GREAT PERSONALITIESTelugu Special Stories

భారతదేశపు మొట్టమొదటి, ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఇందిరాగాంధీ.

భారతదేశంలో అత్యంత ప్రభావశీల మహిళలను ప్రస్తావిస్తే మొదటిస్థానం “ఇందిరాగాంధీ” ని వరిస్తుంది. ఎందుకంటే ఆమె భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి, భారతీయ రాజకీయవేత్త మరియు రాజనీతిజ్ఞురాలు, భారతదేశ ప్రప్రథమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. భారత రాజకీయాలపై ఆమెది చెక్కుచెదరని సంతకం. భారతదేశంలో తన తండ్రి నెహ్రూ తరువాత అత్యధిక రోజులు 15 సంవత్సరాల 350 రోజులు ప్రధానమంత్రిగా (నెహ్రూ 16 సంవత్సరాల 286 రోజుల) పదవి నిర్వహించిన ఏకైక మహిళా ఇందిరాగాంధీ. జీతం తీసుకోని కార్యదర్శిగా తండ్రికి సేవలందించిన ఆమె అనధికారికంగా తన తండ్రి భారతదేశానికి మొదటి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు వ్యక్తిగత సహాయకులుగా పనిచేశారు. కాంగ్రెస్ లో అనేక పదవులు అలంకరించిన ఇందిరాగాంధీ తన తండ్రి మరణంతో ప్రధాని పీఠం ఎక్కిన లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో సమాచా, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

లాల్ బహదూర్ శాస్త్రి మరణంతో 24 జనవరి 1966 నాడు మొదటిసారిగా భారతదేశ ప్రధానమంత్రి బాధ్యతలను స్వీకరించి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించారు. నేటివరకు కూడా మరో మహిళ ఆ స్థానాన్ని చేపట్టలేదు. అలా ఆమె1966 నుండి 1977 వరకు వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడమే కాకుండా, 1980 లో నాలుగవ సారి ప్రధానిగా ఎన్నికై ఆమె హత్యకు గురైన 31 అక్టోబరు 1984 వరకు సుదీర్ఘకాలం ఆ పదవిని చేపట్టిన తొలి, అఖరు మహిళగా చరిత్రకెక్కారు. బాల్యంలో విద్యాభ్యాసానికి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. అయినా మొక్కవోని దైర్యంతో చదువుకుని పట్టభద్రురాలు కాకున్నా కూడా, ప్రముఖ జాతీయ నాయకుల సహచర్యంలో మహామేధావిగా మారి ప్రజలకు నిస్వార్థ సేవలు అందించారు ఇందిరాగాంధీ.

అడుగడుగునా కష్టాలు ఎదురైనా వాటిని అవలీలగా అధిగమించి ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం  చేసి ఆడది అబల కాదు సబల అని ప్రపంచానికి చాటిచెప్పిన మహిళా మూర్తి శ్రీమతి “ఇందిరాగాంధీ”. పరాజయాలను విజయాలకు సోపానాలుగా మార్చుకున్న ఆమె మాతృదేశ సేవలో తన ప్రతీ రక్తకణం తరిస్తుందని ఆమె చెప్పేవారు. భారతదేశ పేరుప్రతిష్టలను దేశ దేశాల్లో చాటి చెప్పి భారతరత్నగా గౌరవం అందుకున్న ధీరవనిత ఇందిరాగాంధీ. “గరీబీ హటావో” నినాదంతో తన ప్రచారాన్ని నిర్వహించి, నలభై మూడు రోజుల పాటు దేశమంతా పర్యటించి, ముప్పై ఆరు వేల మైళ్ల పర్యటనలో మూడు వందల సభలను నిర్వహించి కొన్ని లక్షల మంది ప్రజలను కలుసుకున్నారు ఇందిరాగాంధీ. ఆమెను చూసిన ప్రజల కళ్ళు ఆనందంతో మెరిసాయి. వారందరి దృష్టిలోనూ అమె వారి కోసం పోరాడే ఒక గొప్ప యోధురాలుగా కనిపించారు. 

