ఒక మంచి శాస్త్రవేత్త, ఒక గొప్ప సంస్థ నిర్మాత, ‘అసూయా ద్వేషాలు ఏమ్రాతం లేని ఉదాత్తుడు. వ్యక్తిగత జీవితం, వృత్తిగత ప్రవర్తనలో నైతిక నిష్ఠతోపాటు ప్రతిభను గుర్తించి, పెంపొందించే సమర్థత ఉన్న వ్యక్తి.. సరైన వారికి సరైన బాధ్యతలు అప్పగించే వివేకం, విజయంలోనూ భాగస్వాములను గౌరవించే విచక్షణ, యువ సహచరులను ప్రోత్సహించే పెద్ద మనసు, వైఫల్యానికి నిందను భరించే నైతికధైర్యమూ గల గొప్ప నాయకత్వ విశిష్టతలు సతీష్ ధావన్ సొంతం..
ఆయన్ను భారత ‘ఎక్స్‌పరిమెంటల్ ఫ్లూయిడ్ డైనమిక్స్’కు పితామహుడిగా పరిగణిస్తారు. శ్రీనగర్‌కు చెందిన ధావన్‌ను టర్బులెన్స్, బౌండరీ లేయర్స్ రంగాల్లోనూ అత్యున్నత స్థాయి పరిశోధకుల్లో ఒకరిగా పరిగణిస్తారు. ఈ రంగాల్లో ఆయన శక్తి సామర్థ్యాలు, భారత స్వదేశీ అంతరిక్ష కార్యక్రమ అభివృద్ధికి ఎంతగానో దోహదపడింది. 1972లో ఎమ్.జి.కె. మీనన్ తర్వాత ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సతీష్.. స్పేస్ కమిషన్‌కు, భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖలో సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ తర్వాత అణుశక్తి కమిషన్‌లో ఉన్న ‘బ్రహ్మ ప్రకాష్’, తిరువనంతపురంలో ఉన్న ‘విక్రం సారాభాయ్ అంతరిక్ష కేంద్రం’ చైర్మన్‌గా నియమితులయ్యారు.
ఇస్రో శీఘ్రగతిన ఎదగడానికి ఇది టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఆ తర్వాత భారత తొలి ఉపగ్రహ వాహక నౌక ‘ఎస్ఎల్‌వీ’ అభివృద్ధి కార్యక్రమానికి అబ్దుల్‌కలాంను నాయకుడిగా నియమించగా.. 1975లో అబ్దుల్ కలామ్ నాయకత్వంలో ‘ఎస్ఎల్‌వి’ మొదటి ప్రయోగం విఫలమైంది. అయితే ఆ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఆనాటి పత్రికా సమావేశంలో పాల్గొని విఫల ప్రయోగాన్ని తనపైనే వేసుకున్నాడు ధావన్. ఈసారి రెండవ ప్రయోగం విజయవంతమైనపుడు మాత్రం పత్రికా సమావేశానికి అబ్దుల్ కలాంను పంపిచడం విశేషం.
నేపథ్యం..
1920 సెప్టెంబర్ 25న శ్రీనగర్‌లో జన్మించారు ధావన్. తండ్రి న్యాయమూర్తి. లాహోర్‌లో విద్యాభ్యాసం చేశారు. ఫిజిక్స్, మేథమెటిక్స్, సాహిత్యం, మెకానికల్ ఇంజినీరింగ్‌లలో పట్టభద్రులయ్యారు. భిన్న ప్రపంచాలైన విజ్ఞాన, మానవీయ, సాంకేతికతా శాస్త్రాల మధ్య ధావన్ ఒక వారధిలా నిలిచారు. 1930, 40 దశకాల్లో లాహోర్ విద్యను ఎక్కువగా ప్రోత్సహించేది. విద్యాభ్యాసంలో విలక్షణ ప్రయోగాలకు ఆస్కారం కల్పించేది. ఆ దశకాల్లో లాహోర్ భారత ఉపఖండంలో ఒక గొప్ప సాంస్కృతిక కేంద్రంగానూ, మంచి విద్యకు నెలవుగానూ ఉండేది.
1945లో మూడో డిగ్రీ తీసుకున్న అనంతరం బెంగళూరుకు వచ్చి కొత్తగా ఏర్పాటైన హిందూస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఏడాదిన్నరపాటు ధావన్ ఉద్యోగం చేశారు. ఆ తరువాత పై చదువులకోసం అమెరికా వెళ్ళారు. మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేసి, కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎయిరోనాటికల్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు.
ఉద్యోగం, బాధ్యతలు…
స్వాతంత్ర్య సిద్ధి, దేశ విభజనకాలంలో అప్పటికీ ఆయన అమెరికాలోనే ఉన్నారు. పాకిస్థాన్‌లోని ఆయన కుటుంబం భారత్‌కు అనివార్య కారణాల వల్ల వలస వచ్చింది.
