంలో తొలిసారి ఎన్టీఆర్ కు అవకాశం ఇచ్చారు. ఆ తరువాత ఎన్టీఆర్ ఎంతవారయ్యారో తెలిసిందే. మనదేశం (1949) సినిమాను ఎం.ఆర్.ఏ ప్రొడక్షన్స్ పతాకంపై మీర్జాపూర్ రాజా సాహెబ్, సి.కృష్ణవేణి లు నిర్మించారు. ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వి.నాగయ్య, సి.హెచ్.నారాయణరావు, సి.కృష్ణవేణి లు ప్రధాన తారాగణం.
దర్శకులు ఎల్.వి. ప్రసాద్ శోభనాచల పిక్చర్స్ కార్యాలయానికి ఎన్టీఆర్ ను తీసుకొచ్చారు. పోలీసు అధికారి పాత్రకి ఎన్టీఆర్ ను తీసుకుంటున్నాను అని ఎల్.వి.ప్రసాద్ చెప్పిన మాటకు నిర్మాత కృష్ణవేణి సరే అన్నారు. సినిమా మొత్తానికి రెండు వేల రూపాయలు పారితోషికంగా నిర్ణయించి ఎన్టీఆర్ కు బయనాగా ఆమె 250 రూపాయలు చెక్కును అందజేశారు. ఈ సినిమాని స్వాతంత్రం రాకముందే ప్రారంభించారు. కానీ అది పూర్తి కావడానికి చాలాకాలం పట్టింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత 24 నవంబరు 1949 నాడు మనదేశం సినిమా విడుదలైంది. సినిమా ఆలస్యానికి చాలా కారణాలు ఉన్నాయి. సినిమా విడుదల ఆలస్యం అవ్వడం వలన నిర్మాణ ఖర్చు కూడా బాగా పెరిగింది. చిత్తూరు వి.నాగయ్య అగ్రస్థాయి కథానాయకుడు కాబట్టి ఆయనకు 40,000 రూపాయలు పారితోషికం ఇచ్చారు. చదలవాడ నారాయణ రావు 20,000 రూపాయలు తీసుకున్నారు. సినిమా లాభాలు తీసుకురాకపోయినా నష్టాలు మాత్రం రాలేదు.
ప్రతిభ ఉన్నవారికి అవకాశాలిచ్చి ప్రోత్సాహస్తూ…
మీర్జాపురం రాజావారు స్థాపించిన శోభనాచల స్టూడియోని నిర్వహిస్తూ, స్టూడియో నిర్వహణ అధికారిణిగా, నటిగా, గాయకురాలిగా తనకున్న శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్నారు సి.కృష్ణవేణి. ఎక్కడ చక్కని ప్రతిభ ఉన్నా కూడా, గ్రహించగలిగి వారిని ప్రోత్సహించగల విశాల హృదయంకు ఆమెకు ఉంది. తెలుగు సినిమా పరిశ్రమకు, తెలుగు వారికి సాటిలేని మేటి నటుడిగా నందమూరి తారక రామారావును పరిచయం చేసింది సి.కృష్ణవేణి. ఆమె నిర్మించిన “మనదేశం” (1949) సినిమాతో ఘంటసాల వెంకటేశ్వరరావు, రమేష్ నాయుడు లకు సంగీత దర్శకత్వానికి అవకాశం ఇచ్చింది కూడా ఆమెనే. తెలుగువారిని తన గాన మాధుర్యంతో ఉర్రూతలూగించిన పి.లీలను కూడా పరిచయం చేసింది శోభనాచల వారే, అంటే సి.కృష్ణవేణే.
ఆమె మొత్తంగా నటించినవి 17 సినిమాలు మాత్రమే. తనకున్న ప్రతిభను మరింతగా మెరుగుపరుచుకోవాలని ప్రయత్నించలేదు. మీర్జాపూరం రాజావారి భార్యగా ఆయన నిర్మించిన చిత్రాలలో మాత్రమే ఆమె నటించారు. దానిని బట్టి ఆమె సినిమా ప్రస్థానంపై ఎంత ఒత్తిడి ఉందో అర్థమవుతుంది. కేవలం భర్త మీర్జాపురం రాజావారు వద్దన్నందుకే సినిమాలు చేయడం ఆపేశారు. ఆమెకు చిత్రపటాలంటే ఎంతో ఇష్టం. చేతితో గీసిన కళాత్మకమైన చిత్రాలని ఆమె ఎంతో అపురూపంగా అమర్చుకున్నారు. అందులో కౌతా రామమోహన్, దామెర్ల రామారావు, దేవి ప్రసాద రాయ్ చౌదరి, రంజిత్ సింగ్ వంటి గొప్ప గొప్ప చిత్రకారులు గీసిన కళాఖండాలు ఆమె ఇంట్లో కనిపిస్తాయి. వాటన్నిటిని ఎంతో అపురూపంగా ఇంట్లో అలంకరించుకున్నారు
నేపథ్య గానం…
సి.కృష్ణవేణి నేపథ్య గాయని కూడా. స్వాతంత్ర్య ఉద్యమ కాలం నేపథ్యంగా కథ నడిచే మనదేశం (1949) సినిమాలో ఎమ్మెస్ రామారావుతో కలిసి “ఛలో చలో రాజా” హుషారుగా ఉండే పాటను పాడారు. అలాగే “ఏమిటో ఈ సంబంధం ఎందుకో ఈ అనుబంధం” అనే పాటను కూడా పాడారు. ఘంటసాలతో కలిసి “జయ జనని”, “కల్లో నిన్ను చూసినానే పిల్లా వాళ్ళు జల్లుమన్నాడే” పాడారు. అలాగే “అత్త లేని కోడలు ఉత్తమురాలు”, “వెడలిపో తెల్ల దొర వెడలిపో”, లాంటి గేయాలను ఆమె ఆలపించారు.
