75 ఏళ్ల బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి పూర్తి విముక్తి కల్పించడంలో చెరగని ముద్ర వేసిన గాంధీజీ,
నూలు వడకటం, వాడల్ని శుభ్రం చేయడం మొదలు… ఎన్నో ఉద్యమాలకు, సత్యాగ్రహాలకు పూనుకొని, ఉద్వేగభరిత ప్రసంగాలతో ప్రజల్ని ఐక్యం చేసి, ఆంగ్ల ప్రభుత్వ విధానాల్ని తుదముట్టించి భారతదేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సౌభ్రాతృత్వాన్ని పంచారు వెరసి ‘జాతిపిత’ అయ్యారు.
సత్యం, అహింసలే ఆయన ఆయుధాలు..
ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించమనే
సహనం.. బోసినవ్వుల తాతగా.. పేరుగాంచిన గాంధీ మహాత్ముడి 155వ జయంతి సందర్భంగా ఆయన గురుంచి..
నేపథ్యం…
1869 అక్టోబర్ 2న గుజరాత్ లోని పోరుబందర్ లో జన్మించారు గాంధీజీ. పూర్తి పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. తండ్రి కరంచంద్ గాంధీ. అక్కడే బందరు సంస్థానంలో దివానుగా పనిచేసేవారు. తల్లి పుతలీభాయి. ప్రాథమిక విద్యను రాజ్ కోటలో చదవగా, ఉన్నత విద్యను కథియవాడ్ లో పూర్తి చేశారు. లా చదివేందుకు దక్షిణాఫ్రికాకు వెళ్లారు. ఆయనకు 13 ఏళ్ల వయస్సులోనే కస్తూరిభాయితో వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు.
ఇంగ్లాండులో బారిస్టర్ చదవడానికి వెళ్ళినప్పుడు గాంధీజీ తన తల్లికి మద్యం, మాంసం, స్త్రీని ముట్టనని మూడు ప్రమాణాలు చేశారు. తల్లికిచ్చిన మాట ప్రకారం, ఆయన జీవితాంతం మాంసానికి, మద్యానికి, స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నారు.
జాతి వివక్ష..
గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడ తెల్లదొరల చేతిలో అనేకసార్లు జాతి వివక్షను ఎదుర్కొన్నారు. ఆంగ్లేయులు నల్లజాతి వారి పట్ల చూపే వివక్షను సహించలేని గాంధీజీ వాటిని ఎదుర్కోవాల్సిన బాధ్యతను గ్రహించి, పోరాట పటిమను పెంచుకొన్నారు.
ఉప్పు సత్యాగ్రహం..
ఈ ఉద్యమాన్ని 1930లో మార్చి 12న మొదలుపెట్టారు గాంధీజీ. అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమం నుంచి అరేబియన్ సముద్రం వరకు అంటే దాదాపు 240 కిలోమీటర్లు నడుస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపారు. ఆయనకు మద్దతుగా పాల్గొన్న 60,000 మంది ప్రజలను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టింది. అరేబియన్ పట్టణమైన దండికి ఆయన ఏప్రిల్ 5న చేరుకున్నారు.
క్విట్ ఇండియా..
1942 జులై 14న ‘క్విట్ ఇండియా’ నినాదాన్ని యూసుఫ్ మెహర్ అలీ సూచించారు. క్విట్ ఇండియా ఉద్యమం మొదలై ఆగస్టు 8తో 79 ఏళ్లు పూర్తయ్యాయి. ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదాన్ వేదికలో ‘డూ ఆర్ డై’ అంటూ క్విట్ ఇండియా నినాదాన్ని మొదలుపెట్టారు.
సత్యాగ్రహం, అహింస అనే ఆయుధాలతో కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడికి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటాడు.
ఆంగ్లేయుల పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం లభించేదాకా అలుపెరగని పోరాటం సాగించాడు. ఆంగ్లేయులను గడగడలాడించిన ఉద్యమాలు స్వతంత్ర సమరంలో ఎన్నోసార్లు జైలు కెళ్లి.. ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా లాంటి అనేక ఉద్యమాలతో ఆంగ్లేయులకు నిద్ర లేకుండా చేశాడు.
ఆంగ్లేయులు ఇక భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వక తప్పదన్న నిర్ణయానికి వచ్చేవరకు గాంధీజీ అలుపెరగని పోరాటం చేశారు.
దేశ విభజనను వ్యతిరేకించి..
హిందూవులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు అందరూ అన్నదమ్ములలాగా కలిసి ఉన్న దేశాన్ని మత ప్రాతిపదికన విభజించడాన్ని గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ముస్లిం లీగ్ నాయకుడైన మహమ్మద్ ఆలీ జిన్నా మరింత ఆజ్యం పోస్తూ
“దేశ విభజనో, అంతర్గత యుద్ధమో తేల్చుకోండి” అని హెచ్చరించారు. దీంతో హిందూ ముస్లింల అంతర్గత యుద్ధాన్ని ఆపడానికి వేరే మార్గం లేక గత్యంతరం లేక దేశవిభజనకు గాంధీజీ అంగీకరించారు. 1947 ఆగస్టు 15న దేశమంతా సంబరాలు జరుపుకొంటూ ఉండగా, దేశ విభజన వల్ల విషణ్ణుడైన గాంధీజీ మాత్రం కలకత్తాలో ఒక హరిజన వాడను శుభ్రం చేస్తూ గడిపారు.