సతీష్ ధావన్ భారత్‌కు తిరిగివచ్చి బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్)లోని ఎయిరోనాటిక్స్ విభాగంలో చేరారు. ఇక్కడ ధావన్ పూర్తిగా తన పరిశోధనల్లో నిమగ్నమయ్యారు. దేశంలో తొలి సూపర్‌సోనిక్ విండ్ టన్నెల్స్‌ను నిర్మించారు. బెంగళూరులో ఉండటానికే ఆయన ఎక్కువ ఇష్టపడేవారు. బెంగళూర్ కు చెందిన జన్యుశాస్త్రవేత్త నళిని నిరోడిని వివాహం చేసుకున్నారు. 1962లో ఐఐఎస్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
ఆ వైజ్ఞానిక పరిశోధనా సంస్థ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి అంకురార్పణ చేశారు. కంప్యూటర్ సైన్స్, మాలిక్యులార్ బయోఫిజిక్స్, సాలిడ్‌స్టేట్ కెమిస్ట్రీ, ఇకాలజీ, అట్మాస్ఫియరిక్ సైన్స్ మొదలైన విభాగాల్లో కొత్త పరిశోధనా కార్యక్రమాలకు ఆయన విశేషంగా కృషి చేశారు. 1971-72వరకు ఓ ఏడాదిపాటు సెలవు తీసుకుని పరిశోధన నిమిత్తం ధావన్ అమెరికా వెళ్ళారు. కాల్‌టెక్‌లో పరిశోధనలో నిమగ్నమై ఉన్నప్పుడే, భారత అంతరిక్ష పరిశోధనా కార్యక్రమ సారథి విక్రమ్ సారాభాయ్ అకాల మరణానికి గురయ్యారు. దీంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఇస్రో సారథ్య బాధ్యతలు ధావన్ చేపట్టాలని కోరారు. ఆయన ఇందుకు రెండు షరతులతో అంగీకరించారు. అవెంటంటే..
ఒకటి: తనను ఐఐఎస్ డైరెక్టర్‌గా కొనసాగించడం; రెండు: అంతరిక్ష పరిశోధనా కార్యక్రమ ప్రధాన కార్యాలయాన్ని అహ్మదాబాద్ నుంచి బెంగళూర్ కి మార్చడం. ఈ రెండు షరతులతో పాటు, కొత్త బాధ్యతలు చేపట్టే ముందు కాల్‌టెక్‌లో తన పరిశోధనలను ముగించేందుకు అనుమతినివ్వాలన్న ధావన్ కోరగా.. ఆయన అభ్యర్థనను ఇందిర అంగీకరించారు.
ఇస్రో చైర్మన్‌గా ఆ సంస్థలో ధావన్ తీసుకువచ్చిన మార్పుల గురించి (ఆర్. అరవముదన్ అనే శాస్త్రవేత్త తన ‘ఇస్రో: ఏ పర్సనల్ హిస్టరీ’ అనే పుస్తకంలో విపులంగా వివరించారు.) పరిశోధనా కార్యక్రమాల ఆధారిత కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి శాస్త్రవేత్తకు వ్యక్తిగత పాత్ర, సమష్టి బాధ్యతలను ఆయన నిర్దేశించారు. ఇస్రో దీర్ఘకాలిక కర్తవ్యాల విషయమై సంస్థకు చెందిన, ఇతర పరిశోధనా సంస్థలకు చెందిన నిపుణలతో ధావన్ ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రతిదీ ఒక క్రమపద్ధతిలో ఉండేలా, సాగేలా ఆయన జాగ్రత్త వహించేవారు.
ఇస్రో సామాజిక బాధ్యతలకు ధావన్ సముచిత స్థానం కల్పించారు. వాతావరణ పరిశోధనలు, సహజ వనరుల అన్వేషణ, కమ్యూనికేషన్స్ రంగాల్లో ఉపగ్రహాలను మరింతగా ఉపయోగించుకోవడంపై ఆయన అగ్రప్రాధాన్యమిచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మన జాతి జీవనంలో ఇస్రో నిర్వహిస్తున్న పాత్రకు ధావన్ సుస్థిర ప్రాతిపదికలు నిర్మించారని చెప్పాలి. సంస్థను రాజకీయవేత్తల జోక్యానికి దూరంగా ఉంచేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. అందులో భాగంగానే రాజ్యసభ సభ్యత్వ ప్రతిపాదనను ఆయన నిర్ద్వంద్వంగా నిరాకరించారంటే అతిశయోక్తి కాదు.
గుర్తింపు…
సతీష్ ధావన్ చేసిన పరిశోధనలను హెర్మన్ ష్లిక్టింగ్ తను రాసిన ‘బౌండరీ లేయర్ థియరీ’ పుస్తకంలో వివరించాడు. అంతేకాదు ‘ఐఐఎస్‌సి’లో భారతదేశపు మొట్టమొదటి ‘సూపర్‌సోనిక్ విండ్ టన్నెల్’ను నిర్మించిన ఖ్యాతి ఆయనకు దక్కింది. ధావన్ కృషికిగానూ 1999లో ‘ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం’తోపాటు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి ‘సతీష్ ధావన్ అంతరిక్ష’ కేంద్రంగా పేరు పెట్టారు. లూథియానాలోని ప్రభుత్వ కళాశాలకు ఆయన పేరు పెట్టడం విశేషం!