రాజభరణాల రద్దు, 1966లో రూపాయి మూల్య న్యూనీకరణ, 1969లో బ్యాంకుల జాతీయకరణ లాంటి నిర్ణయాలతోపాటు దేశంలో పంటల ఉత్పత్తిని పెంచడానికి “హరిత విప్లవం”, “పేదరిక నిర్మూలన” కై “గరీబీ హటావో” నినాదం, 20 సూత్రాల పథకము లాంటి అనేక ప్రజాకర్షక పథకాలు చేపట్టారు. 1971 పాకిస్తాన్ తో యుద్ధంలో నిర్ణయాత్మక విజయం ప్రపంచం దృష్టిని ఆకర్షించడంతో బాటు. 1974లో రాజస్థాన్ ఎడారి లోని పోఖ్రాన్లో అణుపాటవ పరీక్ష చేసి భారత అణు కార్యక్రమానికి బలమైన పునాది పడేలా చేశారు. తాను దేశానికి అందించిన విశేషమైన సేవలకు గానూ 1971లో భారత ప్రభుత్వపు అత్యున్నత పౌర పురస్కారం “భారత రత్నను” స్వీకరించి ఈ పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి మహిళగా స్థానం సంపాదించారు. 1983-84 లో రష్యా దేశపు లెనిన్ శాంతి బహుమతి కూడా దక్కించుకుని ఎంతో సమున్నత స్థానాన్ని పొందిన ఇందిరాగాంధీ ప్రశంసలతో బాటు, స్వతంత్ర భారతదేశంలో పలు రాజ్యాంగ వ్యవస్థల పతనానికి నాంది పలికిన ప్రధానిగా విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఈ రోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కథనం మొదటి భాగం…

జీవిత విశేషాలు…

  • జన్మనామం  :  ఇందిరా ప్రియదర్శిని గాంధీ 
  • ఇతర పేర్లు  :  ఇందిరా గాంధీ 
  • జన్మదినం :  19 నవంబరు 1917
  • స్వస్థలం :    అలహాబాదు, సమైక్య ఆస్థానములు, బ్రిటీషు ఇండియా.
  • తల్లి    :     కమలా నెహ్రూ 
  • తండ్రి   :    జవహర్‌లాల్ నెహ్రూ 
  • వృత్తి   :       రాజకీయం, ప్రధానమంత్రి 
  • జీవిత భాగస్వామి  :   ఫిరోజ్ గాంధీ
  • సంతానం     :      రాజీవ్ గాంధీ , సంజయ్ గాంధీ 
  • రాజకీయ పార్టీ    :    భారత జాతీయ కాంగ్రెస్
  • బిరుదులు   :     భారతరత్న (1971)
  • మరణ కారణం  :   హత్య 
  • మరణం :    31 అక్టోబరు 1984, 
  • న్యూ ఢిల్లీ, భారతదేశం

నేపథ్యం…

బ్రిటీషు ఆక్రమిత భారతదేశంలో పేరుమోసిన న్యాయవాది మోతీలాల్ నెహ్రూ. సిరిసంపదలకు కొదువలేదు. స్నేహితులు అంటే విపరీతంగా అభిమానించే మోతీలాల్ నెహ్రూ గృహానికి తన ఆంగ్ల స్నేహితులు (బ్రిటిష్ వారు), స్వదేశీ స్నేహితులు (భారతీయులు) వస్తూ పోతూ ఉండేవారు. మోతీలాల్ నెహ్రూ, స్వరూప్ రాణిల కుమారుడు జవహర్‌లాల్ నెహ్రూ. ఆయన సాంప్రదాయక కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కమలా నెహ్రూను వివాహమాడారు. నవీన సంప్రదాయానికి చెందిన తన అత్తవారింటికి అలవాటు పడటానికి కమలా నెహ్రూకు కొంత సమయం పట్టింది. జవహర్‌లాల్ నెహ్రూ, కమలానెహ్రూ లకు అలహాబాదులోని ఆనంద్ భవన్ లో 19 నవంబరు 1917 నాడు ఒక కుమార్తె జన్మించారు. ఆమెకు ఇందిరా ప్రియదర్శిని అని పేరు పెట్టుకున్నారు. అప్పటికే జాతీయ కాంగ్రెసు సభ్యునిగా ఉన్న మోతీలాల్ నెహ్రూకు మనుమరాలు ఇందిరా ప్రియదర్శిని అంటే చాలా ఇష్టం.