1948 జనవరి 30న దిల్లీలో బిర్లా నివాసం వద్ద ప్రార్థనకు వెళుతున్న గాంధీజీని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపారు. ఈ ఘటనతో యావత్ భారత్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భారతదేశ ప్రజలందరూ బాపు, బాపు అని కన్నీరు మున్నీరయ్యారు. బాపు మరణంతో ఒక శకం అంతమైంది. ఒక ఉద్యమానికి తెర పడినట్లైంది.
మరిన్ని…
●1899లో బోయర్ యుద్ధం ప్రారంభమైన సమయంలో, గాంధీ దాదాపు 1100ల మంది భారతీయులను గుర్తించారు. అంతేకాదు బ్రిటిష్ వారి కోసం భారతీయ అంబులెన్స్ కార్ప్స్ ను ఏర్పాటు చేశారు. అయినా కూడా జాతి వివక్ష, హింస భారతీయులపై కొనసాగింది.
●మహాత్మాగాంధీ స్వాతంత్ర్యోదమంలో భాగంగా దాదాపు 79,000ల కిలోమీటర్ల దూరం నడిచారు.
●గాంధీ ప్రేరణతో పౌర హక్కుల ఉద్యమం 4 ఖండాలలో, 12 దేశాలలో జరిగింది.
●గాంధీజీ మరణించిన 21 సంవత్సరాల తరువాత గ్రేట్ బ్రిటన్ ఈయన్ని గౌరవించటానికి ఒక స్టాంప్‌ను విడుదల చేసింది.
●నోబెల్ శాంతి బహుమతి కోసం గాంధీజీని ఐదుసార్లు ఎన్నుకున్నా ఆయనకు మాత్రం అది వరించలేదు.
●’మహాత్మా’ అనే బిరుదును రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చారన్న వార్త ఆ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు.
●1930లో ‘టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ గా బిరుదును అందుకున్న మొట్టమొదటి భారతీయుడిగా గాంధీజీ చరిత్రకెక్కారు. ఈ అవార్డును అందుకోవడానికి గల కారణం స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా గాంధీజీ నాయకుడిగా వ్యవహరిస్తూ ఉప్పుసత్యాగ్రహా ఉద్యమంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పుపైన విధించే పన్నులను వ్యతిరేకిస్తూ దాదాపు 240 మైళ్ళ దూరం నడిచారు. అందుకు ఈయన్ను ఆ సంవత్సరం మ్యాగజైన్ కవర్ పేజీ పైన ముద్రించారు.
●గాంధీజీ మరణానంతరం, అంత్యక్రియల ఊరేగింపుకు ఎనిమిది కిలోమీటర్ల పొడవున ప్రజలు నీరాజనాలు పలికారు.
●దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి వచ్చిన గాంధీజీ గుజరాతీ సంప్రదాయ దుస్తుల్లో సంపన్నులుగా తిరిగేవారు. ఒకానొక సమయంలో పేదవాళ్లకు కట్టుకోవడానికి సరైన దుస్తులు లేవనే ఆలోచనలో పడ్డారు. మధురై రామనాథపురం చేరిన గాంధీ సామాన్యుడిలా ధోవతి, పైన చిన్న శాలువా కట్టుకున్నారు. అలా ఈయన మొదటిసారి ధోవతి కట్టిన స్థలాన్ని ‘గాంధీ పొట్టల్’ అని పిలుస్తారు.
●ఈయన సుదీర్ఘ కాలంపాటు అంటరానితనమనే సామాజిక దురాచారాన్ని రూపుమాపడంలో కీలక పాత్ర పోషించారు.
●పన్నాలాల్‌దాస్ గుప్తా ‘రెవల్యూషనరీ గాంధీ’ పుస్తకాన్ని రాశారు. అందులో గాంధీజీ గురుంచి ‘సత్యాన్ని సత్యంతోనే నిలబెట్టాలనేది మహాత్ముడి వాదన’ అని అన్నాడు.
●కెనడా విశ్రాంత ఉపాధ్యాయుడు ఆంథోని పరేల్ ‘గాంధీస్ ఫిలాసఫీ అండ్ ది క్వెస్ట్ ఫర్ హార్మనీ’లో గాంధీజీ ఆధ్యాత్మికత గురుంచి రాశారు.
●గుజరాత్ రాష్ట్రానికి చెందిన కొందరు పాత్రికేయులు గాంధీకి ‘మహాత్మా’ అనే బిరుదును ఇచ్చారు. అంతేకాక నాయకుడిగా ఉన్న ఈయన్ను ‘బాపు’ అని పిలుస్తారు.
●గాంధీకి ‘రఘుపతి రాఘవ రాజారాం’ అనే గీతం అంటే చాలా ఇష్టం. గాంధీజీని భారతీయులంతా మహాత్ముడు అని పిలుస్తారు. కానీ ఈయన తన హృదయంలో మరొక మహాత్ముడిగా, గురువుగా ‘గోపాలకృష్ణ గోఖలేను’ ఆరాధించేవారు.
●గాంధీ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వారి పైన సంధించిన ఆయుధాలు సత్యాగ్రహం, నిరాహార దీక్ష, సహాయ నిరాకరణలు. ఇవి అణుబాంబులను మించిన అస్త్రాలుగా వారు పేర్కొన్నడం విశేషం!
●గాంధీజీ జయంతిని పురస్కరించుకుని రాజ్ ఘాట్ లో గాంధీ స్మారక చిహ్నం వద్ద పువ్వులతో నివాళులు అర్పిస్తారు.
●2007 జూన్ 15న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మహాత్మాగాంధీ జయంతి రోజునే ‘అంతర్జాతీయ అహింసా దినంగా’ ప్రకటించింది.
గాంధీ శతజయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈయన ఆశయాలు, సిద్ధాంతాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.