వైజ్ఞానిక రంగంలో తొలి నోబెల్అందుకున్నభౌతిక శాస్త్రవేత్త.సర్ సి.వి.రామన్!
నోబెల్ పురస్కారం అందుకున్న భారతీయులలో రెండవవారు.. సి.వి. రామన్ భౌతికశాస్త్రంలో ‘కాంతివిశ్లేషణము – రామన్ ఫలితం’ అనే అంశంపై విస్తృతంగా పరిశోధించారు. ఆ పరిశోధనలకుగాను 1930వ సంవత్సరపు నోబెల్ బహుమతిని అందుకున్నారు సర్ సి.వి రామన్.. భౌతిక విజ్ఞాన శాస్త్రంలో కాంతి (లైట్), శబ్దం (సౌండ్) విభాగాలలో వెంకట రామన్ ఎన్నో విజయవంతమైన ఆవిష్కరణలు చేశారు. ఆయా రంగాలలో 400కు పైగా పరిశోధన పత్రాలు, ఎనిమిది గ్రంథాలను ప్రచురించారు. ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయస్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తిల్లో సర్ సీవి రామన్ మొదటివారు. కాగా నేడు ఆయన వర్ధంతి సందర్భంగా రామన్ గారి జీవిత, పరిశోధనల విశేషాలను ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం:
నేపథ్యం…
1888 నవంబర్ 7న తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో తిరువనైకోవిల్ గ్రామంలో జన్మించారు చంద్రశేఖర వేంకట రామన్. తండ్రి ఆర్. చంద్రశేఖర అయ్యర్, కళాశాల అధ్యాపకులు. గణిత, భౌతికశాస్త్రాలు బోధించేవారు. తల్లి పార్వతి అమ్మాళ్, గృహిణి.. తండ్రి విశాఖపట్నంలోని ఏవీఎన్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేయడం వల్ల రామన్ బాల్యం అక్కడే సాగింది. విశాఖలోని సెయింట్ ఎలాషీయస్ ఆంగ్లో ఇండియన్ పాఠశాలలో విద్యను అభ్యసించారు. ఆయన 12 ఏళ్లకే మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ రోజుల్లో ఇలాంటి మేధావులకు ప్రభుత్వ ప్రోత్సాహం బాగా ఉండేది.
సర్కారు ఖర్చుతో ఉన్నత విద్యాభ్యాసానికి ఇంగ్లండుకు పంపేవారు. సి.వి.రామన్ కు ఆ అవకాశం వచ్చినప్పటికీ ఆరోగ్య కారణాలవల్ల ఆయన ఇంగ్లండ్ కు వెళ్లలేకపోయారు. కాలేజీ చదువుకోసం మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చేరారు. అక్కడ్నుంచి రామన్ 1904లో బంగారు పతకంతో బీఏ పట్టా అందుకున్నారు. 1907లో, 19 ఏళ్లకే భౌతికశాస్త్రంలో ఎమ్మెస్సీ పట్టా సాధించారు. కాంతి విక్షేపణ, వివర్తనలపై రాసిన థీసిస్ 1906లో ప్రచురితమైంది.
ఆ తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసిఎస్ పాసై, కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా చేరారు. ఆ సమయంలోనే ఆయన పరిశోధనలపై ఆసక్తి పెంచుకున్నారు. తదుపరి ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ సంస్థ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కార్ ను కలిసి పరిశోధనలకు అనుమతిని పొందారు. నాటి నుంచి మొదలైన ఆయన పరిశోధనలు నిరంతరంగా కొనసాగాయి. రామన్ తల్లి పార్వతి అమ్మాళ్ వీణను అద్భుతంగా వాయించేవారు.
అందుకే రామన్ తొలి పరిశోధనలు ఇంట్లోనే మొదలయ్యాయి. వయోలిన్, వీణ, మృదంగం లాంటి సంగీతవాయిద్యాల మీద చేశారు. విజ్ఞాన పరిశోధనల మీద ఉన్న తృష్ణ వల్ల తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసర్ గా చేరారు. 1921లో లండన్‌లో తాను అధ్యయనం చేసిన ప్రత్యేక సంగీత పరికరాల శబ్ద రహస్యంపై ఉపన్యాసాలు ఇచ్చారు. ఇలాంటి అంశాలతో రాయల్ సొసైటీ సభ్యుడు కావాలనుకుంటున్నావా? ఏంటి అని ఓ వ్యక్తి వెటకారంగా అన్నప్పుడు ఆయనలో పరిశోధనలపై మరింత పట్టుదల పెరిగింది.
1921లో కలకత్తా విశ్వవిద్యాలయం తరఫున ఇంగ్లండులోని ఆక్స్ ఫర్డ్ కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆయన సముద్రయానం చేశారు. అయితే ఆ ప్రయాణంలో ఓడ పై నుంచి సముద్రాన్ని వీక్షించిన రామన్ మదిలో ఎన్నో సందేహాలు పుట్టాయి. సముద్ర జలాలు ఆకుపచ్చ- నీలి రంగుతోఎందుడు కనిపిస్తాయి? అని.. అంతే కలకత్తాకు చేరగానే కాంతి వివర్తనం, విక్షేపాలపై ప్రయోగాలు ప్రారంభించారు. ఈ ప్రయోగాల ఫలితంగా రామన్ విజ్ఞాన శాస్త్ర ప్రపంచంలోనే అత్యంత ప్రభావం కలిగిన ‘రామన్ ఫలితాన్ని’ కనుగొన్నారు.