1919లో పంజాబ్ లోని వైశాఖీ పండుగ జరుగుతున్న సమయంలో బ్రిటిష్ వారు జలియన్ వాలా బాగ్‌లో జరిపిన మారణకాండలో కొన్ని వేలమంది బలయ్యారు. ఆ సంఘటన కదిలిపోయిన మోతీలాల్ నెహ్రూ తన వృత్తిని వదిలేసి తన వద్ద ఉన్న ఖరీదైన విదేశీ వస్తులనన్నింటినీ తగులబెట్టి, నాటి నుండి ఖద్దరు దుస్తులను మాత్రమే ధరించడం మొదలు పెట్టారు. తన కుమార్తెను కాన్వెంట్ స్కూలు కూడా మాన్పించారు మోతీలాల్ నెహ్రూ. మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ సలహామేరకు ఇందిరాప్రియదర్శిని తల్లిదండ్రులు ఇద్దరూ స్వాంతంత్ర్యం కోసం కదనరంగంలోకి దూకారు. చిన్నారి ఇందిర సైతం తన విదేశీ బొమ్మలను వదిలివేసింది. నాయనమ్మ స్వరూప్ రాణి, తాతయ్య మోతీలాల్ నెహ్రూలకు ఈమె గారాల పట్టిగా మారిన ఇందిరాప్రియదర్శిని ఖద్దరు పైజామా, చొక్కా, గాంధీ టోపీ ధరించి అబ్బాయిలా ఉండేవారు. ఈమె తాతయ్య ఇచ్చిన రాట్నాన్ని ప్రియాంగా వడికేది. ప్రముఖ రాజకీయ నాయకులకు విడిది అయిన ఆ ఇంట్లో పెరగడంతో పాటు తన తాత, తండ్రులు రాజకీయాల్లో తలమునకలై ఉండడం వలన రాజకీయాలు, జాతీయోద్యమాలపై భావబీజాలు ఇందిరలో చిన్నతనంలోనే ఏర్పడినాయి.

ఇందిర జన్మించే నాటికి భారతదేశ పరిస్థితులు…

ఇందిర ప్రియదర్శిని జన్మించేనాటికి భారతదేశమంతా ఆంగ్లేయుల పాలనలో మగ్గుతూ ఆర్థికంగానూ, సామాజికంగాను అనేక సమస్యలతో అల్లకల్లోలంగా ఉంది. ప్రతీ ఒక్కరూ బ్రిటీషు వారి పాలనను వ్యతిరేకిస్తున్నారు. అలాంటి ఆ సమయంలో భారతీయులలో సమైక్యతను తీసుకురావలసిన అవసరం వచ్చింది. వారిలో జాతీయ భావాన్ని పెంపొందించాల్సిన అవసరం ఏర్పడింది. దానికోసం శరీరంలోని ప్రతీ అవయవంలోనూ దేశభక్తి నిండిన నాయకులు కావాలసిన సమయంలో గోపాలకృష్ణ గోఖలే, బాల గంగాధర్ తిలక్, జవహర్‌లాల్ నెహ్రూ, సరోజినీ నాయుడు, మహాత్మా గాంధీ వంటి నాయకులు ఈ పనికి పూనుకున్నారు.