లక్ష్మమ్మ కథ (1950) సినిమాలో
ఉగాలోయ్ ఉయ్యాలా
చందమామతో చుక్కలతో
అందాల పోటీ చేయాలోయ్…
…………………………………
ఏమని ఏమేమని..
నా హృది లోపల కోరిక ఏదో
నాట్యము సేయు తీయని పాటై…
……………………………………
అలాగే ఎం.ఎస్. రామారావు తో కలిసి పాడిన యుగళగీతం
ఊయల ఊపనా సఖీ
తీయగ పాడనా ఈ
ఊయల ఊపగా ఊగనా…
అంటూ సి.కృష్ణవేణి పాడిన పాటలు అప్పట్లో బాగా ప్రసిద్ధి చెందాయి. ఆమె చేయగలిగినన్ని సినిమాలు చేయలేదు, పాడగలిగినన్ని పాటలు పాడలేదు. 1952 వ సంవత్సరం తరువాత దాదాపు ఆమె నటించడం మానేశారు. ఆమె అంజలీదేవికి నేపథ్య గానం అందించారు. ఆమె 1952లో సాహసం సినిమాలో తన గొంతు పలకడం మీద అసంతృప్తి కలిగి “రావు బాలసరస్వతీ దేవి” చేత నేపథ్య గానం పాడించుకున్నారు. అంటే తను అనే మాట కాకుండా అక్కడ పాట బాగుండాలని ఆమె భావించారు. ఆమె వ్యక్తి కంటే “కళ” ముఖ్యంగా భావించేవారు.
కలగా మిగిలిపోయిన “మొల్ల” సినిమా…
సి.కృష్ణవేణి సినిమాలు చేయడం మానుకున్నాక “సక్కుబాయి” నాటకంలో ఆంధ్రదేశమంతటా తిరిగి కళ కళ కోసమే అని నిరూపించారు. కథానాయక మొల్ల సినిమా తీయాలని, ఆ పాత్ర ఆమె ధరించాలని చాలా ఆశపడ్డారు. స్క్రిప్టు తన దగ్గరే సంవత్సరాల పాటు పెట్టుకున్నారు. కానీ కాలం కలిసి రాలేదు. చివరికి ఆ సినిమా పద్మనాభం తీశారు. ఆమె సినిమాలు “లేడీ డాక్టర్”, “గుడ్ ఈవెనింగ్” లాంటివి మధ్యలోనే ఆగిపోయాయి. ఆమె కూతురు మరియు అల్లుడు సినిమా నిర్మాతలుగా ఎన్నో సినిమాలు తీశారు. వారికి మొదట్లో ఆమె అండగా నిలిచి సాధక బాధకాలనెరిగించారు.
ఆమె నటించిన “తిరుగుబాటు”, “గొల్లభామ”, “మనదేశం”, “సాహసం”, “లక్ష్మమ్మ ” అప్పట్లో అందరినీ అలంరించాయి. ఆమె చాల నిరాడంబరంగా ఉండేవారు. ఎప్పుడూ లేత గులాబీ రంగు చీరలు ఎక్కువగా ధరించేవారు. మనిషి సౌమ్యంగా చిరునవ్వుతో ఎదుటివారిని ప్రేమగా పలకరించే తీరు ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. తెలుగు సినిమా పరిశ్రమకు ఈమె చేసిన జీవితకాలపు కృషికి గానూ 2004 వ సంవత్సరంలో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. 2021 “సాక్షి ఎక్సలెన్స్ పురస్కారాల” లో భాగంగా “జీవిత కాల సాఫల్య” పురస్కారాన్ని ఆమె అందుకున్నారు. ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో 2022 లో ఆకృతి ఘంటసాల శతాబ్ది పురస్కారం కూడా గెలుచున్నారు.
మరణం…
చిత్తజల్లు కృష్ణవేణి నాలుగేళ్ల వయస్సు నుండి నాటక రంగంలో ఉంటూ, తెలుగు సినిమా మాటలు నేర్చిన ప్రారంభదశ నుండి సినిమాలలో ఉంటూ 89 సంవత్సరాలనుండి సినిమా రంగాన్ని వివిధ కోణాలనుండి గమనిస్తూ తన 101 సంవత్సరాలను పూర్తిచేసుకుని 102 వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. బజారాహిల్స్ లోని ప్రసాద్ లాబ్స్ లో ఆవిడ శతజయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మురళీమోహన్, జయప్రద, అనురాధ, రోజారమణి తదితరులు ఈ మహోత్సవానికి హాజరయ్యారు. 102 సంవత్సరాలు జీవించిన ఆమె వయోభారంతో ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. దాంతో ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం లేకపోయింది. చివరికి చికిత్స పొందుతూనే 16 ఫిబ్రవరి 2025 ఆదివారం ఉదయం హైదరాబాదులోని ఫిలింనగర్ లో గల తన నివాసంలో తుది శ్వాస విడిచినట్టు ఆవిడ కుమార్తె నిర్మాత అనురాధ దేవి తెలిపారు. తెలుగు సినిమా తొలి అడుగుల నాటి నుంచి నేడు డిజిటల్ యుగం వరకు పలు తరాల్ని దగ్గరనుంచి చూసి మార్గ నిర్దేశం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి కృష్ణవేణి తన వందేళ్ల ప్రశాంత జీవనం తరువాత ఆనందంగా పరమాత్ముడిలో విలీనమైపోయారు.