రామన్ ఎఫెక్ట్…
1927లో కాంప్టన్ కు నోబెల్ బహుమతి తెచ్చిన ప్రయోగంలో ‘ఎక్స్’ కిరణాలను పారదర్శకమైన యానకం గుండా పంపితే, కొన్నికీరణాల తరంగ దైర్ఘ్యాలలో మార్పులు కలుగుతాయనీ, దీనినే కాంప్టన్ ఫలితం అంటారని కాంప్టన్ ప్రచురించాడు. అయితే వెంటనే రామన్ ఏలవర్ణ కాంతితరంగాలతో అంటే మెర్క్యూరీ ల్యాంప్ ఉపయోగించి రామన్ ఫలితాన్ని, తరంగదైర్ఘ్యంలో తగ్గుదల ఉన్న కాంతి కిరణాలను(వీటినే రామన్ లైన్స్ అంటారు) కనుగొన్నాడు. బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో జరిగిన శాస్త్రవేత్తల సెమినార్ లో దీనిని విజయవంతంగా ప్రయోగం చేసి, ప్రదర్శించాడు. ఫలితంగా డాక్టర్ చంద్రశేఖర వేంకట రామన్ కు 1930 సంవత్సరపు నోబెల్ బహుమతిని ప్రకటించారు.
నోబెల్ పురస్కారం లభించిన తర్వాత కూడా రామన్ శబ్దతరంగాలపై తన పరిశోధనలను కొనసాగించారు. భారతీయ సంగీత వాద్యాలైన వయొలిన్, మృదంగం మొదలైన వాద్యాల్లో శబ్ద తరంగాలు ఏ విధంగా శృతితో కూడిన శబ్దాలను ఉత్పాదిస్తాయో కనుగొని ఆ పరిశోధనలను ప్రచురించారు. భౌతిక, విజ్ఞాన శాస్త్రంలో రామన్ ప్రతిభకు తార్కాణంగా ప్రపంచంలోని ఎన్నో విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు లభించాయి. భారత ప్రభుత్వం సి.వి. రామన్ ప్రతిభ, భారతదేశానికి పేరు తెచ్చిన ఆవిష్కరణలకు గుర్తింపుగా ఆయనను 1954లో ‘భారతరత్న’ బిరుదుతో సత్కరించింది.
కుటుంబం..
రామన్ 1906లో అమ్మాల్ ను వివాహమాడారు. వీరికి చంద్రశేఖర్, రాధాకృష్ణన్ అనే ఇద్దరు కుమారులు. సి.వి. రామన్ తన జీవితమంతా భౌతిక శాస్త్ర పరిశోధనలకే అంకితమై, అంతిమ క్షణాల వరకూ భౌతికశాస్త్ర విషయాలతోనే గడిపారు. రామన్ ఎఫెక్ట్ అనువర్తనాలతో వెయ్యికి పైగా పరిశోధన వ్యాసాలు ఇప్పటికీ ప్రచురితమయ్యాయి.
1943లోభారతీయ విజ్ఞాన సంస్థ(ఐఎస్ఓ) లో రిటైర్ అయిన వెంటనే బెంగళూరులో రామన్ పరిశోధనా సంస్థను స్థాపించారు. ఆ సంస్థలోనే 1970, నవంబర్ 21న తుదిశ్వాస విడిచారు.
గుర్తింపు…
అత్యంత ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన రామన్‌ను 1924లో ఇంగ్లండ్ రాయల్ సొసైటీ సభ్యత్వం దక్కింది.
1928లో సర్ బిరుదు దక్కింది.
ప్రతిష్ఠాత్మకమైన ఫ్రాంక్లిన్ మెడల్ 1947లో లభించింది.
సి.వి. రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొని చరిత్ర సృష్టించిన ఫిబ్రవరి 28నే జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకొంటున్నాం. 1987 ఫిబ్రవరి నుండి ప్రతీ సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవంగా భారత ప్రభుత్వం అధికారకంగా జరుపుతోంది.
నోబెల్ పొందిన రెండో భారతీయుడిగా నిలిచిన రామన్‌ను భారత ప్రభుత్వం ప్రథమ జాతీయ ఆచార్యునిగా నియమించింది.
1957లో సోవియట్ యూనియన్ ‘లెనిన్ బహుమతి’ని బహూకరించింది.
మొత్తంగా విదేశాల్లో ఎన్నో అవకాశాలున్నా కాదని, మన దేశంలోనే అరకొర సదుపాయాలతోనే పరిశోధనలు చేసి సీవీ రామన్ ఎన్నో విజయాలు సాధించి, భవిష్యత్ తరాలకు అసలైన మార్గదర్శిగా నిలిచారు.