స్వాతంత్ర్య పోరాట సమయంలో జవహర్‌లాల్ నెహ్రూ, కమలా నెహ్రూలు కారాగారానికి వెళ్ళవలసి వచ్చేది. అలాంటి సమయంలో చిన్నారి ఇందిరకు ఆమె తాత మోతీలాల్ నెహ్రూ తోడుగా ఉండేవారు. ఒక్కోసారి మోతీలాల్ నెహ్రూ కూడా కారాగారానికి వెళ్ళవలసి వచ్చినపుడు ఎవ్వరూ తోడు లేక ఇందిర ఒంటరితనాన్ని అనుభవించాల్సి వచ్చేది. తన ఎదురుగా జరిగే సంఘటనలను బట్టి తన వ్యక్తిత్వాన్ని మలుచుకున్న ఇందిర తాను ఆడుకొనే ఆటలు సైతం ఆ సంఘటనలకు అనుగుణంగానే ఉండేవి. తాను ఆడుకునే ప్రతీ ఆటలో బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడే ఒక దేశభక్తురాలిగానే తనను ఊహించుకుంటూ ఆడుకొనేది. ఆ ఆటలు ఆమెలో దేశభక్తిని ఎంతగా నింపాయంటే ఆమె చిన్నతనంలోనే తనతోటి వారితో కలసి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనేలా చేసాయి.

విద్యాభ్యాసం…

ఇందిరా ప్రియదర్శిని ప్రాథమిక విద్యాభ్యాసం అనేక చోట్ల సందర్భానుసారంగా కొనసాగింది. ఆమె ఢిల్లీలోని కిండర్ గార్డెన్ పాఠశాలలో చదువుకున్నారు. ఆ తరువాత అలహాబాదు లోని సెయింట్ సిసీలియాలో కొంతవరకు చదువుకున్నారు. తల్లిదండ్రులు కారాగారంలో ఉన్నప్పుడు ఇంటివద్ద ట్యూటర్ సహాయంతో కొన్నాళ్ళు చదువుకుంటూ అలా ప్రాథమిక విద్యను పూర్తిచేశారు. తన తల్లి అనారోగ్యం కారణంగా జెనీవా, స్విట్జర్లాండు వెళ్ళినప్పుడు తనతోపాటు వెళ్లిన ఇందిర అక్కడ పాఠశాలలో కూడా చదువుకున్నారు. 1927లో తిరిగి భారతదేశానికి  రావడంతో  “ది ప్యూపుల్స్ ఓన్ స్కూల్”, పూణేలో ఏడవ తరగతి చేరి చదువుకున్నారు. గణితం పట్ల ఎక్కువ మక్కువ కలిగి ఉండే ఇందిర చదువులో తన ప్రతిభను బాగా కనబరిచేవారు. సాహిత్యం అంటే బాగా ఇష్టపడే ఆమె ఫ్రెంచ్ భాషను కూడా నేర్చుకున్నారు. నాటకాలలో నటించడం అంటే ఇష్టం ఉన్న ఇందిర, వాటితో బాటుగా బ్యాడ్మింటన్, కబడ్డీ, సాము, డ్రిల్లు మొదలగు ఆటలను కూడా ఇష్టంగా ఆడేవారు.

తల్లి, నానమ్మల మరణంతో ఆగిన డిగ్రీ…

తన తోటి పిల్లలతో చనువుగా ఉంటూ పాఠశాలలో అన్ని పనులలో ఉత్సాహంగా పాల్గొనే ఇందిర “బాలచరఖా సంఘం” ను స్థాపించి దానిని నేర్పుగా నిర్వహించి మహాత్మాగాంధీ మన్ననలను పొందారు. తన తోటి బాలబాలికలను “వానరసేన” గా ఏర్పాటు చేసి బాల్యంలోనే సేవాగుణానికి  బీజం వేశారు. ఆమె తన తండ్రి గ్రంథాలయంలోని వివిధ పుస్తకాలను అధ్యయనం చేశారు. 1934లో శాంతినికేతన్ ఆర్ట్స్ లో చదవడానికి హాస్టల్లో చేరిన ఇందిర తన తల్లి అనారోగ్యం కారణంగా మళ్ళీ తిరిగి స్విట్జర్లాండ్, బెక్స్ లో చదివుకున్నారు. 28 ఫిబ్రవరి 1936 నాడు తన తల్లి మరణించారు. ఆ తరువాత ఇంగ్లాండులోని బ్రెస్టల్ లో గల బ్యాట్మెంటన్ పాఠశాలలో చదువుకున్నారు.

ఆ తరువాత ఆక్స్ఫర్డ్ లోని సోమర్ విల్లే కళాశాలలో చదువుకున్నారు. 1938 లో నాయనమ్మ మరణం తరువాత ఇందిర తనకు అనారోగ్యం కలుగడం, తల్లి, నానమ్మల మరణం ఇలా అనేక అడ్డంకులు, అవరోధాలు  కలగడంతో ఇందిర విద్యాభ్యాసం సజావుగా సాగలేకపోయింది. చివరకు ఆమె పట్టభద్రురాలు కూడా కాలేకపోయింది. తన తండ్రి చాలా దూరప్రదేశాల్లో, కారాగారాల్లో ఉన్న సమయాలలో ఆమెకు తన తండ్రి జవహరలాల్ నెహ్రూ వద్దనుండి ఎన్నో లేఖలు వచ్చేవి. ఆ లేఖలలో భారతదేశ భౌగోళిక పరిస్థితులతో పాటు తన జీవిత అనుభవాలు తెలియజేస్తూ ఆమెను హెచ్చరించేవారు. ఏ పనైనా రహస్యంగా కాకుండా నిర్భయంగా చేయాలని, ధైర్యం ధీరుల లక్షణమని ఆయన ధైర్యాన్ని నూరిపోసేవారు.

ఫిరోజ్ గాంధీతో వివాహం…

ఉత్తరప్రదేశ్ లోని అలహాబాదు వాస్తవ్యుడైన ఫిరోజ్ గాంధీ భారత జాతీయ కాంగ్రెసుకు వాలంటీర్ గా పనిచేసేవాడు. ఈయన లండన్ లోని “స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్” లో చదివాడు. కమలా నెహ్రూ అనారోగ్య కారణంగా జర్మనీలో ఉన్నప్పుడు ఆమెకు ఫిరోజ్ గాంధీ ఎంతో సేవ చేశాడు. ఫిరోజ్ తో పరిచయం తరువాత అతని వ్యక్తిత్వం ఇందిరకు బాగా నచ్చింది. ఆ పరిచయం ఆమెతో ప్రణయంగా మారి క్రమక్రమంగా పరిణయానికి దారి తీసింది. అతడినే వివాహం చేసుకోవాలని ఇందిర నిశ్చయించుకున్నారు కూడా. ఫిరోజ్ గాంధీ నెహ్రూ కుటుంబానికి తెలిసినవాడు మాత్రమే కాదు స్నేహితుడు కూడా.

ఫిరోజ్ పూర్వీకులు పర్షియా నుండి భారతదేశానికి వలస వచ్చి స్థిరపడ్డారు. వారు పార్సీలు. నెహ్రూ కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. అందువలన ముందు జవహరలాల్ నెహ్రూ వీరి వివాహానికి అంగీకరించలేదు. ఇందిర నిర్ణయాన్ని విని గాంధీ సలహాని తీసుకోవాల్సిందిగా నెహ్రూ, ఇందిరను కోరాడు. గాంధీ వీరి ప్రేమను అర్థం చేసుకుని వారి వివాహానికి అంగీకరించాల్సిందిగా నెహ్రూను కోరాడు. మహాత్మా గాంధీ ఒప్పించడంతో 26 మార్చి 1942 నాడు ఫిరోజ్ గాంధీ, ఇందిర ప్రియదర్శినిల వివాహం ఆనందభవన్ లో నిరాడంబరంగా జరిగింది. అప్పటినుండి ఇందిర ప్రియదర్శిని కాస్త “ఇందిరాగాంధీ” గా మారింది.

క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జైలుకు…

లక్నోలో నేషనల్ హెరాల్డ్ అనే ఆంగ్ల పత్రికకు ఫిరోజ్ గాంధీ మేనేజరుగా పని చేసేవాడు. భారత స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా “క్విట్ ఇండియా” ఉద్యమం (1942) లో పాల్గొన్న “ఇందిరాగాంధీ, ఫిరోజ్ గాంధీ” లు అరెస్టు చేయబడి కారాగారానికి పంపబడ్డారు. నైనీ జైలులో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ తన తోటి ఖైదీలకు చదువు నేర్పించారు. జైలులోనే ఆవిడ తన 25వ పుట్టినరోజును కూడా జరుపుకున్నారు. 13 మే 1943 నాడు  విడుదలైన ఇందిరాగాంధీ ఆ తరువాత గృహిణిగా ఉంటూనే కాంగ్రెస్ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనేవారు. పెళ్ళి జరిగినది మొదలు అరెస్టు అయ్యి, విడదలయ్యేలోపు ఆమెలో జాతీయ భావం పెరిగి పెద్దయ్యింది. దేశం కోసం పనిచేయాలి అనే తపన ఆమెకు మొదలయ్యింది. 20 ఆగస్టు 1944 నాడు రాజీవ్ గాంధీ, 14 డిసెంబరు 1946 నాడు సంజయ్ గాంధీ లకు జన్మనిచ్చిన ఇందిరాగాంధీ తన ఇద్దరు పిల్లలు, భర్త, తండ్రితో కలిసి ఈమె ఎంతో సంతోషంగా ఉండేవారు. అప్పుడప్పుడు తండ్రితో కలిసి ప్రధాన మంత్రుల సమావేశాలకు హాజరవుతూ విదేశాలు సందర్శించేవారు.

భర్తకు వ్యతిరేకంగా తండ్రికి సానుకూలంగా ప్రచారం…

భర్తతో కలిసి అలహాబాదులో ఉంటున్న సమయంలో విభేదాలు రావడంతో ఇందిరాగాంధీ అలహాబాదును వదలి ఢిల్లీ చేరి తన తండ్రితో కలిసి జీవించారు. తండ్రికి కూతురు మాదిరిగానే కాకుండా కార్యదర్శిగా, స్నేహితుడిగా మెలిగారు. 1948లో లండన్ లోని కామన్వెల్త్ దేశాల ప్రధాన మంత్రుల సమావేశం, ప్యారిస్ లోని ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాన్ని, 1945 లో చైనా దేశాన్ని, 1949 అమెరికా దేశాన్ని, 1951 లో జెనీవా, లండన్, పారిస్ లను ఆవిడ సందర్శించారు. 1951లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో జవహర్ లాల్ నెహ్రూకు పోటీగా ఫిరోజ్ గాంధీ రాయ్‌బరేలీ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు ఇందిరాగాంధీ తన తండ్రి తరఫున ప్రచారం చేసి గెలిపించారు. ఆ సమయంలో ఫిరోజ్ గాంధీ, నెహ్రూకు వ్యతిరేకంగా గళమెత్తి ఆయన అవినీతి, అక్రమాలను ముఖ్యంగా భీమా కుంభకోణాన్ని బయటపెట్టారు. తత్ఫలితంగా అప్పటి నెహ్రూ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రి అయిన టి.టి.కృష్ణమాచారి రాజీనామా చేయవలసి వచ్చింది. 1953 మే నెలలో రెండవ ఎలిజబెత్ రాణి పట్టాభిషేకం మహోత్సవానికి, 1955లో ఇండోనేషియాలో జరిగిన అలీన దేశాల సమావేశానికి సోవియట్ సందర్శనకు వెళ్ళారు. అలాగే రోమ్ నగరంలో 19వ పోప్ పాల్ ను ఇందిరాగాంధీ కలుసుకున్నారు.

భర్త మరణం…

కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోను, తండ్రి రాలేకపోయిన సభలలో ఇందిరాగాంధీ మాట్లాడవలసి వచ్చేది. ఖంగుమని మోగే ఆమె కంఠస్వరం, ముఖ్యంగా ఆమె ఉపన్యాసం, సామాన్యులతో కలసిపోయే ఆమె స్వభావం అందరినీ ఆకట్టుకునేవి. ఆమె ప్రమేయం లేకుండానే అనుకోని విధంగా తన రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టేసింది. 1955లో ఇందిరా గాంధీ కాంగ్రెస్ కార్యవర్గంలో సభ్యురాలు అయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను 02 ఫిబ్రవరి 1959 నాడు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 02 సెప్టెంబరు 1960 నాడు భర్త ఫిరోజ్ గాంధీ గుండెపోటుతో మరణించారు. ఇది ఆమెలో అభద్రతా భావాన్ని కలుగజేసింది. అయితే పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలను నిర్వహించడం, భర్త మరణం వలన ఏర్పడిన ఒంటరితనం ఆమె మౌనాన్ని పెంచడంతో పాటు, ఆమెకు జీవితం పట్ల అవగాహనను, ఆత్మస్థైర్యాన్ని కూడా పెంచింది. నెమ్మదిగా తండ్రి నెహ్రూ స్నేహితులతోను, రాజకీయ నాయకులతోనూ సంభాషణలలో పాల్గొనడం ప్రారంభించింది.

తండ్రి “జవహర్ లాల్ నెహ్రూ” మరణం…

1962 వ సంవత్సరం చివరలో భారత – చైనా సరిహద్దుపై వివాదం చెలరేగి అస్సాంలోని “తేజ్‌పూర్” చైనా దాడికి గురయ్యింది. ఆ సమయంలో తండ్రి చెప్పినది గానీ, ఆర్మీ ఛీఫ్ చేసిన హెచ్చరికను గానీ, స్నేహితుల మాటలను గానీ, వినకుండా అస్సామీలకు ధైర్యాన్నిచ్చి, వారిని కష్టాలకు వదిలి వెయ్యమనే నమ్మకాన్ని వారికి ఇవ్వడానికి ఇందిరాగాంధీ ఒంటరిగా “తేజ్‌పూర్” ప్రయాణం చేసి వెళ్ళారు. చైనా వారు వెనక్కి తగ్గేదాకా తాను తేజ్‌పూర్ వదలనని వారి వెన్నంటి ఉంటానని అక్కడి ప్రజలకు ఇందిరాగాంధీ ధైర్యం చెప్పారు. కానీ విశేషం ఏమిటంటే ఆవిడ వచ్చిన రోజే చైనావారు వారి సేనలను ఉపహరించుకోవడం మొదలుపెట్టారు. చైనా సమస్య వల్ల నెహ్రూ చాలా అలసటకు, ఒత్తిడికి గురయ్యారు. అయనపై రాజకీయ వర్గాలలోనూ, ప్రజలలోనూ వ్యతిరేకత మొదలయ్యింది.

నెహ్రూ తన వద్దకు వచ్చేవారి సమస్యల పరిష్కారానికి, కొన్ని కఠినమైన విషయాల పరిష్కారానికి ఇందిరాగాంధీ సహాయం తీసుకోవడం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఆమె తీసుకున్న చర్యలు, పట్టుదల, ఆమె పద్ధతి నెహ్రూకి ఆమె నాయకత్వం పట్ల, ఆమె పట్ల నమ్మకాన్ని పెంచాయి. 06 జనవరి 1964 నాడు జవహరలాల్ నెహ్రూ కు పక్షవాతం వచ్చింది. అదే సమయానికి 68వ జాతీయ కాంగ్రెస్ పార్టీ సమావేశాలు భువనేశ్వర్ లో జరుగుతున్నాయి. నెహ్రూ అనారోగ్యంపై బెంగతో కొందరు నేతలు ప్రధాని పదవికి పోటీ పడటం మొదలుపెట్టారు. మరి కొంతమంది శ్రేయోభిలాషులు నెహ్రూ వారసుడిని ప్రకటిస్తే బాగుంటుందని సూచించారు. ఆ అవసరం లేదని, తనకేం కాదని, తనకు స్వస్థత చేకూరుతుందని త్వరలో తాను మరలా హుషారుగా తిరగగలుగుతానికి వారికి నెహ్రూ సమాధానమిస్తూ వచ్చారు. కానీ కొనసాగుతూ వచ్చిన అనారోగ్యం కారణంగా 27 మే 1964 నాడు జవహర్ లాల్ నెహ్రూ తుదిశ్వాస విడిచారు.

సమాచార, ప్రసార శాఖ మంత్రిగా…

నెహ్రూ మరణం తరువాత భారత ప్రధానిగా “లాల్ బహాదుర్ శాస్త్రి” సింహాసనాన్ని అధిష్టించారు. అంతకుమునుపే ఇందిరాగాంధీని ప్రధానిగా ఉండమని శాస్త్రి కోరారు. నెహ్రూకు అంతిమదశలో ఏర్పడిన వ్యతిరేకత ఆమెను రాజకీయంగా ఎదగనివ్వదని తెలిసిన ఇందిరాగాంధీ, శాస్త్రి ప్రతిపాదనను వెంటనే తిరస్కరించారు. శాస్త్రి కోరికమేరకు అయిష్టంగానే అంగీకరించిన ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికై లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో కేబినెట్ హోదా కలిగిన సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 19 నెలల పాటు సమాచార, ప్రచార శాఖ మంత్రిగా సమర్థవంతమైన బాధ్యతలు నిర్వర్తించి విప్లమాత్మక సంస్కరణలు తెచ్చారు ఇందిరాగాంధీ.

రేడియో మాధ్యమాన్ని ప్రభుత్వ యంత్రాంగంగా మల్చడంలో కీలకపాత్ర వహించారు. టెలివిజన్ అభివృద్ధికి కృషిచేసి, ఫిల్మ్ సెన్సార్ నిబంధనలను సడలించారు. 1965లో పాకిస్తాన్ లో జరిగిన యుద్ధంలో గాయపడిన సైనికులకు పరామర్శించి వారిలో మనోనిబ్బరాన్ని కలిగించారు. దక్షిణ భారతదేశంలో బలవంతంగా హిందీ భాషను రుద్దాలని నేతలు నిర్ణయించారు. దీనికి వ్యతిరేకంగా దక్షిణ భారత ప్రజలు సమ్మెను మొదలుపెట్టడంతో ఇందిరాగాంధీ అక్కడికి వెళ్ళి అక్కడివారిని హిందీ బలవంతంగా వారిపై రుద్దమని, ఇష్టమైన వారే ఆ భాషను చేర్చుకోవచ్చని ప్రభుత్వం తరపున వారికి హామీ ఇచ్చి వారిని శాంతింపజేశారు ఇందిరాగాంధీ.

తొలి మహిళా ప్రధానిగా… 

1964 లో ప్రధాని పదవిని చేపట్టిన లాల్ బహదూర్ శాస్త్రి “తాష్కెంట్” నగరంలో 10 జనవరి 1966 నాడు గుండెపోటుతో మరణించారు. దాంతో తాత్కాలిక ప్రధానమంత్రిగా “గుల్జారీలాల్ నందా” కొద్దికాలం పాటు పదవిని నిర్వహించారు. శాస్త్రి తరువాత ప్రధాని ఎవరా అనే ప్రశ్న పార్టీలో తలెత్తిన తరుణంలో . మొరార్జీ దేశాయ్, గుల్జారీలాల్ నందా మొదలైన మహామహులంతా ఇందిరాగాంధీకి ప్రత్యర్థులుగా ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్నారు. చివరకు పోటీలో మొరార్జీ దేశాయ్, ఇందిరాగాంధీ మిగిలారు. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షులు కామరాజ్ ఇందిరాగాంధీకి తన మద్దతు తెలిపారు.

ఆమె ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల పరిచయాలను కలిగి ఉన్నారు. వారి మధ్యనే పెరిగారు. అనేక దేశాలను చూడడమే కాక, ఎంతో మంది ప్రపంచ నేతలతో పరిచయాలను కలిగి ఉన్నారు. రాష్ట్ర, కుల, మతాలకు అతీతంగా నవీన భావాలను కలిగివున్నారు. ఇత్యాది కారణాలతో ఆమెకు కామరాజ్ మద్దతు తెలిపారు. దాంతో 24 జనవరి 1966 నాడు “ఇందిరాగాంధీ” మొదటిసారిగా భారతదేశ మూడవ ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. భారతదేశ ప్రధానమంత్రిగా బాధ్యతలను చేపట్టిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. నేటివరకు కూడా మరో మహిళ ఆ స్థానాన్ని చేపట్టకపోవడం విశేషం.

Show More
Back to top button